బహుళ-2

                                                                – జ్వలిత

నందగిరి ఇందిరాదేవి “వాయిద్యం సరదా”

కథ ఏమి చెప్తుంది ? జీవిత అనుభవాన్ని చెప్తుంది. కథాకాలం నాటి సామాజిక సంబంధాలకు సంఘటనలకు అద్దం పడుతుంది. కాలానుగుణంగా పరిణామ క్రమంలో వచ్చిన మార్పులను తెలిపి కరదీపమై మార్గదర్శనం చేస్తుంది.

అటువంటి కథే “వాయిద్యం సరదా” అనే కథ. దీనిని నందగిరి ఇందిరాదేవి రాశారు. 1941 మే నెల “గృహలక్ష్మి మాసపత్రిక”లో ప్రచురింపబడింది.

కథాంశాన్ని బట్టి నాటి సామాజిక పరిస్థితులను రచయిత్రి మనకు కళ్ళకు కట్టిస్తారు.

కథలో మీనాక్షి తన భర్తను “అయ్యవారూ” అని పిలుస్తూంది అనడంలో నాటి భార్యలు పనిమనుషులుగా భావించబడ్డారని తెలుస్తూంది(ఎక్కువ మంది).

“యజమాని తనచేతికి డబ్బు ఇవ్వడు కనుక సంపాదన లేని మీనాక్షి కూరగాయలకు ఇచ్చిన వాటిలో పొదుపు చేసి హార్మోనియం కొనాలి అనుకుంటుంది” అని చెప్పారు కథకురాలు. ఆవిధంగా ఎటువంటి ఆర్ధిక స్వాతంత్ర్య లేకుండా నాటి స్త్రీలు పరాధీనలుగా ఉండేవారని తెలియజేశారు.

“మీనాక్షి హార్మోనియం పెట్టెను ఆమె కళ్ళ ముందే పది రూపాయలకు నరసింహం అమ్మేస్తాడు” భార్య అభిరుచులపై ఆమె వస్తువులపై అతని నిరంకుశ ప్రవర్తన అర్థం అవుతోంది ఇప్పటికీ ఇటువంటి భర్తలు కోకొల్లలు.

” పైగా సంసారులు హార్మోనియం వాయించడం మహా పాపం అతని దృష్టిలో” అంటారు రచయిత్రి. నాటి కుటుంబాల్లో కళలపట్ల ఉన్న గౌరవం, స్త్రీ చైతన్యం వల్ల పురుషులకు ఉన్న అభద్రత అర్థం చేసుకోవచ్చు. అది ఇప్పటికీ కొనసాగుతూ స్త్రీల మీద హింస పెరుగుతూ ఉన్నది.

“నరసింహం సింహ గర్జన లకు అతనితో మాట్లాడడానికి భయపడేది మీనాక్షి” అంటే భార్యను ఒక మానవిగా కుటుంబ సభ్యురాలిగా కాక పనివాళ్లను బానిసలను భయపెట్టినట్టు మాటలతో భయ పెట్టేవారు..

ఇటువంటి ఎన్నో రచనల వలననే కుటుంబ సంబంధాల్లో స్త్రీల పై జరిగే హింస సమాజానికి తెలిసింది. ముందు రోగ లక్షణం తెలిస్తే కదా రోగనిర్దారణ, నివారణ జరిగేది. ఆ విధంగా ఎన్నో పరిణామాల ఫలితమే 2005 సంవత్సరంలో “గృహహింస నిరోధక చట్టం” వచ్చింది. కథలు కాకరకాయలు ఎందుకు అనే వాళ్ళకు సమాధానమిది.

