ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-4

ఆచార్య కొలకలూరి ఇనాక్

-డా.సిహెచ్.సుశీల

          ఆచార్య ఇనాక్ గారు ఈతరం సాహిత్యవేత్తలలో  కొన్ని ప్రముఖమైన వాదాలను వేదాలు గా మార్చాలని కలలు కంటున్న స్వాప్నికుడు. ఆయన వినిపించిన కొన్ని నివేదనలు – నివేదనలు గాక, పరివేదనలుగా సంఘంలో వెలుగుచూస్తున్నాయి. దళిత వాదానికి వకాల్తా పుచ్చుకున్న ప్రముఖుల్లో ప్రముఖునిగా, స్త్రీవాదాన్ని ముట్టీ ముట్టనట్లు ముట్టుకొని, అనాచారాల అరాచకాలని మక్కెలు విరగొట్టడం ఆయనకే చెల్లింది.  పీడిత ప్రజల పక్షం వహించి పెద్దల, అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడం, వారి కర్తవ్యాన్ని వారికి గుర్తు చేయటం ఆయనకే నప్పింది.

       ప్రతి కథలో ఏదో ఒక సందేశం, ప్రతి పాత్రలో ఏదో ఒక సమస్య – దాని పరిష్కారం, ప్రతి కదలికలో సమాజం వేయవలసిన అడుగు – పరుగులు తీయదు… పరుగులు తీయిస్తుంది. మన ఆలోచనలకు పదును పెడుతుంది. అలా స్త్రీవాద భావాలతో నడిపించిన కథానికలు ఎన్నో ఉన్నాయి. అయితే స్థాలీపులాకం గా 2 ,3 కథలు ప్రస్తావించుకుందాం.

   *రమ నా కూతురు* 

  రమ నా కూతురు అని – ఆ పిల్ల పుట్టినపుడు తల్లో తండ్రో అనవలసిన, గర్వంగా తలెత్తుకో వలసిన ఘడియ అది.  కానీ కథానిక కాలం నాటికి రమకి  50 ఏళ్లు. ఆమెను కన్నతల్లికి సుమారు 70 ఏళ్ళు. ఆమె తల్లి పేరు  రస రాజ్యం. రసరాజ్యం చెబుతున్న రమ తండ్రి పేరు రంగారావు. అతనికి 70 ఏళ్లు పైనే. రస రాజ్యం కులం మాదిగ. రంగారావు కులం క్షత్రియ. రసరాజ్యం కూతురైన రమ విద్యావంతురాలు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లెక్చరర్ అయింది. ప్రొఫెసర్ అయింది. అధ్యాపన అనుభవంతో మేధావిగా ఎదిగింది. దశదిశలా ఆమె రాజ్యాంగ విజ్ఞత గుర్తింపు పొందింది. కొద్దో గొప్పో ఉన్న కుటుంబం కాబట్టి ఏ స్కాలర్షిప్ లేకుండానే చదివింది. సొంత ప్రతిభతోనే ఉద్యోగం పొందింది. ఏ రిజర్వేషన్ ఆశించలేదు. కానీ ఒకానొక రాజకీయ పక్షం ఒత్తిడికి లొంగి రిజర్వుడు కేటగిరీలో ఎలక్షన్ లో నిలబడి ఎం.పీగా గెలిచింది. ఓడిపోయిన సమీప అభ్యర్థి ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని సవాలు చేశాడు. కింది కోర్టు పై కోర్టు. వాదప్రతివాదాలు. చివరికి స్కూల్ రికార్డు ప్రకారం ఆమె తండ్రి క్షత్రియుడైన రంగారావు అని తేలింది.

    సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే రంగారావు ఈ విషయాన్ని వార్త మాధ్యమాల ద్వారా విని కోర్టుకెళ్లి కౌంటర్ కేసు వేయించి, తన నిజాయితీని ‘రమ నా కూతురు కాదు’ అని ఘంటాపధంగా నొక్కి చెప్పాడు – తన ఆభిజాత్యాన్ని కాపాడుకోవాలి, అందుకే ఆ ప్రయత్నం. ఇనాక్ గారు ‘రమ నా కూతురు కాదు’ అనే వాక్యం తోనే ‘రమ నా కూతురు’ అనే కథానిక ను ప్రారంభించడం ఆయనకే చెల్లింది. పాఠకునిలో ఉత్సుకత పెరగడానికి ఈ ఒక్క ప్రారంభం చాలు. ప్రశ్నలు పుట్టగొడుగుల్లా పుడుతూ, ఆలోచనల్ని తీవ్రతరం చేస్తాయి. స్త్రీవాదం తో పాటు, కులం – దాని ఆభిజాత్యం, సమాజం లోని రుగ్మత  తెలియచేసే అద్భుతమైన కథ యొక్క ప్రారంభం ఇది.

