మా పిల్లల ముచ్చట్లు

 ఒక టీచర్ అనుభవాలు

  -అనురాధ నాదెళ్ల

బడి అంటే పిల్లలప్రపంచం అనుకుంటాం. కానీ బడిలో ఉండేది పిల్లలొక్కరే కాదుగా. ఆ పిల్లల్ని స్వంతం చేసుకుని తమ కుటుంబంగా భావించే టీచర్లుండేది కూడా బడిలోనే. సహనంతో, ప్రేమతో వారి అమాయకత్వాన్ని జీర్ణించుకుంటూ, అక్షరాలను నేర్పి పిల్లల భవిష్యత్తుకు బాటవేసే టీచర్లు సమాజానికి ఎంత విలువైన సంపదో కదా. 

పసివాళ్లుగా బడిలో ప్రవేశించే పిల్లలు బడి వదిలే సమయానికి భవిష్య జీవితానికి కావలసిన ప్రాథమిక జ్ఞానాన్నినేర్చుకుంటారు. చుట్టూ ఉన్న సమాజం గురించి అవగాహన చేసుకుంటారు.  తమదైన వ్యక్తిత్వాన్ని కూడా ఏర్పరచుకుంటారు. ఈ అడుగులు నేర్పిన టీచర్ల ప్రభావం వారి జీవితాలపైన ఎంతగా ఉంటుందో మనకు తెలుసు. అమ్మా, నాన్నలు చెప్పినదానికంటే టీచర్ చెప్పిన మాట పిల్లలకి వేదవాక్కు. పొద్దున్నుంచీ సాయంకాలం వరకు తోటి పిల్లలందరితో కలిసిమెలిసి బడిలో గడిపిన బాల్యపు రోజులు ఎవరికైనా అద్భుతమైనవే.

                                         ఒక అపురూపమైన పుస్తకం గురించి ఈ నెల మాట్లాడుకుందాం. ఈ పుస్తకంలోని ప్రతి అంశం చదువరి గుండెను తాకుతుంది. తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, లేదా విద్యార్థులే కావచ్చు. నిజాయితీగా తన ఉద్యోగ బాధ్యతను నిర్వహించిన ఒక టీచర్ కథే ‘’మా పిల్లల ముచ్చట్లు.’’ ఎందరో నిజాయితీగా ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూండవచ్చు. కానీ, ఇక్కడ ఉద్యోగమంటే కొన్ని వందల చిన్నారుల జీవితాలను తీర్చిదిద్దేపనన్నమాట. చాలా ఛాలెంజింగ్! ప్రతిక్షణం ఎదురయే కొత్తకొత్త విషయాలు, కొత్తకొత్త సమస్యలు, ఊహించని సన్నివేశాలు, సందర్భాలు! వీటన్నిటి మధ్య ఏమీ తెలియని పసివాళ్ళు. వాళ్లను బడి ఒడిలో దించి ఆశగా, ఆత్రంగా భవిష్యత్తు కోసం చూసే పెద్దలు! 

కేవలం బోధన వరకే పరిమితం కాకుండా ఒక టీచర్ మనసున్న మనిషిగా చేసిన ఉద్యోగ ప్రస్థానం ఇది. తను పనిచేస్తున్న పరిసరాల్లో పసివాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రహించి, సమాజం దృష్టికి ఆ సమస్యలను తీసుకొచ్చి, స్పందించే వ్యక్తులను కూడగట్టుకుని పరిష్కారాలను అందించిన ఒక ఊహాతీతమైన విజయగాథ. ఈ పుస్తకం చెప్పిన ముచ్చట్లు మామూలు కాలక్షేపం కబుర్లు కావు. బడిలోని పిల్లల దైనందిన జీవితాలతో మమైకమైపోయిన ఒక టీచర్ ఆత్మకథాత్మక కథ. అందులోనూ ఆ బడి నగరానికో, పట్టణానికో లేదా ఒక పల్లెకో చెందినది కాదు.  

