నారిసారించిన నవల 

-కాత్యాయనీ విద్మహే 

  6

1935 లో ద్వితీయ ముద్రణగా వచ్చిన  ‘శారదావిజయము’ నవల వ్రాసిన దేవమణి సత్యనాథన్, 1908 లో ‘లలిత’ అనే సాంఘిక నవల వ్రాసిన డి. సత్యనాథన్ ఒకరే.   సత్యనాథన్ భర్త పేరు అయివుంటుంది. వేంకటగిరి కుమార రాజా ఎస్ కె కృష్ణయాచేంద్ర బహద్దర్ తొలిపలుకులతో అచ్చయిన ఆ నవల పై  1934 జులై ఆంధ్రభూమిలో చిరుమామిళ్ల శివరామకృష్ణ ప్రసాదు బహద్దర్ విమర్శ కూడా వచ్చింది. మొదటి ప్రచురణకు వచ్చిన ఆదరం,పాఠ్య  గ్రంథాల కమిటీ ఆమోదం రెండూ ఆమెను ఈ నవల ద్వితీయ ముద్రణకు ప్రోత్సహించి ఉంటాయి. చిరుమామిళ్ల వారి విమర్శ ఇందులో సద్విమర్శనము అనే శీర్షికతో అచ్చయింది. మద్రాస్ నుండి ఇది ప్రచురించబడింది. 

శారదావిజయము చారిత్రక నవల. 14వశతాబ్దిలో విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పరచిన సంగమ వంశస్థుడైన  హరిహరరాయల వారసుల పాలనా కాలం లో బహమనీ రాజులతో జరిగిన యుద్ధాలు, రాజ్యవిస్తరణల నేపథ్యంలో ఈ నవలలో ఇతివృత్తం ప్రవర్తిస్తుంది. చారిత్రకంగా చూస్తే ‘దేవరాయల విజయం’ అని ఉండవలసిన నవల పేరు ‘శారదా విజయము ‘ అయింది అంటే ఈ నవలలో కథ పూర్తిగా కల్పితం అన్నది స్పష్టం. రెండవ హరిహరరాయల మరణానంతరం విరూపాక్ష రాయ, రెండబుక్కరాయల స్వల్ప పాలనా కాలం తరువాత రాజ్యానికి వచ్చిన ఒకటవ దేవరాయల పాలనా కాలంలో అంటే 1406 నుండి 1422 మధ్యకాలం లో ఈ కథ నడుస్తుంది. ఢిల్లీ సుల్తానులపై తిరుగుబాటు చేసి అల్లాఉద్దీన్ బహమన్ షా ఏర్పరచిన బహమనీ సామ్రాజ్యం 1358 నాటికి దక్షిణానికి విస్తరించి విజయనగర వరంగల్ ప్రాంతాల పై పట్టు సాధించింది. 1406 నాటికి విజయనగర సామ్రాజ్యానికి రాజు ఒకటవ దేవరాయలు. అతనికీ బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా కు ముద్గల్ రాయచూర్ మొదలైన కోటల విషయంలో జరిగిన యుద్ధాల కథనం ఈ నవల. 1422 లో ఫిరోజ్ షా మరణం తో ఈ నవలలో కథ ముగిసింది. కానీ నవల ముగింపులో ఫిరోజ్ షా మరణానంతరం సుల్తాన్ బిరుదుతో రాజ్యానికి వచ్చిన అహమ్మదు షా ను ప్రస్తావించి అతని దుండగాలను అణచివేస్తూ శ్రీదేవరాయ సార్వభౌముడు ‘ కర్ణాటక రాజ్య రమా రమణుడై , సంస్కృతాంధ్ర కర్ణాటక భాషా త్రయంబు నభివృద్ధినొందింపుచూ ప్రజారంజకుడై రాజ్యమేలుచుండెను’ అని వ్రాసింది రచయిత్రి. అయితే శ్రీదేవరాయ సార్వభౌముడి పాలన 1422 లోనే అంతమైంది అన్నది చారిత్రక సత్యం. అదే సంవత్సరం రాజ్యానికి వచ్చిన అహమ్మద్ షా 1422నుండి 24 వరకు విజయనగరాన్ని పాలించిన వీరవిజయ బుక్కరాయల పై విజయం సాధించాడు కూడా. అతనిని ఎదిరించి నిలిచినవాడు 1424 నుండి 1446 వరకు విజయనగరాన్ని పాలించిన రెండవ దేవరాయలు. ఒకటవ దేవరాయలకు, రెండవ దేవరాయలకు మధ్య భేదాన్ని గుర్తించని లక్షణం ముగింపులో ఉంది. 

