క’వన’ కోకిలలు – 12 : 

సమకాలీన సాహిత్య ప్రస్థానంలో భారతీయ ఆంగ్ల కవయిత్రులు

   – నాగరాజు రామస్వామి

For women, poetry is not a luxury. It is a vital necessity of our existence.  

            – Audre Lorde, Black American Poetess. 

          సాహిత్యాకాశం లో కవిత్వం నిండు జాబిలి. అన్ని ప్రక్రియల్లోకి మేలిమి. కవిత్వ రచనలో, ముఖ్యంగా ఆంగ్ల కవిత్వ రచనలో  స్త్రీల కన్నా పురుషులు ముందంజలో ఉన్నారనడం ఇప్పుడు వీగిపోతున్న వాదం. భారతీయ ఆంగ్ల కవయిత్రుల మైనారిటీ మెజారిటీ కేసి విస్తరిస్తున్నది. ఎందరో కవయిత్రులు స్త్రీవాద పొలిమేరలు దాటి ఆధునిక/ అధునికానంతర ఆవరణంలో వెలిగిపోతున్నారు. శుభపరిణామం. 

          అలాంటి కొందరి ఆంగ్ల కవితలకు నా తెలుగు సేత.

రాకాసి కలబంద:

(Agave – Anindita Sengupta)

ఇది 

ఒక్క సారి మాత్రమే పూసి

మరణించే ఓషధి.

దీనికీ ఓ లెక్కుంది;

దాని నూరేళ్ళ బతుకులో 

ఒకే పూత, ఒకే ఒక పువ్వు!

ఒకసారి నా కారు 

రాకాసి రెడ్ లైట్ సన్ సెట్ సమీపంలో ఆగిపోయింది.

అక్కడి 

పైమెరపుల నంగనాచి నెరజాణలు

మిత్రులేం కారు;

వాళ్ళ వగల తిరుగుళ్ళ లో చిక్కుకుంటే

బయటపడడం సులభం కాదు.

ఒక్కోసారి కొసరంత నవ్వు 

కొంపనే ముంచేస్తుంది మరి.

బేస్ బాల్ చీర్ గర్ల కు, 

హాలోవిన్ వేషధారులకు, 

వీధి నాటక నాట్యకత్తెలకు 

నప్పుతాయేమో కాని 

ఆ తళుకుబెళుకుల సెక్సీ దుస్తులు

అందరకీ సరిపడవు;

కిలాడీలు వాళ్ళు.

అందుకే నడు 

కారును హైగేర్లో వేసి రోడ్డున పడు.

కోర్కె కోడిగుడ్డు;

ఆ ఎడారి వేడిలో 

తెల్లసొన ఎప్పుడైనా గడ్డకట్టొచ్చు.

          అనిందిత సేన్ గుప్త 2010 లో City of Water , 2016 లో Walk Like Monster అనే రచనలను వెలువరించింది. High Desert Journal, One, Electica, Asian Cha లాంటి పలు ప్రసిద్ధ పత్రికల్లో ఆమె కవితలు ప్రచురించబడ్డాయి. ఆమె website : www.aninditasengupta.com.

అంతస్ఫోటనం:

(Implosion – Menka Shivdasani)

చెప్పాల్సింది ఎంతో వున్నా

నీవు ఎవరికీ చెప్పాపెట్టకుండా 

తాళం వేసిన తలుపు చెంతకు చేరుకుంటావు

తుప్పు పట్టిన తాళంచెవిని నీ నాలుక మీద గీరుకుంటున్నట్టు, 

తాళం తెరచుకుంటున్నట్టు ఊహించుకుంటావు.

రెపరెపలాడుతున్న సీతాకోక చిలుకలా 

నిశ్శబ్దం లేచి వచ్చి తలుపు చెక్క మీద వాలి

నిరంతరంగా బొమ్మలను చెక్కుతుంటుంది.

ఈ భయద కంపనాలు కుతర్కాలకందనివి;

పైకి పాకనే లేదు అణ్వస్త్రాల ధూళి 

బాంబుల దాడికి పెచ్చులూడుతున్న గోడల్లా

వాళ్ళు రాలిపడుతూ 

నీ నాలుక మీద బొగ్గును పులుముతుంటారు. 

ఫ్లెమింగోలు మన సిటీని వదిలి వెళ్ళాయి;

ఐనా, చిత్తడి నేలల బురదనీరు నా గొంతులో 

గలగలలాడుతూనే వున్నది.

