ఒక్కొక్క పువ్వేసి-2

మరియమ్మలు మనలేని భారత్

  –జూపాక సుభద్ర

ఈ దేశంలో మరియమ్మ వంటి దళిత మహిళల మీద బైటి మనుషులు కాదు, ప్రభుత్వ పోలీసు యంత్రాంతమే హత్య చేసినా పౌర సమాజాలు పలుకయి, ఒక్క కొవ్వొత్తి వెలగది, ఒక్క నిరసన నినదించది, ఒక్క అక్షరమ్ అల్లుకోదు, ఏ ఉద్యమ దుకాణాలు ఉలకవు, మహిళా కమిషండ్లకి, సంగాలకు మనసురాదు. చీమ చిటుక్కమన్నా డైరెక్ట్ లైవులతోని చెప్పిందే పదిసార్లు చెప్పి సంచలనాలు వండే టీవీ చానెల్లు యీ దేశాభివృద్ధికి ఉత్పత్తి శక్తులైన దళిత మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరిగినా వార్త చేయవు. ఎందుకంటే మరియమ్మలు ఆధిపత్యకులాల ఆడబిడ్డలైన నిర్భయ, దిశలు కాదు.

వూరి చివరి మహిళలపై జరిగే ఆకృత్యాలు అన్యాయాలు వూరికి వినబడయి, అగ్రహారాలకు అగుపడయి. ఆధిపత్య మహిళ మరియమ్మ యితే యింత తేలిగ్గా కొట్టి చంపేవారా పోలీసులు. దళిత మహిళ వీల్లని కొటిటనా చంపినా, అత్యాచారాలు చేసినా అడిగే వారుండరు అనే అలుసు, కులాధిపత్యమ్ యిస్తుంది. ఆ అలుసు వల్లనే మరియమ్మను పోలీసు స్టేషన్లో కొట్టి చంపిండ్రుపోలీసులు.

ఇంతకి మరియమ్మ కాని నేరమ్ ఏం చేసింది? ఏ నేం చేసినా పోలీసులకు కొట్టిచంపే అధికారమ్ లేదు కదా! మరియమ్మ మీద దొంగతనమ్ కేసు వేసిండు తన పనిచేస్తున్న యజమాని చర్చిఫాదర్. అంబడిపూడి మరియమ్మ ఖమ్మం జిల్లా చింతకాని కోమట్లకుంట పేదరాలు. ముగ్గురు పిల్లలు. వున్నవూల్లె పనిదొర్కక తెల్సిన వాల్లయిలాకన భువనగిరి జిల్లా, అడ్డగూడూరు, గోవిందాపురంలో ఒక చర్చిఫాదర్ యింట్లో పనికి కుదరింది. కొడుకును కూడా వెంటదెచ్చుకొని చర్చిల పంజేస్తున్నది. యీ నెలలో (జూన్ 2021) డబ్బులు  దొంగతనం జేసిందని నేరారోపణ చేసిండు చర్చిఫాదర్. మద్య మద్యల చర్చిఫాదర్కి చెప్పి యింటికి పోయి యిల్లు పిల్లల్ని సమాలించుకొని వస్తుందిట.

కానీ చర్చిఫాదర్ రెండు లక్షలు దొంగతనం జేసివెళ్లిపోయిందని కేసు బెట్టిండు. పోలీసులు పేదవాళ్ల పట్ల ముఖ్యంగా దళితుల పట్ల చాలా కృరమైన ప్రతాపాలు చూపిస్తుంటారు. బాధితులు చెప్పేది వినరు.

మరియమ్మ అయ్యా నాకే పాపమ్ తెల్వదు నేందియ్య లేదయ్యా  సార్ ను అడిగే మా యింటికి బోయిన అని ఎన్ని ప్రమాణాలు జేసినా చర్చిఫాదర్కి సువార్త కాలే.

దళితతల్లి, ఏ ఆధారమ్ లేని, ఏ ఆస్తులు లేని, ఏ ఆసరా లేని మరియమ్మని విపరీతంగా… అంటే చచ్చిపోయే దాక కొట్టి చంపిండ్రు పోలీసులు ఆమె కొడుకును కూడా కొడితే అతను చావుబతుకుల్లో వున్నాడు. దళిత సంగాలు గొడవజేస్తే, కోర్టులు స్పందిస్తే… తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వము కొంత డబ్బులిచ్చింది బాధితులకు. ఖేల్ ఖతమ్ అని దులిపేస్కుంది. మరియమ్మను చంపిన నేరానికి నాలుగు డబ్బులు మరియమ్మ పిల్లలకు – ఉద్యోగము యిల్లు యిస్తే… సరిపోతదా, ఒకరిద్దరు పోలీసుల్ని ససెపండ్ చేస్తే అయిపోతదా!

దళిత మమిళల మీద హత్యలు హత్యాచారాలు జరిగితే, నేరస్తుల్ని ఎస్సీ, ఎస్టీ అరటాసిటీ కేసుపెట్టి శిక్షించాలి. ప్రభుత్వాలు కూడా పైలసలిచ్చి దులపుకోవడమ్ కాక నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలి చిత్తుశుద్ధిగా.

అమెరికాలో జార్జి ఫ్రాయిడ్ ని పోలీసు చంపితే… ప్రపంచమంతా స్పందించి సంఘీభావం తెలిపింది బాదితునిపట్ల. పోలీసులకు 22 ½ సంలు జైలు శిక్ష కూడా పడింది. కానీ యిక్కడ న్యయస్థానాలు అట్లా శిక్షలు వేసిన సందర్భాల చరిత్రలున్నాయా! వెతుక్కోవాలె, దళితులు బాదితులుగా బలైనపుడు.

సవర్ణ మహిళలను దృష్టిలో వుంచుకొని ఏర్పర్చిన చట్టాలు దళిత మహిళలకు సరిపోవు వీరికి ప్రత్యేక చట్టాలు ప్రత్యేక కోర్టులు కావాలి. దళిత మహిళల దాడులు, అత్యాచారాలు, హత్యలకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టలు ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా దళితమహిళా కమిషన్స్ నియామకం జరగాలి.

ఒక మనిషికి ఒకే విలువ అనే సమానత్వ సూత్రాలు అందరి సమాజమ్ లో మరియమ్మలకు నాయయం జరగనందుకు ప్రత్యేక కోర్టులు కావాలి. అన్ని జెండర్ హింసలు ఒకటి కావు. దళితమహిళల మీద జరిగే సామాజిక హింసలు ప్రత్యేకమైన అన్యాయాలు. చట్టపరమైన రక్షణలకు భద్రతలకు దూరంకొట్టబడిన ప్రత్యేక అన్యాయాలు. గృహహింసలకు చట్టాలున్నట్టలు సామాజిక హింసలకు చట్టాల్లేని ప్రత్యేక అన్యాయాలున్నాయి కాబట్టి దళఇత మహిలలకు ప్రత్యేక పోలీస్ స్టేషన్స్ పెట్టాలి. యిట్లాంటి ప్రత్యేక అన్యాయాలు గుర్తించనంతకాలమ్ మరియమ్మలకు న్యాయాలు జరగవు, మరియమమమలు బతకలేరు యీ దేశమ్ లో.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.