(పరిపూర్ణ కథల్లో స్త్రీ పాత్రలు : ఒక పరిశీలన)

అసమానత నుంచి సాధికారత దిశగా

-ఎ. కె. ప్రభాకర్

          నంబూరి పరిపూర్ణ – ఈ పేరు తలుచుకోగానే నాకు నిండైన ఒక స్త్రీ మూర్తి కళ్ళ ముందు సాక్షాత్కారమౌతుంది. అనేకమైన ఒడిదుడుకుల నధిగమించి జీవిత శిఖరాల నధిరోహించిన ధీశాలిని దర్శనమిస్తుంది. నటిగా, గాయనిగా రంగస్థల – సినిమా కళారంగాల్లోకి బాల్యంలోనే ప్రవేశించినప్పటికీ స్త్రీల సమస్యలపై రేడియో ప్రసంగ కర్తగా,
వ్యాసకర్తగా యుక్త వయస్సులోనే నిర్దిష్ట భావజాలంతో, తనదైన ముద్రతో పేరు తెచ్చుకున్నప్పటికీ సృజనాత్మక సాహిత్యంలోకి ఆమె ఆలస్యంగానే అడుగుపెట్టారు. ప్రగతిశీలమైన కుటుంబ నేపథ్యం – విద్యార్థి దశ నుంచే సామాజిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో ఆ జీవితం కృషిచేసిన దర్శి చెంచయ్య లాంటి విప్లవ కారుల, మహీధర
రామ్మోహన రావు వంటి అభ్యుదయ రచయితల, బాలాంత్రపు రజనీకాంతరావు, మాస్టర్ వేణు వంటి సంగీత విద్వాంసుల, వేదాంతం రాఘవయ్య వంటి కళా నిష్ణాతుల వద్ద శిక్షణ ఆమె ‘వెలుగు దారుల్లో …’ నడవడానికి తోడ్పడ్డాయి. కమ్యూనిస్టు నాయకుడు దాసరి నాగభూషణంతో సాహచర్యం – యెడబాటుల దరిమిలా వుద్యోగినిగా కుటుంబ భారాన్ని మోస్తూ, వొంటరి స్త్రీగా పురుషాధిపత్య సమాజంలో యెన్నో సవాళ్లనెదుర్కొంటూ పొందిన
జీవితానుభవం, కళ్ళ ముందే సొంత పిల్లలు కథన రంగంలో వుండటం … యివన్నీ పరిపూర్ణ గారు సృజనాత్మక రచయితగా రూపొందడానికి భూమికనేర్పరిచాయి.

          ‘ఉంటాయి మాకు ఉషస్సులు’ సంపుటికి ముందు వెనక వెలువడ్డ ఆమె ప్రతి కథలోనూ ఆమె జీవితాన్ని చదవొచ్చు. ఆమె పాత్రల్లో ఆమెను చూడొచ్చు. పాత్రల చుట్టూ అల్లిన సన్నివేశాల్లో, సంభాషణల్లో ఆమె వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. స్వీయ జీవితం నుంచే ఆమె రచయితగా స్ఫూర్తిని పొందారు. జీవితానుభవం నుంచే సామాజిక పాఠాలు నేర్చుకున్నారు. నేర్చిన పాఠాల్నే వ్యాసంగానో, కథగానో మలిచారు. ఆమె వుద్యోగ జీవితంలో తారసపడ్డ వ్యక్తులే కథల్లోకి రక్తమాంసాలతో సజీవంగా నడిచి వస్తారు.  ‘రచయిత జీవితంలో స్వయంగా అనుభవించినవో అవగాహనలోకి తెచ్చుకున్నవో అయిన వుద్వేగాల్ని పాత్రల్లో వ్యక్తీకరించినపుడు మాత్రమే ఆ పాత్రలు పాఠకుల మనస్సుకి దగ్గరై నాలుగు కాలాలు నిలిచిపోతాయ’ న్న రచనా సూత్రం యెరిగిన రచయిత్రి కావడం వల్ల పరిపూర్ణ గారు తనకు తెలిసిన జీవితం నుంచే తన పాత్రల్ని వాటి వ్యక్తిత్వాల్ని రూపొందించడానికి యత్నించారు. తానెరుగని కాల్పనిక తలంలోకి ఆమె పయనించ లేదు. తనకు అనుభూతం కాని సామాజిక సాంస్కృతిక అంశాలను ఆమె యెక్కడా ప్రస్తావించలేదు. అభూత పాత్ర పరికల్పనకు ఆమె కథల్లో చోటులేదు. వ్యక్తిగత జీవితంలో తాను పాటించిన విలువలనే, ఆదర్శాలనే ఆమె తన పాత్రలకి అద్దారు. అందువల్ల ఆమె నిర్మించిన స్త్రీ పాత్రలు అనూహ్యంగా ప్రవర్తించవు. గాల్లో చరించవు. నేల విడిచి సాము చేయవు. వాస్తవ విరుద్ధమైన సిద్ధాంతాలు ప్రకటించవు. They are all down to the earth.