ఇప్పుడు 

తాళాన్ని బద్దలుకొట్టి తలుపులు తెరిచారు

కాని 

నిశ్శబ్దం ఇంకా పొగమసిలా అంటుకునే వుంది. 

          మేన్క శివదసాని Nirvana at Ten Rupees, Stet and Safe House, మరో మూడు కవితా సంకలనాలను ప్రచురించింది. సింధీ కవిత్వ సంపుటి Freedom and Fissures కు సహానువాదం చేయగా, సాహిత్య అకాడెమీ దాన్ని ముద్రించింది. వందకు పైగా ఉన్న కవుల కూటమికి ముంబాయి కేంద్ర సమన్వయకర్తగా వ్యవహరించింది. హాంకాంగ్ నుండి South China Morning Post అనే పత్రికను నడిపింది. పలు మహిళా కవన సంకలనాలకు ఎడిటింగ్ చేసింది. రెండు సమకాలీన భారతీయ కవితా సంపుటాలను వెలువరించింది. 

పవిత్రంగా ఉంటూ ఉంటూ అలసిన అమ్మోరు:

(The Goddess Tires of Being Holy) – Vandana Khanna

నిన్ను నీవు అమ్మాయివని పిలుచుకుంటావో

అమ్మోరు అని పిలువమంటావో 

నీ ఇష్టం

నిజానికి నిన్నెవరూ ప్రేమించడం లేదు

అది వాస్తవం.

నిన్ను పునీతను చేసేందుకు, 

శూన్యీకరించేందుకు, పరిపూరించేందుకు

సరిపోయేంత పుత్తడి ఏ పుడమి మీదా లేదు.

నీ ముఖం పులుముకున్న మసి మరకలను తుడిచేసి

మెరుగులద్దే మైపూత ఇంకా పుట్టలేదు

ఏవో కొన్ని వాడి ముళ్ళు, కొంత బంతిపూల ధూళి తప్ప. 

అవే సుమా నీ దేబరింపుకు దక్కే ఉపాదానాలు. 

అంతరిక్షం నుండి, ఆకాశ మేఘాలలోంచి 

నీపై చూపు సారిస్తున్న ప్రతి దేవుడికీ

నీవొక నొప్పింపక తప్పని పచ్చి పుండువే!

నీ చర్మం కింద సలుపుతున్న గాయానికి 

నీ రక్తం తుకతుక మరుగు తున్నా

నీవు గ్రహించవు గాని

నీ దేవుళ్ళు నిన్నెప్పుడూ కాల్చుకుతింటూనే వుంటారు. 

          వందనా ఖన్న న్యూడిల్లీ లో జన్మించింది. Train to Agra, Afternoon Masala, The Goddess Monologues ఆమె ముఖ్య గ్రంథాలు. NewEngland Review, The Missouri Review, Pleiades వంటి శ్రేష్ఠ జర్నల్లలో ఆమె కవితలు వచ్చాయి. 

చాలు చాలు: 

( Enough ) – A poem by Usha Akella

చాలు చాలు

ఇక గొంతెత్తుదాం.

పద, వెళ్ళి వెనక్కు తీసుకొద్దాం

పంజరంలో బందీ ఐన మన పిల్లలను

పొద్దుతిరుగుడు పూల చేలకు.

వాన చినుకులను ఒడిసి పట్టుకుంటున్న 

తెరచిన అరచేతుల్లా

విప్పి పరుద్దాం మన నేలను. 

ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేపపిల్లలా

ఇసుక నేలను కరచుకొని

నీలి చెడ్డీలో నిర్జీవ ఐలాన్! 

గుల్సోమా, ఏడేళ్ళ పాప,

ఆమె చిట్లిన వీపు మీద 

చేప పొలుసుల్లా గాయాల మరకలు;

ఏదీ ఆమె పెళ్ళి ముందటి లేత నవ్వు! 

అసీఫా బానో! 

గులాబి బుగ్గల, కువకువల కూన! 

మతమృగాల బారినపడి చితికిన 

ఎనిమిదేళ్ళ పసికాళ్ళ బాల! 

