వెనుతిరగని వెన్నెల(భాగం-19)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-19)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లయిన సంవత్సరం లోనే అబ్బాయి పుడతాడు.

***

తన్మయి ఒక్క ఉదుటున ఎదురుగా ఆగిన బస్సు ఎక్కేసింది. కండక్టరు టిక్కెట్టు అడిగే వరకూ తన దగ్గిర డబ్బుల్లేవన్న సంగతి గుర్తు రాలేదు

పక్క స్టాపులో బస్సాపిచూస్తే చదూకున్న దానిలా ఉన్నావ్, ఇదేం పని? దిగమ్మా, దిగు. ఎందుకెక్కుతారో డబ్బులేకుండా బస్సులుఅంటున్న డ్రైవరు మాటలు అసలు బుర్రకెక్కడం లేదు తన్మయికి.

తల మొద్దుబారిపోయినట్లయ్యింది. మనసంతా దు:ఖంతో కూడిన నిరాశ

బస్సు దిగి నడక ప్రారంభించింది. హఠాత్తుగా ఎక్కడి నించో చంటి పాప ఏడుపు వినిపించింది

ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ  చూసుకుంది తన్మయి.

అమ్మో, బాబు! బాబుని వదిలేసి తనిక్కడ ..ఇలా రోడ్డు మీద….” ఇక ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా ఇంటి వైపు పరుగెత్తింది.

లోపలికి రాగానే శేఖర్ పక్కన ఆదమరిచి హాయిగా నిద్ర పోతున్న బాబుని అమాంతంగా ఎత్తుకుని భోరున ఏడ్చింది.

పసివాడి తల మీద చెయ్యి పెట్టి, ఇంకెప్పుడూ నిన్నొదిలి ఎక్కడికీ వెళ్లను నాన్నా! నా ప్రాణం పోయినా సరే. నిన్ను మాత్రం వదలను.” అంది.

తన్మయి ఏడుపు వినిపించినట్లు విసుగ్గా ముఖం చిట్లించి, వెనక్కి గోడ వైపు తిరిగి పడుకున్నాడు శేఖర్.

పిల్లాడిని అక్కున చేర్చుకుని  నేల మీద పడి  అలిసిపోయి ఎప్పుడు నిద్రపోయిందో తెలీదు.

ఎండ బాగా ముదిరిన పన్నెండు గంటల వేళ మెలకువ వచ్చే సరికి బాబు పక్కన లేడు. గదిలో మరో మూలకి దొర్లి వేళ్లు నోట్లో పెట్టుకుని జుముక్కుంటూ ఆడుకుంటున్నాడు నిశ్శబ్దంగా.

బోర్లా పడడమే కాదు. వాడికి ముందుకు కదలడమూ వచ్చిందని అర్థమైంది

వాడి అందమైన ముచ్చట్లన్నీ గమనించేటంత మానసిక స్థిమితం ఉంటే బావుణ్ణని అనిపించి మరింత దు:ఖం వచ్చింది తన్మయికి

నన్ను క్షమించు నాన్నా! నీకు ఎన్నో చేయాలనుకుని చేయలేకపోతున్నాను. నా మనస్సేం బాగోలేదు.”   అంది వెక్కుతూబాబు దగ్గిరికి జరిగి వాడి చిన్ని అరచేతిని తన చేతిలోకి తీసుకుంది. ఏదో అర్థమయినట్లు అమ్మ చేతి వేలిని అందుకున్నాడు.

చిన్ని చేతినలాగే పట్టుకుని మౌనంగా రోదించ సాగింది తన్మయి.

శేఖర్ లేవడమూ, వీథి తలుపు ధబాలున వేసి బయటకు వెళ్లిపోవడమూ వింది

అతనికి మనసుతో సంబంధం లేదు. శరీరం, అదీ శరీరమైనా ఒకటేఅనే ఆలోచనే రోత కలిగించసాగింది.

ఇన్నాళ్లూ కాస్తో కూస్తో అతని మీద ఉన్న ప్రేమ భావం కూడా మాయమై అతన్ని చూస్తే కంపరం పుట్టుకు వస్తూంది.