***

          పరిపూర్ణ కథలన్నీ దాదాపు ‘వుమెన్ ఓరియెంటెడ్ స్టోరిసే’. ఆ కథల్లో లచ్చుప్ప, శ్యామల, శారద, అరుంధతి, ప్రమీల, భార్గవి శకుంతలమ్మ, సుజాత, విమల, మస్తాను … యిలా యెందరో స్త్రీలు తాము విశ్వసించిన నేలపై బలంగా కాలూని జీవితాల్ని గెలవడానికి పోరాడిన వాళ్ళే. స్వావలంబన కోసం అనుక్షణం సంఘర్షించినవాళ్ళే. అనుకున్నది సాధించేవరకూ పట్టు విడవని తనం వూపిరిగా బతికిన వాళ్ళ జీవితం పఠితలకు స్ఫూర్తినిస్తుంది. పరిపూర్ణ కథల్లో స్త్రీలు యెన్ని కష్టాలు యెదురైనా చలించక దైన్యాన్ని విడిచి ధైర్యంగా ముందుకు అడుగు వేసిన వాళ్ళు, అసహాయత నుంచి
స్వాధీనత వైపు నడిచిన వాళ్ళు, అసమానత్వం నుంచి సాధికారత దిశగా పయనించిన వాళ్ళు, జీవితాన్ని ప్రేమించినవాళ్లు, ప్రేమించి గెల్చినవాళ్లు.

          ఈ లక్షణాలన్నీ ‘ఎర్ర లచ్చుప్ప’ లో నిండుగా చూడగలం. మాలదాసు కుటుంబం లో పుట్టిన లచ్చుప్పకు చదువులేదు. యెనిమిదేళ్లు వచ్చేసరికి గత్తర సోకి భర్త చనిపోతే ‘బాల వితంతువు’గా వొంటరిగానే సమాజంలో ప్రతికూల పరిస్థితుల్ని యెదుర్కొంది. యవ్వన సహజమైన ప్రేమతో తనకంటే పై కులం వ్యక్తితో పెళ్లి ప్రస్తావన లేని  ‘సహజీవనం’ చేసింది. ఆ కారణంగా కుల బహిష్కరణకి గురైంది. బంధువులకు కంటైంది. కొంతకాలం తర్వాత ‘సహచరుడు’ మరో స్త్రీకి వశుడై ఆమెను పెళ్ళాడి దూరమై పోయాడు. అయినా కుంగి పోకుండా జీవితాన్ని దిద్దుకుంది. కుల వివక్షనీ, జెండర్ న్యూనతనీ అధిగమించి వూరికి సర్పంచ్ గా యెన్నికై స్వయంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆదర్శ గ్రామ పంచాయితీ అవార్డు సాధించింది. ‘చిన్నతనం నుంచీ నేను శ్రామిక స్త్రీని. అంచేత నాకు తెలిసిందల్లా కష్టపడి పనిచెయ్యటమే’ – ఈ
విశ్వాసంతో లచ్చుప్ప తనను తాను జయించింది. ఊరినీ లోకాన్నీ గెలిచింది. అయితే ఆమె గెలుపు దారిలో బలమైన సంఘర్షణ వుంది. సంయమనం వుంది.

          అరవైల నాటి లచ్చుప్ప పాత్ర ద్వారా రచయిత్రి ప్రేమ, పెళ్లి, సహజీవనం, కులాధిక్యం, గ్రామాల స్వయం సమృద్ధి వంటి అనేకాంశాలను చర్చకు పెట్టారు. కంటికి కనిపించని సాంస్కృతిక నియంత్రణలు స్త్రీల జీవితాల్ని ప్రభావితం చేస్తాయన్న
యెరుకతో రాసిన కథ యిది. బ్రాహ్మణీయ పితృస్వామ్య భావజాలం అట్టడుగు  ‘మాల దాసరి’ కుటుంబం వరకూ యెంతగా చొచ్చుకొని పోయిందో తెలుసుకోడానికి ఎర్ర లచ్చుప్ప పెద్ద వుదాహరణ.

