బంతులవాన

-అనసూయ కన్నెగంటి

దినకర్ బడిలో టీచర్. అయినప్పటికీ అతనికి ఆటలంటే మహా ఇష్టం. దాంతో పాఠాలు చెప్తూనే ఏ బడిలో పని చేస్తే ఆ బడిలో ఆటలంటే ఇష్టం ఉన్న పిల్లలను మంచి ఆటగాళ్ళుగా తయారు చేసేవాడు.
వాళ్ళు ఆటల్లో ప్రావీణ్యం సంపాదించాకా వాళ్ళను జిల్లా స్ధాయి పోటీల్లో పాల్గొనేలా చేయాలని ప్రయత్నాలు చేసుకునే సమయంలో అక్కడి నుండి బదిలీ అయ్యేవాడు. ఎప్పుడూ అంతే.

ఇప్పుడు రామనాధపురంలో ఉన్న బడికి బదిలీ అయి వచ్చాడు. రాగానే అతనికి ఇంతకు ముందు తాను ఏ ఏ బడులలో పనిచేసేవాడో ఆయా బడుల్లో చదువుతున్న పిల్లలు అందరికీ ఆయా ఆటల్లో పోటీలు పెట్టాలని అనిపించింది. అందుకు సంబంధించిన అనుమతులను కూడా పై అధికారుల నుండి పొందాడు. ముందుగా క్రికెట్ పోటీలు పెట్టాడు.

ఆ పోటీలో అత్యధికంగా ఫోర్ లు కొట్టి ఎక్కువ పరుగులు చేసిన పొరుగూరు అయిన గోపాలపట్నంకి చెందిన బడి పిల్లలు బహుమతి పొందారు. దినకర్ కు చాల ఆశ్చర్యము, ఆనందమూ కలిగాయి.
వాళ్ళను అభినందించాడు.తర్వాత..

“ మీకు సిక్స్ లు కొట్టే అవకాశం చాలసార్లు వచ్చింది. కానీ ఎందుకు కొట్టలేదు?. సిక్స్ లు కొడితే ఇంకా త్వరగా తక్కువ బంతుల్లోనే విజయం సాధించేవారు కదా “ అనేసరికి పిల్లలంతా ముఖాముఖాలు
చూసుకున్నారు తప్ప ఏమీ మాట్లాడలేదు. అయితే .. ఒకసారి దినకర్ బంధువుల పెళ్ళికి గోపాలపట్నం వెళ్ళి మూడు రోజులు ఉండాల్సి వచ్చింది. పనిలో పనిగా ఆ గెలిచిన పిల్లల బడికి ఒకసారి వెళ్ళి వాళ్ళను చూసి వద్దాం అనుకుని బయలుదేరాడు.

గోపాలపట్నం రాగానే బంధువులను ఒకసారి పలకరించి బడి వైపు బయలుదేరాడు. వస్తూనే ఆ బడిని చూసి చాల ఆశ్చర్యమూ, బాధ కలిగాయి అతనికి. ఆ బడి పాడుబడ్డ చిన్న బంగ్లాలో ఉంది. ఆడుకోవటానికి సరిపడా ఆటస్ధలం కూడా లేదు. మరి వీళ్ళు క్రికెట్ లో అంత ప్రావీణ్యం ఎలా సంపాదించారబ్బా అనుకున్నాడు. దినకర్ ని గుర్తుపట్టి పలకరించిన పిల్లవాణ్ణి అదే మాట అడిగాడు.

“మేమంతా ఊరు చివర ఉన్న కొద్దిపాటి ఖాళీ స్ధలంలో ఆడుకుంటాము “ అని బదులిస్తూనే పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లల్ని తీసుకువచ్చాడు.

దినకర్ ని అక్కడ చూసి చాల సంతోషపడ్డారు వాళ్లంతా. సాయంత్రం తమ ఆటస్ధలం దగ్గరకి రమ్మని పిలిచారు దినకర్ ని. సాయంత్రం కాగానే ఆటస్ధలం దగ్గరకు వచ్చాడు దినకర్. అక్కడ ఖాళీస్థలంలో పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. అందులో క్రికెట్ ఆట కూడా ఉంది. దినకర్ కు వాళ్లని చూస్తుంటే ఆసక్తిగా ఉంది. దినకర్ ని చూసి వాళ్ళు ఇటుగా రాబోతే వద్దని వారించాడు. కాసేపు ఆటలు చూద్దామని అక్కడ ఉన్న రాయి మీద కూర్చున్నాడు. అలా కూర్చుని పిల్లల ఆటను గమనించసాగాడు. అలా చూడగా చూడగా పిల్లల్లో ఒకలాంటి భయం నెలకొని ఉన్నట్టు గమనించాడు. అదేమిటో ఎంత ఆలోచించినా అతనికి అంతుపట్టలేదు. ఇంతలో ఒక పిల్లవాడు కొట్టిన బంతి పైకంటా వెళ్లి పక్కింట్లో పడింది.