మహిళలు తమ అభిరుచుల పై ఉన్న ఆసక్తిని బలవంతంగా చంపుకోవాల్సి వస్తుందని చెప్పే కథ. ఇప్పటికీ చాలామంది విద్యావంతులు ఉద్యోగ వంతులు అయిన స్త్రీలు తమ భర్తలకు, అత్తవారింటి వారికి ఇష్టం లేదనే కారణంతో కళల పట్ల ఆసక్తిని కోరికను వదలుకుంటూనే ఉన్నారు. సంగీతం నాట్యం రచనా వ్యాసంగం చిత్రలేఖనంతో పాటు క్రీడల్లో రికార్డులు సృష్టించిన వారు కూడా వివాహానంతరం ఆ రంగాన్ని వదులుకుంటున్నారు. వీటన్నిటికీ కారణం పితృస్వామ్య దాష్టికమే మూలం. స్త్రీ హక్కులను అణిచివేస్తూ వారి అభిప్రాయాలను గౌరవించకపోవడమే కాక ప్రతి రంగంలోనూ స్త్రీలను వివక్షకు గురిచేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అందరి విషయంలో అట్లా జరిగిందా అంటే ? కాకపోవచ్చు, ఎదురు తిరిగి నిలబడి ఇష్టమైన రంగాల్లో ముందడుగు వేయడం కోసం కుటుంబ బాంధాలను వదులుకున్న వారు కూడా ఉన్నారు. కానీ వారు ఎంతశాతం అన్నది గమనించాలి.

1941 నుండి 2020 వరకు 79సంవత్సరాలయినా స్త్రీల విషయంలో రావలసినంత మార్పు చైతన్యం రాలేదన్నది నిర్వివాదాంశం.

కథలో మూసీనది వంతెన దాటి వాయిద్యాల దుకాణాల వద్దకు వెళ్తుంది. అంటే హైదరాబాద్ నగరంలో కథ నడిచిందని చెప్పకనే చెప్పారు.

కొత్తరోజుల్లో మీనాక్షిని బయటకు రానిచ్చేవాడు కాదు. ఇరుగుపొరుగు గొడవతో రామమందిరానికి వెళ్ళనిచ్చేవాడు. అంటే 1941 కంటే ముందే హైదరాబాద్ నగరంలో ఇరుగుపొరుగు ఒకరిబాగు మరొకరు పట్టించుకొనే సామాజిక నేపధ్యం ఉండేది. ఇప్పటిలా కళ్ళముందు అరాచకాలు జరుగుతున్నా పట్టని లోకం కాదన్నమాట.

తనతో తెచ్చుకున్న తన హార్మోనియం తన కళ్ళముందే అమ్మిన నరసింహం అనుమతి లేకుండా హార్మోనియం కొనాలనే కోరిక తీవ్రత తెగువను కలిగించడం, అందులో కొడుకు ఆశ కూడా తోడవ్వడ ధైర్యాన్నిచ్చింది. పొదుపు చేసి కొన్నది, తనవంతు ప్రయత్నం చేసింది

మార్పు రాని నరసింహం ప్రవర్తన నిరాశ కలిగించింది. తిరిగిచ్చేసింది.

అయితే చివరకు “రెండు ప్రాణాలు మాయమయ్యాయి” అనే వాఖ్యంతో కథ ముగిసింది. ఏమయ్యారు వాళ్ళు ఇంటికి వెళ్ళారా? ప్రశ్న వేసి సమాధానం పాఠకులకే వదలేశారు రచయత్రి.

కథా శైలి ఆగకుండా చదివిస్తుంది. మనకళ్ళ ముందే సంఘటనలు జరిగినట్టు కథ నడపడం రచయిత్రి రచనా పటిమను తెలుపుతుంది.

“వాయిద్యం సరదా” కథలోకి వస్తే ఇందులో మూడు పాత్రలు ఉన్నాయి అనేకంటే ఒక చిన్న కుటుంబానికి సంబంధించిన కథ.

నరసింహం, మీనాక్షి భార్యాభర్తలు చిట్టిబాబు వారికుమారుడు ఏడేళ్ళ లోపు పసివాడు. పోలీస్ అమీనుగా పనిచేసే నరసింహం ఇంటి వద్ద కూడా తాను పోలీసు అమీనుగానే ఉంటూ ఇంటిని పోలీస్ స్టేషన్ చేశాడు.

పెళ్లయిన కొత్తలో చీకట్లో దయ్యాన్ని చూసినట్టు నరసింహంని చూసి జడుసుకున్న మీనాక్షి అత్తగారింటికి పోను అని ఏడ్చేది. నరసింహంది నల్లటిరంగు వయసుకు మించిన భారీశరీరం. పెద్ద మీసాలు ఖాకీ దుస్తులు. ఆకారము ఆహార్యమే కాదు నరసింహం స్వభావం కూడా కర్కసమైనదే.

మీనాక్షిది మామూలు అందం ఇరవైఐదేళ్ళ లోపు వయసులో బాగుంటుంది. చిట్టిబాబుది తల్లి పోలిక.