 “ఇక మీదట అతను తనని ముట్టుకోవడానిక్కూడా వీలులేదు.” అని గట్టిగా నిర్ణయించుకున్న తర్వాత మనసుకి ఉపశమనం అనిపించింది

 లేచి తలారా చల్లటి నీళ్లతో స్నానం చేసిందిఏడ్చి ఉబ్బిన కళ్లకి  చల్లటి నీళ్ల స్నానం ఉపశమనం కలిగించింది

కళ్లకి కాటుక పెట్టుకుని, ఎర్ర తిలకం సీసా కాడతో గుండ్రని బొట్టు దిద్దుకుంది.   సింధూరం పాపిట పెట్టుకోబోయి విరక్తి కమ్ముకొచ్చి ఆగిపోయింది

సింధూరం పెట్టుకున్నపుడల్లా పెళ్లి తతంగం గుర్తుకు వస్తుంది.

శేఖర్ సాయంత్రం వస్తూనే బ్యాగు సర్దుకునినాకు అర్జంటుగా రమ్మని ఒరిస్సా నించి పిలుపు వచ్చింది. ఏం చేస్తాం, ఎదవ బతుకు. మిలట్రీ సంసారం అయిపోయింది.” అన్నాడు.

ముభావంగా ఉన్న తన్మయి వైపు చూస్తూనా బతుక్కి ఉద్యోగంలోనూ సంతోషంలేదు, కొంపలోనూ సంతోషం లేదు. నా తలరాత. ఏం చేస్తాను?!” అని నెత్తి కొట్టుకుని,

నీ ఎదవ ఏడుపు మాని, నా కొడుకునైనా జాగ్రత్తగా చూసుకోఅని విసురుగా వెళ్లిపోయాడు.

శేఖర్ వెళ్లేక చీకటి వేళ చంటాడినెత్తుకుని వాకిట్లోకి వచ్చి కూచుంది తన్మయి.

ప్రశాంతంగా గాలి వీస్తూంది బయట

తన్మయికి దు:ఖం ఎక్కడా నిలవనీయడం లేదు.

ఒళ్లో బాబు తో మెల్లగా మాట్లాడ సాగింది

ఎందుకు నాన్నా నేనిలా మోసపోయాను?! నేనేం తక్కువ చేసానని అతనిలా పరాయి స్త్రీలని తెచ్చుకున్నాడు? అప్పుడు నేను నిన్ను కనడానికే కదా వెళ్లింది! తల్చుకోవడానికే జుగుప్స కలుగుతోంది.” 

శేఖర్ గురించి కాకుండా మరేదైనా ఆలోచించాలని మనసుని తప్పించుకునే మార్గం కోసం లోపలి నించి కరుణ ఇచ్చిన పుస్తకం తెచ్చుకుంది

బయట వరండాలోకి మంచి వెలుతురు వచ్చే బల్బు కొని తేవాలి రా నాన్నా, నువ్వు ఆడుకుందుకూ, నేను చదువుకుందుకూఅంది.

చాప మీద మెత్తటి దుప్పటి పరిచి బాబుని పడుకో బెట్టి పక్కనే కూచుని పుస్తకం తెరిచింది.

పద్య కావ్యమది. పద్యాలలో కొన్ని పదాలకు అర్థాలు తెలియడం లేదు. అయినా పద్యం చదువుతూంటే శబ్ద సౌందర్యానికి మనసుకి ఎంతో ఊరట కలగ సాగింది

పదాల వ్యుత్పత్తి ఎలా తెలుసు కోవాలి? కరుణ కనబడ్డప్పుడు అడగాలిఅనుకుంది.

చదువుతూ చదువుతూ ఉండగానే మనసులో దు:ఖమంతా క్రమంగా మాయమై గుండె తేలికపడింది కాస్సేపటిలోనే.

అజ్ఞాత మిత్రమా! నువ్వు ఇపుడు పుస్తక రూపం దాల్చావన్న మాట.” అనుకోకుండా తన్మయి ముఖమ్మీద చిన్న ప్రశాంతత వెలిసింది.

పుస్తకం లోకి, తన వైపే చూస్తున్న బాబు కళ్ళల్లోకి మార్చి మార్చి  చూస్తూ  “మిత్రమా! అనుక్షణం ఓడిపోతున్న జీవితంలో నువ్వే లేకపోతే నేనేమైపోయేదాన్ని!” అంది

***

ఉదయానే పాల పేకెట్టు కోసం బయటికి వచ్చింది తన్మయి. గేటుకి వేళ్లాడ దీసిన రెండు సంచీల్లో చిన్న సంచీలో చేయి పెట్టి తమ పేకెట్టు తీసుకుని లోపలికి వచ్చింది.