అది సిక్సర్.

అయితే బేటింగ్ చేసే వర్గానికి చెందిన పిల్లలు ఎగిరి గంతేయాల్సింది పోయి సిక్సర్ కొట్టిన అబ్బాయిని తిట్టసాగారు. అలా ఎందుకు తిడుతున్నారో దినకర్ కి తెలియలేదు. గొడవ అయిపోయాకా పిల్లలు ఆ బంతి తెచ్చుకుని మళ్ళీ ఆట మొదలుపెడతారు అని ఎదురు చూస్తున్నాడు దినకర్ . కానీ పిల్లలు ఆ బంతి కోసం ఆ ఇంటికి వెళ్ళలేదు. బంతి తేలేదు. ఆట సాగలేదు. చాలసేపు వాళ్ళల్లో వాళ్ళే తర్జన భర్జనలు పడ్డారు. “నువ్వే గట్టిగా కొట్టావ్ బంతిని” అని ఒకడు అంటే “ నువ్వు పట్టుకోవచ్చు కదా.” అని ఇంకొకడు. మొత్తం మీద వాళ్ళంతా నిరాశ పడినట్టు తెలుస్తూనే ఉంది. కాసేపు అక్కడే ఇతర ఆటలు ఆడుకుని ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.

దినకర్ కి ఎంత ఆలోచించినా పిల్లలు అలా ఎందుకు చేసారో తెలియలేదు. దినకర్ తన దగ్గరకు వచ్చిన ఒక అబ్బాయిని ..
“మీరు పక్కింట్లోకి వెళ్ళి బంతి తెచ్చుకోవచ్చు కదా? ఎందుకు మొత్తానికి ఆడుకోవటమే మానేసి వెళ్ళిపోయారు అంతా?” అన్నాడు.

దానికి ఆ అబ్బాయి ..
“ మేము రోజూ ఇక్కడే ఆడుకుంటాం సార్. ఎప్పుడైనా ఇలా ఒక్కొక్కసారి మా బంతి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఇద్దరు ముసలివాళ్ళు ఉంటారు. కానీ మేము ఎవరన్నా వెళ్ళి
అడిగితే ఆ బంతి ఇవ్వరు. తిడతారు. ఎందుకు అంటే వాళ్ళకి మేము ఇక్కడ ఆడుకోవటం ఇష్టం లేదు. అందుకనే మేము బంతిని గట్టిగా కొడితే వాళ్ల ఇంట్లో పడుతుందని, అనవసరంగా బంతిని ఎందుకు
పోగొట్టుకోవటం అని బ్యాట్ తో గట్టిగా కొట్టకుండా మెల్లగా కొట్టుకుంటూ ఆడుకుంటాము. మా క్రికెట్లో ఫోర్ లు మాత్రమే ఉంటాయి. సిక్సర్ లు ఉండవు. ఆ రోజు మీరు పెట్టిన పోటీల్లో కూడా అన్నీ ఫోర్లే వేస్తే మీరు మమ్మల్ని అడిగారు కూడా సిక్సర్లు ఎందుకు వేయలేదని. ఇదిగో ఇందుకే. నిజానికి అలా ఆడటం మాకు ఇష్టం ఉండదు. కానీ బంతి వెళ్ళి ఆయన పెరట్లో పడుతుందేమోనని భయం. పెరట్లో పడితే ఆట మానేసి వెళ్ళిపోతాము. కొద్ది రోజులు అయ్యాకా అందరం ఇంట్లో అమ్మా,నాన్నా ఇచ్చిన డబ్బుల్లోంచి కొంత డబ్బు ఆదా చేసుకుని బంతి కొనుక్కున్నాక మళ్ళీ వచ్చి ఆడతాము” అని చెప్పాడు.

దినకర్ కి ఇది అస్సలు నచ్చలేదు. ఇది చాల అన్యాయంగా , అయోమయంగా అనిపించింది.

