యాత్రాగీతం

నా కళ్లతో అమెరికా

అలాస్కా

-డా||కె.గీత

భాగం-3

మర్నాడు ముందే బుక్ చేసుకున్న టూరు ప్రకారం మేం ఏంకరేజ్ నుండి ఉదయం 9.45కు బయలుదేరే గ్లాస్ డూమ్ ట్రైనులో  విట్టియార్ అనే ప్రదేశానికి మధ్యాహ్నం 12.45 కు చేరుతాం. అక్కణ్ణించి వెంటనే బయలుదేరే షిప్పులో గ్లేసియర్ టూరుకి వెళ్లి సాయంత్రం 6 గం. కు విట్టియార్ తిరిగొచ్చి మళ్లీ ఏంకరేజ్ కు రాత్రి 9 గం. కు గ్లాస్ డూమ్ ట్రైనులో తిరిగొస్తాం. 

మొత్తం టూరులో హోటలు నుంచి రైలు స్టేషనుకి రానూపోనూ వ్యాను సౌకర్యం టూరు వాళ్లే కల్పిస్తారు. ఇక ట్రైనుకి, షిప్పుకి టికెట్లు, ట్రైనులో, షిప్పులో భోజనాలు, ఉపాహారాలు,డ్రింక్స్ కూడా కలిపిన పేకేజీ ఇది. 

ఇక ముందురోజు అర్థరాత్రి సూర్యుణ్ణి చూస్తూ సంబరపడుతూ చీకటి ఎప్పుడు పడుతుందో, మళ్లీ ఎప్పుడు తెల్లారుతుందో చూద్దామని దాదాపు మెలకువగానే ఉన్నాను. దాంతో పొద్దుట లేచే సరికి తల తిరగడం మొదలెట్టింది. ఇక అర్థరాత్రి వరకూ చీకటి పడకపోవడంతో పిల్లలు కూడా పడుకునేసరికి లేటయ్యి పొద్దున్న లేవడం వాళ్ళకీ కష్టమయ్యింది. 

అయినప్పటికీ ఏడుగంటలకల్లా గబగబా తయారయ్యి హోటలు ప్రాంగణంలోని బ్రేక్ ఫాస్ట్ సెషన్ పూర్తి చేసుకుని ఉదయం 8.30 కల్లా హోటలు నుంచి రైల్వే స్టేషను కి షటిల్ వ్యానులో బయలుదేరేం.  స్టేషనుకి పది పదిహేను నిమిషాల వ్యవధిలోనే డౌన్ టౌన్ లో ఉంది మా హోటల్. బయటంతా మబ్బుగా ఉన్నా చల్లగా లేదు జూలై నెలలో అక్కడ. బొత్తిగా రణగొణ ధ్వని ఏవీ లేని ఒక పాతకాలపు మాములు ఆఫీసు బిల్డింగులా ఉన్న రైల్వే స్టేషను చూసి నవ్వొచ్చింది. ALASKA RAILROAD అనే పెద్ద అక్షరాల్తో ఆ బిల్డింగు పాతదైనా, బయట వేలాడే పూల కుండీలతో, చక్కగా కొత్తమాయని కోరా రంగు సున్నంతో అందంగా ఉంది.  

ముందు రైల్వే స్టేషనుకి ఎదురుగా పాతకాలపు రైళ్ల జ్ఞాపకంగా కట్టిన చిన్న సైజు పొగబండి దగ్గిరికి పరుగెత్తి ఫోటోలు తీసుకున్నాం.     

ఇక స్టేషను ఎంట్రన్సు కి ఒక పక్కగా చిన్న గేటులో నుంచి లోపలికి ప్రత్యేకంగా ఓపెన్ లాట్ లో లైను ఉంది. చిన్న హ్యాండ్ బ్యాగులు తప్ప పెద్ద లగేజీ ఏవైనా ఉంటే ఆ లైనులో వెళ్లి చెకిన్ చెయ్యాలి. వాటికి అక్కడే ట్యాగులు వేసి తీసుకుని, దిగేక తీసుకోమని చెప్తున్నారు. లగేజీ చెకిన్ పూర్తిగా ఉచితం. 

మా దగ్గిర ఏవీ పెద్ద లగేజీ లేకపోవడంతో మేం తిన్నగా మా రిజర్వేషను కాగితాలు తీసుకుని లోనికి వెళ్లి పెద్ద హాలులో ఉన్న బెంచీలపై కూచున్నాం. 

అసలు మాతో ప్రయాణం ఎవరైనా చేస్తారా లేదా అని ఆలోచించుకుంటుండగా సరిగ్గా అరగంటలో హాలు కిక్కిరిసేలా జనం పోగయ్యేరు. 

ఎక్కడా కూర్చునేందుకు చోటు లేక చాలా మంది నిలబడ్డారు. 

దాదాపు 70% మంది వృద్ధులే ఉన్నారు. మాలాగా పిల్లలతో  వచ్చిన వాళ్ళు 20%, యువకులు 10% ఉన్నారు. 

అలాస్కా రైలురోడ్డు చారిత్రాత్మకమైనది. దాదాపు 110 సంవత్సరాల ముందే నిర్మించబడినది. తొలిదశలో ఇక్కడి ప్రధాన పారిశ్రామిక ఉత్పత్తులైన క్రూడ్ పెట్రోలియం, సహజవాయువు, బొగ్గు, బంగారం, జింక్, కలప, సముద్ర వనరులు మొ.న వాటి రవాణా కోసం మాత్రమే రైలు మార్గాల్ని విరివిగా వాడినా 1959లో అలాస్కాను  అధికారికంగా  అమెరికా సంయుక్త రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత టూరిజం కోసం ప్రత్యేక మార్గాలలో, ప్రత్యేక రైళ్లని నడుపుతున్నారు. 