ఇంటికి వచ్చిన దగ్గర్నించి అరలీటరు పాల పేకెట్టు ఇంటివాళ్లకి వేసే సప్లయిరు దగ్గిర తీసుకుంటున్నారు

ఇంటి వాళ్లు తన్మయితో పరిచయంగా ఉండరు. ఇంటాయన పెద్దింటి వాకిట్లో శేఖర్తో అప్పుడప్పుడూ మాట్లాడతాడు

ఇంటావిడ తన్మయిని చూసి పలకరింపుగా నవ్వుతుందే కానీ ఏమీ మాట్లాడదు. ఇంటికి వచ్చి పోయే వాళ్ల స్నేహితులతో గేటు దగ్గిర వరకూ వచ్చి బానే మాట్లాడుతుంది.  

ఆవిడ ఆస్థిపరురాలు కాబట్టి తనతో ఇలా అంతరం పాటిస్తుందనుకుంటా”  అనుకుంది తన్మయి లోపలికి వెళ్తూ

ఎప్పుడూ ఔట్ హౌస్ వైపు ఎవరూ రారు. తన్మయికీ అలా ఉండడమే ఇష్టం

ప్రశాంతంగా ఉన్న ఇంట్లో శేఖర్ ఊళ్లో లేనపుడు తన్మయికి రోజంతా ఎటువంటి దిగులూ లేకుండా గడుస్తుంది

రోజు మధ్యాహ్నం తలుపు తట్టిన శబ్దమయ్యింది.

తన్మయి  ఆశ్చర్యంగా  తలుపు తీసింది.

ఇంటిగలాయన పలకరింపుగా నవ్వుతూఇంట్లో మీటర్ చెక్ చేయడానికిఅన్నాడు. అతన్ని ఇంత దగ్గిరగా చూడడం ఇదే మొదటి సారి. యాభై ఏళ్ళుంటాయనడానికి  సాక్షిగా పెద్ద బొజ్జ, బట్ట తల, తెల్ల బనీను, గళ్ళ లుంగీ, హవాయి చెప్పులు. ఎందుకో అతన్ని చూడగానే తన్మయికి మంచి అభిప్రాయం కలగలేదు.

అతనికి దారిచ్చి, బాబునెత్తుకుని తన్మయి బయటికి గేటు వైపుకి వచ్చి నిలబడింది.

అయిదు నిమిషాల్లో వెళ్తూశేఖర్ చాలా మంచి పనిమంతుడు. అతనికి కంపెనీలో  చాలా మంచి పేరుందినాకూ మంచి స్నేహితుడు. అందుకే అద్దె గురించి చూసుకోకుండా మీకు ఇల్లిచ్చేం. నీకేం అవసరం పడినా అడగడానికి మొహమాట పడకు. మా మేడం కి ఇంట్లో సాయం అవసరం. నీకేవైనా వీలవుతుందాఅన్నాడు.

తన్మయి కొంచెం తటపటాయించినేను యూనివర్శిటీలో ఎమ్మే లో జాయినయ్యానండి. ఖాళీ ఉన్నపుడు తప్పక సాయం చేస్తాను.” అంది.

అతను కనుబొమ్మలు ముడిచినువ్వు చదువుకున్న అమ్మాయివని శేఖర్ ఎప్పుడూ చెప్పనే లేదు. సారీఅని 

అప్పుడే వీథి గేటు తీసుకుని వస్తూన్న వాళ్లావిడ వైపు నడిచేడు.

ఆవిడ అతన్నీ, తననీ మార్చి మార్చి చూడడం తన్మయికి ఆశ్చర్యంగా అనిపించింది. ఆవిడ ముఖమ్మీద ఎప్పుడూ తనని చూడగానే  కనబడే చిన్న చిర్నవ్వు స్థానంలో ఒక విధమైన చికాకు చోటు చేసుకోవడం గమనించింది తన్మయి.

వెనకే వచ్చి ఇంటాయనని అడ్రసు అడుగుతూన్న కరుణని చూసి ఇంకాస్త ఆశ్చర్యపోయింది తన్మయి

ఇక్కడే  ఉన్నారా, ఇదిగో మీకీ పుస్తకం ఇచ్చి వెళదామని వచ్చేను. ఎంత గొప్పగా ఉన్నాయో పద్యాలుఅంటున్న అతన్ని చూస్తూ పక్క నించి వెళ్తూన్న ఇంటావిడ ముఖంలో చికాకు మరింత పెరగడాన్ని గమనించింది తన్మయి.

థాంక్సండీ, మీరిది వరకు ఇచ్చిన పుస్తకం నిన్నే చదివేను. తెస్తానుండండిఅని లోపలికి వచ్చింది తన్మయి. కరుణ వరండా వరకూ వచ్చి బయట నిలబడ్డాడు.

