మిట్ట మధ్యాహ్నపు మరణం- 5

– గౌరీ కృపానందన్

క్షణం… కాదు కాదు క్షణంలో సగానికి తక్కువ అని కూడా చెప్పవచ్చు. ఆ దృశ్యం ఉమ కళ్ళ ముందు కదలాడింది. ఆ రైలు వేరు. ప్రయాణికులు వేరు. భర్త పక్కన లేడు. ఉమ పుట్టెడు శోకంలో మునిగి పోయి ఉంది. కన్నీరు మున్నీరు గా విలపిస్తోంది.

ఛీ.. ఎంత విచిత్రమైన పగటి కల! పగటి కల కాదు. ముందు ముందు జరగబోయే దానికి సూచన! కాదు కాదు కలే. మేలుకుని ఉన్నప్పుడే ఇలాంటి కల రావడం ఏమిటి? సంతోష శిఖరపు అంచుల్ని తాకుతున్న ఈ సమయంలో, అమ్మ నాన్నలను విడిచి పెట్టి ఉండటం వల్ల ఏర్పడిన మానసిక సంచలనం ఇది. అంతే!   

తనను తాను నిగ్రహించు కోవడానికి ప్రయత్నించింది. మణి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. మూర్తి అతని మాటలకి అవును అన్నట్లుగా తల ఊపుతూ ఉన్నా, అంత శ్రద్ధగా వింటునట్లు అనిపించలేదు.

“మన దేశం ఇంత అధ్వాన్నంగా తయారవడానికి కారణం ఏమిటో తెలుసా? కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవడం! బొత్తిగా దేశభక్తి లేకుండా పోయింది. స్వార్థం! అందరిలోనూ స్వార్థం ఎక్కువై పొయింది.’

ఉపన్యాసం దంచేస్తున్నవాడల్లా ఉన్నట్టుండి, తన ఉనికి అక్కడ అక్కర్లేదన్న స్పృహ  రాగానే, “రానా మరి. మిమ్మల్ని ఇంకా బోర్ కొట్టించ దలచుకోలేదు. తరువాత కలుద్దాం. వస్తాను ఉమా” అన్నాడు.

“ఉమీ అనే కదా మీరు ఆమెను పిలిచేది?”

“ఇక మీద ఉమీ కాదు. ఉమ! తను పరాయి ఇంటిది అయిపొయింది.”

మణి వెళ్ళిన తరువాత, “పెక్యూలియర్ చాప్” అన్నాడు మూర్తి.

““ఎందుకలా అంటున్నారు?”

“ఒక సబ్జెక్ట్ లో స్థిరంగా ఉండటం లేదు. “

“మీరేం మాట్లాడుకున్నారో నేను గమనించనే లేదు.”

“ఒకసారి జిడ్డు కృష్ణమూర్తి అంటాడు. ఇంకో సారి ఐన్ స్టీన్ అంటాడు. బొత్తిగా అర్థం కావట్లేదు. నువ్వేంటి? ఆలోచనలలో మునిగి పోయావే?”

“ఏమిటో అర్థం పర్థం లేని ఆలోచనలు.” మూర్తి భుజాలను నొక్కి పట్టుకుంటూ అంది. “నన్ను వదిలేసి ఎక్కడికీ వెళ్లి పోరుగా?”

“బెంగ పెట్టుకోకు. ఆఫీసుకు వెళ్ళేటప్పుడు కూడా నిన్ను బుట్టలో పెట్టుకుని తీసుకెళ్తాను. సరేనా? ఇంతకు ముందు నువ్వు బెంగళూరుకు వచ్చావ?”

“ఒక సారి ప్రెండ్స్ తో క్రికెట్ మాచ్ ఆడడానికి వచ్చాను. ఇదే బృందావన్ రైలులో. పదిహేను మంది దాకా వచ్చాం. ఒకటే అల్లరి, ఆట పాటలు. అప్పట్లో జీన్స్, టీ షర్ట్ వేసుకునే దాన్ని. అబ్బాయిలందరూ మా కంపార్ట్ మెంట్ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ‘హాయ్! ఐ యాం రాకేష్’ అని ఒకబ్బాయి ధైర్యంగా ముందుకు వచ్చి నాతో పరిచయం కూడా చేసుకున్నాడు. భలేగా నవ్వొచ్చింది.”