          ‘శిఖరారోహణ’లో భార్గవి అన్ని విధాల పరిపక్వమైన ఆధునిక స్త్రీ. లచ్చుప్ప లాగానే బలమైన వ్యక్తిత్వం ఆమెది. చిన్నప్పటినుంచి తండ్రి ఆధిపత్యాన్నీ కుటుంబం పట్ల అతని ఉపేక్షాభావాన్నీ చవిచూసింది. ఇంట్లో తండ్రి వుంది కేవలం అధికారం  చెలా యించడానికే. అతనికి కుటుంబం పట్ల బాధ్యత లేదు. పైపెచ్చు తల్లీకూతుళ్లు సంపాదిస్తే దానిమీద బతుకుతూ ఊరు మీద పడి అచ్చోసిన ఆబోతులా తిరుగుతాడు. భార్గవి చిన్నతనంలోనే తన చదువు మాని చిన్న ఉద్యోగంలో చేరింది. చిన్నవాడైన  తమ్ముణ్ణి చదివించింది. ఇంటికి అండగా నిలబడింది. తండ్రి లేని లోటు తీర్చింది. ఆ
మాత్రం ఉద్యోగం కూడా చేయకూడదని తండ్రి విధించిన ఆంక్షల్ని యెదిరించింది. అతని కుట్రల్ని జయించింది. తరువాతి కాలంలో తమ్ముడు కూడా తండ్రి లాగానే ఆమెపై పెత్తనం చలాయించాలని ప్రయత్నిస్తే ఇల్లు వదిలి బయటికి వెళ్లి పోయింది. తర్వాత పై చదువులు చదివి పెద్ద ఉద్యోగం సాధించింది. పెళ్ళి చేసి ఒక అయ్య చేతిలో పెడితే బాధ్యత తీరిపోతుందన్న తల్లి మూస ఆలోచనని కూడా ఖండించి తనదైన వ్యక్తిత్వంతో జీవితాన్ని దిద్దుకుంది. పెళ్ళి, చదువు, వుద్యోగం, కెరీర్ జీవితానికి  సంబంధించిన అన్ని నిర్ణయాల్నీ ఆమె స్వయంగానే తీసుకొంది. తన స్వేచ్ఛను తానే
నిర్వచించుకొంది.

          ‘శ్రుతి తప్పిన రాగం’ లో తల్లీకూతుళ్లు అరుంధతి, శారద కూడా బలమైన పాత్రలు. శారద ప్రేమించినవాడే కట్నం ఆశిస్తే నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. శుభలేఖలు వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది. ఇంతదాకా వచ్చాకా నీకు మరో పెళ్ళి కుదరదని వాడు భయపెట్టినా బెదరలేదు. లొంగలేదు. ‘పెళ్లే బ్రతుక్కీ భవిష్యత్తుకూ అర్థమని అనుకోను. పైగా నేటి స్త్రీకి పెళ్లి ఒక ప్రతిబంధకమవుతోంది. మనిషికి ఆత్మ గౌరవం ప్రధానం. కట్నమిచ్చి బతుక్కి ఓ తోడు కొనుక్కోను’ అంటుంది శారద. ఇది పెళ్లి పట్ల, కట్నం లాంటి దురాచారాల పట్ల రచయిత అభిప్రాయమే.

          అరుంధతి ప్రేమ పెళ్లి ఉద్యోగం అన్నీ పరిపూర్ణ స్వీయ జీవితానుభవం నుంచే స్వీకరించారు. చిన్న వయసులోనే పెళ్లయి భర్త నిరాదరణకు గురైన ఒంటరి స్త్రీగా పిల్లల పెంపకంలో ఆమె ఎదుర్కొన్న సమస్యల్ని అధిగమించి జీవితాన్ని గెల్చుకున్న తీరు తన తర్వాతి తరానికి ఆదర్శప్రాయమైంది. నమ్మిన విలువల కోసం యిద్దరూ బలంగా నిలబడ్డారు. దేనికైనా సిద్ధమయ్యారు. రెండు తరాల స్త్రీల చైతన్యానికి శారద అరుంధతి ప్రతీకలు.

          ‘ఆదర్శాలూ – అన్వయాలూ’ కథలో ఆనుషంగికంగా వచ్చిన శకుంతలమ్మ కథ కావొచ్చు, ‘నిరంతర శాకుంతలం’ లో చెప్పిన ప్రమీలోపాఖ్యానం కావచ్చు రెండూ రచయిత్రి జీవన శకలాలే. మొదటి కథలో సొంత కుటుంబంలోనే శకుంతలమ్మ యెదుర్కొన్న కుల వివక్షకు సంబంధించిన అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. కథకు అదే కేంద్రబిందువైంది. పరిపూర్ణ కథలు పరిష్కారం దిశగా అంతమౌతాయి. అందుకు భిన్నంగా యిది ఓపెన్ ఎండింగ్ కథ. కులం కారణంగా శకుతలమ్మను నిరాదరణకు గురి చేసిన కోడలు ఆ వైరుధ్యాన్ని యెలా పరిష్కారించుకుంటుందో అన్న
వూహను పాఠకులకే వదిలి వేయడం ఆ ముగింపు విశిష్టత. ఈ కథని అత్తా కోడళ్ళ మధ్య వివాదంగా కాకుండా మానవ సంబంధాలని శాసించే కుల వైరుధ్యం వైపు నుంచి చూడాలి.