“ నేను వెళ్ళి మాట్లాడి వస్తాను ఉండు. అదేం పని. పెద్దవాళ్ళు అయి ఉండి కూడా” అనుకుంటూ ఆ ఇంటి గల ఆయనతో మాట్లాడదామని వెళితే ఎంత కొట్టినా వాళ్ళు తలుపు తెరవలేదు. కాసేపటికి తెరిచారు. లోపలికి వెళ్ళిన దినకర్ అక్కడ బుట్ట నిండుగా ఉన్న బంతుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. అదేమాట ఆ ఇంటాయనను అడిగాడు.

దాంతో ఆయన “ మీరు ఈ ఊరికి కొత్తలా ఉన్నారు. మేమిద్దరం ముసలివాళ్ళం. ఎక్కువసేపు నడవలేము. మాకు పిల్లలు లేరు.ఈ పిల్లలు కొట్టిన బంతి ఎన్నోసార్లు విసురుగా వచ్చి మాకు తగిలింది. హాస్పిటళ్ళ చుట్టూ తిరిగాము. ఇక తిరిగే ఓపిక లేక ఇక్కడ ఆడనివ్వకండి అని ఊరి పెద్దలకు చెబితే వాళ్ళు పట్టించుకోలేదు. పిల్లలూ మా మాట వినలేదు. వాళ్ళ గోల వాళ్ళది. మేము ఎక్కడో లోపల ఉంటాము. వ్రద్ధాప్యం వల్ల నడవలేని మేము ఎక్కువసేపు పడుకునే ఉంటాము. ఎన్నిసార్లని బంతి పట్టుకెళ్ళి ఇవ్వగలం? అలా అని వాళ్ళే తీసుకుంటార్లే అని తలుపులు తెరచి ఉంచితే దొంగలు వచ్చి ఒకసారి దొరికినది అంతా దోచుకుపోయారు. మమ్మల్ని ఏం చెయ్యమంటావ్ చెప్పు బాబూ” అన్నాడు.

దినకర్ కి మనసంతా బాధగా అయిపోయింది. ఏమి మాట్లాడాలో తెలియలేదు. పిల్లల వాదన, పెద్ధాయన వేదన రెండూ సబబే. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలాగ? అనుకున్నాడు.

“ తలుపుకొట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మన్నించండి” అని వాళ్ళతో చెప్పి వెను తిరిగాడు. కానీ దీని గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. పిల్లలు అడుకునేటప్పుడు బంతి వెళ్ళి ఇంట్లో పడితే సాధారణంగా ఎవ్వరూ తిరిగి ఇవ్వకుండా ఉండరు. కానీ వాళ్ళ ఇబ్బంది ఏమిటో వాళ్ళు చెప్పారు. అయినా ఇలా బంతి తిరిగి ఇవ్వకపోతే పిల్లలు ఎన్ని బంతులని కొనుక్కుంటారు? పైగా వాళ్ళ దొడ్లో పడుతుందేమోనని గట్టిగా కొట్టరు. అలా కొట్టకపోవటం వాళ్ళ ప్రావీణ్యాన్ని వాళ్ళే కుదించుకున్నట్టు. ఇది పిల్లల స్వేచ్ఛకు భంగం. వారి వారి ఆటల్లో పరిణితి సాధించాలంటే వాళ్ళను స్వేచ్చగా ఆడుకొనివ్వాలి.

దీనికి పరిష్కారం ఏమిటి? అని ఆలోచించి పిల్లల ఆలోచన ఎలా ఉందో అడిగి చూద్దాం అనుకుని మర్నాడు సాయంత్రం ఆడుకునే పిల్లల్ని పిలిచి ఏం చేద్దాం? ఏం చేస్తే మీరు స్వేచ్చగా ఇక్కడ
ఆడుకోగలుగుతారు? “ అని అడిగాడు.

“ వాళ్లని ఇల్లు ఖాళీ చేసి ఎక్కడైనా ఇంకో ఇంట్లో ఉండమందాం సార్?” అన్నాడు ఒకడు.

“ వాళ్లని కూడా వచ్చి ఆట చూడమందాం సార్.” అన్నాడు ఇంకొకడు.

“కాదు కాదు..వాళ్ళిద్దరినీ చెరో గ్రూపుకి అంపైర్ లుగా ఉండమందాం సార్ “ అన్నాడు మరొకడు. ఆ మాటలకు అందరూ నవ్వారు.

