
నీహార పథం – భాగం-1
తొలి తొలి అడుగుల చిన్నారి లోకం
-డాక్టర్ కొండపల్లి నీహారిణి
అమ్మ చూడడానికి కూడా చాలా బాగుండేది. దాదాపు సావిత్రి, కృష్ణ కుమారి లు కలగలిసిన రూపురేఖలకు దగ్గరగా ముఖ కవళికలు ఉండేవి. తనో గొప్ప రాజకీయ నాయకుని భార్య హోదానో, భూస్వామి కోడలుగానో ఉండేది కాదు. అందరూ “దొరసాని” అని పిలవడం ఆ కాలపు పద్ధతే! కానీ, ఆమె పెత్తందారీ నిరంకుశ ధోరణి తో ఉండేదే కాదు. అసలు మా బాపు ఆదర్శాలకు విరుద్ధంగా ఏనాడూ లేదు. మా మేనమామ కొలనుపాక వేణుగోపాల్ రావు గారు అంటే మా అమ్మ పెద్దన్నయ్య కూడా కమ్యూనిస్టు భావజాలంతో పనిచేసినతనే. అందుకే మా అమ్మను ఢిల్లీ కి తీసుకువెళ్లి మరీ మా బాపు తో పెళ్లి చేయించారు. ఒకవైపు మా అమ్మమ్మ వాళ్ళు నియమనిష్టలతో జీవితాన్ని గడిపే వాళ్ళు. కొన్ని విషయాలలో ఛాందస భావాలున్న సద్బ్రాహ్మణ కుటుంబం. అయినా అమ్మ చిన్నప్పటినుంచి చదువంటే ఇష్టం తో,ఏదైనా సాధించాలనే ఆలోచన తో ఉన్నటువంటి స్త్రీ. ఇవన్ని… కారణాలతో అమ్మ తనదైన గొప్ప వ్యక్తిత్వ నిర్మాణం చేసుకున్న
ఆదర్శ మహిళ. ఇటు ఇంటి సేవ ఎలాగో …. అటు సమాజసేవ అలా ! ఈ రెంటిలోనూ అమ్మ తనదైన ముద్ర వేసిన తరుణీమణి. అనంతమైన శక్తి. అమ్మ ‘మహిళా మండలి’ ని స్థాపించి స్త్రీ ల కు ఉపాధి కల్పించిన మార్గదర్శి. స్త్రీ ల సాధికారత కోసం కృషి చేసిన మనీషి. ఈ మహిళా మండలి కోసం మా ఇంటి మనసాలలోని తూర్పు గదిని కేటాయించి, మా ఇంట్లో నే కుట్టు మిషన్ లు పెట్టించి అధికారికంగా శిక్షణ ఇప్పించి, నేర్పించి, వాళ్ళకు బ్రతుకు తెరువు చూపించింది. మహిళలకు ఆర్థక స్వావలంబన కోసం, మహిళా సాధికారత కోసం , వాళ్ళ లోన నైపుణ్యాలను మెరుగుపరచడానికి వృత్తి విద్యా శిక్షణ ఇప్పించే ఉద్దేశ్యానికి తనకు చేతనైనంత సేవ చేసింది అమ్మ. తను పాఠశాల కు వెళ్లి పెద్ద చదువులు చదువుకున్నా హిందీ ఇంగ్లీష్ బాగా వచ్చేది. ఆఫీసర్స్ తో మాట్లాడాల్సి వస్తే ఎంతో ధైర్యంగా మాట్లాడి మహిళలకు ఏ ఏ లోన్లు , ఏయే పథకాలు అందుతాయో అవన్నీ వచ్చేలా చూస్తూ టైలరింగ్ అవన్నీ నేర్పించే ఏర్పాటు చేసేది.
