స్వప్నం ఒక ఆరని నిప్పురవ్వ

మీనా కందసామి “ది ఆర్డర్స్ వర్ టు రేప్ యు” పై సమీక్ష 

  -ఎన్.వేణుగోపాల్

పునరుజ్జీవనం ప్రకృతిలో నిత్య సత్యం. మేఘం కురిసి తనను తాను రద్దు చేసుకుంటుంది. కాని భవిష్యత్ మేఘాలెన్నిటికో జన్మనిస్తుంది. భూమి తనచుట్టూ తాను తిరిగి సూర్యుడినీ, చంద్రుడినీ, నక్షత్రాలనూ పోగొట్టుకుంటుంది. కొన్ని గంటల్లోనే తిరిగి తన కళ్ల ముందరికి తెచ్చుకుంటుంది. చెట్టు కూలిపోతుందన్నమాట నిజమే కానీ ఆ లోపు వేనవేల పూలు పూసి లక్షోపలక్షల విత్తనాలయి పునరుత్థానం చెందుతుంది.

ఈ ప్రకృతి పునరాగమన చక్రాన్ని చూసి మనుషులు తాము కూడా పునర్జన్మిస్తామని అమాయకంగా అపోహ పడ్డారు. మనుషుల పునరుత్థానం ప్రకృతిలో లాగా భౌతికం కాకపోవచ్చునని వాళ్లకు తెలియకపోయింది.

మనిషి మరణించవచ్చు. ఆ మనిషి ఆలోచనలు, పంచుకున్న జ్ఞాపకాలు, విజయవంతంగా చేసిన పనులు, అర్ధాంతరంగా వదిలేసి పోయిన పనులు ఆ మనిషికి మళ్లీ మళ్లీ జీవితాన్ని ఇస్తూనే ఉంటాయి. తమ కోసమే కాక సకల మానవాళి కోసం జీవన స్వప్నాలు ఆవిష్కరించే మనుషులు అప్పటికి ఓడిపోయారనో, పడిపోయారనో, విగతజీవులయ్యారనో అనిపించవచ్చు, వారిని ఓడించినవారు ఆ క్షణానికి విజేతలమని విర్రవీగవచ్చు. కాని చితాభస్మంలోంచి రెక్కవిప్పి ఎగిరే ఫీనిక్స్ పక్షి లాగ, స్వప్నానికి మరణం లేదు. స్వాప్నికులకు మరణం లేదు. ఇవాళ బూడిద కప్పిన నిప్పురవ్వ రేపు మళ్లీ రాజుకుంటుంది. 

ఇది ఇవాళ్టి ఒకానొక వర్తమాన మరణం గురించి కూడ కావచ్చు. కాని అంత మాత్రమే కాదు. ఇంతకన్న ఎన్నో రెట్లు ఎక్కువ విషాదం వెదజల్లిన ఒక జాతి పోరాటం ఒక దశాబ్దం తర్వాత కూడా మళ్లీ మళ్లీ పునరుత్థానం అవుతున్న కథ.

శ్రీలంకలో పాలిత తమిళ జాతి పాలక సింహళ జాతి చేతుల్లో అనుభవించిన వివక్షనూ, అన్యాయాన్నీ, దుర్మార్గాలనూ రద్దు చేయాలంటే తమిళ జాతి విముక్తి పోరాటం ద్వారా సాధించబోయే తమిళ ఈలం తప్ప మరొక మార్గం లేదనేది ఒక స్వప్నం. వేలాది, లక్షలాది మన అక్క చెల్లెళ్లూ అన్నదమ్ములూ తమ జాతి సామూహిక స్వప్నంలో తమ సొంత వ్యక్తిగత స్వప్నాలనూ పెనవేసుకున్నారు. ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి వాళ్లు అనుసరించిన మార్గం మీద మనకు ఎటువంటి అభిప్రాయాలైనా ఉండవచ్చు. కాని రెండు దశాబ్దాలకు పైగా ఆ మార్గంలో వేలాది మంది మనుషులు తమ రక్తమాంసాలనూ శక్తి సామర్థ్యాలనూ వెచ్చించి, తమ జాతి విముక్తి కోసం ప్రయత్నించారు. ప్రాణాలు బలిపెట్టి పోరాడారు. సొంత విమానాలు, నౌకలు, అంతర్జాతీయ సంఘీభావం వంటి విషయాలలో ప్రపంచంలో ఏ ప్రజా ఉద్యమమూ సాధించని విజయాలు సాధించారు. నలబై వేల మంది పోరాట యోధులనూ, పోరాటం పట్ల సానుభూతి ప్రకటించిన తమిళ ప్రజలనూ ఊచకోత కోసి, మూడు లక్షల మంది తమిళ ప్రజలను నిర్వాసితుల్ని చేసిన శ్రీలంక పాలకులు ఆ తమిళ ఈలం స్వప్నాన్ని అతి భయానకంగా చిదిమేయగలమని అనుకున్నారు. ఆ అపజయం తర్వాత కొన్ని వేల మంది దేశదేశాలకు వలస వెళ్లి ప్రవాసంలో సందిగ్ధ జీవితాలు గడుపుతుండగా, మరికొన్ని వేల మందో లక్షల మందో స్వదేశంలోనే రెండో తరగతి పౌరులుగా దుర్భరమైన బతుకులు ఈడుస్తున్నారు.