                                       నాగరిక సమాజానికి దూరంగా తమదైన ఒక సంస్కృతి, భాష, జీవనవిధానం ఉన్న మారుమూల అటవీ ప్రాంతపు తండాలలోని పిల్లలకోసం ప్రభుత్వం నడుపుతున్న బడి. అక్కడికి చేరుకోవటమే నిత్యం ఒక సవాలైన ప్రాంతం. అటువంటి చోటుకి వెళ్లవలసి రావటాన్ని ఒక సమస్యగా కాక అడవిదారిలో ఆ ప్రయాణాన్నిఅందమైన అనుభవంగా మార్చుకుని, సానుకూల ధోరణితో తన ఉద్యోగ జీవితాన్ని నడుపుకున్న తీరు రచయిత్రిలోని సున్నితమైన మానవీయ కోణాన్ని ప్రతిఫలింపజేస్తుంది. ఒక టీచర్కి ఉండవలసిన అత్యుత్తమ లక్షణం కాదా ఇది!

ఆ బడి పిల్లలతో, ఆ ప్రాంతంతో రోజూ కొత్త కొత్త అనుభూతుల్ని మూటగట్టుకుంటూ ఇరవై ఒక్క సంవత్సరాల పాటు ఎందరో పిల్లల జీవితాలను ప్రభావితం చేసిన రచయిత్రి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని మన కళ్లముందు చూబించారు. బడి, అక్కడి పిల్లలు, వారి కుటుంబ నేపథ్యాలు, వారి దైనందిన పోరాటాలు, సంతోషాలు, దుఃఖాలు…ఒకటేమిటి ఆ పిల్లల జీవితాలకి సంబంధించిన ప్రతి విషయాన్ని రచయిత్రి ఈ పుస్తకంలో ప్రస్తావించారు. 

సమ్మెట ఉమాదేవి గారు ఒక టీచర్. టీచర్ మాత్రమే కాదు. తను పనిచేస్తున్నబడిలోని పిల్లలను మనసావాచా తనవాళ్లను చేసుకుని అక్షరాలు దిద్దించిన వ్యక్తి. వాళ్ల బాధలను తనవిగా చేసుకుని, వాళ్ల పోరాటాలను తనవిగా పోరాడిన వ్యక్తి. వ్యవస్థలోని లోపాలను ధైర్యంగా ప్రశ్నించిన వ్యక్తి.

ఈ పుస్తకంలో ఏముంది ఇంతకీ?!

‘’శాంతావసంత ట్రస్టు’’ తరఫున పుస్తకం ప్రచురించిన శ్రీ వరప్రసాద్ గారు ముందుమాటను రాస్తూ చెప్పిన మాటలు, 

‘’అమ్మ చెప్పే కథల్లో కనీస ధర్మాలు, బాంధవ్యాలు, బాధ్యతలు తెలుస్తాయి. అమ్మ పాడే జోలపాటల్లో అనుభూతులు పరిచయమవుతాయి. అమ్మ ఒడి నుంచి బడికి వచ్చిన బిడ్డ బాధ్యత అప్పుడు గురువుది అవుతుంది.

అన్ని మానవీయ గుణాలను, విలువలను పిల్లల స్థాయిలో వారికి నేర్పిన ఉమాదేవిగారు పిల్లలకోసం ఒక కలల ప్రపంచాన్నే సృష్టించారు. ఈ పుస్తకం ఒక చిన్నపిల్లల విశ్వవిద్యాలయంగా చెప్పవచ్చు.’’

శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, ముందు మాటలో చెప్పిన మాటలు,

‘’ప్రతి తల్లీ, తండ్రీ, ఉపాధ్యాయినీ తప్పక చదవవలసిన పుస్తకం. ముఖ్యంగా విద్యాశాఖ అధికారులు, పాఠ్య పుస్తకాల రూపకర్తలు శ్రధ్ధగా అధ్యయనం చెయ్యవలసిన పాఠ్యపుస్తకం’’ 

మేడ్చల్ అడిషనల్ జిల్లా కలెక్టర్ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు, మరికొందరు విద్యావేత్తలు కూడా ఈ పుస్తకంలోని ప్రత్యేకతను గుర్తించి పరిచయం చేసారు.

రచయిత్రి ఈ పుస్తకంలో పిల్లల చదువు, వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు సంబంధించి దాదాపు రెండువందల పాతిక అంశాలను స్పృశించారు. ఒక బడికి, బడిలోని పిల్లలకి సంబంధించి ఇన్నిన్ని విషయాలున్నాయన్న వాస్తవం చదువుతుంటే అవగాహనకొస్తుంది. 

మొదటి అంశం ‘’జేగంట!’’ రైలు పట్టాలను బడిగంటగా చెయ్యటం ద్వారా బడి నుంచి జీవనయానపు తొలి అడుగులు మొదలవుతాయన్నది స్పష్టమవుతుందంటారు రచయిత్రి. ఎంత చక్కని విశ్లేషణ! 

