మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

దొమితిలా జీవితం- సైగ్లో – 20

గృహిణుల సంఘం

ఆయన చెప్పిందాని సారాంశమేమంటే కొమిబొల్ ఆర్థికంగా చితికిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. కొమిబొల్కు ఎన్నో అప్పులున్నాయని ఆయన చెప్పాడు. ఆ అప్పులు తీర్చకపోతే బొలీవియాకు ఉన్న విదేశీ వ్యాపారాలు రద్దయిపోతాయి. ఇలా ఆయన ఇంకేమిటేమిటో చెప్పుకొచ్చాడు. వెంటనే జనం “… రోజులిట్లా ఉంటే మనం కం పెనీని కాపాడుకోవడం కన్నా చేసేదేముంది? మనం తొందరపాటుగా ఈ ప్రభుత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళయిందని.. ” అనడం మొదలెట్టారు.

ఇక వెంటనే జీతాల కోత చట్టం అమల్లోకొచ్చింది. ప్రతి ఒక్కళ్ళూ ఈ వార్త విని విచారపడ్డారు. గృహిణుల సంఘం కూడ ఒక ప్రకటన విడుదల చేసింది. అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న జీతంలోంచి అంత పెద్ద మొత్తం కోతవిధిస్తే మేమేం కావాలి?

ఆ తర్వాత 1965 మేలో మరెన్నెన్నో ఆర్థిక చర్యలు తీసుకోబడ్డాయి. వెంటనే నిరసనలు మొదలయ్యాయి. ప్రభుత్వం నాయకులమీద విరుచుకపడింది.

మొదట వాళ్ళు లెచిన్ను అరెస్టు చేసి పెరాగ్వేకు ప్రవాసం పంపారు. వెంటనే గని కార్మిక సమాఖ్య ఒక సర్వవ్యాపిత సమ్మెకు పిలుపిచ్చింది. అప్పుడు మరొక నిరంకుశ ఉత్తర్వు వచ్చి పడింది. “నాయకులందరూ దేశం విడిచి వెంటనే వెళ్ళిపోవాలి”. ఆ ఉత్తర్వులోనే నాయకులు గనుక తమంతటతాము వెళ్ళకపోతే సైన్యం వచ్చి తన్ని తరిమేస్తుందని గూడా రాయబడింది. నాయకులు వెళ్ళకపోతే ఎంతో రక్తపాతం జరుగుతుందనీ, ఇంకెన్నెన్నో ఘోరాలు జరుగుతాయనీ రాయబడింది. ఫెడరికొ ఎస్కోబార్ ను వెళ్ళమని మేం నచ్చజెప్పాం. ఆయనకు వెళ్ళిపోవడం సుతరామూ ఇష్టం లేకుండింది. మేం ఆయనతో మాట్లాడి, ఆయన్ని చంపడానికి వాళ్ళెంతగా ప్రయత్నిస్తున్నారో, ఆయన వెళ్ళిపోవడం ఎంత అవసరమో వివరించాం. ఆయనెంతకూ ఒప్పుకోలేదు. “నేను గనిలోకే వెళతాను. వాళ్ళకంతకోరిగ్గా ఉంటే అక్కడి నుంచి బయటికి లాగమను – నేను మాత్రం ఎక్కడికీ వెళ్ళను” అని మొండికేశాడు. కాని ఎస్కోబార్ గనిలోకే వెళ్తే ఆయన్ని బయటికి లాగి చంపేస్తారని మా అందరికీ తెలుసు. అలాంటి మనిషిని పోగొట్టుకోవడం మాకిష్టం లేదు. మేం ఆయనకెంతగానో నచ్చజెప్పాం. ఆయనతో పాటు పనిచేసే కామ్రగ్స్ కూడ జైల్లో ఉన్న నాయకుని కంటె బైట ఉన్న నాయకుడు ఎంత పనికి రాగలడో, చనిపోవడం కంటే బతికి ఉండడం ఎంత ఉపయోగకరమో వివరించారు. మేం మా ఊరి చర్చి వాళ్ళతో మాట్లాడి ఎస్కోబార్ పారిపోయే ఏర్పాట్లుచేశాం. సైన్యం యూనియన్ నాయకుల్ని, కార్మికుల రేడియో స్టేషన్ లోని జర్నలిస్టులను, గృహిణుల సంఘం నాయకుల భర్తలను పట్టుకుంది. ఇలా పట్టుకున్న వందమందికి పైగా మా వాళ్ళను విమానాల్లో ఎక్కించి అర్జెంటీనాకు తరలించారు. ఎంత ఘోరం!