          ‘నిరంతర శాకుంతలం’లో ప్రమీల చరిత్ర అయితే మొత్తం పరిపూర్ణ జీవిత చరిత్రే. అన్ని ఘటనలూ పరిపూర్ణ జీవితంలో జరిగినట్లే ప్రమీల జీవితంలో కూడా  చోటు చేసు కుంటాయి. ప్రమీల, ఆమె భర్త ప్రసాద్ యిద్దరూ విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వామపక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కానీ పెళ్ళైయ్యాకా ఆమె జీవితం యింటికీ పిల్లల పెంపకానికీ కుంచించుకు పోయింది. కుటుంబం గురించి కుటుంబ అవసరాల గురించి భార్యా బిడ్డల మంచి చెడులు గురించి యే మాత్రం పట్టించుకోని అతను నాయకత్వ కాంక్షతో జాతీయ స్థాయికి యెదుగుతాడు. ‘ప్రజా మహిళా రంగాల్లో శక్త్యను సారం కృషి చేయాలని కొండంత ఆశ’ ఆమెకు. ‘క్రియాత్మక ఆశయం’ ఆమెకు ఊపిరి. కానీ ‘సంసార బాధ్యతలు ఆమెకు కట్టుకొయ్యలయి కదలనివ్వవు’ ‘లోక సేవకోసం సంసారాన్ని త్యాగం చేశారు’ అన్న కీర్తి లోక నాయకులైన మగవారికి దక్కితే మహిళా కార్యకర్తలకు యిల్లు బందిఖానా అవుతుంది. ఇది యిలా యెందుకు అని ప్రమీల ప్రశ్నించినందుకు ప్రసాద్ ఆమెనీ, పిల్లల్నీ విడిచి వెళ్ళిపోయాడు. ‘ఒకే ఆశయాలు, ఆదర్శాలు గల యిరువురూ వొకటైతే చేయి చేయి కలుపుకుంటూ ఉద్యమాన్ని మరింత బల పరుస్తుండ వచ్చు. సమాజాన్ని మరింతగా చైతన్య పరచవచ్చు ‘అనుకున్న ఆమె ఆశలు అడియాశలయ్యాయి. ప్రమీలని వదిలించుకున్న ప్రసాద్ సంపదకి ఆశపడి శాస్త్రోక్తంగా మరో పెళ్ళి చేసుకున్నాడు. ఆశయాలకూ, ఆచరణకూ మధ్య వున్న యీ వైరుధ్యాల్ని ప్రమీల జీర్ణం చేసుకోలేక పోయింది. ఒంటరి స్త్రీగా జీవితంలో వొడిదుడుకుల్ని  యెదుర్కొంటూనే పై చదువులు చదివి, మంచి వుద్యోగం తెచ్చుకొని, పిల్లల్ని  ప్రయోజకులుగా తీర్చిదిద్దింది. నమ్మిన విలువలతో జీవితంలో యెక్కడా రాజీపడకుండా
ప్రభుత్వోద్యోగినిగా స్త్రీ సంక్షేమం కోసం కృషి చేసింది. 2009 లో రాసిన యీ కథ పరిపూర్ణ తర్వాతి కాలంలో రచించిన ఆత్మకథ ‘వెలుగు దారుల్లో…’కి డ్రెస్ రిహార్సల్ లా అనిపిస్తుంది. కథ లోపలి కథగా యశోద చెప్పిన యీ ‘యథార్థ జీవిత గాథ’ (దాదాపు పది పేజీలు) శ్యామల లాంటి వాళ్ళకి ‘కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని యివ్వచ్చు’ అని కథకురాలే స్వయంగా ప్రకటించడం గమనించవచ్చు. అంటే పరిపూర్ణగారికి రచయితగా తాను మలుస్తున్న పాత్రల పట్ల, అవి అందించాల్సిన చైతన్యం పట్ల, స్ఫూర్తి పట్ల స్పష్టమైన యెరుక వుందని తెలుస్తోంది.

          ఇది యశోద శ్యామల కు చెప్పిన కథ. శ్యామల పరిస్థితి అదే. ప్రేమ పేరు చెప్పి పెళ్లి చేసుకొని తర్వాత కట్నం కోసం పీడించే భర్త. ఆ కారణంగా అనారోగ్యం. భర్త పీడన నుంచి బయటపడటానికి ఆమెకు తల్లిదండ్రుల మద్దతు లభించింది. పొరుగింటి యశోద చెప్పిన ప్రమీల కథ ఆమెకు భవిష్యత్తు పట్ల ఆశని కలిగించింది. లాయరై తనలాగా గృహహింసకు బలయ్యే వాళ్ళకి అండగా నిలవాలని నిశ్చయించుకుంది.

