
తులసి
(నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-సురేష్ బాబు
తులసి పదేళ్ల పిల్ల. చిత్రకారులు చిత్రించే దేవతామూర్తులకు మల్లె పెద్ద కళ్ళు మంచి ముఖ నిర్మాణం. తోటి పిల్లలతో సరదాగా గడిపే అమాయకత్వం. పొద్దున్నే లేచి వేడి నీళ్లు పెట్టి కాఫీ కాచి అమ్మానాన్నలకు ఇచ్చి తలంటుకుని అల్పాహారం తర్వాత బుద్ధిగా స్కూల్ బ్యాగ్ మోసుకుంటూ స్కూల్ కెళ్ళి పాఠాలు శ్రద్ధగా విని సాయంత్రం అందరితో ఆడుకుని స్నానం చేసి గుడికి వెళ్లి అందరి దేవుళ్ళకు దండం పెట్టుకొని ఇంటికి వెళ్లి చదవాల్సింది ఉంటే చదువుకొని అలసట రాగానే అమ్మకు నాన్నకు దండం పెట్టుకుని కళ్ళు మూసుకొని ఆ వయసులో వచ్చే కలలతో నిద్రపోతుంది. సహజంగా పిల్లలకు కొత్తగా అనుభూతినిచ్చే విషయాల మీద విచక్షణ లేని ఆసక్తి ఉంటుంది.సెల్ఫోన్ మీద టీవీ మీద సినిమాల మీద తినుబండారాల మీద బస్సులు కారులు రైలు ఇలా చాలా, కానీ తులసికి ఇవేవీ పట్టవు. తన దినచర్యలో ఎక్కడా అసంతృప్తి గాని అలగటం కానీ ఉండదు ఎప్పుడన్నా అమ్మమ్మతో బజారుకెళ్ళి పచారిసామాన్లు తెస్తుంది. తోటి పిల్లలు కూడా తులసిని ఎప్పుడూ తక్కువ చేయరు. తులసి అందరితో ఉన్నట్టే ఉంటుంది. అందరూ సినిమాల గురించి, సెలవు నాడు హోటల్లో తిన్న బిర్యాని గురించి మాట్లాడుకుంటుంటే కనీసం మాట కూడా కలపదు. అలా ఉంటుందంతే.
ఓసారి ఇంటికి ఎవరో బంధువు వచ్చి పలానా వాళ్ళు చనిపోయారు అని చెబితే అలా అనకూడదు దేవుడి దగ్గరికి వెళ్లారని చెప్పాలని కళ్ళల్లో నీళ్ళు తిప్పుకుంది. ఇంకొక బంధువు వచ్చి తన కూతురు పెళ్లి అని తులసి అమ్మానాన్నలకు పెళ్లి పత్రిక ఇచ్చి తులసితో పెద్దయ్యాక నీకు కూడా మంచి సంబంధం చూస్తాలే అనిచతుర్లాడినప్పుడు పెళ్లయితే నాకేమైనా కిరీటం వస్తుందా అప్పుడు నా బాధ్యత కాస్త పెరుగుతుంది అంతేగా. భార్యగా తల్లిగా ఇంకొంచెం ఎక్కువ బాధ్యత అప్పుడైనా నా బతుకు నేనే కదా బతకాలి నా ఆనందాన్ని సంతోషాన్ని పంచుకునేందుకు పెంచుకునేందుకు నేనే కదా ప్రయత్నించాలి. అని అందరూ ముక్కును వేలు వేసుకునేలా నిబ్బరంగా మాట్లాడింది. తులసికి వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడు అలవాటు చేసిందో తెలియదు కానీ మేడ మీద మధ్యాహ్నం పూట ఇంత అన్నం ముద్ద పెడుతుంది ఒకసారి రెండు ఉడత పిల్లలు ఆ అన్నం తినడం చూసి ఎప్పుడూ తప్పకుండా అన్నం పెడుతూ ఉండేది. క్రమంగా రెండు గువ్వ పిల్లలు రావడం చూసి కొన్ని బియ్యపు గింజలు కూడా పెట్టేది. అమ్మ అంటే ఇష్టం. నాన్నంటే గౌరవం. దేవుళ్ళంటే భక్తి. తోటి పిల్లలతో స్నేహం అమ్మమ్మ అంటే ప్రేమ చనువు ఇంకేం కావాలి తులసికి. కాలం ఎవరికోసం ఆగదు తులసి కోసం కూడా అస్సలు ఆగకుండా తులసి పెద్దమనిషి అయింది. సాంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు అయి అమ్మ అమ్మమ్మ చెప్పిన బుద్ధులు సుద్దులు విని ప్రపంచాన్ని ప్రపంచం దృష్టితో చూడడం మొదలుపెట్టింది తులసి. పెద్దమ్మ కూతురైన పద్మక్క పెళ్లిలో కట్న కానుకల విషయాలు, డబ్బున్నోళ్ల దర్పాలు , కొంటె పిల్లల్లో చిలిపి చేష్టలు అన్నిటిని గమనిస్తూ సరదాగా ఉంటూ మెల్లమెల్లగా ఆలోచనల చట్రంలో ఇరుక్కుపోయింది. సినిమాల్లో ఉండే ద్వంద్వార్థాలు, స్త్రీల అసమానతలు విచ్చలవిడితనం టీవీ సీరియల్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్, ధనార్జన కోసం లోకం పడుతున్న అవస్థలు, అన్నిటినీ అర్థం చేసుకుంటోంది. స్వార్ధపు బ్యాక్టీరియా లేని ప్రపంచం ఉండదని తులసికి అర్థమయింది. ఆ దిక్కుమాలిన స్వార్థంలోనే ఆనందాన్ని బట్వాడా చేసుకుని మనుషులు తృప్తి చెందడాన్ని ఛీత్కరించుకుంది. ఇక్కడ బతకాలంటే స్వార్థంతో పాటు తెలివి, అవకాశవాదం, నిజాయితీ లేని సుఖాలను అనుభవించే మనసు ఉండాలని చివరకు కృష్ణా రామా అంటూ అన్ని మూసుకుని బకెట్ తన్నాలని లేదంటే ఎమోషనల్ బరస్టయ్యి ముందే రోగాలతో పోవాలని మూడో నేత్రంలో ఎరుక గలిగింది తులసికి.