ఆ తర్వాత వాళ్ళు ప్రజల నిరాయుధీకరణ కార్యక్రమం మొదలెట్టారు. ఆయుధాలు అప్పజెప్పిన కార్మికులకు పతకాలో బహుమానాలో ముట్టేవి. కార్మికులందరి దగ్గరా ఆయుధాలుండేవని కాదు. అసలు వాళ్ళదగ్గర ఎలా ఉంటాయి? కాని ఎంఎన్ఆర్ లోని ఒక వర్గం కార్మికుల దగ్గర ఆయుధాలుండేవి. నిజానికి ఆయుధాలున్న వాళ్ళు చాలా తక్కువ మంది.

అప్పుడు ఆ నాయకులేగనుక వెళ్ళిపోకపోయినట్టయితే వాళ్ళలో ఎంత మందిని చం పే సేవారో! ఎంత రక్తం చిందేదో! మా దగ్గరేమో ఆయుధాలు లేవు. మేం దేనితో ఆత్మరక్షణ చేసుకోగలిగే వాళ్లం? అప్పుడు గని కార్మికులందరి ఆలోచనా ఇదే.

నాయకులందరూ అర్జెంటీనాకు ప్రవాసం వెళ్ళిన తర్వాత కార్మికుల్లో కొందరు – ముఖ్యంగా ట్రాట్ స్కీయిస్టులు – ఒక రహస్య సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘానికి ఎజాక్ కమాలో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు. ఆయన గనిలోనే ఉండి ఉద్యమం నడిపాడు. ఈ సంగతి తెలియగానే ప్రభుత్వం ఆయన్ని వేటాడ్డం మొదలెట్టింది.

1965 సెప్టెంబర్ 18న కమాచో బైటికి వచ్చి యూనియన్ భవనం ముఖద్వారం దగ్గర కార్మికులతో మాట్లాడుతుండగా ఆయన్ని ఆరెస్టు చేశారు. ఆయన్ని పట్టుకోవడం కోసం ఎంతో మందిని కూడా అరెస్టు చేశారు. కొందరు విద్యార్థుల్ని, స్త్రీలని, మరెంతో మంది మామూలు జనాన్ని చంపేశారు. కమాలోను కాపాడడానికి జనం ప్రయత్నించినప్పుడు ఈ ఘర్షణ జరిగింది. కమాచో మాకు కనబడడం అదే ఆఖరు సారి.

శనివారం నాడు ‘ఈ సంఘటన జరిగితే ఆదివారం నాడు వాళ్ళు మృతదేహాలన్నిట్నీ ఖననం చేశారు. సోమవారం నాడు కార్మికులు మళ్ళీ గనిలోకి దిగారు. గని లోపల రహస్య సంఘానికి చెందిన కార్మికులు “ఇంతలేసి ఘోరాలు జరుగుతోంటే మనం చూస్తూ ఊరుకోవడమేనా? వీల్లేదు… ” అని పిలుపిచ్చారు.

కార్మికులందరూ వెంటనే ఈ పిలుపుకి స్పందించి ఒక నిరసన ప్రదర్శన జరపడానికి నిర్ణయించారు. వాళ్ళు కం పెనీ గిడ్డంగి నుంచి డైనమైట్ తీసుకుని సాయుధులయ్యారు. సైన్యానికి ఇదంతా ముందే తెలిసిపోయింది. సైనికులకి సబ్ మెషిన్గన్లూ ఇతర భారీ ఆయుధాలూ ఇచ్చి గని ప్రవేశ ద్వారం దగ్గరే నిలబెట్టారు. కార్మికులు వాళ్ళని తప్పించుకొని రావడం అసాధ్యం. సైనికులు బయటికీ గని లోపలికీ ఉన్న సమాచార సంబంధాలన్నిటినీ తెంచేశారు. మైక్రోఫోన్లనూ, టెలిఫోన్లనూ తెంచేశారు. బయట ఉన్న స్త్రీలం కార్మికులకీ విషయం తెలియజేయాలని ఆందోళన పడ్డాం. మేం ఎంత తాపత్రయపడ్డా ఈ సంగతి లోపలికి తెలియజేయడం మాకు సాధ్యంకాకపోయింది. మేం విపరీతంగా భయపడిపోయాం. ఇప్పుడో, మరో క్షణాన్నో కార్మికులు బయటి కొస్తారనీ, సైన్యం కాల్పులు ప్రారంభిస్తుందనీ మేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూచున్నాం.