          పరిపూర్ణ కథల్లో యిదొక పాజిటివ్ పార్శ్వం. బాధిత స్త్రీలు తమ సొంత బతుకుల్ని బాగుచేసుకోవడం దగ్గర ఆగిపోరు. తమ లాంటి వారికి సహాయం అందించడం గురించి కూడా ఆలోచిస్తారు. చాలా కథల్లో ముగింపులు పరిష్కారం దిశగా నడుస్తాయి లేదా సూచిస్తాయి. జీవితం పట్ల ఆశని చిగరింపజేస్తాయి. ఆ పరిష్కారాలు కృత్రిమంగా వుండవు. ఆచరణాత్మకంగా వుంటాయి. పరిష్కారాలు/సందేశాలు చెప్పే కథల పట్ల కొందరికి చిన్నచూపు వుండొచ్చు. కానీ ఆడదాని యెదుగుదలకు సంకెలగా మారిన కుటుంబ సంప్రదాయాల్ని వొదిలించుకోవడం, సామాజిక విలువల్ని తిరస్కరించడం, లోతుగా పాతుకు పోయిన పితృస్వామ్య భావజాలానికి విరుగుడు కనిపెట్టడం ప్రధానాశయాలుగా కలం పట్టిన పరిపూర్ణ గారు తన రచనలకి నిర్దిష్ట ప్రయోజనం  ఆశించారు. ఆ ప్రయోజనం యెటువంటి సంక్లిష్టత లేకుండా పాఠకులకు చేరాలని కాంక్షించారు. అందువల్ల ఆమె కథనంలో ప్రయోగాలకు తావు లేదు. సాదా సీదా
సంప్రదాయ కథన పద్ధతినే ఆమె ఆశ్రయించారు. అన్వయ క్లిష్టత లేని శైలి ఆమెది. విస్తృతమైన అధ్యయనం ద్వారా అబ్బిన భాష ఆమెది. ఆ విషయమై ఆధునికుల్లో ప్రాచీనురాలు. ఆలోచనల పరంగా యే ఆధునికులకూ తీసిపోరు. జీవిత విలువల పట్ల నైతికత పట్ల ఆమె అభిప్రాయాలు స్థిరమైనవి. బాల్యం నుంచి నేర్చుకున్న వామపక్ష/అభ్యుదయ భావజాలాన్నే ఆమె యిప్పటికీ అంటి పెట్టుకుని వున్నారు. శంఖు  చక్రాంకితాలైన భుజాల మీద బాల్యంలో గర్వంగా ముద్రించుకున్న కత్తి సుత్తుల్ని యిప్పటికీ గౌరవంగా తడుముకుంటూనే వున్నారు. వాటి జాడల్ని ఆమె కథల్లో తేలిగ్గానే
పట్టుకోగలం. స్త్రీ పురుష సంబంధాల్లోని వైరుధ్యాల్ని అర్థం చేసుకోవడానికి సైతం ఆమెకు యేదో వొక మేరకు ప్రగతి శీల వుద్యమ జీవితం దోహదం చేసి వుంటుందని ఆమె సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే గ్రహించగలం. కుటుంబంలో పురుషాధిక్య మూలాల్ని ఆమె స్పష్టంగా చూడగలిగారని తెలుస్తుంది. 

          ‘స్ఫూర్తి’ కథలో విమల భర్తకి తనకు మధ్య చోటు చేసుకున్న సంఘర్షణని స్వయంగా పరిష్కరించుకో లేకపోయింది. భర్త ఇంటి యజమాని తనే అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి ఆమె కష్టార్జితాన్ని దక్కించుకొని ఆధిపత్యం ప్రకటించినా ఆమెకు యేం చేయాలో తోచలేదు. కానీ తన దగ్గర పనిచేసే మస్తానమ్మ భర్త తాగుబోతుతనాన్ని యెదిరించి ధైర్యంతో దారిలో తెచ్చుకుంది. చివరికి మస్తాను విమలకి ఆదర్శమైంది.

          ఈ కథలో విమల స్వయంగా ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నప్పటికీ ఆమె సంపాదనపై అధికారమంతా భర్తదే. ఇంటి పని, బయటి పని చేస్తూ మొగుడి పెత్తనం కింద నలిగి పోయే విమల నిస్సహాయతపై మస్తానమ్మ జాలి పడుతుంది. కానీ తర్వాత ఆ మస్తానమ్మ నుంచి విమల స్ఫూర్తిని పొంది తన జీవిత గమనాన్ని నిర్దేశించుకుంది. రచయిత్రి ఈ కథలో ఒక మాట చెబుతుంది: ‘మొగుడు! మగాడు!! రిక్షావాడైతేం కూలోడయితేం ఒక పెళ్ళానికి మొగుడు! ఆ ఒక్క మాటలో ఎన్ని అధికారాలు దాఖలు పడ్డాయి మగ మనిషికి’