“ వాళ్ల గోడ మీద ఇంకో గోడ ఎత్తుగా కట్టాలి సార్” అన్నాడు వేరేవాడు.

వాళ్ల ఆలోచనలు తన ఆలోచనలకు దగ్గరదగ్గరగా వస్తున్నట్టు అనిపించింది దినకర్ కి. దాంతో “నువ్వేమంటావ్ ?” అని మరొకణ్ణి అడిగాడు. ఇంతలో..

“ సార్.నాదో ఐడియా…” అని అరిచాడు గట్టిగా వేరొకడు.

“ఏంటది?” అని అడిగాడు దినకర్.

“ గోడ కట్టాలంటే బోలెడన్ని డబ్బులు అవుతాయి సార్ . అందుకని మా ఇంట్లో చేపలు పట్టే వల ఉంది. అది తెస్తాను సార్ . గోడ బదులు ఇప్పుడున్న గోడ మీద ఆ వల కట్టేస్తే బంతి వాళ్ళ ఇంట్లో పడదు “
అన్నాడు వాడు. చప్పట్లు చరిచాడు దినకర్.

“ నీ ఆలోచన చాలా బాగుంది. నా ఆలోచన కూడా ఇదే . మీతో చెప్పిద్దామని అలా అడిగాను. కాకపోతే చేపలు పట్టే వల కంటే ఇలా కట్టటానికే ప్రత్యేకమైన వలలు ఉంటాయి. వాళ్ళను అడిగి ఒప్పుకుంటే
దాన్ని తెచ్చి కట్టేద్దాం.” అన్నాడు .పిల్లలందరూ ఎగిరి గంతులేసారు. ఇదే విషయాన్ని ఊరి పెద్దలతో చర్చించటానికి వెళితే..

“ పిల్లలు అక్కడ ఆడుకోవడం వాళ్లకి ఇష్టం లేదు. మనం ఎన్ని చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. ఏం చెయ్యలేం?” అన్నారు.

“ కానీ పిల్లలు అక్కడ కాకపోతే ఇంక ఎక్కడ ఆడుకుంటారు? వాళ్ళకి క్రీడాస్థలం చూపించాల్సిన బాధ్యత ఊరు వాళ్ళకు ఉంటుంది కదా” అన్నాడు దినకర్.

“ ఉంటుంది. కానీ అంతస్థలం మా ఊర్లో లేదు. ఉన్న ఖాళీ స్ధలాలు అన్నీ ఆసుపత్రులు, గ్రంధాలాయాలు వంటి వాటికి ఇచ్చేశారు. అందుకని ఈ విషయంలో పంచాయతీ వాళ్ళు ఏమీ చేయలేక పోతున్నారు” అన్నారు పెద్దలు.

“ పంచాయతీ వాళ్ళు చేయలేకపోతే మీరంతా కలిసి చేయవచ్చు కదా. ఊరికి ఆసుపత్రి, గ్రంధాలయం ఎంత ముఖ్యమో క్రీడాస్ధలం కూడా అంతే ముఖ్యం. ఆడుకుంటే పిల్లలకు శారీరక దారుఢ్యం
బాగుంటుంది. చురుకుగా ఉంటారు. పైగా ఆటలలో రాణిస్తే మీ ఊరికి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కాబట్టి మీ ఊరి వారంతా చందాలు వేసుకుని కొంత స్థలాన్ని కొని క్రీడాస్థలంగా ఊరి పిల్లలకు కానుకగా
ఇస్తే వాళ్ళను మంచి క్రీడాకారులుగా నేను తయారు చేస్తాను. నేను మీ ఊరు కాకపోవచ్చు. కానీ పిల్లల ఆసక్తిని గమనిస్తే నాకు వాళ్ళని ప్రోత్సహించాలని ఉంది. అందుకనే మీరు కూడా సహకరించి పిల్లలకు
మంచి క్రీడాస్థలం ఇస్తే నా సమయంలో కొంత సమయాన్ని మీ ఊరి పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచడానికి వినియోగిస్తాను. దయచేసి ఆలోచించండి” అని అభ్యర్థించాడు.

దాంతో ఆ ఊరి వారంతా ఒకచోట సమావేశమై బాగా ఆలోచించారు. పిల్లలకు విజ్ఞానమే కాక ఆటలు కూడా చాలా అవసరమని గుర్తించి అందరూ తలో కొంత ధనం వేసుకొని పిల్లలకు ఒకచోట స్థలం కొని కానుకగా ఇద్దాం అనుకున్నారు. కానీ దానికి చాల సమయం పట్టేటట్టు ఉంది.