ఫిరోజ్ షా ను హిందూ మతద్వేషిగా పరిచయంచేసి అతనిమీద మొదటిదేవరాయల విజయాన్ని హిందూమత ఉద్ధరణగా నిరూపిస్తూ ఈ నవల ఇతివృత్తం నిర్మించబడింది. దానికి బలం చేకూర్చే కథ శారద కథ. ముద్దగల్లు దుర్గంలో బాలికా పాఠశాల విద్యార్థిగా ఆమెను పరిచయం చేసి, ఫిరోజ్ షా తమ్ముడు యువరాజు అహమ్మద్ షా ఆదుర్గానికి పర్యట నకు వచ్చి పాఠశాలను దర్శించి ఆమెను చూచి ఆమె పాటను, మాటను విని  వరించి నట్లు కథను మలచి అక్కడనుండి ఆంధ్రమహిళల స్వమతాభిమానం, స్వాభిమానం, దేశభక్తి మొదలైన గుణాల నిరూపణగా ఆమె వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకొంటూ ఇతివృత్తాన్ని అభివృద్ధి చేసింది. అహమ్మద్ షా పాలకుడైన సరే అతనిమెడలో మాలవేయటానికి నిరాకరించటం తో బహ్మనీలకు ఆమె లొంగదీయవలసిన మనిషి అయింది. విజయనగరం పై ఆధిపత్యం, శారద పై అధికారం సంపాదించటం లక్ష్యంగా సాగిన బహమనీ సుల్తానుల రాజకీయ దౌర్జన్యాలను ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ విజయనగర రాజులు, మగవేషంలో వారి సైన్యంలో చేరి  ప్రముఖ పాత్ర వహించిన శారదా,ఆమె స్నేహితురాలు జానకి, ఆమె ప్రేమికుడు సింహాద్రి ఎదిరించి సాధించిన విజయమే ‘శారదావిజయం’ నవల.  

ఆతరువాత చెప్పుకోదగిన నవల హవాయి కావేరీబాయి వ్రాసిన ‘పరిణామము’. మాలపల్లి నవల ఎలాగైతే తెలుగునవలా సాహిత్య చరిత్రలో వికాసాయుగానికి ప్రారంభమో స్త్రీల నవలాసాహిత్య చరిత్రలో వికాస యుగానికి ‘పరిణామము’ నవల ఆ రకంగా గొప్ప ప్రారంభం. పరిణామము నవల 1940 లో ఆంధ్రపత్రిక (వారపత్రిక)లో సీరియల్‌గా ప్రచురింపబడింది. నవల ప్రారంభ సంచికలు లభించ లేదు. 1940 సెప్టెంబరు 18 వ తేది నాటి సంచికలో 43వ అధ్యాయం నుండి 1940 నవంబర్  సంచికలో నవల ముగింపు వరకు ఉన్న భాగం మాత్రమే లభించింది. ‘అమూలాగ్రముగా కల్పిత పాత్రలు గల అద్భుత సాంఘీక నవల’ అని పత్రిక దీని గురించి పేర్కొన్నది. నవల మొత్తం 58 అధ్యాయాలుగా విభజింపబడి ఒక్కొక్క అధ్యాయానికి ఒక పేరు పెట్టబడింది. 