                                      ప్రకృతి మధ్య చెట్లకింద పాఠాలు నేర్చుకోవటం, ఆ చెట్లకింద కూర్చుని ప్రతిరోజూ మధ్యాహ్న భోజనాలను చెయ్యటం పిల్లలకి దొరికిన అందమైన అవకాశమంటూనే, తరగతి గదుల కొరతను అధిగమించేందుకు మరిన్ని గదులు అందుబాటులోకి తేవాలన్న విషయాన్ని కూడా ప్రభుత్వానికి సున్నితంగానే చెప్పారు రచయిత్రి. ముత్యాలంపాడు పాఠశాలలో పెద్ద వేపచెట్టు గురించి ప్రస్తావిస్తూ అక్కడి ఆవరణలో పాఠాలు బోధించిన రచయితలు దిలావర్ గారు, దేవపుత్రుడు వంటివారు నాటిన మొక్కలు చెట్లుగా రూపొంది నేటికి ఆ బడికి ఎలాటి నిండుదనాన్ని తెచ్చాయో చెప్పారు. ఇక్కడ రచయిత్రి ఒక ఉదాత్తమైన ఆలోచన చెప్పారు. పిల్లలకు వారి కులం, మతం, భాష మాత్రమే కాక చదువుకున్న పాఠశాలను తమ అస్తిత్వ ఆస్తిగా భావించేలా నేర్పి దాని అభివృధ్ధికి తోడ్పడేలా తీర్చిదిద్దాలంటారు. 

ప్రతి సంవత్సరం కొత్తగా బడిలోకి ప్రవేశించే చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించటంతో అయిపోదుగా, ఆ తర్వాత రోజునుంచి మొదటి తరగతిలోని పిల్లలు ఇంటిమీద బెంగతో చేసే రాగాలాపన ఇంటికెళ్లిన టీచర్ చెవిలో ఆరునెలలపాటు గింగురుమంటూనే ఉంటుందని చెబుతారు. 

తమ అన్నలాగానో, అక్కలాగానో తాము కూడా పెద్దబడికి వెళ్లాలన్న కలను కంటూ ఉన్నత పాఠశాల మెట్లెక్కేందుకు పిల్లల ఎదురుచూపుల గురించి, తండాల్లోని ఆడ, మగ పిల్లలు ఇంటి పనుల బాధ్యతను, తమ్ముళ్ల, చెల్లెళ్ల బాధ్యతను సునాయాసంగా సహజంగా నిర్వహించటం గురించి తెలుసుకోవటం ముచ్చటగా ఉంటుంది. పనిపాటల మధ్య పాదాలకు చెప్పుల అవసరం ఒకటుంటుందని కూడా వారికి తెలియదు. పట్టుబట్టీ ఉమా టీచర్ లాటివారు వాటిని అందించినా ఆ చెప్పులు నాలుగు రోజుల్లోనే గోడపక్కనో, అలమరలోనో చేరిపోతాయి. కానీ ఆడపిల్లల కాళ్లకి పది తులాల పట్ట గొలుసులు మాత్రం ఎల్లవేళలా ఉంటాయట.

‘’అవిద్యకు కారణం పేదరికం ఒక్కటే కాదు’’ అన్న అమార్త్యసేన్ మాటలని ఇక్కడ గుర్తుచేసుకుంటారు రచయిత్రి. ఎంత అర్థవంతమైన మాటలవి!

                                     తండాలలోని వారు వ్యవసాయ పనులు మొదలుపెట్టుకుని వర్షాల రాకకోసం తాము నమ్మిన కప్పల ఊరేగింపు వంటివి ఆచరిస్తారు. ఇక్కడ వాళ్ల నమ్మకాల పట్ల విమర్శ కాక తమ సమస్య పరిష్కారానికి సంఘటితమైన వారి ఐక్యత గురించి రచయిత్రి ప్రశంసించారు. 

బస్సు సౌకర్యం లేని గ్రామాలలోని పిల్లలు బడికొచ్చేందుకు నడక ఒక్కటే మార్గం. బస్సు రాకపోవటానికి కారణం రోడ్లు లేకపోవటం అయితే రోడ్లు వెయ్యవలసిన బాధ్యత ప్రభుత్వానిదే కదా అంటారామె. ఆయా గ్రామాల్లోని వారు బతుకమ్మ పండుగను, ఇంకా వారివే అయిన అనేక పండుగలను చేసుకోవటాన్ని చెబుతూ, ప్రభుత్వం ఇచ్చిన పండుగ సెలవులను దాటి మరిన్ని పిల్లలే తీసేసుకుంటూ ఉంటారన్నారు. 