ఆ మహిళ లు చిన్న చిన్న మోడల్స్ లాగా అంటే బ్లౌజులు, ఫ్రాక్స్, లంగా జాకెట్లు, సెల్వార్స్, షర్ట్స్ వంటివన్నీ చిన్న చిన్న బొమ్మల్లా మోడల్స్ లాగా కట్ చేసి కుట్టి అతికించిన పెద్ద పెద్ద రికార్డ్స్ మా ఇంట్లో చాలా కాలం ఉండేవి. అవి అపురూపమనిపించేవి. చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి మహిళా మండలి బ్లాక్ నుండి వాళ్లకు లోన్స్ ఇప్పించి వాళ్ళ మంచి చెడ్డలు చూసుకునేది. ఇంటి వంటిల్లు నుండి సమాజ సేవ వరకు ఆమె అడుగులు అవిశ్రాంతంగా సాగినవి. ఆమె చేతుల్లో పెరిగిన మాకు… ఓపిక, సహనం, సేవా భావం సహజ గుణాలయ్యాయి. ఇదీ మా అమ్మ గుణసౌందర్య ముఖచిత్రం. అమ్మ గురించి ఓ గ్రంథమే రాయాలి. రాస్తున్నాను.
పొలాలు,చెల్కల దగ్గరకు వెళ్ళి, వరిమళ్ళకు నీళ్లు కట్టించడాలు, గొర్రు కొట్టించడాలూ, చెలకలు దున్నించడాలు, కల్పులు తీయించడాలు, పంటను ఇంటికి చేర్పించడాలు వంటి పనులన్నీ బాపు ఓ బావి వైపు, తనో వైపు వెళ్లి పనులు చూసుకొని, మళ్లీ ఇంటిదగ్గర జీతగాడు పాలుపిండే వేళకు వచ్చేవాళ్ళు. మమ్మల్నందరినీ ఇంకా నిద్ర లేవకుంటే కోప్పడో బుదుగరించో నిద్రలేపే వాళ్ళు. పెద్ద మనుషులు మంచాన పడితే వాళ్లకు మొత్తం సేవలన్నీ అమ్మనే చేసేదని మా చుట్టాలు అందరూ చెబుతుంటారు.
ఆనాడు తాతయ్యకు పక్షవాతం వచ్చిందంట. మా నాయనమ్మకు పక్షవాతం వచ్చి మంచానపడితే మా అమ్మనే సేవ చేయడం నేను చూశాను. మా అమ్మ మాకు ఒక విద్యార్థిని ఒకటి ఉపాధ్యాయిని. అదేంటి అనుకుంటున్నారా? అవును… పిల్లల మేం టీచర్లుగా బ్లాక్ బోర్డ్ మీద రాస్తూ ఉంటే మా అమ్మ విద్యార్థినిలా కూర్చుని వినేది. అలా ఇంట్లో స్కూల్ లాగా ఆడించేది . ఇంగ్లీష్ అక్షరాలు, తెలుగు,హిందీ వర్ణమాల తానే నేర్పించింది. రంగులు, కూరగాయల పేర్లు, ఋతువులు, తిథులు,వారాల , నెలల పేర్లు, చిన్నచిన్న పదాలు ఇలాంటివన్నీ మాకు డిక్టేషన్ ఇస్తూ చదివించేది. వేళకు మాకందరికీ ఇష్టమైన పదార్థాలు తయారు చేసి పెట్టడానికి
పొయ్యి ముట్టించిందంటే ఇక వంటింటి పనికే అంకితం అమ్మ. అట్లా అమ్మ ఎప్పుడూ తీరిక లేకుండా ఉండేది. అయినా అమ్మ ముఖం మీద ప్రశాంతత నే ఉండేది. అటువంటి తల్లి కడుపున పుట్టడం వల్లనేమో, ఆమె చల్లని చేతుల్లో పెరగడం వల్లనేమో ఆమె లా నాకూ కొంతోగొప్పో ఓపిక, సమర్థత అలవడింది.
ఉదయం రేడియో లో “వందేమాతరం…” గీతం తర్వాత వచ్చే ” కేయూరాణి న భూషయంతి పురుషం…….సతతం వాగ్భూషణం భూషణం” శ్లోకం చదువుతూ నో ఇల్లంతా ఏకం చేసే వాళ్లం. వాగ్భూషణం ఎందుకు భూషణం? ఎలా భూషణం? అప్పుడు అర్థం తెలియదు తర్వాత కాలంలో తెలుసుకున్న వాక్య అసలైన ఆభరణం అని. అనేది అమ్మను చూస్తూ పెరగడం వల్ల తర్వాత కాలంలో నేనూ అలవర్చుకున్నాను.