      ” కళ్ళు కానని అంధ యుగంలో దిక్కుమాలిన పెళ్లి పేరంటం లేని పిచ్చి సన్నాసులు బీజ ప్రాధాన్యం చెప్పినంత మాత్రాన క్షేత్ర ప్రాధాన్యం గాలికి కొట్టుకు పోతుందా? కాలం మారిందని, సమాజం మారిందని గుర్తించే మీరు ఒకనాడు ఎప్పుడో, ఎవరికో, ఎందుకో ఉద్దేశించిన ‘తండ్రి’ ముఖ్యమనే ముక్క నేడు పట్టుకొని వేలాడుతున్నారే. మీకేమైనా సాంఘిక న్యాయం 

తెలుసా! మానవ ప్రాధాన్యం తెలుసా!”  కట్టలు తెంచుకున్న 

ఉద్రేకంతో ఎదురు దాడి చేసింది రమ.

    ఇంకా ఆమె నొక్కి చెప్ప దలుచుకున్న ముఖ్యమైన విషయం “నేను నా తల్లి కూతుర్ని. న్యాయానికి, ధర్మానికి, 

రాజ్యాంగానికి, వారసత్వ చట్టాలకు, హిందూ ధర్మశాస్త్రాలకు, అత్యుత్తమ అత్యున్నత న్యాయస్థానానికి ముఖ్యం ఏమంటే ‘నేను నా తల్లి కూతుర్ని అని అంగీకరించటం’.” ఇంకా ఆమె ఇలా ప్రతిపాదిస్తుంది…..

      “ప్రస్తుత చట్టం మారాలి. శాసనం మారాలి. న్యాయస్థానం మార్పును ప్రతిపాదించాలి. దేశం దాన్ని శాసనం చేయాలి. అది అమలు కావాలి. ఇంత పెద్ద న్యాయస్థానం, న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఆలోచనా పరులు, సమాజం అంతా కలిసి మారిన సమాజానికి అవసరమైన ధర్మ సూత్రాలు ప్రతిపాదించాలి. లేకపోతే ఇంత పెద్ద న్యాయవ్యవస్థ దుర్గతి పొందినట్లే. పతన మయినట్లే. పాడయినట్లే.’ న్యాయస్థానంలో రమ పోరాటంలో, వాదనలో ఇనాక్ గారు పరకాయ ప్రవేశం చేశారు. 

    రమ గుండె అర్థ్రమైంది. “మా అమ్మను నేను హింసించలేను. నన్ను కన్నందుకు శిక్షించ లేను. పోషించినందుకు సాధించలేను. దేవతను దెయ్యం చేయలేను. స్వర్గం-నరకం గా మార్చలేను. నా తండ్రిని నేను వెదకలేను.  నాకు అది అసాధ్యం.  రమకు తనను

 కన్న తల్లి పై గౌరవం, అనురాగం కొలువలేనిది. ఆమె తల్లి దేవత. ఆమె ఉన్న ఇల్లు స్వర్గం.

         రసరాజ్యం కోర్టులో ప్రవేశపెట్టబడింది. ‘నాటికీ నేటికీ ఏనాటికీ రంగారావే నా భర్త’ అని చెప్పింది. రమ ఎవరంటే ‘రమ నా కూతురు’ అని చెప్పింది.  ఎన్ని సార్లు అడిగినా ఆమెలో మార్పు లేదు. మొదట చెప్పిన దాన్నే గట్టిగా, మనస్ఫూర్తిగా చెప్పింది.

   రమ కన్ను ముక్కు తీరు పూర్తిగా రంగారావును పోలి ఉంటుంది. ఆకారం, అవయవ నిర్మాణం, తలకట్టు, పోలిక, రంగు, రూపం, అచ్చుగుద్దినట్టు ఇద్దర్ని ఒక చోట చూస్తే ఎవరైనా వాళ్లను తండ్రి కూతురు అనుకుంటారు. కాదంటే ఎవ్వరూ నమ్మరు. న్యాయ మూర్తులు కూడా నమ్మే స్థితిలో ఉండరు. రమ లో నిక్షిప్తమైన రంగారావు బాహ్య లక్షణాలు కళ్ళకు ప్రత్యక్ష సాక్ష్యాలు.(నాటి వరూధిని, నేటి గైనకాలజీ, సైకాలజీ ప్రకారం కూడ). పైగా రమ స్కూల్ రికార్డు లో తండ్రి పేరు రంగారావు అని ఉండటం బట్టి రమ క్షత్రియు రాలే. కానీ రంగారావు రంగంలోకి ప్రవేశించి ‘రమ నా కూతురు కాదు’  అనే సరికి కథ మొత్తం అడ్డం తిరిగింది.