మీ అబ్బాయి భలే ముద్దొస్తున్నాడండీ, వీణ్ణి చూస్తే  భాగవతంలో చిన్ని కృష్ణుణ్ణి ఉద్దేశించిన పద్యాలు జ్ఞాపకం వస్తున్నాయి.” అన్నాడు.

తన్మయి పుస్తకంతో బాటూ తెచ్చిన గ్లాసు నీళ్లు అందుకుని తాగి, “హమ్మయ్య, బతికించేరండీ నీళ్లిచ్చిఅని

మీకు ఇంత చంటి పిల్లాణ్ణి పెట్టుకుని ఇలా చదవాలన్న ఉత్సాహం ఎక్కణ్ణించి వస్తోందా అనుకున్నాను. మీ ఇంటినల్లుకున్న తీగెలు, పొదలు, లతల నించన్నమాట….అన్నట్లు పదాలకు వ్యుత్పత్తి గురించి అడిగేరు కదా, అమర కోశం కంఠతా పట్టడమే. అలా కంగారు పడకండి నేనున్నానుగా.” అన్నాడు.

చలాకీగా మాట్లాడుతూన్న అతన్ని చూస్తూ  “గొప్ప జ్ఞానంతో తొణికిసలాడే ముఖ వర్చస్సు ఇతనిదిఅనుకుంది తన్మయి.

వచ్చే సోమవారం నించి క్లాసులు. మర్చిపోకండి.” అన్నాడు వెళ్తూ

***

ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కాలేజీ మొదటి రోజు రానే వచ్చింది.

బాబుని ఎత్తుకుని యూనివర్శిటీ ప్రాంగణం లోకి అడుగు పెట్టింది తన్మయి.

బాబుని క్లాసు రూములోకి రానిస్తారో లేదో తెలియదు. అయినా మరో దారి లేదు తనకు. మొదటి క్లాసు లోకి అడుగు పెట్టింది

అప్పటికే క్లాసు లో ఉన్న లేడీ ప్రొఫెసరుఏమ్మా, ఎమ్మే నీకా, మీ అబ్బాయికాఅంది.

అందరూ పకాలున నవ్వేరు.” 

ఇవేళ్టికే మేడం. రేపట్నించి….” అంది తన్మయి.

అందే గానీ రేపట్నించి ఏంచెయ్యాలో తెలియదు తనకి.

బాబు సరిగ్గా అయిదు నిమిషాల్లో ఏడుపు మొదలు పెట్టేడు. తన్మయి బ్యాగు తీసుకుని డిపార్టుమెంటు బయట చెట్టు కింద బెంచీ మీద కూలబడింది.

అప్పటి దాకా ఏడ్చిన వాడు బయటికి రాగానే నిశ్శబ్దంగా నవ్వేడు అమ్మని చూసి.

ఒళ్లో పడుకో బెట్టుకుని పాల సీసా బయటికి తీస్తూనువ్విలా పేచీ పెడితే అమ్మ ఎలా చదువుకుంటుందిరా?” అంది.

ఊంగాఅంటూ కేరింతలు కొట్టేడు.

నిజమే నీతో ఆడడమే ముఖ్యం. కానీ అమ్మ చదువుకోవాలి నాన్నా, అమ్మ తన కాళ్లమీద తను నిలబడాలి. చిన్నపట్నించీ కలలు గన్న పీ.ఎహ్.డీ చెయ్యాలి.” అంది వాడి కళ్లల్లోకి చూస్తూ.

చుట్టూ ఉన్న  యూకలిప్టస్  చెట్ల నించి ఆకులు రాలి చుట్టూ అంతా తుక్కుతుక్కుగా ఉంది. చెట్ల కింద బల్లల  మీద కాస్త ఎండా, కాస్త నీడా దోబూచులాడుతున్నాయి.

బాబు తల మీద కొంగు కప్పి సంచీ లోంచి కర్చీఫ్ తీసి వాడికి విసురుతూ కూచుంది.

ఇదేవిటి, ఇక్కడ కూచున్నారు?” కరుణ మాటలకి పలకరింపుగా నవ్వింది

నవ్వులో నీరసం కనిపెట్టినట్లు  “అయినా క్లాసుల్లో ఏవీ చెప్పేది లేదు ఇవేళ. మొదటి రోజు కదా, ఊరికే పరిచయాలు మాత్రమే.” అంటూ అటుగా వస్తున్న ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల్ని పిలిచి పరిచయం చేసేడు.