రేడియో ఒక శ్రవణ శక్తి… ఒక విజ్ఞాన కేంద్రం! రేడియో మాకు గురువు. అలా రేడియో లో ఆ తర్వాత వచ్చే ” శ్రీ హనుమాను గురుదేవులు నా యద పలికిన సీత రామ కథ నే పలికెద సీతా రామ కథ…… ‘ టురురుం టుం….టుకుడుమ్….’ “ ” శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు/ లంకకు పోయి రాగల ధీరుడు….” ఇలా సాగే ఈ గానమాధుర్యానికి ఆ కథలో లీనమై మేం అనుకరిస్తూ పెద్దగా పాడే వాళ్ళం. ఎం. ఎస్. రామారావు గారు గానం చేసిన “సుందర కాండ ” మా నోళ్ళల్లో నానేది. అమ్మ చుట్టూ తిరుగుతూ, అమ్మ కట్టుకున్న మెత్తటి కాటన్ చీర కు ముఖం తుడుచుకుంటూనో, హత్తుకుంటూనో అమ్మ పోసిన పాలు తాగడం… అదో మధురానుభూతి. మేమంతా మా చెవి రేడియో వైపు వేసేవాళ్ళం. శనివారం ఉదయాన్నే ” శ్రీవేంకటేశ్వర సుప్రభాతం” వచ్చేది. ఇక , “నమో వెంకటేశా … నమో తిరుమలేశా….” వంటి పాటలు , ఇతర సినిమా పాటలు రేడియో తోబాటే కూనిరాగాలు తీసేవాళ్ళం.. ఇలా మేం స్కూల్ కి వెళ్ళేదాకా, మళ్లీ సాయంత్రం ఇంటికి వచ్చామంటే రేడియో మా హృదయాల్లో తిష్ట వేసుకుని ఉండేది. మా పెదాలపై స్వరాలొలుకుతూ ఉండేది.
ప్రతిరోజూ 7 గంటల 5 నిమిషాల సమయంలో ” ఆకాశవాణి వార్తలు చదువుతోంది కందుకూరి సూర్యనారాయణ…” సుదీర్ఘ కాలం ఈ గొంతు విని విని ఆ గళ గాంభీర్యాన్ని అనుకరించలేక… అనుకరిస్తూ మా ఇంటి విశేషాలు మాట్లాడుతూ ఉండేవాళ్లం నేనూ చెందు. అద్దంకి మన్నార్ పేరు కూడా జ్ఞాపకం. ఎంత విచిత్రం అంటే… 2017 లో ఢిల్లీలో AP Bhavan లో జరిగిన సాహిత్య సదస్సు లో కందుకూరి సూర్యనారాయణ గారి ని కలవడం, మాట్లాడడం భలే అనిపించింది. “ఇయం ఆకాశవాణి, సంప్రతి వార్తాః ప్రవాచకో బలదేవానంద సాగరః” ఉదయం 9 గంటలకి ఐదు నిమిషాలు, సాయంత్రం 6 గంటలకు పది నిమిషాలకు మరొక ఐదు నిమిషాలు వీరు గళ గాంభీర్యాన్ని విని అనుకరించిన మా చిన్నతనం సంస్కృత పాండిత్యం అంతుబట్టాలని కాదు, తెలిసీ తెలియని చిలిపితనంతో అలాగే అనేవాళ్ళం. రేడియో క్రమం తప్పకుండా వినే వాళ్లకు సుపరిచితం. జాతీయ గీతం, సుందరకాండ గాన మాధుర్యం, జాతీయ గీతం, లలిత గీతాలు, సినిమా పాటలు ఇవన్నీ మా బాల్యంలో చైతన్యపు విత్తనాలు.