మీనాక్షి భర్తతో మనసిచ్చి చనువుగా మాట్లాడ లేకపోయేది, అతని సింహగర్జనలకు భయపడి. భర్తను “అయ్యవారూ” అని పిలిచేది, భర్తకు అన్ని సపర్యలు చేస్తూ, వేళకు కావలసినవి సమకూర్చడమే తన విధి అనుకునేది మీనాక్షి. ఆమెకు భర్త అంటే భయంతో కూడిన భక్తి.

చిట్టి బాబు పుట్టిన తర్వాతే ఆమె జీవితంలోకి వెలుగు వచ్చింది. ఆమెకు చిట్టి బాబుదే లోకం చిట్టిబాబే ప్రాణం. నరసింహం ఉద్యోగానికి పోయిన తర్వాత రెండు ప్రాణాలు ఆనందంగా ఉండేవి.

పెళ్లయిన కొత్త రోజుల్లో మీనాక్షిని బయటికి పోనిచ్చేవాడు కాదు. ఇరుగుపొరుగు గొడవ చేయడంతో ప్రతి శనివారం రామాలయంలో జరిగే భజనకు మాత్రం వెళ్ళనిచ్చేవాడు. అదే తల్లీకొడుకులకు పండుగా, ఆటవిడుపు.

చిట్టిబాబుకు కూడా తండ్రంటే సింహ స్వప్నం. “నోట్లో చుట్టబెట్టుకుని కర్రూపుతూ కిర్రుబూట్లతో నడిచి వస్తున్న తండ్రిని చూసి, అరుగు మీద ఆడుకునే చిట్టి బాబు భయంగా ఇంట్లోకి పరిగెత్తి తల్లితో “అమ్మా నాన్న ఒత్తున్నారు” అని చెప్పేవాడు.

తండ్రి ఇంట్లో ఉన్నంతసేపు తల్లి కొంగు పట్టుకొని తిరిగేవాడు భయంతో. కొడుకు అమాయకుడు ఎంత పిరికివాడు అనుకునేవాడు తండ్రి.

ప్రతి శనివారం దేవాలయానికి వెళ్లి అక్కడి చెట్లు పూలు పిట్టలు మనుషులతో గుడి వాతావరణంతో ఆనందంగా గడిపి ఇల్లు చేరే వాళ్ళు తల్లి కొడుకులు. అప్పుడప్పుడు రామ మందిరంలో ఉత్సవాలు జరిగేవి. ఒకసారి ఉత్సవాలు చూసేందుకు పిల్లవాడు ఇష్టపడుతున్నాడు అనుమతి ఇవ్వమని భర్తను కోరింది మీనాక్షి. ఏ లోకాన ఉన్నాడో వెళ్ళమని అనుమతి ఇచ్చాడు. ఉత్సవాలు జరిగిన వారం రోజులు ప్రతిరోజు రామమందిరానికి వెళ్ళేవాళ్ళు. అక్కడ భజనలు కీర్తనలు జరిగేవి రకరకాల వాయిద్యాలు వేదికపై ఉండేవి పక్కింట్లో చూసిన హార్మోనియం అక్కడ వేదిక మీద కూడా ఉండడం చూసాడు చిట్టిబాబు. ఇంటికి వచ్చేటప్పుడు మనకు కూడా హార్మోనియం ఉంటే ఎంత బాగుంటుంది అని తల్లిని అడిగాడు.

మీనాక్షి అత్తగారి ఇంటికి వచ్చేటప్పుడు తనతో పాటు తన హార్మోనియం పెట్టె కూడా తెచ్చుకుంది. దాన్ని తన కళ్ళ ముందే పది రూపాయలకు అమ్మేశాడు నరసింహం. సంసారులు హార్మోనియం వాయించడం అంటే మహాపాపమని అతని ఉద్దేశం.