ఉజ్వలమైన శ్రీలంక తమిళ ఈలం పోరాటంలో స్త్రీల భాగస్వామ్యపు చరిత్ర అద్భుతమైనది. 1983లో తమిళ ఈలం సాయుధపోరాటం ప్రారంభమైనప్పటి నుంచే స్త్రీల పాత్ర పట్ల నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సాయుధపోరాటానికి అవసరమైన అనుబంధ కార్యక్రమాల్లో మాత్రమే కాక, నేరుగా స్త్రీలకు సైనిక శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. మహిళలే శిక్షకులుగా ప్రత్యేక మహిళా నిర్మాణాలు ఏర్పాటు చేశారు. 1980ల చివరినుంచి 2009లో పరాజయం దాకా మహిళా టైగర్ సైనికుల విన్యాసాల గురించి, సాహసాల గురించి ప్రపంచవ్యాప్తంగా పుస్తకాలు, వ్యాసాలు ఎన్నో వెలువడ్డాయి. ముఖ్యంగా భారతదేశంలోని సంకుచిత, ఛాందస తమిళ సమాజంలో, సాహసికులైన శ్రీలంక తమిళ సైనిక మహిళల ఉదంతాలు యువతులను ఉర్రూతలూగించాయి.

అట్లా మహిళా టైగర్ల ఫొటోలను, పోస్టర్లను తమ గదుల్లో గోడలకు అతికించుకుని మహిళా టైగర్ల సాహసాలను ఆరాధించిన భారతీయ తమిళ యువతుల్లో ఒకరు మీనా కందసామి. 2009 ఎల్ టి టి ఇ పరాజయంతో ఆగ్రహమూ దుఃఖమూ కలగలిసిన ఉద్వేగాలతో అతలాకుతలమైన తమిళ యువతరంలో ఆమె ఒకరు. టైగర్ల పరాజయం తర్వాత శ్రీలంక సైనికులు తమిళ స్త్రీల మీద జరిపిన సామూహిక అత్యాచారాల, హత్యల వార్తలు ఆమెను లోతుగా కదిలించాయి. ఒకవైపు భాషా శాస్త్రంలో పి ఎచ్ డి పరిశోధన, మరొకవైపు తొలి నవల రచన పూర్తి కాగానే 2012లో ఆమె మహిళా టైగర్ల మీద, ముఖ్యంగా శ్రీలంక సైనికుల హింసాకాండకు గురై, లేదా తప్పించుకుని శ్రీలంకలోనో, ఇతర దేశాలలోనో ఉన్న మహిళా టైగర్ల మీద ఒక డాక్యుమెంటరీ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మలేషియాలో, ఇండోనేషియాలో ప్రవాసంలో ఉన్న మాజీ మహిళా టైగర్ల అనుభవాలు చిత్రీకరిస్తూ మూడు నెలలు గడిపారు. చిత్రీకరణ విజయవంతంగానే జరిగింది గాని అనేక కారణాల వల్ల ఆ డాక్యుమెంటరీ పూర్తి కాలేదు.

ఐదు సంవత్సరాల తర్వాత, ఆ డాక్యుమెంటరీ ఫుటేజ్ ఇస్తే ఒక స్మారక ఆర్కైవ్స్ లో పెడతామని సూచన వచ్చినప్పుడు వెతికితే ఆ హార్డ్ డిస్క్ దొరకలేదు. ఈ మధ్యలో మీనా అనేక దేశాలు తిరుగుతూ ఉండడం వల్ల అది ఎక్కడ ఉందో కూడా ఆచూకీ దొరకలేదు. కాని ఆ మహిళా టైగర్ల మాటలను రికార్డ్ చేసిన ఆడియో ఫైళ్లు మాత్రం ఒక ఆన్ లైన్ డ్రైవ్ మీద ఉన్నాయని గుర్తించి వాటిలో ఇద్దరి కథనాలను భూమికగా పెట్టుకుని ఒక పెద్ద వ్యాసం రాయడానికి పూనుకున్నారు.

ఒక కథనం ఒక తమిళ టైగర్ ను పెళ్లి చేసుకున్న నేరానికి శ్రీలంక సైనికుల చేతుల్లో వేధింపులకు గురై పారిపోయి ఇండోనేషియాలో కాందిశీకురాలిగా ఉన్న యువతిది. రెండో కథనం ఒక మహిళా టైగర్ ది. పద్దెనిమిదో ఏట టైగర్ గా మారి, 2009 ఏప్రిల్ లో, తుది పరాజయానికి ఒక నెల ముందు మరెంతో మందితో కలిసి లొంగిపోయినప్పటికీ, శ్రీలంక సైనిక శిబిరంలో దారుణమైన అత్యాచారాలకు గురై, పారిపోయి మలేషియాలో ప్రవాసంలో బతుకుతున్న యువతి హృదయ విదారక గాథ ఇది.