ఈ నవలలో నాయిక లలిత.  తండ్రి జనార్థనం, తల్లి కమలమ్మ.  ఇద్దరు అన్నలు పెద్దతను అర్జునుడు డాక్టరు.  అతని భార్య సరోజిని. చిన్నన్న శంకరం కాంగ్రెసులో పనిచేస్తుంటాడు.  అతను ప్రేమించి పెళ్ళాడలేకపోయిన అమ్మాయి చెల్లాయి. ఆమెకూడా కాంగ్రెసులో పనిచేసింది.  లలిత మిత్రుడు రాజారత్నం.లలిత వితంతువు. తల్లిదండ్రుల మీద అన్నల మీద ఆధారపడి బ్రతకటం ఆమెకు ఇష్టం లేదు.  స్వేచ్చా జీవనానికి తపన ఆమె జీవలక్షణం. ఉద్యోగం చేయాలని, స్వతంత్రంగా బ్రతకాలని ఆశిస్తుంది. తనమీద అన్నగారి పెత్తనం నిరాకరించటం, తనది చేయాలో నిర్ణయించుకునే హక్కు తనకే ఉండాలనుకోవటం ఆమె చైతన్యంలో భాగం.  నా -లైఫ్ ఏమిటి, ఎంతసేపు వీడికి టైపిస్టుగాను, వాడికి కాంపౌండరుగానూ, బేబికి ఆయాగానూ నా బ్రతుకా? I Cant Stand It Any More, I Must Be Free అనుకుని – వైద్య విద్య పూర్తి చేసి డాక్టరుగా ప్రాక్టీసు ప్రారంభిస్తుంది.  ఆ క్రమంలో చిన్నప్పటి స్నేహితుడు రాజారత్నం కలుస్తాడు. వాళ్ళ అక్క విక్టోరియాకు వైద్యం చేయటానికి వాళ్ళింటికి వెడుతుంది. వాళ్ళ స్నేహంలో బైబిలు చదవాలనిపిస్తుంది. క్రమంగా రాజారత్నం పట్ల ప్రేమ అభివృద్ది చెందుతుంది. వివాహం చేసుకోవాలను కుంటుంది.

లలిత రాజారత్నంను పెళ్ళాడ నిర్ణయించుకొందని తెలిసి అతను దళిత క్రైస్తవుడని ఇంటిల్లిపాది వేదన పడుతారు,  ఆ విషయంలో ఆమె వారితో వివాదపడుతుంది. ఒక Human being చేయదగనిదేది నేను చేయట లేదు. Brahmin Widows పొందే  Inhuman treatment నేను సహించలేను -అని నొక్కి చెప్తుంది, నేను స్వతంత్రురాల్ని, నేను Love చేసే Man ని నీవలా అవమానపరచ వద్దు అని అన్నగారి మాటలకు అభ్యంతరం చెబుతుంది. 

ఈ నవలేతివృత్తాన్ని దేశీయ సంస్కరణోద్యమాలతో, జాతీయోద్యమంతో ముడిపెట్టి నడపటంలో కావేరి బాయి చైతన్యం కనబడుతుంది. సంస్కరణోద్యమంలో భాగమైన భోగం మేళాలు మొదలైన సమస్యల గురించి లలిత ఆలోచిస్తుంది. కన్యాశుల్కం నాటకాన్ని చదివింది. ఆ నాటక ప్రదర్శనను కూడా చూచింది. గురజాడ ఆ నాటకాన్నితనలాంటి వాళ్ళను హేళన చేయటానికే వ్రాశాడా అని నొచ్చుకుంటుంది కూడా. ఒక వితంతు స్త్రీగా ఆమె దానిని ఎలా అర్థంచేసుకున్నది అనేది కీలకమైన అంశం. ఆ కోణం నుండి చూచినపుడు స్త్రీవాద సాహిత్య విమర్శలో ‘గైనోక్రిటిసిజమ్‌’ కు ప్రారంభం కావేరీబాయి పరోక్షంగా ఈ నవలలో చేసిందని చెప్పాలి. ఇది ప్రత్యేకంగా విశ్లేషించి నిర్దారించాల్సి ఉంది.