అలాస్కాని రష్యా నుండి 1867లో ఏడు మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది యుఎస్ఏ. వైశాల్యంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలోకెల్లా అలాస్కాయే అతి పెద్ద రాష్ట్రం. అంతేకాకుండా అమెరికా సంయుక్త రాష్ట్రాల మొత్తం సముద్ర తీరంకంటే అలాస్కా సముద్రతీరం పెద్దది. అలాస్కాలో విస్తారమైన సహజ వనరులు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో అలాస్కా దేశంలోనే రెండవ స్థానంలో ఉంది.

ఇక రాజధాని జునేయు అయినప్పటికీ అలాస్కాలో అత్యంత జనసంఖ్య కలిగినది మేమున్న ఏంకరేజ్ నగరమే.

దక్షిణ మధ్య భూభాగంలో ఉన్న ఏంకరేజ్ నుండి అలాస్కాలోని అన్ని ఇతర ప్రాంతాలకు, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని అన్ని ప్రధాన నగరాలకు విమాన సౌకర్యం ఉంది. ఒక విధంగా ఏంకరేజ్ అన్నిటికీ కూడలి వంటిది. 

ఇక మేమెక్కవలసిన రైలు నిర్ణీత సమయానికి పట్టాల  మీద  సిద్ధంగా  ఉంది.  

ప్లాటుఫారం వంటిదేమీ  లేనేలేదు. పరిశుభ్రంగా ఉన్న పట్టాల మీద ఠీవిగా ఆకాశం లోకి నిలబడిన ఆ  డబుల్ డెక్కర్ రైలు ఎక్కడానికి చక్కగా చిన్న మెట్లు ఉన్నాయి . 

ముందున్న ఇంజనుని ఆనుకుని గ్లాస్ డూమ్ పెట్టెలు రెండు మాత్రమే ఉన్నా, మొత్తం పదికి  పైగా పెట్టెలతో  విహార యాత్రకి మాత్రమే ఉద్దేశించిన ప్రత్యేక రైలది. ఈ రైలు పేరు Chugach Explorer. 

మా టిక్కెట్టు  ర్యాంప్ ఎక్కేముందే పరిశీలించి లోపలికి ఆహ్వానించేరు. అక్కడ కొద్దిమంది ప్రధాన స్టాఫ్ తప్ప మిగతా  అంతా వేసవి ఉద్యోగాలు చేస్తున్న హైస్కూలు పిల్లలే. 

నవ్వుతూ, తుళ్లుతూ, మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ సీతాకోకచిలుకల్లా ఉన్న వాళ్ళని చూస్తే భలే ఆనందం, ఉత్సాహం వేసింది.  

పై అంతస్థులో టాప్ సగం వరకూ గ్లాస్ డూమ్ తో ఉన్న రైలు పెట్టెలో ప్రయాణం అంతకంతా భలే ఆహ్లాదంగా ఉంటుంది. గాల్లో విహంగంలా రెక్కలు సాచి ప్రయాణిస్తున్నట్టు.  

చుట్టూ కమ్ముకునే  చెట్లు, పర్వతాలు, ఆకాశం, మేఘాలు, ఒరుసుకుని ప్రవహించే నీటి చెలమలు, కిటికీల మీదికి విస్తరించినట్లున్న ప్రకృతిలో మనమూ మమేకమై అల్లనల్లన మెల్లగా సాగిపోతూ…. ఓహ్… అత్యద్భుతమైన ప్రయాణం అది. 

ఆ రైలుకి దూసుకుపోవడం ప్రధాన ధ్యేయం కాదు కనుక గంట సేపట్లో వెళ్లాల్సిన దూరానికి మూడుగంటలు పడుతుంది. 

హాఫ్ గ్లాస్ డూమ్ రైలు కాబట్టి పిల్లలు కిటికీ సీటు కోసం కొట్టుకోకుండా బుద్ధిగా కూచున్నారు. 

వరుసల మధ్య తగినంత స్థలంతో వరుసకు నాలుగు సీట్ల చొప్పున మధ్యన టేబుల్తో ఎదురుబొదురుగా రెస్టారెంటులో ఉన్నట్టున్నాయి సీట్లు. 

మెట్లెక్కి పైకి వచ్చే చోటే చిన్న స్నాక్స్ & డ్రింక్స్ బార్ ఉంది. 

కింద పెట్టె కూడా అలానే ఉన్నా మెట్లెక్కలేని  పెద్దవాళ్ళ కోసం కేటాయించేరు ఆ సీట్లని. 

 డ్రింక్స్, స్నాక్స్ అన్నీ టిక్కెట్టులోనే కవర్ అవుతాయి.

అతి ముఖ్యంగా ఈ ప్రయాణంలో అలాస్కాలోని మరి కొన్ని ఊళ్లు చూసేం. 

ఎంకరేజ్ పొలిమేరల్లోఉన్న ఇళ్లు ఎకరానికొకటి చొప్పున కట్టినట్లున్న పెద్ద పెద్ద స్థలాల్లో ఉన్నాయి. విశేషం ఏవిటంటే ఇంటికొక కారున్నట్టు ఇక్కడ ఇంటికొక చిన్న విమానం ఉంది! 

*****

(ఇంకా ఉంది) 

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.