రండి తీసుకొద్దాం

మట్టి పొరల మడతల్లో చుట్టబడిన 

పసి పాపల మృత దేహాలను, 

అడవికెల్లి తిరిగిరాని బరికాళ్ళ బానోను; 

ఆమె కాల్చాలిగా 

అగ్నిసెగ మీద అడవి బాదంకాయలను. 

ఇక మీదట 

మలాలా తలలోంచి బుల్లెట్లు దూసుకుపోవద్దు,

కార్లా వేల మానభంగాల ఊసెత్తొద్దు,

పసి పిల్లలు తమ దయనీయ గాధల్ని విప్పొద్దు;

ఆ అవసరం రావొద్దు. 

రండి వేలాడ తీద్దాం  

చెట్టున కుళ్లిన పళ్ల లాంటి 

అపహర్తలను, అవినీతి పోలీసులను, 

కన్న బిడ్డలను కడతేర్చే తల్లులను, తండ్రులను, 

అక్క చెల్లెలను అమ్మేసే అన్నదమ్ములను,

అత్యారం చేసే మగమృగాలను, 

అమానవీయ మత జాగిలాలను. 

అన్నన్ని కన్నులున్న ఆక్టోపస్ లా 

అన్నీ గ్రహించగల మనం 

ఈ అమానుషం ఇక చాలు చాలని

ఇంకా ఎలుగెత్తడం లేదేమిటి? 

          శ్రీమతి ఉష ఆకెల్ల గారు ఆస్టిన్ నివాసి. ఇంగ్లీషులో కవిత్వం రాస్తుంటారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి సృజనాత్మక కవిత్వ రచన (Creative writing)లో మాస్టర్స్ చేశారు. ఇప్పటికి 5 కవిత్వ సంకలనాలు వేశారు. ఒక నృత్య నాటికను రాసి ప్రదర్శించారు. 2019 లో ఆమె పుస్తకం “The Waiting” కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురించింది. Matwaala.comthe-pov.com  ద్వారా ప్రముఖుల ఇంటర్వ్యూలు చేసి ప్రచురిస్తుంటారు. అనేక అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. సాహిత్య ఆహ్వానాలు అందుకొని, రొమేనియా, కెనడా, స్లొవేకియా, నికరాగువా, కొలంబియా, ఇండియా లాంటి పలు దేశాలను సందర్శించారు. ఆమె సాహిత్యకారిణి మాత్రమే కాక, స్త్రీవాద కార్యశీలి కూడా. Creative Ambassador of Austin గా ప్రసిద్ధులు. వారి చైతన్య స్ఫూర్తి ఫలితంగా, ఆస్టిన్ వాసులు జనవరి 27ను Poetry Carven Day గా ప్రకటించుకున్నారు.

అ’భాస’:

(Decomposition) – Minal Hajratwala

“ఇక్కడ ఉన్నాం కనుక, ఈ అమెరికన్ బాసలోనే మాట్లాడుకుందాం” – Sarah Palin

జాగ్రత్త:

ఈ ఇంగ్లీషులు 

ఈగల్లా ముసురుకుంటున్నవి,

నీ జున్నుగడ్డ మీద జోరీగల్లా మూగుతున్నవి,

నీ పిక్నిక్ లను కొల్లకొడుతున్నవి.

బ్లాక్ అమెరికన్ ‘గీచీ’ కంఠజీర, 

టర్కిష్ ‘ఇంగిలాజ్కా’, కొరియన్ ‘కంగోలిష్’, 

నార్వే ‘స్కౌస్’ యాస భాష, 

మళయాళ మణిప్రవాళం

ఇవన్నీ నీ కప్ కేకులను నాకేస్తున్నవి.

ఓ ‘పకేహా’న్యూన్యూజిలాండర్! 

ఇబ్బందిగా లేవా 

నీకీ గజిబిజి రాతల గొలుసుకట్టు మాటలు?

ఓ హవాయియన్ ‘పాలినీసియన్!’ 

ఓ ‘స్వహేలీ’ ప్రవాస వాసీ! 

ఏమున్నది 

అంటుగట్టిన మీ పెరటి మొక్కల్లో?

చూడు

ఈ ఆంగ్లాలన్నీ తేనెటీగల్లా రొదచేస్తున్నవి,

వార్తావనిలో 

మిశ్రిత సంకర భాషల, మాండలికాల,

వ్యర్థ వాక్యాంత ప్రాసల, ఏటవాలు లయల

పరభాషా సంపర్కం కొనసాగుతున్నది.