         రంగారావుకు వేరే పెళ్లి అయింది. అందుకే తనకు సంబంధం లేని కేసులో అభాసుపాలు అవ్వటం ఇష్టంలేక కోర్టుకెక్కాడు. ఆయన ప్లీడర్ “రంగారావు రమ తండ్రి కాదు” అని తీర్పు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరాడు. అతని పరువు ప్రతిష్టలను కాపాడండి అని, క్షత్రియులు ఆభిజాత్యానికి మచ్చరానీయకుండా వాదించాడు. దీనికి ఆధునిక పరిశీలనలో డి.యన్.ఏ. సరైన సమాధానం అన్నాడు. కోర్టు పరిధిలో అది జరిగింది. రమ రంగారావు కూతురు కాదని టెస్ట్ నిర్ధారించింది.

     రసరాజ్యం రంగారావు నా భర్త అంటుంది. రమ నా కూతురు అంటుంది. కానీ రమ తండ్రి రంగారావు అనటం లేదు – ఇది రంగారావు న్యాయవాది వాదన.

     తెలిసీ తెలియని వయసులో రసరాజ్యం రంగారావు ప్రేమలో పడింది. “రసం” అని ముద్దుగా పిలిచి, “శృంగార రసాధి దేవతా” అని  పిలిచే రంగారావు ప్రేమ రాజ్యానికి ఆమెను రాణి చేశాడు. కవ్వించాడు. ఆమె గుండె బంతిలా ఎగిరెగిరి పల్లంలోకి పోసాగింది. ఆ మాయలో పడి మనిషి కాలేక పోయింది. అతని కోసం ప్రేమ, ఆరాధన, ఆరాటం. కానీ రాజ్యాన్ని ప్రేమ లో అంత వరకు తెచ్చిన రంగారావు తండ్రి ప్రోద్బలంతో కుల ఆభిజాత్యంతో చదువు పేరున ఆమె నుండి పారిపోయాడు. అతని కోసం, ప్రేమ కోసం, క్రుంగి పోయి, వెర్రి చూపులు, మాటలు, చేష్టలు ఎక్కువై పిచ్చిదానిలా మారి పోయింది. 

     అదుపు తప్పే వయస్సు. పిచ్చి ప్రేమ. ఆ పిచ్చి లో బయలుదేరింది. సౌందర్యవతి. ఒంటినిండా నగలు. తలదాచుకునే చోటులేని ఒంటరి స్త్రీ. భర్త కావలసిన ‘రంగారావు’ కోసం ఆరాటపడుతున్న అసహాయురాలు. ఆమెతో ఎవరో స్నేహం చేశారు‌. ఆశలు చూపారు. ఆ “ఎవరో” ఎవరికీ తెలీదు. సొమ్ము దోచుకున్నారు. ఇంకా ఏం దోచుకోగలరో అంతా దోపిడీ జరిగింది. కానీ ఆమె మనసులో ఉన్నది ‘రంగారావే’. ఆమెను దోపిడి చేస్తున్నది రంగారావే అనుకుంది. ఆమె పాడు చేసింది  రంగారావే అనుకొన్నది, అంటూనే ఉంది. “మనం పెళ్లి చేసుకుందాం రంగా. నేను నీ దాన్ని రంగా. నా ఆస్తి నీది రంగా. నా మనసు నీది. నా శరీరం నీది. నా హృదయం నీది. నా సర్వస్వం నీది”.. అంటూనే ఉంది. ఆమె మనసంతా “రంగారావే”. ఆమె స్వాధీనం తప్పింది. ఆ పరాధీన స్థితిలోనే నెల తప్పింది. అందుకే రమకు రంగారావు పోలికలు అచ్చు గుద్దినట్లు వచ్చాయి. అది డి.యన్. ఏ. కు తెలియకపోవచ్చు కానీ సైకాలజీలో ఒక అద్భుత ప్రయోగం.