తులసి తన బతుకు చిత్రాన్ని తనే గీసుకుంటోంది. తను బాగా చదువుకుంది కాబట్టి మంచి ఉద్యోగం, మంచి స్థాయి కలిగిన భర్త పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ల పిల్లలు ఓపిక ఉన్నంత వరకు సేవలు చివరికి చావు. ఒక మహోన్నత జీవితం లోకం దృష్టిలో .
తనకు ఉద్యోగం రాలేదు భర్త మీద ఆధారపడటం, కొన్నాళ్లు పురుషాధిక్య ప్రపంచంతో అంటకాగడం, పిల్లల మీద ప్రేమ , సహనం , కష్టసుఖాలు చివరికి చావు. మధ్యతరగతి కర్మ జీవితం. ఇవేవీ శుభం పలకలేదు తులసికి.
తీవ్రంగా ఆలోచిస్తోంది తులసి. అందరిలా హార్మోన్ల రాపిడికో ఎమోషనల్ ప్రెజర్కో లొంగిపోయే పిల్ల కాదు తను. బాగా చదువుకుంది. తన కాళ్ళ మీద తన నిలబడగలుగుతుంది. డబ్బు మీద ఆశ లేదు కాబట్టి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన పనిలేదు. చనిపోయే వరకు అమ్మానాన్నలను బాగా చూసుకుంటుంది. మేడ మీద ఒక మినీ గార్డెన్ ఏర్పాటు చేసుకొని ఉడతలను పిట్టలను సాక్కుంటుంది. కాకపోతే దిక్కులేకుండాచస్తుంది. చచ్చేటప్పుడు, స్పౄహే లేనప్పుడు ఏ దిక్కుతో ఎవరికి అవసరం. తను పొల్యూట్అవ్వకుండా తన గాలిని తను పీల్చుకుంటూ తన కడుపు తను నింపుకుంటూ తనకు మిగిలిన ఒకే ఒక జ్ఞాపకమైన అమ్మానాన్నలను చూసుకుంటూ చివరాఖరుకు తను సొంతంగా కట్టుకున్న తన ఇంటి మేడ మీద తను పెంచి పోషించిన ప్రాణుల అల్లరి చూస్తూ కనుమూస్తుంది. ఇంకేం కావాలి తులసికి.