వాళ్లకెట్లో తెలిసిందో నాకు తెలియదు గాని అదృష్టవశాత్తూ కార్మికులకి బయట ఏం జరుగుతోందో తెలిసిపోయింది. వాళ్ళు సైగ్లో -20కి అవతలివైపుగా గనికి మరో పక్కన ఉన్న సెర్రో అజుల్ ద్వారం నుంచి బయటికి వచ్చేశారు. వాళ్ళు సైన్యం కంట్లో దుమ్ముకొట్టగలిగారు. ఒక్కచోట మాత్రం కార్మికులకీ సైన్యానికీ ఘర్షణ జరిగింది. కార్మికులు చాల సాహసికంగా ఆత్మరక్షణ చేసుకున్నారనే చెప్పాలి. వాళ్ళ దగ్గరున్నదల్లా డైనమైట్ మాత్రమే. అవతలి వైపో, అత్యాధునిక ఆయుధాలున్నాయి.

ఐతే పరిస్థితి అదుపులోకి వచ్చిందనీ, అంతా మామూలైపోయిందనీ మేం అనుకున్నప్పుడే భయంకరమైన అధ్యాయం మొదలైంది. సైన్యం మెషిన్గన్లతో విమానాల్లో సైగ్లో-20కి వచ్చిపడింది. మేం మా జీవితంలో మొదటి సారిగా విమానం చూశాం. విమానం గాలిలో గింగర్లు కొట్టడం, విమానంలోంచి చిన్న చిన్న కాంతి పుంజాలు బైటికి రావడం, బుల్లెట్ల వర్షం కురవడం మేం మొదటిసారి చూశాం. ధన్… ధన్… ధన్… ఎటు చూస్తే అటు బుల్లెట్లు. వాళ్ళు ప్లాజాడెల్ మైనెరో మీదా, కటావిమీదా, రాళ్ళ గుట్టమీదా కాల్పులు సాగించారు. మా మీదికి తుపాకీ గుళ్ళు కాంతి కిరణాలలాగ ఎటునుంచి బడితే అటునుంచి దూసుకొచ్చాయి. అంతమాత్రమే కాదు, ఏ యుద్ధంలోనూ, ఏ ఘర్షణలోనూ అంగీకారయోగ్యంకాని పద్ధతిలో వాళ్ళు అంబులెన్సుల మీద కూడ దాడి చేశారు. ఇది అంతర్జాతీయ నేరంకాదూ?! ఎంతమంది చనిపోయారని! ఎంతమంది గాయపడ్డారని! కటావి ఆస్పత్రి కిక్కిరిసిపోయి కొందరికి స్థలమే దొరకలేదు.