“అధికారికంగా యుద్ధం ముగియకముందే మా మీద అత్యాచారాలు మొదలయ్యాయి… అందరూ రేపిస్టులే. అత్యున్నత సైనికాధికారి నుంచి అతి కింది స్థాయి సైనికుడిదాకా ప్రతి ఒక్కరూ నా శరీరంలో ఒక ముక్క కావాలనుకున్నారు….” అనీ, “నేను ఫిర్యాదు చేస్తానని బెదిరించేదాన్ని. ‘మీ పై అధికారులకు చెపుతా’ అనేదాన్ని. వాళ్లు ‘ఇవి వాళ్ల ఆదేశాలే. నిన్ను రేప్ చేయమని మాకు ఆదేశాలున్నాయి’ అనేవారు” అనీ ఆమె మాటలు వింటుంటే హృదయం ముక్కలవుతుంది.   

అటువంటి కథనాలతో తయారైనదే ఈ పుస్తకంలోని ప్రధాన వ్యాసం ‘ది ఆర్డర్స్ వర్ టు రేప్ యు’.

అలాగే ఈ పుస్తకంలోని మరొక వ్యాసం తమిళ ఈలం మహిళా కవుల కవితల పరిచయం, ముగ్గురు కవుల ఏడు కవితల అనువాదం. 2013లో లండన్ లో ఒక పుస్తకాల దుకాణంలో ‘లవర్స్ అండ్ కామ్రేడ్స్ – విమెన్స్ రెసిస్టెన్స్ పొయెట్రీ ఫ్రమ్ సెంట్రల్ అమెరికా’ అనే పుస్తకం చూసి, అలాగే తమిళ మహిళా గెరిల్లా కవుల కవిత్వం పరిచయం చేయాలనే ఆలోచన వచ్చిందని అంటూ, కెప్టెన్ వానతి, కెప్టెన్ కస్తూరి, ఆధిలచుమి లు రాసిన ఏడు కవితలు అనువదించి, పరిచయ వ్యాసం రాశారు.

ఇది కేవలం ఒక ఓడిపోయిన పోరాటపు అవశేషాల సానుభూతి రచన కాదు. కవిగా, జర్నలిస్టుగా, నవలా రచయితగా, అనువాదకురాలిగా, సామాజిక కార్యకర్తగా సుప్రసిద్ధురాలైన మీనా, ఇక్కడ తమిళ జాతి విముక్తి పోరాటపు న్యాయబద్ధతను, దాని పట్ల తన మమేకతను, నిబద్ధతను ప్రకటించిన పుస్తకం ఇది. తన సొంత తల్లిదండ్రుల జీవిత శకలాల నుంచి, తన జీవితం నుంచి, అంతర్జాతీయ రాజకీయాల నుంచి, కవిత్వం నుంచి, పాలకుల దుర్మార్గాల నుంచి, పితృస్వామ్యం దాకా ప్రస్తావనవశాత్తూ ఎన్నెన్నో విషయాలు ఇముడ్చుకున్న అద్భుతమైన పుస్తకం ఇది.

శ్రీలంక తమిళ జాతి విముక్తి పోరాటం ఓడిపోయి ఉండవచ్చు. దాన్ని నిర్మూలించామని శ్రీలంక పాలకులు, వారికి సహకరించిన భారత్, అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, చైనా పాలకులు విర్రవీగుతుండవచ్చు. కాని ఎల్ టి టి ఇ ని మట్టి కరిపించామని ప్రగల్భాలు పలుకుతున్న పాలకులే పన్నెండు సంవత్సరాల తర్వాత కూడ తమ తమ దేశాలలో నిషిద్ధ సంస్థల జాబితాలో ఆ సంస్థ పేరు రాస్తూనే ఉన్నారంటే, ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరిని నిర్బంధించడానికి ఇవాళ్టికీ తమిళ ఈలం సాకు చూపుతూనే ఉన్నారంటే అది ఇంకా మిగిలి ఉన్నదని చెప్పకనే చెపుతున్నారన్నమాట. మరొకవైపు తమిళ ఈలం ఆకాంక్ష ఇవాళ్టికీ శ్రీలంక తమిళ సాహిత్యంలో, భారతీయ తమిళ సాహిత్యంలో, ప్రవాస సాహిత్యంలో ఆరని నిప్పురవ్వగా జ్వలిస్తూనే ఉన్నది. శ్రీలంక పాలకుల దుర్మార్గాన్ని చరిత్ర నమోదు చేసిందనీ, జాతి విముక్తి ఆకాంక్ష నిప్పురవ్వ మనుషుల, మనసుల లోలోపల ఇంకా పదిలంగానే ఉందనీ ఈ చిన్న పుస్తకం చదివితే అర్థమవుతుంది.

అది ఒక సమానత్వ, ఆత్మగౌరవ, సామాజిక న్యాయ స్వప్నం కదా, దాన్ని రద్దు చెయ్యగల శక్తి ఈ భూమి మీద ఉన్నదా?

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.