          స్త్రీకి జరుగుతున్న అన్యాయాల్లో ఈ ఆభిజాత్యం ఒక విషసర్పం. దాని కాటుకు బలైన రాజ్యం పిచ్చి అయింది. ఆమె ప్రేమ కు కేంద్ర బిందువైన రంగారావు బాగానే ఉన్నాడు. తన తండ్రి మాటను బట్టి కులాభిజాత్యాన్ని కాపాడుకున్నాడు. పెళ్లి బాగా చేసుకున్నాడు. చివరకు రమ నా కూతురు కాదని కోర్టుకెక్కాడు.  డీఎన్ఏ టెస్ట్ లో తన ఆభిజాత్యాన్ని కాపాడుకున్నాడు.

        ఇనాక్ గారు ఈ కథానిక లో   ప్రతిపాదించినది – పురుషాధిక్య ప్రపంచంలో పురుషులకున్న ప్రాతి నిధ్యం, గౌరవం స్త్రీలకు కూడా సమానంగా ఉండాలి, అందుకు కావలసిన చట్టాలు శాసన రూపంలో రావాలి, చట్టసభల్లో ఇది ప్రతిపాదించబడిన రాజ్యాంగ సవరణ రూపంలో రావాలి. స్త్రీలకు సాధికారత, సమానత్వం సాధించబడాలి.

     *బర్త్ సర్టిఫికేట్*

    ఇనాక్ గారి బర్త్ సర్టిఫికెట్ కథానిక తనతో పాటు పాఠకుల్ని నడిపిస్తూ ఆయన చెప్పినదానికి ఒప్పుకున్నట్లు పాత్రల్లో లీనం చేసేస్తుంది.

  అది కాన్పుల గది. ఈ లోకానికి కొత్త లోకం అనుగ్రహించే వింత లోకం‌. ఏడుపులు పెడబొబ్బలు తో నిండిపోయి ఉంది. పుట్టిన పిల్లలగోల, పిల్లలుపుట్టబోయే తల్లుల గోల, వీళ్ళు కోసం వెంట వచ్చిన వాళ్ళు గోల,   డాక్టర్లు వస్తూపోతూ .. అంతా వింత లోకం.

    కథానిక లోని అంశం చిన్నదే. కానీ సందేశం చాలా పెద్దది.

     రమణి ఒక కాలేజీలో లెక్చరర్. స్వతంత్ర జీవనం ఆమె పీల్చుకునే శ్వాస. అవమానాల మెలికల్ని   మెళకువగా తొలగించుకోవటం ఆమె చిరునవ్వు కు తెలుసు. సులువుగా సులభంగా బయట పడటం ఆమె సహనానికి తెలుసు. ఆమెకు ఇది రెండో కానుపు. అక్కడ చేరిన అమ్మలక్కల ఉబుసుపోక కబుర్లు, మధ్య మధ్యలో పక్కవారి గురించి ఆరాలు. రమణి అక్కడికి కనడానికి వచ్చింది, తన కొడుకు బుడతడి తో , ఇంట్లో తనకు సహాయం చేసే అర్భకురాలైన ఒక ఆడపిల్ల తో. ఆమె వెంట ఇంక ఎవరూ రాలేదు‌. అందరిలా ఆమె హడావుడి చేయడం లేదు. కనీసం నొప్పిని కూడా కనబడనీయటం లేదు. అంతే. అక్కడి ఆడవాళ్లకు అనుమానం రానే వచ్చింది. ఆ అనుమానాన్ని నివృత్తి చేసు కోవడానికి వాళ్ళు పడే అవస్థ, ఆరాటం, ఆ ఆరాటంతో వాళ్ళు తీసే ఆరాలు, ఆ మాటల ఘాటుని…. పొదుపైన అక్షరాల్లో పొందికైన భావాల్లో విశ్లేషించిన విధానం మరింత ఉత్కంఠని కలుగ జేస్తాయి. అసలు- రాబోయే, చెప్పబోయే సమస్యను పరిచయం చేయడానికి ఇంత ఆర్భాటం కథనంలో అవసరమే. ఇది ఇనాక్  గారి శైలి, స్టైల్.