ఆ సంవత్సరమే నేను గృహిణుల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం మొదలు పెట్టాను. అప్పటికి నేను పరిస్థితిని సరిగా అవగాహన చేసుకోని ఒకానొక మామూలు మనిషిని మాత్రమే. నేనప్పటికి తగినంతగా ఎదగలేదు. ఆ పరిస్థితుల్లో నేను ఈ హత్యాకాండను నా కళ్ళారా చూశాను. ఈ హత్యాకాండతోపాటే మరెన్నో సంగతులు నా అనుభవంలో కొచ్చాయి. అంతరంగిక మంత్రిత్వశాఖ ఏజెంట్లు స్టెచర్లు మోసేవారుగా మారువేషాల్లో అంబులెన్సుల్లోకి ఎక్కడం నేను చూశాను. వాళ్ళు క్షతగాత్రుల్ని ఎత్తుకు రావడానికి వెళ్ళినట్టేవెళ్ళి, క్షతగాత్రులకు సపర్యలు చేస్తున్న జనాన్ని ఫొటోలు తీశారు. మరోసారి ‘హత్యాకాండ జరిగేటప్పుడు వాళ్ళు ఈ ఫొటోల్ని ఉపయోగించుకొని జనాన్ని వెతుకుతారు. సైగ్లో-20లోని ఏజెంట్లకు ఆ ఫొటోలు చూపి ఫలానా అతను ఎక్కడుంటాడని వాకబుచేస్తారు. ఇక ఆయన్ని వేటాడడం మొదలెడతారు. ఫొటోలో ఉన్న యువకులందర్నీ వాళ్ళు పాఠశాల ఆటస్థలంలో జమచేశారు. వాళ్ళందరినీ జైలుకు పట్టుకుపోయారు. ఇంత భయంకరమైన ఘటనకు, ఇంత అమానుషానికి కారకుడు జకారియస్ ప్లాజా. వాడు అప్పుడు గని శిబిరానికి బాధ్యుడుగా ఉండేవాడు.

జకారియన్ ప్లాజా మిలిటరీ మనిషి. సైగ్లో-20లో అనేక మంది కార్మికులను మూకుమ్మడిగా హత్య చేయించినందుకుగాను వాడు ఎంతో డబ్బూ, ఎన్నో పతకాలూ గడించాడు. కాని, ఎన్నోసార్లు హత్యాప్రయత్నాలు తప్పించుకొని చివరికి 1970లో. జకారియన్ ప్లాజా నిర్దాక్షిణ్యంగా చంపేయబడ్డాడు. సాన్ జువాన్ పండుగ రోజున లేచిచూస్తే వాడుచనిపోయి కనిపించాడు. ‘ఈగిల్ ఐ’ అని పేరు పెట్టుకున్న ఒక బృందం వాణ్ని చంపేసింది. వాళ్ళు వాణ్ని చితకబొడిచారని నేను పత్రికల్లో చదివాను. వాడిమీద జరిగిందంతా సైగ్లో-20లో వాడు జరిపిన అమానుషానికి ప్రతీకారమేనని ‘ఈగిల్ ఐ ప్రకటించింది. ప్రజానీకం మీద హత్యాకాండలకు పాల్పడే వాళ్ళందరికీ చివరికి పట్టే గతి అదే. మా మీద జరిగిన రెండు మూకుమ్మడి హత్యాకాండలకూ, సెప్టెంబర్ 65లో జరిగిందీ, 67లో సాన్జువాన్ రోజు జరిగిందీ – జకారియస్ ప్లాజానే పథకం వేశాడు. ప్రతి విషయమూ వాడే చూసుకునే వాడు. వాడు మాతో వేళాకోళంగా “దమ్ములేని వాళ్ళు ఎందుకు ప్రగల్బాలు పలకాలి? ఏదీ ఇప్పుడు రండి చూద్దాం!” అంటూ మా మీదికి సైన్యాన్ని పురికొల్పాడు.

సరే – అదట్లా ఉంచి, సెప్టెంబర్ 1965లో జరిగిన దారుణ మారణకాండ గురించి చెప్తున్నాను గదూ – అది ముగియగానే సైన్యం విజయోన్మాదంతో గనుల్లోకి ప్రవేశించింది. మా దగ్గర రక్షించుకోవడానికి కూడా ఆయుధాలు లేవు. వాళ్ళు ఇల్లిల్లూ వెతికి మగవాళ్లందర్నీ పట్టుకుపోయారు. సైన్యం తన కాలాన్నంతా రేడియోలో గప్పాలు కొడుతూ గడిపింది. ” మనం ఇప్పుడు ఉత్తరంవైపు ఉన్నాం… ఇప్పుడు దక్షిణానికి చేరాం…. ఈ ఎర్రదొంగలను, ఈ పిరికి పందలను, ఈ లంజకొడుకులను ఇప్పుడు మనం పూర్తిగా తుడిచి పెడ్తున్నాం…” అంటూ వాళ్ళు రేడియో గొంతుచించుకున్నారు.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.