          ఆర్థికంగా భర్త పై ఆధారపడనప్పటికీ యే కారణం చేత విమల భర్త పెట్టే హింసను భరించింది? అతనికి అధికారం యెక్కడి నుంచి వచ్చింది? మధ్య తరగతి స్త్రీని యే సామాజిక విలువలు కుటుంబానికి కట్టివేస్తున్నాయి? ఆర్థిక స్వావలంబన వాటిని తెంచుకునే స్థైర్యాన్ని ఇవ్వగలదు; కానీ స్త్రీకి అంతకు మించిన చైతన్యమేదో కావాలని విమల, మస్తాను పాత్రల ద్వారా తెలుస్తోంది. విమల లీగల్ ఎయిడ్ సెంటర్ కి బయలు దేరడంతో కథ ముగుస్తుంది. కానీ అక్కడ మరో కథ మొదలు కావచ్చు. స్త్రీ అణగి వున్నంత వరకే మగవాడి దౌష్ట్యం, దాష్టీకం నడుస్తాయి. ఈ అంశాన్ని మరింత బలంగా చెప్పిన కథ ‘సరికొత్త దృశ్యం’.

          ‘సరికొత్త దృశ్యం’లో సుజాత భర్త ప్రకాష్ పెట్టే బాధలతో మానసిక రుగ్మతకు గురై స్నేహితుల సహకారంతో కోలుకుని అతనికి దూరంగా స్వేచ్ఛగా జీవిస్తుంది. స్వయం పోషకత్వ సామర్థ్యం వున్నప్పుడే స్త్రీ స్వేచ్ఛగా జీవించగలదని పరిపూర్ణ చాలా కథల్లో స్పష్టం చేశారు. అయితే వారి ఆ స్వాతంత్య్రయాన్ని ప్రకాష్ లాంటి ‘మేల్ చావనిస్టులు’ సహించలేరు.

          శారీరకంగా హింసించి అయినా లొంగదీసుకోడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారికి దేహశుద్ధే సరైన సమాధానం అని నిరూపించిన సుజాత ఆధునిక స్త్రీ శక్తికి తార్కాణంగా నిలుస్తుంది. ఆర్థిక స్వావలంబన మాత్రమే స్త్రీ విముక్తికి దారితీయదు. ఆర్థికంగా స్వేచ్ఛ సాధించినప్పటికీ అదే అంతిమ గమ్యం కాదు. అదే సర్వస్వం కాదు. జీవితంపై స్వయం నియంత్రణ కలిగి వుండటం, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలగడం, స్త్రీలపై కుటుంబ పరంగా సమాజ పరంగా అమలయ్యే జెండర్ వివక్షని, సోషల్ కండిషనింగ్ ని నిరాకరించడం, స్త్రీ పురుష సంబంధాల్లో పాతుకుపోయిన సమస్త అసమానతలనీ తిరస్కరించి సమానత్వం సాధించడం యిదే సాధికారత.

          ఆ దిశగా నడిచే పరిపూర్ణమ్మ కథల్లో స్త్రీల ఆత్మగౌరవ స్వరం వినిపిస్తుంది. సాధారణంగా వారంతా ఆత్మాభిమానంతో జ్వలిస్తూ వుంటారు. అందుకే యెవరి దయా దాక్షిణ్యాల పై ఆధార పడకుండా స్వయం ప్రతిపత్తిని కోరుకున్నారు. స్వయం
నిర్ణయాధికారాన్ని డిమాండ్ చేశారు. జీవితంలో అన్నివిధాల యెదుగుదలను ఆకాంక్షించారు. వారికి సొంతానికి కోరికలున్నాయి. కలలున్నాయి (అవి వాళ్ళ బలం బలహీనత కూడా).’మాకు రావు సూర్యోదయాలు’లో శ్యామల అందుకు పెద్ద వుదాహరణ. ఆమెకు యెన్నో కోరికలు వున్నప్పటికీ అవి విషాదాంతాలుగా పరిణమిస్తాయి. ‘సావిత్రి
కల’ని ఆమె కొడుకు సాకారం చేయడానికి పూనుకుంటాడు.