దేశ క్షేమానికి భాషా క్షేమమే ఎందుకు పునాదో అప్పుడు తెలియదు కానీ మా అమ్మవాళ్ళు అందుకే అంత పట్టింపుతో ఉండేవాళ్ళు. బాపైతే మరీనూ ఉచ్చారణ దోషాలు వస్తే సహించలేకపోయేవారు. ఇంగ్లీషు హిందీ భాషలను సమయానుకూలంగా నేర్పించేవారు అమ్మా, బాపు . అలాంటి వాళ్ళు తప్పులు మాట్లాడితే సహిస్తారా! మాతృభాష సరిగ్గా రాకుంటే ఎట్లా? అని బాపు గట్టిగా గద్దించేవారు.మా బాపు సెవెంత్ క్లాస్ వరకే చదువుకున్నారట. కానీ…తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడేవారు. నేను అనుకుంటుంటాను, హిందీ లో బాగా మాట్లాడడమే ప్రత్యేక ఆకర్షణై మా బాపును ఎంపి. గా సెలెక్ట్ చేసుకున్నారేమో కేంద్ర కమిటీ వాళ్లు అని! అలాగే అనిపించింది. పార్లమెంటులో మాట్లాడాలంటే వాక్కుకు బలం ఉండాలి కదా! వాక్కుకు బలం ఉండాలి అంటే మన భాషనే కాదు వేరే భాషలు కూడా వచ్చి ఉండాలి కదా! ఎన్నెన్నో పుస్తకాలు,పత్రికలూ చదివేవారు. బాపు వాక్చాతుర్యాన్ని చూసి తోటి రాజకీయ నాయకులు అబ్బురపడేవారట! స్వాతంత్ర్య పోరాటాల సమయంలో బాపు స్పీచ్ వినడానికి ఊర్ల నుండి జనం బండ్లు కట్టుకొని, సద్దులు పట్టుకొని వచ్చేవాళ్ళట. స్టేజ్ మీద మా బాపు ఉపన్యాసం అయ్యాక, “రాగన్న మాట్లాడిన తర్వాత ఇక నేనేం మాట్లాడాలె?” అని అనే వాడిని అంటూ చెప్పింది ఎవరో తెలుసా? కాళోజి గారు. ఈ మాటలే మా బాపు వాక్చాతుర్యానికి ముద్ర.
1980లలో “నా ప్రజా జీవితం” బాపు రాసుకున్న తన జీవిత గాథ అప్పుడు “జనధర్మ” పత్రికలో ధారవాహికంగా ప్రచురితమైంది. 2007లో ఇవన్నీ పుస్తకంగా వేసినప్పుడు నాకు మా బాపు విరాట్ స్వరూపం సంపూర్ణంగా అర్థమైంది. కాళోజీ గారు చెప్పిన ఈ మాటల భావాన్ని ఆ పుస్తకంలో వెతుక్కున్నాను. సమాధానం దొరికింది. తర్వాత కాలంలో తెలుగు అకాడమీ వారు నన్ను బాపు జీవిత చరిత్రను రాయమని కోరితే, రాసాను. 2014లో వాళ్లు ప్రచురించారు. కమ్యూనిస్టు నాయకుల జీవిత చరిత్రలలో గాని వరంగల్ జిల్లా కమ్యూనిస్టు నాయకుల చరిత్రలో గాని ఉపేక్షకు గురైన విషయం నన్ను బాధించినా పట్టించుకోకుండా నాదైన కృషి చేశాను. కొంతవరకైనా న్యాయం చేద్దామని! ఏ స్వార్థం లేకుండా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటాలు చేసిన వీరుడికి నేను ఇచ్చే అక్షరాంజలి గా భావించాను. వద్దు… ఈ విషయాల్లోకి ఇప్పుడే వెళితే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను! నా బాల్య విశేషాల పుష్ప సముచ్ఛయ గుబాళింపులు మీకు తెలియాలి కదా!!