పరిణామము నవలలో దండి సత్యాగ్రహోద్యమ ప్రస్తావన ఉంది.  లలిత సోదరుడు శంకరం ఆ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు.  ఈ నవలలో చివరి అధ్యాయం మహాత్ముని ప్రాయోపవేశం. రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్స్‌ ముగిసిందని ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది.  రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది 1932లో. దళిత ఉద్యమంలో ఇది ముఖ్యమైన ఘట్టం. దళిత వర్గాలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఇయ్యాలన్న నిర్ణయం జరిగిందీ కాన్ఫరెన్స్‌లోనే.  గాంధీ దానిని వ్యతిరేకించాడు. దళిత వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించే పథకానికి సంబంధించిన ఆలోచన బ్రిటీష్‌ ప్రభుత్వం మానుకోవాలని, ఆ మేరకు ప్రకటన వెలువడే వరకు తాను ఆమరణ నిరాహార  దీక్ష చేస్తానని గాంధీ ప్రకటించింది అపుడే. దళితవర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను నిర్ణయిస్తే హిందూ సమాజం ముక్కలవుతుందన్నది ఆయన వేదన. అస్పృశ్యతను నివారించాలి. నిరసించాలి, నిరాకరించాలి కాని హరిజనులు మాత్రం హిందూ  సమాజంలో భాగంగానే ఉండాలి అన్నది ఆయన ఉద్దేశం. అందుకు అవసరమైన చర్యలు దేవాలయ ప్రవేశం, బడులలో వ్రవేశం, నూతి నీరు తోడుకునే అవకాశం మొదలైన సంస్కరణలకు ఆయన ప్రాధాన్యమిచ్చాడు. అంబేద్కర్‌ దీనిమీద విమర్శ పెట్టాడు. అయితే నవలలో గాంధీ మార్గం వైపే మొగ్గు కనబడుతుంది.  గాంధీ ఆదర్శాలను నమ్మి ఆలోచించే శంకరం ఈ నవలలో ఉన్నాడు కానీ, అంబేద్కర్‌ ఆలోచనలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తి పాత్ర లేదు.

రౌండ్‌టేబుల్‌  కాన్ఫరెన్స్‌ జరిగి దళితుల సామాజిక రాజకీయ హక్కులమీద ఒక చర్చ నడుస్తున్న సమకాలంలో శంకరం జాతీయోద్యమ కార్యకర్తగా తన ఆదర్శానికి ఆచరణకు మధ్య ఉన్న ఎడం గురించి ఆత్మవిమర్శలో పడ్డట్లు ఈ నవలేతివృత్తాన్ని మలిచింది కావేరీబాయి.  మహాత్ముడు ఆస్పృశ్యతను నిరాకరిస్తుండగా తాను అందుకు అనుకూలంగా ప్రవర్తించలేకపోవటేమిటని ప్రశ్నించుకున్నాడు శంకరం. అస్పృశ్యతను నిరాకరించకపోతే స్వాతంత్య్రోద్యమంలోకి ఎందుకు వచ్చినట్లు అని విచికిత్సకు లోనయ్యాడు. తదితర స్త్రీ పురుషుల కొసగిన స్వాతంత్య్రం దైవం విధవలకీయలేదా అన్న ప్రశ్నతో లలిత పట్ల తమ కుటుంబ వైఖరి గురించి శోధనలో పడ్డాడు.  హరిజనుల యిడుములు బాపనుద్భవించిన జాతీయవాదులు, బ్రాహ్మణులు తదితర అగ్రకులాలవారు హరిజనులను పెళ్ళాడటానికి సిద్దపడితే దానిని ఆమోదించలేకపోవటమేమిటన్న విమర్శను శంకరం ఆలోచనల ముఖంగా లేవనెత్తింది కావేరీబాయి. ఆ రకరగా శంకరం ఆత్మశోధన ఇటు వ్యక్తిగా తనను సంస్కరించు కొనటానికి ఉపయోగపడటమే కాక అటు మొత్తం జాతీయోద్యమ వైఖరి మీద జాతీయవాదుల ఆచరణాత్మకత మీద విమర్శగా తేలి సంస్కరించబడవలసిన ఉద్యమ దృక్పథాన్ని, గమనాన్ని గురించిన హెచ్చరిక కూడా అయింది.