ఇలాంటి ఆలోచనలతో సాగిపోతున్న తులసి జీవితంలో ఒక అనూహ్య సంఘటన జరిగినది. తులసి ఇష్టానికి వ్యతిరేకంగా తనకి పెళ్ళిచూపుల ఏర్పాటు జరిగింది. ఒక మంచి రోజు అబ్బాయి తరపు వారు రెండు కార్లలో తులసి ఇంటికి రావటం, తులసి అందంగా ముస్తాబయ్యి వాళ్ళ ముందు దేవకన్యలా నిలబడటం జరిగిపోయాయి. అబ్బాయి చాలా అందగాడు నిగనిగలాడే జుట్టు చూడగానే గుర్తుండిపోయే ముఖవర్చుస్సు. పెద్దవాళ్ల మాటామంతీ అయ్యాక మేడ మీద చిన్న పిల్లల సమక్షంలో తులసికి ఆ అబ్బాయికి సమాలోచనాల సమావేశం ఏర్పాటు చేయబడింది పెద్దల అనుమతితో. అబ్బాయి చెప్పడం ప్రారంభించాడు. తాను ఎంటెక్చదివాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా బెంగళూరులో పని. నెలకు ఐదంకెల జీతం. పెళ్లయ్యాక తులసిని అబ్బాయి ఇంట్లోనే ఉంచి వారానికి ఒక్కసారి బెంగళూరు నుంచి అప్ అండ్ డౌన్. ఏడాది కాకముందే పిల్లవాడినో పిల్లనో ఖచ్చితంగా ప్రసవించి ఆ పిల్లలు స్కూల్ వెళ్ళే వయసు వచ్చాక, ఆ సమయానికి తాను మంచిగా సెటిల్ అవుతాడు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా స్వంత ఇల్లు, కలిసి ఉండటం. అంతవరకు అత్తగారింట్లోనే తులసి నివాసం. తులసి చెప్పింది. నిన్ను పెళ్లి చేసుకోవడంలో నాకేమాత్రం అయిష్టం లేదు కానీ ఆర్థిక స్వతంత్రయం లేకుండా బతకటం నాకేమాత్రం ఇష్టం లేదు నేను చదువుకున్నాను నా విద్య పది మందికి ఉపయోగపడగల అవకాశాన్ని నేను ఎప్పటికీ వదులుకొను. పైగా నా స్వంత కాళ్ళ మీద నిలబడటంలో నా వ్యక్తిత్వాన్ని నేను గౌరవించుకున్నట్టు. పిల్లలంటావా ఆర్థికంగా నిలబడ్డాక నిర్ణయం తీసికుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. తులసి మాటలు పూర్తికాకముందే ఆ అబ్బాయి విసవిసామేడ దిగి వెళ్ళిపోయాడు. ఇలా రెండు మూడు సార్లు జరిగేటప్పటికి తులసికి అర్థమైన విషయం ఏమిటంటే స్త్రీ వ్యక్తిగత స్వేచ్ఛను ఆమోదించే మనసు ఈ సమాజానికి ఇంకా కలగలేదని. యాధృచ్చికంగా జరిగే ఏ విషయం గురించి తాను అంతలా ఆలోచించదు కాబట్టి తులసి ఈ తతంగాలను అసలు పట్టిచ్చుకొనట్లే ఉంది.
ఒకరోజు నాన్న గట్టిగా నీ మనసులో ఎవరున్నారో చెప్పు అంటే నా మనసంతా నేనే ఉన్నాను అని అంతే గట్టిగా జవాబిచ్చింది. ‘ వనిత , లతా మనలేవు లేక జత ‘ అని అమ్మ ఎత్తిపొడుపుగా పాడుతుంటే మనసులేని పాట కోయిల పాడదని తానూ రాగం అందుకునేది. ఈ తంతు ఇలా జరుగుతుండగా తులసి చిన్నప్పుడు నీకు సంబంధం నేను చూస్తానని చెప్పిన బంధువు మాట ప్రకారం తులసి ఇంటికి వచ్చాడు. అతను సూటిగా తులసితోనే నీ గురించి నాకు బాగా తెలుసు వ్యక్తిత్వం విషయంలోగాని స్వేచ్ఛ విషయంలోగాని నువ్వు రాజీ పడవని తెలుసు అందుకే నువ్వు, నీకు కాబోయే వాడు ఇద్దరు కలిసి పని చేసేలా కలిసి జీవితాదర్శాలను నిలబెట్టుకునేలా మంచి సంబంధం తెచ్చాను అతను నీలాగే బీఎస్సీ బిఇడి చేసి ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్. నీకూ అక్కడ పార్ట్ టైమ్ జాబ్ సిధ్ధం చేసి ఉంచాడు. స్వంత ఇంటిలోనే కాపురం. అయినా ఆర్థిక స్వావలంబన దొరికాకే పిల్లల విషయమని అతనే పదే పదే చెప్పాడు. నాకు బాగా తెలిసిన వ్యక్తి . నువ్వు తప్పకుండా మాట్లాడటం కోసం అభిప్రాయాలు పంచుకునేందుకు తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. జీవితం అనేది పంచుకోడానికే అని అమ్మానాన్నలంత అందమైన అనుబంధం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదని పరిణితి చెందిన మనుషుల మధ్య పొరపచ్చలు దూదిపింజల్లాంటివని, తనతో ముందుగా మాట్లాడి ఇష్టమైతే కబురు చేయమని నచ్చితే పెళ్ళిచూపుల రోజే నిశ్చయ తాంబూలాలు మార్చుకుందామని చెప్పాడని వివరించాడు.
సంధ్యవేళ ఒక చల్లని సమీరం తులసి పెంచుకుంటున్న జాజి చెట్టు నుంచి తులసి ముంగురులతో ఆడుకుంటుండగా అప్పుడే తళుక్కుమన్న నక్షత్రాన్ని చూస్తూ తులసి ఫోన్ నెంబర్ రాసుకుంది.
*****

సురేష్ బాబు విద్యుత్ శాఖలో అధికారిగా పనిచేస్తున్నారు. ‘ విస్మృతి గానం’ అనే కవితా సంకలనాన్ని వెలువరించారు. రెండవ కవితా సంకలనం ‘ కెరటం నన్ను ఆవహించింది ‘
ముద్రణ దశలో ఉంది.
