పేషంట్ చెప్పే కథలు – 2

యామిని

ఆలూరి విజయలక్ష్మి

          చల్లగాలి వెర్రెత్తినట్టు వీస్తూంది.
          “నమస్తే డాక్టర్!” చేతులు జోడిస్తూ లోపలికి వచ్చాడు మురళి.

          “హలో! రండి రండి, యామిని కూడా వచ్చిందా?”

          “వచ్చింది.” అతను చెప్పేంతలో యామిని కూడా లోపలికి వచ్చింది.

          “ఎమ్మా? ఎప్పుడొచ్చారు? పిల్లలు బావున్నారా?” చిరునవ్వుతో మౌనంగా తలూపింది యామిని. మాట్లాడని మల్లెమొగ్గ యామిని. వెన్నెల్లాంటి చిరునవ్వుతో పలకరిస్తుంది. కళలు కనే కళ్ళతో మాట్లాడుతుంది. అవి చూసి ముచ్చటపడే, పెద్దగా చదువు లేక పోయినా, చూడగానే నిలబెట్టే అందం లేకపోయినా బిలాయిలో మంచి ఉద్యోగంలో వున్న మురళి యామినీని కోరి చేసుకున్నాడు.

          “నాకు కొంచెం పనుంది. ఇప్పుడే వచ్చేస్తాను. ఒకసారి యామినీని పరీక్ష చెయ్యండి డాక్టర్” మురళి లేచాడు.

          “నాకేం జబ్బులేదు. ఇప్పుడు పరీక్షలెందుకు?” తీక్షణంగా చూస్తూ కరుగ్గా అడిగింది యామిని. క్షణంలో అంతలా మారిపోయిన యామిని వంక తెల్లబోయి చూస్తోంది శృతి. యామిని పెళ్ళవక ముందు నుంచి శృతికి తెలుసు. యామిని పిల్లలిద్దరూ శృతి నర్సింగ్ హోంలోనే పుట్టారు. యామిని ప్రవృత్తి, ప్రవర్తన క్షుణ్ణంగా తెలిసిన శృతి యామినీలోని మార్పును విస్మయంగా గమనించింది. అసహజంగా వున్నా నవ్వు, అస్థిరంగా చలిస్తున్న కళ్ళు, శరీరంలో సన్నటి కంపనం, పదునుగా, ఎక్కువగా, నిర్లక్ష్యంగా మాట్లాడడం. మరునాడు మురళీతో మాట్లాడాకగాని కొంత వరకు కారణం తెలియలేదు శ్రుతికి.

          మొదటి నుంచి ఎవరితోనూ కలవకుండా, అంటిముట్టనట్లు ఉంటే యామిని పర రాష్ట్రంలో భాష తెలియక కొంత, స్వభావ రీత్యా కొంత- ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరి తనాన్ని ఆశ్రయించింది. చలాకీగా, చొరవగా వుండే ఇరుగు పొరుగు ఆడవాళ్ళూ దగ్గరవు దామని ప్రయత్నించినా అందరికీ దూరంగా ఉండిపోయింది. భర్త, పిల్లలు – వీళ్ళ చుట్టూ గిరి గీసుకుని ఆ గిరిలోపలే బ్రతకడం అలవాటు చేసుకుంది. అందంగా హుందాగా, ఎప్పుడూ గలగలా నవ్వుతూ కబుర్లు చెప్పే మురళి అందరికీ సన్నిహితుడు. అతనితో మాట్లాడడమంటే అందరికీ ఆసక్తి. తీరిక సమయాల్లో అందరూ కలిసి హుషారుగా కబుర్లు చెప్పుకుంటుంటే యామిని ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చునేది. వాళ్ళు పలకరించే కొద్ది ముడుచుకుపోయేది. ఆమెని నవ్వించుదామని ఛలోక్తులు విసిరితే తనని అపహాస్యం చేస్తున్నట్లు భావించి బాధపడేది. తమ క్వార్ట్రర్ ప్రక్క ఖాళీస్థలంలో షటిల్ కోర్టు వేసి ఆడ, మగ అందరూ కలిసి ఆడుకుంటూంటే తాను ఒంటరిగా రూంలో కూర్చుని వాళ్ళ నవ్వులు వింటూ ఏవేవో వూహించుకుంటుంది.