తల్లిదండ్రుల్లేని పిల్లల అవస్థ గురించి చెబుతూ, ‘’అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా’’ అన్న దీవెనలోని అంతరార్థం తనకు అలాటి పిల్లల్ని చూసినప్పుడే అర్థమయిందని రచయిత్రి అంటారు. తండ్రి లేకపోయినా బిడ్డకు తల్లి ఆదరణ దొరుకుతుంది. తల్లి లేని బిడ్డలకు మాత్రం మేనత్తలో, పిన్నులో, పెద్దమ్మలో, నానమ్మలో, అమ్మమ్మలో ఆదరించవలసిన అవసరం తప్పనిసరి అవుతుంది.

క్షేత్ర పర్యటన పేరుతో వివిధ ప్రదేశాలకు బడి పిల్లల్ని తీసుకెళ్లటం ఖర్చు తో కూడినది అవటంవల్ల పిల్లలను వారి పొలాలకు తీసుకెళ్లి వ్యవసాయం గురించిన వివరాలను తెలిసేలా చేసారు రచయిత్రి. ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవటం టీచర్ సమయస్ఫూర్తికి నిదర్శనం.

                                ప్రభుత్వ పాఠాశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో ప్రతిరోజూ ఎంతమందికి వండిస్తున్నారన్నది, ఎంత పరిమాణంలో ఆహార పదార్థాలను వినియోగిస్తున్నారన్న వివరాలు ఎప్పటికప్పుడు డి.ఈ.వో. కార్యాలయానికి పంపవలసి ఉంటుంది. అయితే, ఏ కులాలవారు ఎందరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారన్న వివరాలు నమోదు చెయ్యవలసి రావటం పట్ల రచయిత్రి ఆవేదన వ్యక్తం చేసారు. కుల, మతాలకు అతీతమైనదని చెప్పే భారతదేశంలో ఈ వివరాలను ఇంత కచ్చితంగా ఈ శతాబ్దంలోనూ నమోదు చెయ్యాలన్నది ఆలోచనాపరులైన ఎవ్వరైనా నిరశించే అంశమే.

చదువుల ప్రాధాన్యతను కొంతవరకు అర్థం చేసుకుంటున్నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు పల్లెల్లోని ఆడపిల్లలను కూలీపనులకు పంపక తప్పటం లేదు. వారి చదువు కుంటుపడకా తప్పట్లేదు. అలాగే మగపిల్లలు ఆటో డ్రైవింగో, మరొక పనో నేర్చుకోక తప్పని పరిస్థితులు. ఇంటి ఆర్థికభారం మోసే క్రమంలో పిల్లల చదువు వెనకపడటం తప్పదు. కానీ వారి వెనుకబడిన చదువులకు కారణంగా నింద మోస్తున్నది మాత్రం ప్రభుత్వ బడుల్లో టీచర్లు. వాళ్లు ఏమీ చెప్పరట! 

                                    బడిలో ఏ కార్యక్రమానికైనా పిల్లలే ముందుండి తమ శ్రమదానంతో కార్యక్రమాన్ని నడిపిస్తారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఎలాటి పనికైనా సిధ్ధపడే ఆ పిల్లల పని సంస్కృతి ఎంతైనా ప్రశంసించదగ్గది. ఉదాహరణకి, కొత్త సంవత్సరం మొదలవుతుంటే మండల కేంద్రం నుండి కట్టలుకట్టలుగా బడికి చేరే పుస్తకాల దొంతరలను ఆఫీసు గదుల్లోకి చేర్చటం, ఆనక వాటిని తరగతి గదుల్లోని టేబిళ్లపైకి చేర్చటం, భోజనపథకానికి అవసరమైన వస్తుసామగ్రి బడికి చేరగానే వాటిని లోపలికి చేర్చటం, బడి పండుగ సమయాల్లో బడినంతటినీ శుభ్రపరచి, అలంకరించటం! ఎన్నని చెప్పాలి ఆ లేత భుజాలు, చేతులు ఆనందంగా పంచుకునే బాధ్యతలని!?

