జీవితమే నవీనం

అనుభవాలు -జ్ఞాపకాలు-6

-వెనిగళ్ళ కోమల

ఒకనాడు వెల్మా, నేను బస్ మిస్ చేసి మార్కెట్ కు అడ్డదారిన నడిచి వెళుతూ ఉన్నాం. నలుగురు యువకులు ఆ దారినే వెళుతూ ఉన్నారు. వెల్మా గళ్ళెగా పెద్దదానిలాగా ఉంటుంది. నేను అప్పుడు బక్కగా ఉండేదాన్ని. తనకు తెలుగు రాదు గనుక ఇద్దరం హిందీలో కబుర్లాడుకుంటూ నడిచాం. ఆ అబ్బాయిలు తెలుగులో మా మీద కామెంట్స్ పాస్ చేస్తూనే నడిచారు. మాకు అర్థం కాదని గాబోలు – ఈమె మన సినిమా నటి జమునలాగా ఉన్నది. కానీ హిందీ మాట్లాడుతున్నది . తెలుగామె కాదు కదా ఆటపట్టిద్దామంటే పక్కన తల్లికోడిలా పెద్దామె ఉన్నది అంటూ అలా మాట్లాడుతూనే పోయారు. నేను కల్పించుకోలేదు. తీరా మార్కెట్ దగ్గర కొచ్చిన తరువాత – థాంక్స్ మీ కామెంట్స్ కు, ఇలా ఆడవాళ్ళ వెంట బడటం మీ సభ్యతగాబోలు. చూస్తే మర్యాదస్తుల్లా ఉన్నారు. ఇదేం బుద్ధి అన్నాను. వాళ్లు నా తెలుగు విని అవాక్కయ్యారు. వారికేమనలో తోచలా. మేము తిరిగి వెళ్ళేటప్పుడు ఇన్స్టి ట్యూట్ బస్ ఎక్కడం చూసారు. మరురోజు వుడ్ కాక్ హాలుకు వచ్చి క్షమాపణలడిగారు. వారిది రాజమండ్రి అట. ప్రోఫెషనల్ కోర్సు విద్యార్థులట. ఊటీ విహారయాత్రకొచ్చామని చెప్పారు. ఇది అప్రస్తుతమైనా చెప్పాలనిపించింది. కొన్ని సంఘటనలలా గుర్తుండిపోతాయి. 1959 నాటి ముచ్చట యిది. నేను ఊటీ వెళుతుంటే సుశీలా పీటర్స్ చక్కని స్వెట్టర్ బహూకరించింది. అది అక్కడి చలి వాతావరణంలో ఎంతో ఉపయోగపడింది. 

హాస్టల్లో ముఖ్యమైన మిత్రులు ఎస్. సావిత్రమ్మ, ఆర్. లక్ష్మీకాంతం. సావిత్రమ్మ బాలవితంతువు. హిందీ చదవటానికి రావులపాలెం (తూర్పుగోదావరి) నుంచి వచ్చి హాస్టల్లో ఉన్నది. నా రూంమేట్. 1961నాటి మాట. మనిషి నెమ్మది, మితభాషి. నేను ఎక్కువ మాట్లాడుతుంటే నవ్వుతూ వినేది. చదువయిపోయి ఆర్.టి.సి. స్కూల్లో హిందీ టీచరుగా కుదురుకున్నారు. సత్యనారాయణరెడ్డిగారు ఆమె బంధువు. ఆయన ప్రోద్బలం వల్లనే సావిత్రమ్మ చదివి, టీచరు కాగలిగింది. ఆయన లాయరు. కష్టపడి చదివి, పనిచేసి జీవితంలో సుస్థిరంగా నిలదొక్కుకున్న వ్యక్తి. మాకు పరిచయమయి మరణించేదాకా మిత్రులుగా కొనసాగారు. సావిత్రమ్మ అక్క వీరమ్మగారు, చెల్లెలు మీనాక్షి, తమ్ముడు వెంకట రెడ్డి అందరితో నాకు పరిచయముంది. మా యిద్దరి స్నేహం 45 ఏళ్ళు కొనసాగింది. అరమరికలు లేకుండా ఉండేవాళ్ళం. నా పిల్లలన్నా, నా భర్త అన్నా ఎంతో ఆదరంగా ఉండేది. ఊరి నుండి మిఠాయిలు వచ్చినా, తానేమన్నా తయారు చేసినా నాకు పంపించకుండా తాను తినేది కాదు. ఆమె తమ్ముని కొడుకు ప్రభాకర్ రెడ్డిని దగ్గరకు తీసి ఇంజనీరింగ్ చదివించింది.  ఆమె, సత్యనారాయణరెడ్డిగారు వారి వారి పేదబంధువులకు విరివిగా ధనసహాయం అందించేవారు. ఆరేళ్ళ క్రితం ఆమె, 4 ఏళ్ళ క్రితం రెడ్డిగారు మరణించారు. ఆప్తమిత్రులను కోల్పోయామనే బాధ మిగిలింది మాకు. 