          సాధారణంగా పరిపూర్ణ కథల్లో స్త్రీ పాత్రలు aggressive గా కన్నా assertive గా వుంటాయి. రెండు మూడు తరాలకు చెందిన స్త్రీలు కథల్లో కనిపిస్తారు. భిన్న తరాలకు చెందిన వాళ్ల ఆలోచనల్లో, ఆచరణలో సంభవించిన మార్పులను కూడా రచయిత్రి గమనించింది. సమాజంలో యెన్ని మార్పులు వచ్చినా స్త్రీల పట్ల మగవారి ఆలోచనల
స్వభావంలో మార్పు రాలేదు. వివాహ వ్యవస్థను పరిపూర్ణ గారు పూర్తిగా తిరస్కరించలేదు. కాకుంటే దానిలో సమూలమైన మార్పును ఆకాంక్షించారు. అక్కడ స్త్రీకి సంపూర్ణమైన స్వేచ్ఛ వుండాలని భావించారు. ఎంపికలో, కొనసాగింపులో స్వతంత్రత వుండాలని భావించారు. ఆమె కథల్లో స్త్రీలు సహజత్వానికి దగ్గరగా వుంటారు. వారి ప్రేమలు
సహజంగా వికసిస్తాయి. పురుషుడితో మిత్ర వైరుధ్యమే తప్ప శత్రు వైరుధ్యం వుండదు. పురుషాధీనంలో వుండే కుటుంబం, సమాజం స్త్రీ యెదుగుదలకు, సహజ ప్రేమకు ఆటంకమైనపుడు మాత్రమే వాటిని ఆమె తిరస్కరించింది. స్త్రీ పురుషుల మధ్య మానవీయమైన ప్రేమానుబంధాలనే ఆమె కోరుకున్నారు. అటు వంటి సమాజం మాత్రమే అభ్యుదయ పథంలో పురోగమిస్తుందని భావించారు.

          పరిపూర్ణ గారి స్త్రీ పాత్రల రూపురేఖల వర్ణనలు కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎర్ర లచ్చుప్ప ‘బంగారు బొమ్మ. మిసమిసల పసిమి ఒళ్ళూ, అందాల ముఖంలో వరాల ముక్కు, కలువ కన్నులూ, వాటిపైన వింటి వొంపు కనుబొమ్మలు, నిగనిగలాడే జుట్టు, జాజుల కూర్పు లాంటి పలువరుస …’ ఇదీ వరస. ‘సావిత్రి కల’ లో సావిత్రి కూడా
అంతే చక్కంది. ‘ముట్టుకుంటే మాసిపోయే రంగు. గుండ్రంగా పొట్లాల్లాటి చేతులకి పెసర కాయలంటి వేళ్ళు పున్నమి చందమామ వంటి ముఖం మీద నల్లటి మెట్ల మెట్ల జుట్టు. ముక్కు ఒక్క పిసరు పెద్దదైతేనేం- పక్కనే ఆ పెద్ద పెద్ద కళ్ళలో ఎన్ని తళుకులు’ ఈ వర్ణనల్లో స్త్రీ దృష్టి కోణం వుంది. అలాగే శ్యామల, అరుంధతి, ప్రమీల వంటి పేర్ల యెంపికలో సార్థక్యం వున్నట్టు అనిపిస్తుంది.

***

          పరిపూర్ణ కథలు యే విధంగా చూసినా ఫిర్యాదు కథలు కావు. ఫిర్యాదు వల్ల ప్రయోజనం లేదని ఆమెకు తెలుసు. దాదాపు పై పాత్రలన్నీ తమ జీవితంలో యెదురైన కష్టాలకు యెవర్నీ నిందిస్తూ కూర్చోలేదు. వాటి మూలాల్లోకి వెళ్ళి చూసే వ్యర్థ సిద్ధాంత చర్చలకూ పూనుకోలేదు. కేవలం వాటిని అధిగమించి జీవితాన్ని గెలవటానికే ప్రయత్నించాయి. అందుకు అవసరమైన ఆత్మా విశ్వాసాన్ని కూడ దీసుకున్నాయి. అవకాశాల్ని స్వయంగా సృజించుకున్నాయి. తన వర్తమానాన్నీ భవిష్యత్తునీ తామే నిర్దేశించుకున్నాయి. అలా పరిపూర్ణ నిర్మించిన (సృష్టించిన అని కావాలనే అనడం
లేదు) స్త్రీ పాత్రలు పాఠకులకు గెలుపు పాఠం బోధిస్తాయి. ఆధునిక స్త్రీ జీవితంలో స్వయంగా సాధించవలసిన గమ్యాలకు దారులు పరుస్తాయి. కంటకావృత మార్గాల్లో స్థిరంగా ముందుకు నడిచే ధైర్యాన్నిస్తాయి. తాను తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న విధానాన్నే ఆమె తన పాత్రలకు ఆపాదించింది. (మాకు రావు సూర్యోదయాలు – నవలికలో తారాదేవి శ్యామలా ఇందుకు విరుద్ధం. పరిపూర్ణ మిగతా కథల్లోలా ఆ రెండు పాత్రలు నలుపు తెలుపుల్లో వుండవు. వాటిలోని బూడిద వర్ణాన్ని చూపే క్రమంలోనే ఆ రచన కథా పరిమితుల్ని దాటి విస్తృతమైంది. మిగిలిన కథల్లా అది పరిష్కారాంతం
కూడా కాదు. ఆ నవలిక వొక్కటే ప్రత్యేకంగా అధ్యయనార్హం).