ఆ మారుమూల గ్రామాల్లో డాక్టర్ సదుపాయం, కనీసం ప్రాణావసరమైన మందులు దొరికే అవకాశం లేదు. అలాగే ఆడపిల్లలకు నెలవారీ అవసరమైన న్యాప్కిన్లు దొరకవు. కానీ చౌకరకం తినుబండారాలు మాత్రం గుట్టలుగా దొరుకుతాయి. అల్కహాల్, పాన్ పరాగ్ లు కూడా దొరుకుతాయి. వీటి అమ్మకంపై ఎలాటి కట్టడి ఉండదు. ఆకలికి ఆగలేక ఇంట్లో అడిగి తెచ్చుకున్న ఐదు, పది రూపాయలతో వీటిని కొనుక్కుని తినే పిల్లల ఆరోగ్యాలు ఎవరు పట్టించుకుంటారు? మన సంక్షేమ ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం కోసం తీసుకుంటున్న చర్యలేమిటో అంతుబట్టదు మరి.

ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు పల్స్ పోలియో, ఓటర్ల దినం, వన సంరక్షణా వారోత్సవాలు…వీటన్నిటికి బడిపిల్లలే ర్యాలీలు నడపాలి. వారి లేత శరీరాలు ఎండలో పడే శ్రమ చూసేందుకే కష్టం. ఇలాటి బాధ్యతలు వారికి అప్పగించటం అనాలోచిత చర్య కాదూ?

                                   రచయిత్రి తనకున్న గుడ్ విల్ తో స్నేహితుల ద్వారా తను పనిచేస్తున్న బడి పిల్లలకి అవసరం అయిన లో దుస్తులు, సైకిళ్లు వంటివి ఇప్పించగలిగారు. ఒక్కక్క విజయ గాథ వెనుక ఉమా టీచర్ సంకల్పంతో పాటు ఎందరెందరి అమృత హృదయాల సాయం ఉందో!

                                   ప్రతి బడిలోనూ కనిపించే టీచర్ల కొరత మిగిలిన టీచర్ల మీద ఒత్తిడిని తెస్తూ, పిల్లల చదువు మీద ప్రభావాన్ని చూబిస్తోంది. బడికి కావలసిన కనీసావసరాల పట్ల శ్రధ్ధవహిస్తే ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన చదువును అందించగలుగుతాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నారు. 

మాతృభాషలో చదివించుకోవాలనే వారి ఆశ ఎలా తీరుతుంది. ప్రాథమిక స్థాయిలో పిల్లలు తమ ఆలోచనలను వ్యక్తపరుచుకుందుకు మాతృభాషను మించిన భాష ఉందా? ఇలాటి నిర్ణయాలు తీసుకునేప్పుడు ప్రభుత్వం విద్యావేత్తల, తల్లిదండ్రుల, టీచర్ల అభిప్రాయాన్ని తీసుకుంటే అందరికీ ఆమోదయోగ్యమైన మార్గం దొరుకుతుంది. ఈ విషయం పట్ల సరైన నిర్ణయం తీసుకుందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి.

                                      పదవ తరగతి పిల్లలు పబ్లిక్ పరీక్షల ముందు కుల ధృవీకరణ పత్రాల కోసం మండల ఆఫీసుల చుట్టూ పదేపదే తిరగవలసి రావటం వలన వారికి సమయం, డబ్బు కూడా వృధా అవుతుంటాయి. దీనికి పరిష్కారంగా ఒక ఫీల్డ్ ఆఫీసర్, క్లర్క్, కెమెరామెన్ బడికి వస్తే పిల్లలందరికీ ఉపయోగకరంగా ఉంటుందని రచయిత్రి సూచించారు. అదే పద్ధతిలో ఆధార్, ఆదాయ, వికలాంగ సర్టిఫికెట్లు కూడా అందిస్తే ఎందరికో ప్రయోజనకారిగా ఉంటుంది. రోజువారీ పనులకెళ్లేవారికి ఆయా సర్టిఫికెట్లకోసం తిరిగే శ్రమ తప్పుతుంది.