లక్ష్మీకాంతం జి.సి.ఐ.ఎమ్. (ఆయుర్వేదం) డాక్టరు. క్లాసుమేట్ ఒ.వి. సుబ్బారెడ్డి (నెల్లూరు)ని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇద్దరు నెల్లూరు ప్రజా వైద్యశాలలో పనిచేసి వైద్యవృత్తిలో అనుభవం గడించి బోధన్ లో హాస్పిటల్ తెరిచారు. వైద్యసేవలందించి మంచిపేరు గడించారు. స్థితిమంతులయ్యారు. మా యింటికి తరచు వస్తూ పోతూ ఉండేవారు స్నేహరీత్యా. లక్ష్మిది చాలా ఉదారబుద్ధి. స్నేహితులు అవసరంలో ఉన్నారని తెలిస్తే వారడకముందే సహాయమందించటానికి ముందుండేది. నవ్వుతూ మాట్లాడేది. రెండుసార్లు కవలపిల్లలు పుట్టారు. – స్వాతి, చిత్రకుమార్, హారతి, జ్యోతి. మా పిల్లలు, వాళ్లూ సెలవుల్లో కలిసి (మా దగ్గర) గడిపిన సందర్భాలున్నాయి. తల్లి-దండ్రి మాదిరిగా స్నేహశీలురు ఆనలుగురూ. వారంతా ఇంటర్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా ఒకనాడు పిడుగులాంటి దుర్వార్త అందింది. లక్ష్మి, రెడ్డిగారు, లక్ష్మి తల్లి బందిపోట్ల దురాగతంలో యింటిలో ప్రాణాలు విడిచారని. పిల్లల్ని కూడా చిత్రహింస పెట్టారు దుండగులు. హారతి గూడా గాంధీ హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడి ఓడిపోయింది.  ప్రొఫెషనల్ ఈర్ష్యతో కొందరు వారిని చంపించారని చెప్పుకున్నారు. భయంకరమైన సంఘటన అది. అలా చేయించిన దుర్మార్గులు ప్రశాంతంగా నిద్రపోగలరంటే నమ్మలేము. లక్ష్మి పెద్దక్క మాణిక్యమ్మగారు పిల్లలను (ముగ్గురు) దగ్గరకు తీసి స్థిరపడేటట్లు చేశారు. ఈనాటికీ, లక్ష్మిని, రెడ్డిగారిని తలచుకుంటే కన్నీళ్ళాగవు. అంత మంచి వ్యక్తులకు ఘోర విపత్తు తలపెట్టినవారు అంతటి దురాగతాన్ని అనుభవిస్తారేమో ఎప్పటికైనా!

మరొక స్నేహితురాలు సీత, లాయరు. ఏలూరు నుండి వచ్చిందామె. లాముగించి కమర్షియల్ టాక్స్ ఆఫీసరుగా కుదురుకున్నారు. నాకు హాస్టల్లో రూం మేట్. పెద్ద గ్లాసుతో కాఫీతాగేది. మాటికొకసారి అమృతాంజనం పిసరు తీసి కణతలకు రాసుకుంటూ ఉండేది. అంత చదివి, పెద్ద ఉద్యోగంలో ఉన్నా చాలా సీదా సాదాగా ఉండేది. హైదరాబాద్ లోనే స్థిరపడిందామె. ఇటీవలి కాలంలో కలవ లేదు. ప్రస్తుతం తన గురించి ఏమీ సమాచారం లేదు. కాని నవ్వుతూ మాట్లాడే సీత ఎప్పుడూ గుర్తుకొస్తూనే ఉంటుంది. 

వసంత కుమారి సరూర్ నగర్ లో స్కూల్లో సైన్స్ టీచరుగా కొంతకాలం పనిచేసి వివాహం వల్ల హైదరాబాద్ కి స్వస్తి పలికింది. హాస్టల్లోనే ఉండేది. ఆదివారం చర్చికి వెళుతూ (హెబ్రోన్) నన్నూ లాక్కెళ్ళేది. ఆమె సోదరులు డా. అభయ్, క్రిస్టీ (చదువుతుండేవాడు) బాగా పరిచయమయ్యారు. మంచి కుటుంబం నుండి వచ్చిందామె. దైవభక్తి మెండు. ప్రస్తుతం రిటైరయి మధిరలోనే ఉంటున్నది. అసలు తన వల్లనే నేను హైదరాబాద్ కు ఉద్యోగరీత్యా రాగలిగానని ఎప్పుడూ కృతజ్ఞతా భావం నాలో మెదులుతూ ఉంటుంది. 

నాన్న నన్ను రాత్రి కాలేజీలో చేరి లా చదవమన్నారు. నా జీతం ఫీజులకు చాలదేమో అని డబ్బు కూడా ఇచ్చాడు. నాకెందుకో లా చదవటం ఇష్టం కాలేదు. ఏదో వంక చెప్పి తప్పించుకున్నాను. ఇక నన్ను నాన్న బలవంత పెట్టలేదు. చదువు విషయంలో నాన్న కోర్కెను నేను తీర్చనేలేదు. 

ఇంతలో CIEFL నుండి ఒక లెటర్ వచ్చింది. ఇరాఖ్ లో ఇంగ్లీషు టీచర్లు కావాలని, ఇష్టమయిపోతామంటే వాళ్ళే ఏర్పాటు చేయగలమని. ట్రైనీస్ అందరికీ పంపి ఉంటారా లెటర్. నాకు ఆ దేశం గురించి ఏమీ తెలియకపోయినా వెళ్ళ సాహసించలేదు. వెళతానంటే నాన్న అనుమతి దొరికేదో లేదో వేరే సంగతి. పరుగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగటం మంచిదన్నట్లు వెళ్ళే ఆలోచనే పెట్టుకోలేదు. పిరికితనం అనుకుంటాను నాది!

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.