ఇయాంబిక్ ఛందశ్శకలాలు 

హార్డ్ రాక్ బాండ్ లో కవాతు చేస్తున్నవి.

అందుకే 

ఈ మిశ్రభాషా రసకషాయాన్ని దిగమింగు,

ఈ అమెరికన్ అభాసల వక్ర యమకగమకాలను 

పట్టీపట్టనట్టు నోరుమూసుకొని వింటూ

కులాసాగా కూనిరాగాలు తీస్తూ ఆనందించు. 

          మినాల్ హజ్రత్ వాలా: Leaving India: My Family’s Journey from Five Villages to Five Continents, Stories from the New Queer India వంటి పలు గ్రంథాలు రచించింది. అనేక  పురస్కారాలు ఆమెను వరించాయి. సహసంస్థాపక సంపాదకురాలిగా ఆమె సంకలించిన The (Great) Indian Poetry వర్ధమాన కవుల పాలిట కరదీపికగా వెలుగొందింది.

వర్ష కాంక్ష :

(Rain I- Priya Sarukkai Chabria)

చిరు వర్షమా!

రా

నిమురు నీ తడితడి మునివేళ్ళ తో నా తనువును,

నియంత్రించు నా నిట్టూర్పులను.

కురువకున్నవి నీ నీటి బిందువులు;

ఈ వర్షాభావం నా దేహాన్ని దహిస్తున్నది,

నీ ఆర్ద్రతను ఆకాంక్షించే నా చర్మం

మండుతూ, ఎండుతూ, హిమ తుషారాన్ని మోస్తూ,

లోలోన ఆతప గీతాలను గొణుక్కుంటూ.

భస్మరేకుల ధూళి రాలుతున్నది,

నా రోమకూపాలు రగులుతున్నవి.

వేచి ఉంటాను 

నీ దేహ పరిమళం ద్రవీభవించేదాకా,

జలతలంపై నీ నీటి నృత్యం ముగిసేదాకా,

చీల్చివేతల నీ మెరుపు శూలం

నన్ను మరో ఆకలిలోకి నెట్టేసే దాకా. 

          ప్రియ సరుక్కాయ్ చాబ్రియ బహు పురస్కారాలు పొందిన రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు. ఆమె ఫిక్షన్, నాన్ ఫిక్షన్, నవల, కవిత్వం లాంటి అన్ని సాహిత్య ప్రక్రియల్లో దిట్ట. రెండు కవితా సంకలనాలను వెలువరించింది. ఆమె అనువాదాలలో ఆశ్వార్ ఆండాల్ ఆత్మకథ (The Autobiograpphy of Goddess) ముఖ్యమైనది. ఆమె రచనలు యూరప్, అమెరికా, ఇండియాకు చెందిన అనేక అంతర్జాల పత్రికల్లో ప్రచురించబడ్డాయి. నాట్యం, ఫోటోగ్రఫి, పెయింటింగ్ లలో ప్రసిద్ధి పొందిన పలు కళాకారులతో సాగంత్యం పెంచుకొని ఫిల్మ్ క్లబ్ స్థాపించింది. సురేష్ చాబ్రయా దర్శకత్వంలో తెరకెక్కిన ఆమె లఘుచిత్రం “ధార” 1989 లో జర్మన్ చలనచిత్ర మహోత్సవంలో ప్రదర్శించబడింది. బుద్ధ జాతక కథలను చదువాలని పాళీ భాష నేర్చుకుంది.

          తోరూదత్ తొలి భారతీయ ఆంగ్ల కవయిత్రి. కమలా దాస్, లీలా రాయ్, మోనికావర్మ, గౌరీ దేశ్ పాండే, యూనిస్ డి సౌజా, సరోజినీ నాయుడు వంటి అనేక విదుషీమణులు భారతీయ ఆంగ్ల సాహిత్య ఆకాశాన్ని వెలిగించారు. నేటి అనేకానేక భారత ఆంగ్ల కవయిత్రులు సమకాలీన సాహిత్యాన్ని భారతీయం చేస్తున్నారు. శుభం.

          – ( గీతాంజలిశ్రీ రచించిన “రేత్ సమాధి” – Tomb of Sand – అంతర్జాతీయ Booker Prize 2022, గెలుచుకున్న శుభసందర్భాన్ని గుర్తుచేసుకుంటూ …..)

*****                  

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.