“ఈ లోపు ఏమైనా చెయ్యగలమా ?” అని దినకర్ తో వాళ్లు ఆలోచించినప్పుడు పిల్లలు చెప్పిన ఐడియా వాళ్లకు చెప్పాడు. అందుకు సరే అని దినకర్ తో కలసి ఆ వృద్ధుల ఇంటికి వెళ్ళి ఊరి పెద్దలు
తమ ఆలోచన, అది సఫలం అయ్యే వరకూ వాళ్ళిద్దరికీ ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా తాము ఏం చెయ్యాలి అనుకుంటున్నామో వివరించారు.

అంతావిని సంతోషంగా వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకున్నారు ఆ దంపతులు. దాంతో దినకర్ వెంటనే బయలుదేరి పట్నం వెళ్ళి తనకు కావాల్సిన వస్తువులను కొనుక్కు వచ్చాడు. అవి ఊరి పెద్దలకు, ఆ దంపతులకు చూపించి వాళ్ళ ఇంట్లోకి బంతి వెళ్ళకుండా పనివాళ్లను పిలిచి వాటిని ఆ ఇంటి చుట్టూ కట్టించాడు. సాయంత్రం పిల్లలు ఆడుకోవటానికి వచ్చినప్పుడు ఆ ముసలి దంపతుల ఇంటి చుట్టూ కట్టి ఉన్న నెట్ చూసి ఎగిరి గంతేసారు.

ఇక ఆ సాయంత్రం ఆడిన క్రికెట్ ఆటలో సిక్సులే సిక్సులు. దినకర్ ఆ దంపతుల దగ్గరకు వెళ్ళి ఒకసారి బయటకు వచ్చి పిల్లల ఆటల్ని, ఆనందాన్ని చూడమన్నాడు.

“ అలాగే “ అంటూ బయటకు వచ్చి చూసిన ఆ దంపతులు పిల్లల ముఖాల్లో అంతకు ముందెన్నడూ లేని కొత్త ఉత్సాహాన్ని గమనించి ఆనందపడ్డారు. వాళ్ల ఆనందం చూసిన దినకర్..
“ ఇంటిచుట్టూ పిల్లలు, పక్షుల అరుపులు ఇంటికి శుభం. పైగా చుట్టూ ఎప్పుడూ ఇలా సందడిగా ఉంటే మీ ఇంటికి, మీకు రక్షణ. అంతే కాదు మీకేం సహాయం కావాలన్నా పిల్లలు చేసిపెడతారు. మనం
ఆనందం ఇస్తే మనకి ఆనందం తిరిగి వస్తుంది. ఏమంటారు?” అన్నాడు వాళ్ళిద్దరి వైపూ చూస్తూ..

“ ఏమంటామా?ఒక్క నిమిషం..” అంటూ లోపలికి వెళ్ళి పిల్లల బంతుల్తో నిండుగా ఉన్న బుట్టను ఇద్దరూ మోసుకుంటూ తెచ్చి క్రీడా స్ధలంలో విసురుగా వాటిని క్రుమ్మరించి..”ఇదిగో..ఇదే మేము
వాళ్లకి ఇచ్చే ఆనందం” అన్నారు నవ్వుతూ.

అవన్నీ క్రీడాస్ధలం అంతా దొర్లుకుంటూ పోతుంటే పిల్లలంతా ఆ బంతుల్ని చూసి చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. కొంతమంది పిల్లలైతే న్యత్యం చేసారు. పాటలు పాడారు “ బంతుల వాన..బంతులవాన..” అనుకుంటూ.

దినకర్ వైపు కృతజ్నతగా చూశారు ఆ దంపతులు.

“ చిటికెలో పరిష్కరించావయ్యా సమస్యని. మా వల్ల కానిది నీ వల్ల అయ్యింది” చప్పట్లు చరుస్తూ వచ్చారు ఊరిపెద్దలు దినకర్ దగ్గరకు.

“ అది పిల్లల అదృష్టం అండి” అన్నాడు దినకర్.

పిల్లలంతా వేగంగా వచ్చి దినకర్ ని పైకెత్తి భుజాల మీద కూర్చోబెట్టుకుని అతన్ని క్రీడాస్ధలం చుట్టూ తిప్పేశారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.