ఒక్కొక్క పువ్వేసి-7

సామాజిక సేవా చరిత్రలో బహుజన మహిళ

-జూపాక సుభద్ర

భారతదేశంలో బహుజన కులాల మహిళలు ఎస్సీ,ఎస్టీ ,బీసీలు,కొన్ని మైనారిటీ తెగలుగావున్న
మహిళల జనాభా సగభాగంగా వున్న ఉత్పత్తి శక్తులు.వీరికి సామాజికంగా ఉత్పత్తి సంబంధిత జీవితమే గాని,నాలుగ్గోడల మధ్య వున్న జీవితాలు కావు. గడప దాటితేనే కడుపు నిండే జీవితాలు. వంట ఇండ్లు లేని జీవితాలు. గట్క/సంకటి/ అంబలి ఇవ్వే,కూర ఎప్పుడో ఒకసారి. పొద్దుగాల మూడు రాళ్ల పొయ్యి,సాయంత్రం పనికి బొయి వచ్చేటాలకు పిల్లి కుక్కలు ఆడే ఆటలో చెదిరిపోయిన రాళ్ల పొయ్యి. వీరికి వ్యవసాయం బాగా తెలుసు. వ్యవసాయ సాగు ఉత్పత్తి లో వీరిదే ప్రధాన పాత్ర. మట్టికి మాలిమైన వాళ్ళు. ఏ మట్టికి ఏ విత్తనం పండుతదో, ఏ కాలం లో ఏ పంట పండుతదో ,ఏ రకం భూమిలో నీటి వూటలు ఉంటా యో మట్టిని ముర్క చూసి చెప్పగల విజ్ఞాన ఖనులు.
ఒక్క వ్యవసాయ రంగమే గాదు,కుండలు చేసే పనిలో మొగాయిన కేవలం మట్టి తెచ్చిచ్చే వరకే. కానీ ఆ మట్టిని రాళ్ళూ ఇసుక లేకుండా మైదా పిండిలా మెత్తగా మర్దించి కుండకు,మట్టి పాత్రలకూ అనుకూలంగా చేసి కుమ్మరి సారె మీద ఎక్కించేది కుమ్మరి మహిళలే. అట్లా వడ్ల పనిలో కట్టెని పొతం చేసిచ్చేది, కమ్మరి పనిలో కొలిమి లాగా మండి ఇనుముని అన్ని రకాలుగా మలిచే పనిలో సగం భాగం వీరిదే. అట్లాగే గొర్ల,కురుమ గొర్లను సమాలించడం ,డోలు జమిడిక తయారీలో తోలును డోలు చేయడం వూలు తీయడం యాదవ, కురుమ మహిళలదే ప్రధాన పాత్ర.కానీ ఈ డోలును వాయించే కాడ వారికి నిషేధాలు.
మాదిగ మహిళలకు వ్యవసాయం తెల్సు. నీరు పారించే టెక్నాలజీ తెల్సు. తోలుకు సున్నం రాసి లందలో
నానబెట్టి ప్రతిరోజు ఆ నీళ్లను మార్చడానికి ఎంతెంతో దూరం బోయి నీళ్లెత్తుకొచ్చి కడిగి శుభ్రం చేస్తుంటది.మాదిగ ఇండ్ల సమీపాల్లో నీళ్ళ సౌలతు వుండది. పది రోజులు ఆ లందను కుక్క నక్క ముట్టకుండా కావలి కాస్తది. ఆ తోలు డప్పుగా మూయడానికి చింత గింజల్ని అంబలి అయ్యే దాక ఉడక బెట్టి కాయాలి. దాని కోసం సగం బండేడు కట్టెలు
కొట్టుకొస్తది. అవన్నీ తెచ్చి పొయ్యిల కట్టెలాగానే కాలుతుంటాది గింజలు ద్రవంగా అంబలి కానీకి. ఇవన్నీ అయినంక అప్పుడు మొగాయిన వచ్చి తోలును గుండ్రటి కట్టే చట్రానికి చింత అంబలి తో అతికిస్తే — దప్పు ఢమ్ ఢమ్ అని, డొడ్డోoక డోమ్ అని మోగిస్తడు. కానీ మాదిగ మహిళ దప్పు వాయించే కాడ నిషేధాలు.
ఊరందరి బట్టల మురికి, వూరి ఆడవాళ్ళ ముట్టు బట్టలను ఉతికి ఆరేసేది చాకలి ఆడ,మగలు. ఊరందరి నుంచి తిరిగి తిరిగి మురికి బట్టలు పట్టుకొచ్చేది,డ్రమ్ముల బట్టల్ని సోడాలో ముంచేది,రంగు బట్టల్ని ,తెల్ల బట్టల్ని వేరు చేసేది, సబ్బు పెట్టె బట్టల్ని ఉడకబెట్టే బట్టల్ని వేరు చేసేది పట్టు బట్ట, మొద్దుబట్ట లాంటి నాణ్యతను బట్టి వేరు చేసి ఉడకబెట్టేది ఆ పొయ్యి కింద మంట బెట్టేది, కట్టెలు తెచ్చేది చాకలి మహిళ. ఇన్ని చేసి బట్టలు బండ పక్కనేస్తే——–సగం బట్టలు మగాయిన ఉత్కుతడు,మిగతా సగం బట్టలు నాణ్యమైన బట్టలు ఉతికేది చాకలి మహిళ. ఆరేయడం ఆరిన బట్టలు మడిసి మూటలు గట్టి మల్ల ఎవరి బట్టలు వారి ఇండ్లకు బోయి ఇచ్చేది,రంగులు బోయినయని, మంచిగ వుత్క లేదని తిట్ల బడేది, వూరోల్లు యిచ్చిన అన్నం, కూరలు తెచ్చే దంతా చాకలి మహిళలే.అయితే ఊరి ఇండ్లకే వెళ్లి బట్టలు తెస్తారు గాని వాడ గూడెం ఇండ్లకు వెళ్లరు, ఉత్కరు.