     పాఠకుల ఆసక్తిని జారి పోనీకుండా రమణి హాస్పిటల్ కి వచ్చి మెటర్నిటీ వార్డులో చేరినప్పటి నుంచి కథనం గుంభనంగా నడిపించారు. ఎవరైనా నొప్పులతో ప్రసవానికి వస్తే ఏడవకుండా పెడబొబ్బలు పెట్టకుండా ఉంటారా ? కానీ నొప్పులు ఎక్కువైనా రమణి ఏడవలేదు. అరవలేదు.  ఇది సహజంగా జరిగే పని కాదు. “ఆ మనిషిది ఏం గుండె” అని కొందరు ఆలోచిస్తున్నారు. ఆశ్చర్యపోతు న్నారు. “సులువైన కాన్పు కాబోలు” అని వాళ్లకు వాళ్లే సర్ది చెప్పు కుంటున్నారు. మరికొందరు “మగముండా కొడుకు ఏమయ్యాడు” అని నోళ్ళు నొక్కుకుంటున్నారు. రమణి ప్రసవం లో ఏడవలేదు. తన బిడ్డ పసి గొంతు ఏడుపు ‘ఉషోదయపు కేకలా’ వినిపించింది అంతే.

    మళ్ళీ అనుమానం. ఆశ్చర్యం. రమణి అరవ లేదేం! కనీసం మూలగ లేదేం!  ఆమె బ్రతికే ఉందా! అంతలో నర్సులు స్ట్రెచర్ తీసుకువచ్చారు. రమణి కళ్ళు తెరిచే ఉంది. కొడుకును ముద్దాడింది. పసిపాప తల నిమిరింది. పువ్వులా నవ్వుతూ ఉంది. అలుపెరుగని సైనికురాలిలా ఉంది.

    ఇలా చిన్న చిన్న వాక్యాల్లో రమణి మనసును, ఆమె మనోధైర్యాన్ని, ఆమె ఆలోచనా సరళిని, ఆమె సుదృఢ చిత్తాన్ని, ఆమె సంకల్ప బలాన్ని ఇనాక్ స్పష్ట పరిచారు. ఆమె వ్యక్తిత్వానికి మానసిక శక్తికి ఇంధనంగా చూపారు. ఆమె సంకల్ప బలానికి అనల్పమైన పునాది వేశారు.

 “అమ్మ నాన్న రారా” వారి ప్రశ్న.

  “రారు” రమణి జవాబు.

“అత్తా మామలు?” వారి ప్రశ్న.

“రారు” రమణి జవాబు.

“మరి భర్త రావాలి కదా” వారంతా ఊపిరి బిగబట్టి అడిగిన ప్రశ్న.

కానీ సమాధానం రాలేదు. రమణి ముఖంలో ఏ భావాన్ని చదవలేక వారిలో వారికే కాదు పాఠకులకీ విషయం అర్థం కాక తల వాచిపోతుంది.

  అసలు విషయం ఏమిటో! రాబోయే మహొత్పాతానికి  నిశ్చల నిశ్శబ్దం. బుస కొట్టేలా వాతావరణం వేడెక్కింది. తుఫానుకు ముందు ప్రశాంతత. రమణి విద్యార్థుల మనసు దోచుకున్న లెక్చరర్. యువతీ యువకులే ఆమెకు ఆత్మీయులు. ఆమె వ్యక్తిత్వం, ఆమె గంభీరతకి ఆమె పొందే గౌరవాభిమానాలు వాళ్లే. ఆమెకు అయినవారు వాళ్ళే. అందుకే వాళ్లు వచ్చారు. ఆనందాన్ని పంచు కున్నారు.

        బర్త్ సర్టిఫికెట్ తయారుచేసి రమణిని డిశ్చార్జి చేయాలి. గతంలో డాక్టర్ ఒకసారి అడిగి ఫెయిల్ అయింది రమణి ఏమీ చెప్పక పోవడంతో.  ఈసారి డాక్టర్ కొంచెం తెలివిగా అడిగింది. ఇద్దరూ కాస్త సన్నిహితులయ్యారేమో నవ్వుతూ చనువుగా అడిగింది. “తండ్రి పేరు అని ఉంది” డాక్టర్ అడిగింది. రమణి సున్నితంగా తోసిపుచ్చింది. “తల్లి పేరు చాలు” అని దృఢంగా చెప్పింది. ధైర్యంగా చెప్పింది. తండ్రి పేరు కాలమ్ దగ్గర ‘గీత గీయండి’ అని చెప్పింది. 

       డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ – తన అభీష్టం మేరకు రాయించుకున్న సర్టిఫికేట్ ని పసిబిడ్డ తోపాటు రమణి పొదివి పట్టుకుంది. డాక్టర్ కి అర్థమైంది. డాక్టర్ రమణిని కౌగిలించుకుంది. “ఇద్దరి పొట్టల మధ్య పసిగుడ్డు నవ్వుతూ ఉంది”.