అందరికన్నా ముందు బడికి వెళ్లాలి. స్కూల్లో ఫస్ట్ మేమే ఉండాలి. అలా వెళ్లాలంటే సమయానికి తయారవ్వాలి. ఇక్కడా పోటీయే… స్నానాల దగ్గర వచ్చేది చిక్కు. బాపు వాకిట్లో ఉన్నారు అంటే ఇంక మాకు లాభమే లాభం. ” అన్నయ్యా అగో… బాపు పిలుస్తున్నారు” అనో ” చెందూ బాపు రమ్మన్నారురా..” అనో చెబితే పనయిపోతుందికదా! అంటే, భయానికి
వాళ్ళు వాకిట్లోకి వెళ్ళేవాళ్ళు , వెంటనే బాత్రూం లో దూరడమే! ఈ ట్రిక్ నేనే కాదు అక్కయ్య, తమ్ముడు కూడా ప్రయోగించే వాళ్ళు. ఇదో సరదా… ఇదో ఆనందం… ! దీంట్లో.. చాలానే నేర్పు ఉండాలి. అర్థమైందనుకుంటా…
అదీ కథ!! ఆటల మధ్య నేర్చుకున్న తెలివి ఇది. జీవితం అలా ఆటలతో మొదలై బాధ్యతలతో ఎదిగింది.
ఇటువంటి కొంటె పనుల మధ్య లో ఒకరోజు ఏమైందంటే…. నేను చాక్లెట్ తింటున్నది మా తమ్ముడు చూశాడు. “నాకు కావాలి.. నాకు కావాలి …” అని ఏడుపందుకున్నాడు. అమ్మ నిలదీసింది కారణం ఏంటని? ఎందుకంటే.. నేను తమ్ముణ్ణి ఒక్క మాట అనేది కాదు. ఎవరైనా వాణ్ణి ఏమైనా అంటే ఊరుకునేదాన్నీ కాదు. అంత ప్రేమ వాడంటే ! మరి నా ముందే ఎందుకు ఏడుస్తున్నాడని అమ్మకు అనుమానం. విషయం ఏంటంటే… నేను ప్రతిరోజు ప్రొద్దున పొద్దున్నే “రామి దుకాణానికి” పోయి ఇంటికి ఏవైనా వస్తువులు కొనుక్కొని వచ్చేది. ఊరంతా రామి అని అలాగే పిలుస్తారు. బొబ్బిడాల రామి. అది ఆమె ఇంటిపేరో… లేకుంటే ఆమె బొబ్బుడాలు అనే స్నాక్స్ అమ్మడం వల్ల అలా పేరుపడిపోయిందో .. తెలియదు. కానీ నా జ్ఞాపకాలలో మాత్రం తాజాగా ఉన్నది. ఆలుగడ్డలు, బ్రెడ్, అలా ఏవైనా చిన్న చిన్న పదార్థాలు వస్తువులు అవసరానికి కొనుకొచ్చేదాన్ని. ముఖ్యంగా మా నాయనమ్మ నన్నే పంపేది “నీహారమ్మా ! బిస్కోట్లులు కొనుక్కురావా …మా… అమ్మవు కదా !” అని బ్రతిమాడి బామాడి నన్నే పంపేది. రెండు మూడు రోజులకు ఒకసారైనా వెళ్లేదాన్ని. ఎప్పుడో ఒకసారి ఉదయం వేళ తొందరగా వెళ్లినట్టున్నా. ఇక అప్పటినుంచి, “చిన్న దొర్సానీ.. నువ్వు రోజూ పొద్దున్నే నా దుకునానికి ఒచ్చి ‘బోని’ చెయ్యవా” అని రామి నన్ను తన దుకాణానికి రమ్మని బాగా బ్రతిమిలాడింది, గారాబం చేసింది. ‘బోణి’ చేయడం అంటే ఏంటో తెల్వదు. అంతేకాదు, రోజూ పోయి కొనడానికి ఏముంటాయి? అయినా సరే రామి అడిగిందని వెళ్ళేదాన్ని. ఆమె ముతక చీర, చింపిరి జుట్టు అన్నీ ఆమె బోసి నవ్వుతో పోటీకి రావు. పళ్ళూడిన ఆ నవ్వులో ఏం కనిపించిందో నాకు? కానీ, నన్ను ముద్దు చేసి చిటికెలు విరిచి “మా బంగారు తల్లి ” అనేది కదా ! పాపం అనిపించి, రోజు పొద్దున్నే వెళ్లే దాన్ని. ఆమె కృతజ్ఞత ఆమె ఇచ్చే చాక్లెట్లో కనిపించిందేమో ఈ గడుసు అమ్మాయికి ఎవరికెరుక ? ఇవన్నీ విషయాలు అమ్మ వాళ్లకు తెలియదు.