“నాకేం నవ్వు రావడం లేదు. అతనితో మాట్లాడావా?”

“హాయ్ అన్నాను అంతే. బెంగళూరులో మేము ఆడిన అన్ని మాచ్ లకీ వచ్చాడు పాపం.”

“ఎక్కడ స్టే చేశారు?”

“K.C.H.A. స్టేడియంలో. చాలా సరదాగా గడిచి పోయింది ఆ ట్రిప్.”

ఇప్పుడు మళ్ళీ బెంగళూరు. స్టూడెంట్ లా కాదు. ఒకరికి భార్యగా, ఒద్దికగా చీర కట్టుతో, పక్కనే భర్తతో, పెళ్లి వలన ఏర్పడిన కొత్త హోదాతో, దేనినో కోల్పోయి, దేనినో పొంది…

బెంగళూరు వచ్చేసింది. మేకప్ కిట్ తీసి లైట్ గా టచప్  చేసుకుంది.

బెంగళూరు శుభ్రతకి ప్రాధాన్యం కలిగిన నగరంలా కనిపించింది. ఆటోలు పసుపు రంగులో రివ్వున పరుగులు పెడుతున్నాయి.

“మిసెస్ అండ్ మిసెస్ కృష్ణమూర్తి!”

“ఒక్క నిమిషం! “

రిసెప్షనిస్ట్ రిజర్వేషన్ చార్ట్ చూస్తుండగా ఉమ చుట్టూ పక్కన పరిసరాలను పరీక్షగా చూస్తూ నబడింది.

“సరిగ్గా చూడండి. మణి అన్న వ్యక్తి మా కోసం రిజర్వ్ చేశారు.”

“జస్ట్ ఎ సెకండ్. అడ్వాన్స్ పంపించారా?”

“నీకు తెలుసా ఉమా?”

“నాకు తెలియదు. నాన్నగారు మణితో చెప్పారు.”

“ఐ గాట్ ఇట్. మీ పేరిట రూమ్ రిజర్వ్ అయి ఉంది. రూమ్ నంబరు 424. లిప్ట్ లో వెళ్ళండి.”

“కాటేజ్ లేదా?”

“సారీ సర్. అన్నీ బుక్ అయి ఉన్నాయి. రెండు రోజుల తరువాత ఖాళీ అవుతాయి. అప్పుడు మార్చుకోండి.”

“రూమ్ లో ఏ.సి. ఉందా?”

“బెంగళూరులో ఎందుకు సార్ ఏ.సి.?”

“అన్నింటికీ స్మార్ట్ గా జవాబు చెబుతున్నారు. రా ఉమా.”

రిసెప్షన్ లో ఉన్న ఆ యువకుడు ఉమను చూసి ఒక మాదిరిగా నవ్వాడు.

గదిలోకి రాగానే ఉమకి మళ్ళీ జ్వరం వచ్చినట్లయింది. గదిలోని వాతావరణం, ఇద్దరు మాత్రమే ఉన్న ఆ ఏకాంతం! బాల్కనీకి వెళ్లి చూసింది. స్టేడియం కాస్త దూరంలో కనబడింది.

“రా ఉమా!” పిలిచాడు మూర్తి.

“మొదట భోజనం చేద్దాం.”

“మై గాడ్! అన్ని ఇడ్లీలు తిన్న తరువాత కూడా ఆకలిగా ఉందా?”

“అవును. ఒక్క మీల్స్ కి ఆర్డర్ ఇవ్వండి. ఇద్దరమూ షేర్ చేసుకుందాం.”

“అలాగే మహారాణీ.” పక్కనే ఉన్న స్విచ్ ని నొక్కాడు. “అతను తెచ్చే లోపల ఒక చిన్న…”

“అన్నీ తరువాత. మొదట భోజనం. తరువాత వెంటనే బయలుదేరి షాపింగ్ వెళదాం.”