     ఈ కథానికలో ప్రతిపాదించిన స్త్రీవాద భావజాలం మగవారికి కొంచెం కోపం తెప్పించేదిగా, తమ ఆహాన్ని ఎవరో కావాలని తగ్గించినట్లుగా ముఖం ముడిచే ప్రమాదం లేకపోలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం – ఇలా రాసింది మరెవరో కాదు ఒక మగ రచయితే. పురుషునికి ఇచ్చే ప్రాధాన్యత స్త్రీకి ఎందుకు ఇవ్వరు అన్నది ఆయన ప్రశ్న. అలాం టప్పుడు స్త్రీకి సమానత్వం ఎలా వస్తుంది? ఈ కథలో రమణి చదువుకున్నది. ఉద్యోగం చేస్తున్నది. డబ్బు సంపాదిస్తుంది. నవమాసాలు మోసి బిడ్డను కన్నది. అయినా పేగు బంధానికి ప్రాధాన్యత లేదు.  సర్టిఫికెట్ లో తన పేరుకి ప్రాధాన్యత లేదు. అందుకే ఆమె పోరాటం. అది న్యాయ పోరాటానికి నాంది. సామాజిక సమానత్వానికి మరో మెట్టు. డాక్టర్ కూడా చదువు కున్నది. సంస్కారం తెలిసింది. అందుకే ఇలా అంటుంది-  “భవిష్యత్తులో కొత్త లోకాలకు జన్మ నివ్వబోయే పసిదాన్ని ప్రసవించింది ఆమె హాస్పటల్లో”. రమణి తో కొద్ది పరిచయం లోనే డాక్టర్ కొత్త లోకాన్ని చూడగలిగింది. తనలో నిద్రాణమైన చైతన్యం కదలటం గమనించింది. భవిష్యత్తు పురుషస్వామికం కాదని, కాకూడదని కోరుకుంది. పుట్టింది మగపిల్లవాడు కాదు. కొత్త లోకాలకు కొత్త భవిష్యత్తును పండించ గలిగిన మాతృమూర్తిని పసిపాపలో చూడగలిగింది. అందుకే అరమరికలు లేకుండా రమణిని కౌగలించుకుంది. ఆ కొత్త లోకంలో స్త్రీలు పురుషులు సమానమైన స్థాయిలో కొత్త జీవితాన్ని గడపాలి. ఇది ఇనాక్ గారి ఆశయం. ఇది స్త్రీవాదం లోని ఒక కోణం.

       రమ నా కూతురు కథలో రమ తన తల్లి రసరాజ్యం అని చెప్పింది కానీ రంగారావు తన తండ్రిగా ఎక్కడా చెప్పలేదు. బర్త్ సర్టిఫికెట్ కథలో  రమణి భర్త పేరు కాలమ్ పూర్తి చేయకుండా సర్టిఫికెట్ తీసుకుంది. రెండు కథల్లోనూ తల్లికి ఉన్న ప్రాధాన్యత చెప్పబడింది. ఈ రెండు కథానికలకు స్త్రీల నుండి, స్త్రీవాదుల నుండి విశేషంగా స్పందన వచ్చింది. ఈ కథానికల లోని ముఖ్యమైన అంశం ఇంతవరకు స్త్రీ వాదులు కూడా స్పృశించకపోవడం చూసి స్త్రీవాదులు హర్షం ప్రకటించారు. ఆమోదం అందించారు. పురుషాధిక్య ప్రపంచంలో పురుషులతో పాటు సమానంగా నిలవటానికి, నిలబడటానికి దోహదమిచ్చే కథలివి. దాదాపు ఇవి జంట కథానికలనవచ్చు. ఇటు వంటి సున్నితమైన సమస్యలని, స్త్రీ జాతికి జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని పునరావృతం కాకుండా సమాన స్థాయి – చట్టం ద్వారా కల్పించమని, అంతకు ముందున్న చట్టాలని సవరించమని పరోక్ష సూచన ఈ కథల ద్వారా ఇనాక్ గారు ప్రతిపాదించారు. 

*****

Please follow and like us:

One thought on “ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-4 ఆచార్య కొలకలూరి ఇనాక్ -కథానికలు”

  1. రమ నా కూతురు కథను మళ్ళీ చదివించినందుకు ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published.