యుద్ధం పుల్లింగమే

-జయశ్రీ మువ్వా

కాలాన్ని గుప్పిట పట్టి పంటి కింద్ర తొక్కిపట్టి
ఇదిగో ఇప్పుడిప్పుడే రెక్కల సవ్వడి గుర్తుపడుతున్నాం
 
వెన్నెలను అద్దంలో ఒంపి తృప్తిపడుతున్నాం
నక్షత్రాలను పెదాలపై అతికించుకుని
ఆనందంలోకి అడుగుపెడుతున్నాం
 
నాలోనూ రక్తమే ప్రవహిస్తోందని
ఆకశాన్ని అంగిట్లో దాచేస్తున్నాం
 
రంగాలన్నీ రంగరించి గుటుక్కున మింగేస్తూ
పాదాలకు పరుగు నేర్పిస్తున్నాం
 
శరీరం పై మచ్చలన్నీ మాయమైన సంతోషంలో
కొత్త వలసపక్షులై
రెక్కలు కూర్చుకున్నాం
 
ఆదిమ నుంచి అంచలంచలుగా అందరూ ఎదుగుతూనే ఉన్నారు
నువ్వూ అతీతం కాదు
 
నీ మత మౌఢ్యం మాత్రం
అదిగో పురిటిదుర్వాసన నుంచి ఇంకా శుద్ధి కాలేదు
అందమైన బలపాలు అరచేతి పలకలో అరిగే క్షణాలనొదిలి
నిప్పులు కురిసే గొట్టాం తుపాకుల సహవాసమా?
 
అల్లరి వల్లరి పాటలతో గడపాల్సిన బాల్యానికి
తూటాల మోతల సంగీతమా?
 
ఏ రాత్రి ఉరి బిగించుకుని ఊసు మరచి 
నిన్ను కనిపడేసిందో
 
రక్తమడుగులోనే అసహ్యపు చూపులతో..
అందుకే పురిటి వాసన వారసత్వమై వసిస్తొంది
 
నిన్నుకన్నది నీకు బానిసా?
నీ జీవాన్ని మోసినది నీకు దాసీనా?
ఎవరిది భిక్ష?
ఎవరికి శిక్ష?
 
కరుకు బూట్ల చప్పుడు
సరిహద్దు ఆవల కదులుతుంటే
వీపులపై చండ్రకోల శబ్ధం
జలదరిస్తూ పాకుతోంది
 
చీకట్లో చతికల పడ్డ చర్మం
చివుక్కున తలుపు చాటు నక్కుతోంది
పిరమిడ్ చేసి ఊరేగాల్సి వస్తుందని..
 
మేను ముందుగానే వర్షిస్తోంది
మనిషి నుంచి వేరు పడి
వాసన కోల్పోతున్న భావన
 
మహిషి మనిషిపై స్వారిచేస్తున్న రోదన
గుండె గుండెనీ ముడేసి చితిపేసిన ఆక్రందన
 
ఉన్నట్టుండి అవే ఇనుప బూట్ల నాడాలు 
కిటికీ చివర గాలిని
ఖతం చేసాయి 
 
తెరిచే ఉన్న తలుపు భయంతో
మరో గోరీ అయింది 
బానిసత్వం ఇక ప్రొఫెట్  ఫత్వా అయి
గడపకు తావీద్ లు కడుతోంది
 
నాలుగో ప్రపంచ యుద్ధం కోసం చేతులు కలిపే దేశాలు మొహం చాటేస్తాయా
మనకెందుకులే అని ఎవరి చావు వాళ్లనే చావమంటాయా?
 
స్వేచ్చ జారి కలలోంచి ఎగిరిపోయింది
వేలాడిన ముంగురులు వేడి గాలికి ఒణికి  
నల్ల ముసుగులోకి జారుకున్నాయి!
 
(ఆఫ్ఘన్ ఆడపిల్లల వేదన విని చలించి )

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.