“షాపింగ్ చెయ్యడానికా పెళ్లి చేసుకున్నాం? అన్నిటికీ ఒక టైం ఉంది.”

గది తలుపును చప్పుడు చేసి లోపలి వచ్చిన బేరర్, “ఏం కావాలి సర్?” ఎటో చూస్తూ అడిగాడు.

“ఒక బాంబే మీల్స్ తీసుకుని రా.”

“ఒక్క మీల్స్?” సరిగ్గానే విన్నానా అని అడిగి తెలుసుకున్నాడు, ఎర్రగా, అందంగా ఉన్నాడు.

“స్వీట్స్ ఏమున్నాయి?”

“బాసుంది… జాంగ్రి.”

“బాసుంది రెండు” అన్నాడు.

బేరర్ వెళ్లి పోయిన తరువాత, మంచానికి ఎదురుగా ఉన్న నిలువుటద్దం చూసిన ఉమ తుళ్ళి పడింది. “అయ్యో! ఇదేమిటి?”

“మనల్ని మనమే టి. వి. లో చూసుకోవడానికి.”

“చస్తే ఒపుకోను.”

వచ్చిన మీల్స్ ని ఇద్దరూ కలిసి తిన్నారు. ప్లేటును తీసి గది బైట పెట్టిన వాడల్లా, గది తలుపు గొళ్ళెం పెట్టి, మంచం  మీద వచ్చి కూర్చున్నాడు. అతను విడిచిన పాంట్, షర్ట్ లను హేంగర్ కి తగిలించి, అక్కడే ఉన్న వార్డ్ రోబ్ లో పెట్ట బోయింది.

“అవన్నీ తరువాత చూసుకుందాం ఉమీ!”

“నేనూ అదే అంటున్నాను బాబ్జీ!”

“ఇప్పుడు వస్తావా లేదా?”

“ఈ నిలువుటద్దం ఉన్నంత వరకు నేను రాను.”

“ఆల్ రైట్! దానికి తెర వేసేద్దువుగాని.”

“తెర ఎక్కడుంది?”

“నీ చీరను విప్పేసి దాని మీద తెర లాగా వేసేయ్. ఇప్పుడు చీర ఎలాగు వేస్టే కదా.”

“ఇలా మాట్లాడితే నేను రానంతే.”

సాయంకాలం అవుతుండగా హోటల్ రూమ్ నుంచి బయటకి వచ్చారు. కబ్బన్ పార్క్ కి వెళ్ళారు. టెన్నిస్ స్టేడియం, పాప్ కార్న్!

ఫోటోగ్రాఫర్ ఒకతను దగ్గిరికి వచ్చి, “ఎక్స్ క్యూస్ మీ ” అన్నాడు. “వుడ్ యు మైండ్ ఇఫ్ ఐ టేక్ అ పిక్చర్?” అన్నాడు.

అతన్ని పరిశీలనగా చూసిన మూర్తి చిరునవ్వుతో, “నాట్ ఎట్ ఆల్” అన్నాడు.

క్లిక్! “థాంక్యూ!”

స్టేడియం దాటుతుండగా, “ఇక్కడే నేను క్రికెట్ ఆడాను” అంది ఉమ.

“ఎన్ని రన్లు చేశావు?”

“ఎనిమిది.”

“వెరి గుడ్!”

“వెరి గుడ్ అంటారేమిటి? ఎనిమిది రన్నులు అంటే చాలా తక్కువ. క్రికెట్ గురించి ఏమీ తెలియదా?”

“నాకు తెలిసిన దంతా ఒకే ఆట. హ్యాండ్ బాల్.”

“అయ్యయ్యో! మరి డైవోర్స్ చేయాల్సిందే. మీరు ఏ ఏ పుస్తకాలు చదువుతారు?”

“బిజినెస్ వీక్, ఎకనామిక్ టైమ్స్, కాస్త షేర్ మార్కెట్.”