లలిత క్రైస్తవం తీసుకున్న రాజారత్నాన్ని పెళ్ళాడటానికి నిర్ణయం తీనుకొన్నదని కుటుంబం యావత్తు ఆమెను వదిలివేసింది.  ఒంటరి అయిన లలిత పక్షాన జాతీయోద్యమ కార్యకర్తగా తానుండవలసిన వాడన్న జ్ఞానం శంకరాన్ని లలిత దగ్గరకు వెళ్ళేట్లు చేసింది.  రాజారత్నంతో సహా లలితను ఆమోదించేట్లు చేసింది. ఈ సంఘటన ద్వారా జాతీయోద్యమం దళిత సమస్యను, దళితులతో సంబంధాలను అర్థం చేసుకొనవలసిన పద్దతిని కావేరీబాయి  ఒక అభ్యుదయకరమైన ఆచరణాత్మక విమర్శనాత్మక వాస్తవిక దృక్పథం నుండి సూచించటం గమనించవచ్చు.

కులం సమస్య మీద కావేరీబాయి కొంత అంబేద్కర్‌ అవగాహనతో, ఆత్మగౌరవ చైతన్య కోణం నుండి ఆలోచించటం కనిపిస్తుంది.  బ్రాహ్మణౌన్నత్యాన్ని ఈ కాలంలో ఎవరూ అంగీకరింపకున్ననూ, కొందరు ఇంకా ప్రదర్శించే స్థితిలోనే ఉండటం గురించి కావేరీబాయి ఈ నవలేతివృత్తంలో విమర్శ పెట్టింది.  శూద్ర స్త్రీ చే వంట చేయించుకొనటానికి అభ్యంతరంలేని వాళ్ళు, శూద్రుల సేవలతో సౌకర్యవంతంగా జీవించేవాళ్ళు బ్రాహ్మణులుగా తాము అధికులమనటం హాస్యాస్పదంగా కనిపించిందామెకు.  ఈ క్రమంలోనే కులాన్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళ పట్ల దళితులలో పెరుగుతున్న న్యాయమైన వ్యతిరేకతను కూడా ఆమె ఈ నవలేతివృత్తంలో భాగం చేసింది. 

ఒక పంతులమ్మ లెక్కలు సరిగా రావటం లేదని ఒక అమ్మాయిని మందలిస్తూ ‘గడ్డి మోపులు తలమీదేసుకొని అమ్మ వలసిన వాళ్ళను చదువులకు వేస్తే వస్తాదా! అని వెక్కిరింతగా మాట్లాడుతుంది.  ఆ మాటలకు నొచ్చుకున్న ఆ అమ్మాయి తన బాధను ఎమిలీ అనే తన స్నేహితురాలికి చెప్పుకుంటుంది. ఆపుడా అమ్మాయితో ఎమిలీ బుర్రగొరిగించుకొని పాచిపనులు చేయవలసిన వాళ్ళకి చదువులు షోకులూ వస్తే గడ్డిమోపుల వాళ్ళకి మాత్రం రాదూ అని నువ్వు పంతులమ్మకు సమాధానం చెప్పి ఉండవలసిందని అంటుంది.  ఆ పంతులమ్మ బ్రాహ్మణ వితంతువు. ఎమిలీకి అది తెలుసు. పనిపాటల వారిని దళితులను అవమానకరంగా మాట్లాడిన ఆమెపై తన కోపాన్ని ఆ రకంగా ప్రదర్శించింది.

ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది. స్త్రీలందరి సమస్యలు ఒకటి కావు.  బ్రాహ్మణ వర్గంలో వితంతు స్త్రీగా ఆ పంతులమ్మ వివక్షను ఎదుర్కొని ఉండవచ్చు.  దానిని ఏదో ఒక మేరకు అధిగమించే క్రమంలో చదువుకుని ఉద్యోగస్తురాలై ఉండవచ్చు. కాని ఆమెకు శ్రామిక వర్గ,దళిత వర్గ స్త్రీల గురించి ఏమీ తెలియదు.  సంప్రదాయ సంస్కృతి నుండి శ్రమను తక్కువ చేసి చూచే లక్షణం మాత్రం అబ్బింది. దాని ఫలితంగానే దళిత వర్గ విద్యార్థి పట్ల సానుభూతితో కానీ స్నేహంతో కానీ ఆమె ప్రవర్తించలేకపోయింది.  కనుకనే అగ్రవర్ణ దళిత స్త్రీల మధ్య వైరుధ్యంగా ఇది వ్యక్తమైంది. 

స్త్రీ వాదం దళిత స్త్రీల సమస్యలు స్పృశించలేదని 2000 సంవత్సరాలలో ఏ అవగాహనతో, అనుభవంతో దళిత స్త్రీలు మాట్లాడటం మొదలుపెట్టారో దాని మూలం పరిణామము  నవలలో బీజప్రాయంగా కనబడుతుంది. స్త్రీ సమస్య, దేశ స్వాతంత్య్ర సమస్య, కుల సమస్యల మధ్య ఉన్న పరస్పర సంబంధ వైరుధ్యాలను గుర్తించి 1940 నాటికే నవలేతివృత్తంలో  చక్కగా అల్లికపనితో వ్రాయటాన్ని బట్టి చూస్తే కావేరీబాయి కాలం కన్నా ముందున్న రచయితగా కనబడుతుంది. పరిణామం నవలకు ఒక ప్రత్యేకత ఉంది. భిన్న అస్తిత్వ చైతన్యాల మధ్య సంఘర్షణ, సంవాదం, సంభాషణ నడుస్తున్న వర్తమాన చారిత్రక సందర్భంలో భిన్న అస్తిత్వాలకు చెందిన స్త్రీ ల మధ్య స్నేహం అభివృద్దికావటానికి, భుజం భుజం కలిపి విముక్తికై సాగటానికి దాటవలసిన అగడ్తలెన్నో అర్థం చేసుకొనటానికి ఈ నవల చక్కగా ఉపయోగపడుతుంది.  దీనిని సంపాదించి ప్రచురించటం ఇపుడు జరుగవలసిన పని. 