          పరిపూర్ణ కథల్లో పురుష పాత్రలు కొన్ని దుర్గుణాలకు నమూనాల్లాగా కనిపిస్తాయి. అవి అన్నీ దాదాపుగా ఫ్లాట్ క్యారెక్టర్స్ మాత్రమే. రౌండ్ క్యారెక్టర్స్ కావు (ఎర్ర లచ్చుప్ప లో భూషణం అందుకు మినహాయింపు. అతనికి లచ్చుప్ప మీద ప్రేమ వుంటుంది. అయినా మరో స్త్రీతో పొత్తు వదులుకోడు). మూస పాత్రల నిర్మించి వల్ల పురుషాధిపత్య సమాజంలో స్త్రీలపై అమలయ్యే హింస, పీడనల బహురూపతనీ భిన్న పార్శ్వాలనీ ఆమె కథల్లో చూడలేము. ఈ  పరిమితిని ఆమె కూడా గుర్తించింది. దాన్ని చాలా అందంగా కూడా వ్యక్తీకరించారు. ‘శిఖరారోహణ’ కథలో భార్గవి అన్న భాస్కర్ తండ్రి నుంచి  అలవర్చు కున్న పితృస్వామ్య అవలక్షణాల గురించి చెబుతూ ‘పిల్ల చేపకు ఈతొచ్చినంత
సహజంగా అబ్బినాయి’ అని అంటారు. ‘ఎర్ర లచ్చుప్ప’ లో నాగభూషణ చౌదరి, ‘స్ఫూర్తి’, ‘ఆదర్శాలూ – అన్వయాలూ’, ‘నిరంతర శాకుంతలం’ కథల్లో ముగ్గురు ప్రసాద్ లు వొక్కరే అనిపిస్తారు. ఆ ముగ్గురూ యెవరో పరిపూర్ణ గారి ఆత్మకథ ద్వారా తెలుసుకోవచ్చు.

          ఇలా చూసినప్పుడు పరిపూర్ణ రచయితగా వొకే కథ పలుమార్లు చెబుతున్నారన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఆ మొనాటనీని తొలగించడానికి ఆమె కథలో కొత్త వాతావరణం సృష్టిస్తారు. పాత్రలకు కొత్త వుద్వేగాలు అద్దుతారు. ఆ క్రమంలో కాలాను గుణంగా కొత్త సామాజిక అంశాల్ని జోడిస్తారు. ప్రతి సందర్భంలోనూ తన జీవితంలో యెదుర్కొన్న జ్ఞాపకాలు ఆమెను వదలవు. అవి యేదో వొక రూపంలో కథల్లోకి చొచ్చుకొని వస్తాయి. పాత్రల వ్యక్తిత్వంలో వ్యక్తమౌతాయి. రచయిత కథనంలోనో పాత్రలో సంభాషణ ల్లోనో అవి బహిర్గతమౌతాయి. ఆమె జ్ఞాపకాలు అంత బలమైనవి. ఆమె వ్యక్తిత్వం అంత ప్రభావశీలమైంది. ఆమె వ్యక్తిత్వమే ఆమె సాహిత్యం. మరో విధంగా చెప్పాలంటే ఆమె
జీవితమే ఆమె సాహిత్యం. సమస్త అసమానతలను జయించి సాధికారత దిశగా చేసే ప్రయాణమే అది. అది సుదీర్ఘమైనదీ, ఆదర్శప్రాయమైనదీ, ఉజ్జ్వలమైనదీ.

          ‘చాలామంది బ్రతుకు అర్థరహితంగా ముగుస్తుంది. తాను మాత్రం మరింత దీక్షతో – తాను ప్రేమించే జనం కోసం పాటు పడాలి. బ్రతుకే సార్థకమవ్వాలి! అంతకు మించి తానేమీ కోరుకోదు!!’ అన్న ఎర్ర లచ్చుప్ప ఆలోచనే యిప్పుడు కూడా – యీ తొంభై రెండేళ్ల వయస్సులో పరిపూర్ణ గారు చేస్తూండవచ్చు. పలకరించి చూడండి; తీక్షణమైన చూపుతో, స్థిరమైన గొంతుతో, బోసి నోటితో నవ్వుతూ అదే మాట చెబుతారు.

*****

Please follow and like us:

One thought on “నంబూరి పరిపూర్ణ కథల్లో స్త్రీ పాత్రలు”

  1. సంపూర్ణతతో నిండిన పరిశీలన ..ఆమెను మరోసారి దగ్గరగా చూసినట్టు ఉంది ..ప్రభాకర్ గారికి హృదయ పూర్వక అభినందనలు ..

    _ ముకుంద రామారావు
    హైదరాబాద్

Leave a Reply

Your email address will not be published.