“మీరేం చెబుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మనిద్దరం ఇంతవరకూ శారీరకంగానే పరిచయం అయ్యాం.”

“నో ప్రాబ్లం. చాలా టైం ఉంది. నా గురించి అన్నీ చెబుతాను. ఇప్పుడు సినిమాకి వెళదామా?”

“ సినిమా చూడనిస్తానంటే వెళదాం.”

నిలువుటద్దంలో ఇద్దరి ప్రతిబింబాలను చూసుకున్న ఉమకి గర్వంగా కూడా అనిపించింది. ప్రకటనల్లో వచ్చే భార్యాభర్తల్లాగా, ఎత్తు, వయసు, అందచందాలు అన్నీ ఖచ్చితంగాం పొందికగా ఉన్నట్లనిపించింది. తను ఎంతో అదృష్టవంతురాలు!

సినిమా ధియేటర్ నుంచి వచ్చేటప్పుడు దివ్యను చూసింది.

“హలో దివ్యా! చూశారా, నేను చెప్పలేదూ స్టేషన్ లో దివ్యను చూశానని. ఏంటి దివ్యా? బెంగళూరుకు ఇలా సడన్ గా?”

“మా అక్క ఇక్కడే ఉంది. హెల్ప్ కి రమ్మని రాసింది.” దివ్య ముఖం కాస్త పాలిపోయినట్లు అనిపించింది. కాస్త తొందరలో ఉన్నట్లు అనిపించింది. ఎత్తుగా, దృడంగా ఉన్న యువకుడు మౌనంగా ఆమె పక్కన నుంచున్నాడు.

“హాయ్ దివ్యా” అన్నాడు మూర్తి.

“ఉమా! ఇతను నా కజిన్ బ్రదర్. ఆమె ఉమ, ఈయన పేరు కృష్ణమూర్తి.”

“హాయ్!”

“వస్తాను. హేవ్ ఎ నైస్ టైం.” దివ్య కంగారు పడుతూ అతనితో వెళ్లి పోయింది.

“కజిన్ బ్రదరా? ఏదో తిరకాసు వ్యవహారం లా ఉంది. నాకు ముందే అనుమానం. దివ్యను వద్దనడానికి ఇది కూడా ముఖ్య కారణం. సెకండ్ హేండ్!”

హోటల్ గదిలో రెండవ రాత్రి. ఇద్దరి మధ్య కొత్తదనం కాస్త తగ్గినా కూడా నిద్ర పోవడానికి మూడు గంటలయ్యింది.

మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకు లేచి, కాఫీ తాగి మళ్ళీ నిద్ర పోయాడు మూర్తి. ఉమకి నిద్ర పట్టలేదు. లేచి స్నానం వగైరాలు ముగించింది. బ్రేక్ ఫాస్ట్ చేద్దామా అని మూర్తిని అడిగినప్పుడు అతను అటు వైపు తిరిగి మళ్ళీ నిద్రలో మునిగి పోయాడు.

బాగా అలిసి పోయిన వాడిలా నిద్రపోతున్న మూర్తిని చూసిన ఉమ, అతన్ని కుదుపుతూ, “కాస్త తలువు లాక్ చేసుకోండి. నేను క్రిందికి వెళ్లి బుక్ షాప్ లో ఏవైనా ఉన్నాయేమో చూస్తాను” అని అంది.

అతను కలత నిద్ర లోనే, “ఊం. అలాగే” అన్నాడు.

క్రిందికి వచ్చింది ఉమ. లౌంజ్ లోనే ఉన్న పుస్తకాల షాప్ కి వెళ్ళింది. అక్కడ ఉన్న పుస్తకాలను తిరగేస్తూ కూర్చుంది. కాస్సేపయ్యాక గడియారం కేసి చూసుకుంది. మూర్తి ఈ పాటికి లేచి ఉంటాడని మళ్ళీ నాలుగో ఫ్లోర్ కి వెళ్ళి తమ గది తలుపులను తోసిన ఆమె, తలుపు క్రింద సన్నని రక్తపు ధారను చూసింది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.