కొడుకు హార్మోనియం గురించి అడిగే టప్పటికీ అవన్నీ గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకుంటూ “చాలా బాగుంటుంది” అని సమాధానం చెబుతుంది. కొడుకు అటువంటి హార్మోనియం మనం కూడా కొనుక్కుందాం అంటాడు. కూరగాయల కోసం ఇచ్చిన వాటిలో పొదుపు చేసి హార్మోనియం కొనుక్కోవలనుకుంటుంది. అదేవిధంగా పొదుపు చేసిన డబ్బును తీసుకొని మూసీనది వంతెనదాటి వాయిద్యాలమ్మే దుకాణాల ప్రదేశానికి కొడుకును తీసుకుని వెళ్ళింది. అక్కడ నిలబడి చూస్తూ ఉండగా గుమస్తా ఏమి కావాలని అడుగుతాడు హార్మోనియం అనగానే వాళ్ళిద్దర్నీ లోపలికి తీసుకుపోతాడు కానీ వాటి ధర విని, కొత్తవి వద్దు వాడినవి ఉంటే చూపించు అంటుంది. చివరకు తన వద్ద ఉన్న డబ్బుకు ఏక్తారా మాత్రమే వస్తుందని ఇస్తొడు గుమస్తా. ఇదీ బానే ఉందంటాడు చిట్టిబాబు. ఏక్తారా తీసుకొని ఇంటికి వస్తారు. తల్లి కొడుకులు ఇద్దరు సంతోషంగా దానిని వాయిస్తూ నరసింహం ఇంటికి వచ్చేవరకు గమనించారు. అతడు రావడంతో భయంగా దానిమీద ఒక గుడ్డను కప్పి వంటింట్లోకి పరిగెత్తుతుంది. అయినా సరే నరసింహ దాన్ని చూస్తాడు ఎక్కడిది, అని అడిగి తిరిగి ఇచ్చేసి రమ్మంటారు. రాత్రిపూట మరొకసారి చిట్టిబాబు ఇష్టపడుతున్నాడు ఆడుగుతుంది. అయినా సరే నరసింహం అంగీకరించక తిరిగిచ్చెయ్యమని అంటాడు. దాంతో తెల్లవారి తల్లి కొడుకుల వెళ్లి ఎవరూ చూడకుండా షాపు లో పెట్టి బయటకు వచ్చి , రెండు ప్రాణాలు మాయమయ్యాయి. కథ ముగుస్తుంది.

*****

నందగిరి ఇందిరాదేవి తొలితరం తెలంగాణ కథారచయిత్రి 22 సెప్టెంబర్ 1919 లో వంగపహాడ్ గ్రామం, హనుమకొండ లో జన్మించారు. ఇందిరాదేవి తన సాహితీ వ్యాసంగం 50 ఏళ్లు కొనసాగింది కథలు వ్యాసాలు రేడియో ప్రసంగాలు చాలా చేశారు. 2007 జనవరి 22న టెక్సాస్లో మరణించారు.
ఆమె తండ్రి వడ్లకొండ నరసింహారావు, తల్లి వెంకటమ్మ , భర్త నందగిరి వెంకటరావు.
ఆమె తన 14వ ఏటనే పాఠశాల తరఫున సాహిత్య సంచికలను వెలువరించింది. అనేక సామాజిక సాంస్కృతిక ఉద్యమాల్లో పాలుపంచుకుంది. ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకులలో ఆమె ఒకరు. బాల్యవివాహాలను వ్యతిరేకించింది. కుటుంబ సంబంధాల ఇతివృత్తాలు పై ఇందిరా దేవి రాసిన కథలన్నీ వ్యవహారిక భాషలో సరళ శైలిలో ఉన్నాయి. స్త్రీ పురుషుల మనస్తత్వాలను సుకుమారంగా చిత్రించడం ఆమె కథల్లో కనిపిస్తాయి. భారతి, గృహలక్ష్మి, ఆంధ్రజ్యోతి, చిత్రగుప్త, ఆంధ్ర కేసరి, శోభ, ప్రజామిత్ర, వనితా జ్యోతి,యువ వంటి ప్రముఖ పత్రికలలో ఆమె రచనలు ప్రచురితమయ్యాయి.
వీరి మొదటి కథ పందెం 1941లో తర్వాత నేటి మనకథ వాయిద్యం సరదా అదే సంవత్సరంలో లో రాసారు.1961లో రూల్స్ ప్రకారం మా ఇల్లు, 1962లో మా వారి పెళ్లి , ఒక వాన రోజున మా ఇంట్లో, ఎవరి తరమమ్మ ఉద్యోగితో కాపురం, ఆడవారికి అలుక ఆనందం వంటి కథలు 2005లో పందెం 2006లో గంగన్న వంటి కథలు రాశారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.