అమ్మాయి అనంత, ఇతను రాజు, ఇతను దివాకర్అంటూ.

అనంత పరిచయంగా దగ్గిరికి వచ్చిఅబ్బా, ఎంత ముద్దుగా ఉన్నాడో చంటోడుఅని చేతుల్లోకి తీసుకుంది. బాబు కేరింతల్తో పరిచయంగా మీదికి దుమికే సరికిఅమ్మో, ఎంత బంగారు కన్నయ్యోఅంటూనాకు పిల్లలంటే భలే ఇష్టమండీఅంది ఓరగా రాజు వైపు చూస్తూ.

అతను ముసి ముసిగా నవ్వడం చూసి, “వీళ్లిద్దరూ చిరకాల ప్రేమికులు. ఎమ్మేలు, పీహెచ్ డీ లు   చేస్తారు గానీ పెళ్లి మాత్రం చేసుకోరుఅన్నాడు కరుణ.

ఓయ్అని అతని భుజమ్మీద ఒకటిచ్చింది అనంత.

వాళ్లని చూసి తన్మయికి భలే సంతోషంగా అనిపించింది. ఇలా అందరితో కలిసి హాయిగా చదువుకునే అవకాశం తనకి ఉంటే ఎంత బావుణ్ణు అనుకుంది.

త్వరపడి చదువు పూర్తవకుండా పెళ్లి మాత్రం చేసుకోకండి.” అంది తన్మయి.

అప్పటి వరకూ నిశ్శబ్దంగా ఉన్న దివాకర్నేను వి..వీళ్లను చూసే ..ఆజన్మాంత బ్రహ్మచారిగా ఉండిపోవాలని చిచిన్నప్పుడే శ్శ..పథం చేసుకున్నాఅన్నాడు నత్తితో పలకలేక పాట్లు పడ్తూ.

అంతా పక్కున నవ్వేరు.

కరుణ లేస్తూరండి, అన్ని క్లాసు రూములూ చూసొద్దాంఅన్నాడు.

బాబుతో….” అని సంశయిస్తున్న తన్మయి తోఅయ్యో ఇంత బంగారమంటి పిల్లోణ్ణి రావొద్దనే వాళ్లెవ్వరు? చూద్దాం పడండిఅంది అనంత వాణ్ణి తన్మయి భుజమ్మీంచి ముద్దాడుతూ. నలుగురితో కలిసి డిపార్టు మెంటు అంతా కలయదిరగడం తన్మయికి ఎంతో హుషారు నిచ్చింది.

తన చేతిలో బాబుని ప్రొఫెసర్లంతా సహృదయంతో పలకరించడం ఇంకాస్త హుషారునిచ్చింది.

చెట్ల మధ్య నించి కాస్త దూరం నడిచి కేంటీను వరకూ వచ్చేరు. టీ తాగుతూ, ఎదురుగా ఉన్న పెద్ద బిల్డింగుని చూపించిఇదే మన యూనివర్శీటీ లైబ్రరీఅన్నాడు కరుణ.

తన్మయి తన కళ్లని తనే నమ్మలేక పోయింది. “ఇంత పెద్ద భవనం లైబ్రరీయా? అని నోరు తెరిచింది.

తన్మయి ముఖంలో కనిపిస్తూన్న ఆశ్చర్యం, ఆనందం చూసి, “బయటి నించి ఏం చూసేరు? లోపల ఎంత గొప్పగా ఉందో తెలుసా?” అన్నాడు కరుణ.

వెళ్దామా?” అంది హుషారుగా తన్మయి.

అబ్బా, మీరూ పుస్తకాల పురుగేనన్న మాటఅంది అనంత నవ్వుతూ.

లోపల రెండస్థులలో ఉన్న అత్యంత విశాలమైన లైబ్రరీని, పుస్తకాల్ని చూసిఆహా! నా జీవితం ధన్య మైపోయిందిఅంది అప్రయత్నంగా తన్మయి.

కరుణ ప్రశంసా పూర్వకంగా చూసిసరిగ్గా నేనూ ఇలాగే అనుకున్నాను తెలుసా లైబ్రరీని మొదటగా చూసినప్పుడుఅన్నాడు.

 రేక్ మధ్యలో తిరుగుతూంటే అవధి లేని ఆనందం కలగసాగింది తన్మయికి.