ఆరోజు రెండు చాక్లెట్లు ఇచ్చిందో ఏమో? ఇంటికి వచ్చేసరికి తినడం పూర్తి కాలేదు కావచ్చు! మా తమ్ముని కంటపడి ఆరున్నొక్కరాగం అందుకున్నాడు. అప్పుడు గాని బండారం బయటపడలేదు.. నిలదీస్తే, ” బొబ్బుడాల రామి దుకాణానికి పోయిన, రామే ఇచ్చింది ” అని నోరు తెరిచా… శ్రీకృష్ణ పరమాత్మ యశోదమ్మకు చూపిన స్టైల్ లో! అమ్మ ముసిముసి నవ్వుల వెనుక కోపాన్ని దాచుకొని , “అట్లా వెళ్లొద్దు, ఉట్టిగా ఇచ్చేవి తీసుకొని తినొద్దు” అని నచ్చ చెప్పింది. ఇది కేవలం చాక్లెట్ కథ కాదు. స్వాభిమానం పాఠం. ఆ రామమ్మ ఇచ్చే ‘తీయని’ ప్రేమ జల్లులలో అలా కరిగిపోకుండా మా అమ్మ కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అయితే , ఈ చిన్న దుకాణానికి నేను తరచూ వెళ్ళడానికి మా నాన్నమ్మనే కారణం. మా నాన్నమ్మ ఎప్పుడూ మంచంలోనే ఉండేది. మా అక్కయ్య పుట్టిన ఏడాదికి తాతయ్య చనిపోయారట. నానమ్మ కు 80 ఏళ్ళు ఉంటాయేమో. పూర్తిగా వంగిపోయి నడిచేది! బిస్కెట్స్ ను ఎక్కువ రోజులు దాచుకోవడం కష్టం కదా! నన్ను ఎప్పుడు పిలిచినా, “ముందు నా పేరు సరిగ్గా పిలవడం నేర్చుకో!” అని లొల్లి చేసేదాన్ని. నా పేరు స్పెషల్ .ఆమెకు నోరు తిరగక అలా అంటుంది అనుకున్నానేమో! ఎందుకంటే నా దోస్త్ కోమటోళ్ల రాణి నన్ను “నిహారాణి.. నిహారాణి..” అని పిలిచేది. ఎన్నిసార్లు చెప్పినా అంతే అలా ” నిహారాణీ ” అని అనకు “నీహారిణి” అని అను అంటే ఆమెకు అలా అనరాకపోయేది. అదే ఉద్దేశ్యం తో నాయనమ్మకూ పలకరావట్లేదేమో అనుకునేదాన్ని కావచ్చు ! కానీ నాయనమ్మకు నా పేరు అనరాక కాదు…. “నీహారమ్మా”,”నియ్యరమ్మా..” అని నన్ను బనాయిస్తుంది అని నాకు తెలియదు.
*****
( ఇంకా వుంది )

ఎం .ఏ. తెలుగు , తెలుగు పండిత శిక్షణ (20 ఏళ్ళ బోధనానుభవం), ఉస్మానియా విశ్వ విద్యాలయం లో ‘ ఒద్దిరాజు సోదరుల జీవితం-సాహిత్యం‘ పై పరిశోధన చేసి , డాక్టరేట్ పట్టా పొందాను . నిత్యవిద్యార్థిగా నిరంతర సాహిత్య పఠనం . పెద్దల మాటలను , కొత్తగొంతుకలను వినడం ఇష్టం .