కొందరు పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న బడుల్లో గాంధీజీ వంటి దేశ నాయకుల విగ్రహాలను ప్రతిష్టించేందుకు కృషి చేస్తున్నారని రచయిత్రి గమనించారు. వేలకొద్దీ డబ్బును ఆ విగ్రహాల నిర్మాణానికి ఖర్చు చేసే బదులుగా బడికి అవసరమైన ల్యాబ్, లైబ్రరీ వంటి వాటిని సమకూర్చి పెడితే పిల్లలు మరిన్ని విషయాలను నేర్చుకునే వీలుంటుందంటారామె. మన బడుల్లో ఇలాటి సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి. కంప్యూటర్లను బడులలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం వాటిని ఉపయోగించుకునేలా తగిన సౌకర్యాలను నిరంతరంగా అందించవలసి ఉంది. 

                                  రచయిత్రి బడికి, పిల్లలకి అవసరమైన ఎన్నో సూచనలు చేసారు. పాత రికార్డులను కంప్యూటరైజ్ చేసి భద్రపరచవలసిన అవసరం గురించి చెప్పారు. పాత విద్యార్థులు తమ సర్టిఫికెట్ల కోసం వచ్చినప్పుడు అవి సరైన స్థితిలో అందుబాటులో ఉండక ఇబ్బంది పడటం జరుగుతుంటుంది. అలాగే బడి రికార్డులలో పిల్లల గురించిన వివరాలను పొందుపరిచేటప్పుడు కేవలం వారి పేరు, తల్లిదండ్రుల వివరాలవంటివే కాక ఆయా పిల్లల ఆర్థిక, శారీరక, ఆరోగ్య స్థితిని, వారి బలాబలాలను కూడా పొందుపరిస్తే టీచర్లు కొత్తవారు వచ్చినా ఆ పిల్లల పట్ల సమగ్ర అవగాహన ఉంటుంది.

విద్యార్థులతో తన అనుబంధాన్ని తెలిపే ఎన్నో విషయాలను పంచుకున్నారు రచయిత్రి. ఒక బడి వదిలి, పిల్లలకి వీడ్కోలు చెప్పినప్పుడు వెంటబడి, ఏడ్చే పిల్లలు ఆ వెంటనే వచ్చే కొత్త టీచర్ తో ఎంత త్వరగా అనుబంధాన్ని అల్లుకుంటారో చెబుతారు. అలాగే ఆ తండాల్లోని పెద్దలు కూడా ఎన్నో అమాయకమైన ప్రశ్నలను అడుగుతుండేవారని చెబుతారు. ఒక విద్యార్థి ఆధార్ కార్డ్ కోసం కబురంపినపుడు ఆ విద్యార్థి నాయనమ్మ పిల్లవాడిది కాక తన కొడుకు ఆధార్ కార్డ్ తీసుకురావటం, అది కాదు విద్యార్థి స్వంత ఆధార్ కార్డ్ కావాలన్నప్పుడు ఒక్కక్కరికీ ఒక్కక్క ఆధార్ ఉన్నట్టే ఒక్కక్క రేషన్ కార్డ్ ఇచ్చి, నెలవారీ సరుకులు ఇవ్వచ్చు కదా అని టీచర్ని అడగటం చూస్తే వారి అవసరాలు, పేదరికం, అవిద్య కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. 

                                   మొత్తానికి ఈ పుస్తకం చదవటం నిజంగా ఒక మంచి అనుభవం. ఈ పుస్తకానికి ఉన్న మరొక ప్రత్యేకత పుస్తకం నిండా ఆయా సంఘటనలు, సన్నివేశాలను కళ్లకు కడుతూ ప్రచురించిన అందమైన ఫోటోలు! ఇవి పుస్తకానికి మరింత బలాన్నిచ్చాయంటే అతిశయం కాదు. రెండువందల యాభై పేజీలున్న ఈ పుస్తకం గురించి ఇంకా ఎన్నో చెప్పేయ్యాలని ఉంది. ఒక్కో విషయం రాయమంటూ తోసుకు వస్తున్నాయి. కాని అన్నింటినీ నేను చెప్పేకంటే పుస్తకం చదవటమే న్యాయం. అసలు ఇప్పటికే చాలా రాసేను కదూ.

మంచి పఠనానుభవాన్నిచ్చిన రచయిత్రికి అభినందనలు.

****

Please follow and like us:

2 thoughts on “”మా పిల్లల ముచ్చట్లు” పుస్తక సమీక్ష”

  1. Being a school teacher myself for more than 3 decades, I loved reading the review. I realised how beautiful the original work would be!!! School children bring mothers out of us with their innocence and love..

Leave a Reply

Your email address will not be published.