లైబ్రరీ కార్డుకి అప్లికేషను పెడ్తూంటే ఎంతో గర్వంగా అనిపించసాగింది

యూనివర్శీటీలో తనిప్పుడు నిజంగానే చదువుకుంటూంది! నిజంగానే!!” 

అమ్మ యూనివర్శిటీ లో నిజంగా చదువుకుంటూంది. నచ్చిందా నాన్నా నీకు? నువ్వెప్పుడు యూనివర్శీటీకి వెళ్తావు మరి?” అంది తిరిగి వస్తూ  బస్సులో బాబుతో.

***

శేఖర్ ఊర్నించి వస్తూనేఇంకా కోపం పోలేదా?” అన్నాడు నీరసంగా, ముభావంగా ఉన్న తన్మయితో.

నిశ్శబ్దంగా అన్నం వడ్డించింది.

సాయంత్రం సినిమా కు వెళ్దాంఅన్నాడు మాట మారుస్తూ.

శేఖర్కు  వచ్చిన ప్రతీ సినిమా చూసే అలవాటు ఉంది.

తన్మయికి ఫైట్సు, అర్థం పర్థం లేని గందరగోళం సినిమాలు నచ్చవు. మంచి సాహిత్యం, సంగీతం లేని పాటలు కూడా నచ్చవు.

ఇంట్లో అసహనంగా ఉంది. కనీసం సినిమాకు వెళ్తేనైనా తగ్గుతుందనిపించింది. అతని వెంట మౌనంగా బయలుదేరింది.

సినిమా నించి వచ్చేటపుడు అర్థమైంది ఇంట్లో ఉండడమే మంచిదని. అంత చెత్త సినిమా అది.

శేఖర్  రెండర్థాల డైలాగులకి పగలబడి నవ్వుకుంటూ సినిమా చూసేడు.

ఒళ్లో కూచున్న బాబు తనని చూసి నవ్వుతున్నాడనుకుని కిలకిలా నవ్వసాగేడు.

తన్మయికి బాగా తలపోటు వచ్చేయడం ప్రారంభించింది.

పడుకునే వేళకి తన్మయి విడిగా పక్క వేసుకోవడం గమనించిఏం? మంచం పైన పడుకోవా?” అన్నాడు

మారు మాట్లాడకుండా గోడ వైపు తిరిగి పడుకుంది.

ఏంటి చిన్న విషయానికి ఇంత గోల చేస్తున్నావు? నువ్వేమైనా భూలోక రంభవా నువ్వంటే వెంపర్లాడడానికి?” అన్నాడు విసుగ్గా.

నేను భూలోక రంభని కాదన్న విషయం పెళ్లికి ముందు తెలీదా?” అంది చివుక్కున తిరిగి.

ఒంటి మీద కేజీ కండ లేకపోయినా, అందగత్తెవి కాకపోయినా మొగుడేం చేసినా పడుంటావని చేసుకున్నాను. అయినా పెళ్లికి ముందు నువ్వు ఒళ్లు చూపించేవా, నువ్వు రంభవో, కాదో తెలియడానికి?” అన్నాడు పచ్చిగా.

అతని మాటలకి తన్మయికి తన మీద తనకే అసహ్యం వేసింది.

ఛీ.. మనిషివేనా?” అని గట్టిగా అరిచింది.   “అతను చేసే తప్పులన్నిటికీ తనని బాధ్యురాలిని చెయ్యడానికి చూస్తున్నాడు. కాస్త కూడా పశ్చాత్తాపం లేదు మనిషికి. ఛీ. ఛీ

బాబు బాగా గాఢంగా నిద్రపోతున్నాడు.

తన్మయి కి ఇక ఆపుకోలేని దు:ఖం ముంచుకొచ్చింది. వెనక్కి తిరిగి ఏడుస్తున్న తన్మయిని అమాంతం ఎత్తి మంచమ్మీద పడేసేడు.

గింజుకున్నా వీలు లేని బలిష్టమైన కౌగిలిలో అసహాయంగా కళ్లు మూసుకుంది.

వెర్రి మొర్రి వేషాలు వేసేవనుకో…” అని పెదవుల్ని గట్టిగా కొరికేడు.

కళ్లల్లోంచి ధారాపాతంగా కారుతున్న కన్నీళ్ల శరీరమ్మీద పడి కోరిక తీర్చుకున్నాడు.

ఓడిపోయిన బాధతో కుమిలి పోతున్న తన్మయికిభూమి పగిలి అంతా అక్కడే సమాధి అయిపోతే బావుణ్ణుఅనిపించింది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.