మంగలి మహిళలకు వైద్యమే కాదు, మనుషులను లోకం మీద పడేసే దంతా మంగలి మహిళలే. వీరికి ఊరు వాడ తేడా లేదు. మహిళల పురిటి కష్టాలన్నీ తీర్చేది పురుళ్ళు పోసేది మంగలి మహిళలే. వారికి సాయంగా మాదిగ మహిళల్ని తీస్క పోతుoటరు. కడుపుని చూసి ఎప్పుడు కంటారో టైం చెప్తారు. పిండం అడ్డముంటే చేతి స్పర్శ తో పిండాన్ని సజావుగా చేసి కాన్పులు చేస్తరు. వీళ్ళు డాక్టర్లకే డాక్టర్లు ఇప్పటికి వీరు సిజీరియన్ లేకుండానే కాన్పులు అవలీలగా చేస్తుంటారు. సర్వీసుగా చేస్తారే గాని వ్యాపారంగా కాదు. ఈ మహిళలు ఇప్పటికీ గ్రామాల్లో కనిపిస్తుంటారు.
బట్టలు నేసే నేత పని కాడ కండెలు చుట్టడం, పోగులు చుట్టడం, పడుగు గుంటలు తయారు చేయడంలో, నేయడంలో,నేత మహిళల పాత్ర నేత మగవారి కన్నా ఎక్కువ.
ఇక సంచార జాతుల్లో డక్కలి, చిందు, మాష్టీ,కాకి పరుగుల,బుడబుక్కల,పిచ్చుకుంట్ల, మందెచ్చు,బైండ్ల గోసంగి లాంటి అనేక కులాల్లోని కళాకారుల్లో సంచార జాతుల్లో వచ్చే అనేక ఒడిదుడుకుల నుంచి కుటుంబాన్ని కాపాడేది, సంచార జాతి మహిళలదే ప్రథమస్థానం.
రోడ్లూడిసే, కక్కోసులు కడిగే రెల్లి, మెహతర్, మాదిగ మహిళల సర్వీసుకు సమాజమంతా ఋణపడి ఉంది. వీరు రోడ్లను శుభ్రం చేయడానికి, చెత్త మురుగు మురికి ఎత్తడానికి నిరాకరిస్తే ——- సమాజం రోగ పీడితమైపోతది. ఇంకా డ్రై లెట్రిన్ వ్యవస్థలో మనిషి మలాన్ని ఎత్తి పోస్తున్నది ఈ కులాల మహిళలే. వీరికి సరిఅయిన వేతనాల్లేవు.
సామాజికంగా శ్రమ కులాలుగా, ఉత్పత్తి శక్తులుగా సమాజానికి సేవ చేస్తున్న బహుజన మహిళలు లేని ఉద్యమాలు లేవు. బౌద్ధం లో వీరి ప్రశ్నలు స్వాంతన పొందిన కాలముంది. భక్తి ఉద్యమాల నుంచి జాతీయోద్యమాలు,సంస్కరణోద్యమాలు, ఆధునిక, అభ్యుదయ కమ్యూనిస్టు, తెలంగాణ తొలి,మలి దశల ఉద్యమాలు,
విప్లవ,దళిత మహిళోద్యమాల్లో బహుజన మహిళలు పాల్గొనని ఉద్యమాలు,వారి నెత్తురు చిందని, వారి త్యాగాలు లేని ఉద్యమాల్లేవు. ఈ ఉద్యమాలన్ని ఈ మహిళలకు కులం లేని,జెండర్ సమానత్వాలుండే సమాజాన్ని వాగ్దానం చేసినయి. ఆ వాగ్దానాలు సఫలం కాక పోగా వారు ఉద్యమించిన పోరాటాలు వారికి గుర్తింపులు గౌరవాలు లేని చరిత్రలను మిగిల్చినయి. చారిత్రకంగా సామాజికంగా వారు నిర్వహించిన భూమిక ఉద్యమాల్లో వారి భాగస్వామ్య నిర్వహణల్ని అవాచ్యం చేసినయి ఉద్యమ చరిత్రలు.
చారిత్రకంగా వారు యుద్ధాలు చేశారు. సంఘ దురాచారాల్ని నిర్మూలించారు. సమాజాన్ని మార్చేందుకు అనేక త్యాగాలు చేశారు. సమానత్వాలకోసం అంటరానితనాలకి వ్యతిరేకంగా , ఇంకా సామాజికంగా వున్న అన్ని రకాల అణచివేతల మీద పోరాడారు. అట్లాంటి చరిత్రలున్న కొద్దిమంది బహుజన ప్రతిభావంతమైన ప్రభావ శీలురైన మహిళల గురించిన పోరాట పటిమలు, యుద్ధ నైపుణ్యాలని త్యాగాల చరిత్రల్ని ఒక్కొక్కటిగా ఆవిష్కరిస్తాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.