          “తను ఎంత ఫూలిష్ గా ఊహించుకుని భాదపడుతూందో తన కర్థం కావడం లేదండి. ఇరుగు పొరుగు వాళ్ళంతా తనను గురించే హేళనగా చెప్పుకుంటున్నట్లు, ఆ మాటలన్నీ తనకు వినబడుతున్నట్లు భ్రమపడుతుంది. చెవులు రిక్కించి ఆలకిస్తూ, చుట్టూ నిశబ్ధంగా ఉన్నాసరే, తననెవరో వెక్కిరిస్తున్నట్లు ఫీలయి, ఉద్రేకపడిపోయి, వేర్రెత్తినట్లు ఇరుగు పొరుగు వాళ్ళను పేరు పేరునా తిట్టడం మొదలు పెడుతుంది. ఆడవాళ్లేవరు నాతో మాట్లాడినా మరీ రెచ్చిపోతుంది. తన ప్రవర్తనవల్ల పరువు గంగలో కలిసిపోయింది. అంత కన్నా ఎక్కువ బాధ… పిల్లల భవిష్యత్తు పాడయి పోతూంది. ఎదుగుతున్న పిల్లల మీద తన ప్రవర్తన ఎలాంటి భయంకరమైన ప్రభావాన్ని కలిగిస్తుందో గుర్తించడం లేదు. తనిలా అయినప్పటి నుంచి వాళ్ళు ఉత్సాహం చచ్చిపోయి డల్ గా అయిపోతున్నారు. తల్లిని చూస్తేనే వాళ్ళ ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించే టెన్షన్ ని చూడగానే నా గుండెనెవరో బలంగా నలిపినట్లుగా వుంటుంది.” మురళి కంఠం వణికింది.

          “సున్నితమైన స్వభావం. తాను గీసుకున్న గిరిలోపల నుంచి బయటి విశాల ప్రపంచమువైపు తొంగిచూడక పోవడం, ఇంఫీరియారిటి కాంప్లెక్స్, మీరు దూర మవుతారేమోనన్న భయం, ఎక్కువగా ఆలోచించడం, ఊహించుకోవడం… యామిని మనసు నలిగిపోతూంది. ప్రేమగా ఉండడం, నెమ్మదిగా నచ్చజెప్పడం…” శృతి మాటలకు మధ్యలోనే అడ్డొచ్చాడు మురళి.

          “నచ్చచెప్పడానికి ప్రయత్నించానండి. నయానా, భయానా ఎలా చెప్పినా నా మాటల్ని విపరీతంగా తీసుకుని బాధపడడం, రెచ్చిపోవడం… ఇంక విసిగిపోయాన్నేను… తనకు మీ మాటంటే చాలా గురి. మీరు చెప్తేనన్నా వింటుందేమోనన్న ఆశతో లీవ్ తీసుకుని వెంటబెట్టుకుని వచ్చాను. తన భ్రమల్ని విడగొట్టి మామూలుగా చేసేభారం మీదే,” ప్రాధేయపడుతున్న మురళి చిరుతకల్లు రెండూ తనపై నిప్పుల వర్షం కురిపించడం చూసి ఆగిపోయాడు. ఎప్పుడు వచ్చిందో యామిని గుమ్మం దగ్గర నుంచుని మురళి వంక సూటిగా చూస్తోంది.

          “రామ్మా!” యామినీని ఆప్యాయంగా పిలిచింది శృతి. శృతి పైన కళ్ళతో చురకత్తులు విసిరి గిర్రున వెనక్కు తిరిగి వెళ్లిపోయింది యామిని. శృతి తేరుకుంటానికో నిమిషం పట్టింది.

          “మీరేం వర్రీ కావద్దు. యామినికి నేను నచ్చజెప్తాను. సైకియాట్రిస్ట్ ని సంప్రదిద్దాం. తప్పకుండా బాగవుతుంది”. మురళిని ఓదార్చసాగింది శృతి.

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.