స్వాతంత్య్రానికి పూర్వం నవలా రచనలో జంట రచయితల సంప్రదాయాన్ని ప్రారంభించినవారు ఇందిర, భారతీదేవి.   అయితం ఇందిరా భారతీదేవులు అనే పేరుతో జంటగా కవిత్వం చెప్పారు. నెల్లూరు మండలంలోని గూడూరుకు చెందినవాళ్ళు 1946లో వాళ్ళు ప్రతిమాదేవి అనే నవల వ్రాసారు.  అప్పటికే ఆ జంటకవులు జననీ శతకము, శ్రీ అన్నపూర్ణ సుభాషిత రత్నావళి పద్యకావ్యాలు వ్రాసారు. తండ్రి అయితం కాళీవరప్రసాదరాయల ప్రోత్సాహం వారికి బాగా ఉంది. ప్రతిమాదేవి చారిత్రక నవల.  ఇల్‌స్ట్రడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియాలో ప్రచురింపబడిన అహమద్‌ షా పరిణయములు అనే వ్యాసం ఆధారంగా వాళ్ళీ నవల వ్రాసారు. జహనారాబేగం పాత్ర ఒక్కటే కల్పితమని వాథోజీ సోదరులు, ఉకోజీ, రాణీ బాయి, లాలాబాయి, శత్రుశూల్జీ మొదలైన వారు చారిత్రక వ్యక్తులేనని శత్రుశూల్జీమరణము వంటివి చారిత్రక ఘటనలేనని తొలిపలుకులో చెప్పుకున్నారు.మేము బాలికలము గావునను క్రొంగ్రొత్తగా సాహిత్య క్షేత్రమున వ్రవేశించు చున్నవారము గావునను, పరిణత బుద్దులు పితృకల్పులైన యాంధ్రులు మా ఈ సారస్వత సేవను మన్నించి ప్రొత్సాహమిచ్చి యాశీర్వదించమని తొలిపలుకులలో పాఠకలోకాన్ని ప్రార్థించారు.

ఈ నవలకు 1410 ప్రాంతాలలో గుజరాతును పరిపాలిస్తున్న అహమ్మద్‌షా అరాచకాలపై దేశీయ సంస్థానాల రాజవంశాల వారి తిరుగుబాట్ల , ప్రతిఘటనల చరిత్ర ఇతివృత్తం.  అహమ్మద్‌షా ఆక్రమణకు దేశాల ప్రాంతాలే కాదు, ఆయా ప్రాంతాల రాజ కుటుంబ స్త్రీలు కూడా గురయ్యారు. అట్లా బందీగా తేబడి చివరికతని భార్యగా అయిన ప్రతిమాదేవి జహనారగా ఈ నవలలో గొప్ప మానసిక సంఘర్షణతో మనకు కనబడుతుంది.  రాజ్యాలవలె, సంపదల వలె స్త్రీలు కూడా స్వీయ అభిప్రాయాలతో, మానాభిమానాలతో నిమిత్తం లేకుండా విజేతల సొత్తు అవుతున్నపుడు పరాజితవర్గపు ప్రతినిధులుగా ఆ స్త్రీలు ఎదుర్కొనే హింసను, ఆత్మగౌరవ చైతన్యంతో చేసే పెనుగులాటను ప్రముఖంగా చూపించటానికే ఇందిరాభారతీదేవులు ఈ నవల వ్రాసారు.  జహనార పాత్రను కల్పించి కథకు ఆమెను కేంద్రం చేసారు. స్వదేశాభిమాన ధర్మం ముందు మానవతీ జనాపరాధుల యందు భార్యగా ఆచరించవలసిన ఆధీనతను, వినయాన్ని తృణప్రాయంగా త్యజించ వచ్చని తన ప్రవర్తనలో ప్రతిమాదేవి నిరూపించినట్లు ఈ నవల వ్రాసారు అయితం ఇందిరాదేవి భారతీదేవులు. జాతీయోద్యమ చైతన్య శక్తి దీనికి మూలం. భారతదేశం బ్రిటీష్‌ వలపపాలన నుండి విముక్తం కావటానికి ఐదు నెలల ముందు  మార్చి 1947లో ఈ నవల ప్రచురించబడింది. జాతి స్వాతంత్య్రాభిలాషకు ఎత్తిన దివిటీగా ఈ నవలను పేర్కొనవచ్చు.

ఈ విధంగా స్వాతంత్య్రానికి పూర్వం స్త్రీలు ఇంకా ఎంతమంది ఎన్ని నవలలు  వ్రాసారో ఏ సామాజిక జీవిత పరిణామాలను వ్యాఖ్యనించారో వెలికి తీసి తెలుగు నవలా సాహిత్య చరిత్రకు కలుపుకోవలసి ఉంది.

*****



Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.