కొత్త అడుగులు – 38

రజిత కొండసాని

– శిలాలోలిత

          ‘కళ్ళు రెండైనా చూపు ఒక్కటే కళ్ళు రెండయినా కల ఒక్కటే అంటోంది’ ‘కొండసాని రజిత’. రజిత మొదటి పుస్తకం పేరు ‘ఒక కల రెండు కళ్ళు’. రాయలసీమ కవయిత్రి. రాటుదేలిన కవిత్వం సున్నితమైన భావ కవిత్వం ఈమెలో ఎక్కువగా కనిపిస్తోంది. 2019లో రాసిన కవిత్వమిది.

          చిన్న చిన్న పదాలతో లోతైన భావాన్ని చెప్పడం ఈమె ప్రత్యేకత. మానసిక సంచలనాల సవ్వడితోపాటు సామాజికాంశాలనెన్నింటినో కవిత్వం చేసింది. రాసే అక్షరాల్లో కొంత తడబాటు, చెప్పే విధానంలో భయంతో కూడిన వినయం కనిపిస్తున్నప్పటికీ ఒక స్పష్టమైన అవగాహనతో పాటు రాజీ పడే ధోరణి ఎక్కడా లేదు. ప్రతివాదనలు చాలాచోట్ల బలంగా చేసింది. రాతి సీమ నైసర్గికత కదా! మట్టి ఘనీ భవించి రాయైన నైసర్గికత కదా! అందుకే ఆమెతో కవిత్వ ప్రయాణంలో నెమ్మదితో కూడిన కఠినత్వం కనిపిస్తుంది.

          రజిత కథలు కూడా ఎక్కువగానే రాసింది. బాల సాహిత్యం అంటే ఉన్న మక్కువతో ఎక్కువగా రాసింది. నిజానికి ఇది కష్టమైన ప్రక్రియ. పిల్లల స్థాయికి వాళ్ల మానసిక ప్రపంచాలకు దగ్గరగా వెళ్లి రాయగలగాలి. వారి వ్యక్తిత్వ పునాది స్థిరంగా నాటడానికి ప్రయత్నించాలి. ఆహ్లాదకరంగా చెప్తూనే వాళ్ళలో మానవత్వ బీజాలను విలువలను ఉత్సాహాల్ని నింపగలగాలి. అవన్నీ రజిత కథల్లో ఉన్నాయి.

          అలాంటి రజిత కవితలు మూడు. 1. నా దేశపు వెన్నెముక (My country’s backbone) 2. రా(come) 3. ప్రేమాద్వైతం (Loves’ నోన్-Duality) ఆంగ్లంలోకి అనువదింపబడి ఇంగ్లాండ్ లోని Lincoln నగరంలోని Goarspried magazine ప్రచురింపబడినవి.

          మొదటి కవితా పుస్తకంలోని కవితలకు నిన్న మొన్నటి వరకు రాస్తున్న ఫేస్బుక్ కవితలకి చాలా వ్యత్యాసం ఉంది. రోజు రోజుకి మరింత చిక్కనవుతున్న కవిత్వాన్ని చూసి అభినందించక తప్పదు.

          నేను వలస పక్షినే.. కనిపించని కోయిల, విత్తనం నవ్వింది ఆమె ప్రశ్నలాంటి మంచి కవితలు ఎన్నో ఉన్నాయి. మచ్చుకి ‘ఆమె ప్రశ్న’ – కవిత

ఆమె తలంటుకుంది
ఆకలంటూ తలుపు తోసుకొచ్చాడతను

‘ఇవాళ హోటల్ కి వెళ్ళలేదా?’
ఆమె ప్రశ్న

‘దేవాలయం లాంటి
నువ్వు ఉండగ
ఇక హోటల్ తో పనేంటి?
అతని సమాధానం

‘మరి దేవాలయం లోపల
దేవత ఉంటుందిగా!
ఆ దేవతకు కూడా ఆకలి వేస్తే?

ఆమె ప్రశ్నకు సమాధానం లేదు

‘నన్ను దేవాలయమో దేవతో అంటే అభ్యంతరం లేదు
కానీ ఈ దేహం రాతి కట్టడం కాదు
నేను విగ్రహాన్ని కాదు

అతని కళ్ళలో పశ్చాత్తాపం
ఆమె కళ్ళలో ఆకలి, ప్రేమ రెండూనూ!

 

మరోచోట తనను తాను ఇలా ప్రకటించుకుంటుంది.
ఆ అక్షరం ఆగదు ఎన్నటికి
కొత్త పదానికి వాక్య నిర్మాణానికి
పునాదులు వేస్తూ
పాత పదాలకు పాతరేస్తూ..

          రాయలసీమలో కవయిత్రులను పరిచయం చేసుకోవాలనుకున్నప్పుడు శశికళ, చిలుకూరి దీవెన, పేరిందేవి, నాగమణి,  కళ్యాణదుర్గం స్వర్ణలత, కందిమళ్ళ లక్ష్మి, రజిత కొండసాని కనిపిస్తున్నారు.

          ఈ పుస్తకంలో రాసిన కవితలకి, ఫేస్ బుక్ లో రాస్తున్న కవితలకు గమనిస్తే చాలా పరిణితి కనిపిస్తోంది. సీరియస్ నెస్ బాగా వచ్చింది. ఒక విషయాన్ని వ్యంగ్యంగా చెబుతూ వాస్తవాల్ని అద్దంలో చూపినట్లు చూపెడుతుంది. కవిత్వం, కథలు ఇటీవల విరివిగా రాస్తోంది. ఉద్యోగిగా కుటుంబ బరువు బాధ్యతల్ని సైతం అలవోకగా నడిపించిన తీరు ముచ్చట గొల్పింది.

కొన్ని మచ్చుకి-

వంటింట్లో
కత్తిపీట కూరలు తరిగేందుకే కాకుండా
మొగుడికి మొలిచిన ‘మగాడిననే’ కోరలు తరిగేందుకూ
ఉపయోగపడుతుంది’ కదా అంటుంది.

అలాగే ఇంకో చోట

వంటింట్లో
పిండి రుబ్బేందుకు తిరిగే
మిక్సీ బ్లేడ్లు అరుగుతాయట
అదేం చిత్రమో
చేతివాచీలో సెకన్ల ముల్లులా
ఇంటి పని వంట పని
పిల్లల పెంటపనితో
అస్తమానం
ఊడిగం చేసినా

ఒంట్లో ప్రతీ కణం కరిగి
ఆవిరై మరిగి
ఆయు:ప్రమాణం తరిగినా
ఆమెకు మాత్రం
ఏవీ అరగవట
మరీ విడ్డూరం కాదూ – అని ప్రశ్నిస్తుంది.

          ఇలా తనదైన శైలి, అత్యంత బిజీ షెడ్యూల్లో కూడా తనలో నిబడీకృతమై ఉన్న అక్షరాలకు జీవం పోస్తూ, రచించడమే తనకు గొప్ప ఊరటగా భావించే కవయిత్రి ఈమె. మనిషెంత సున్నితంగా కనిపిస్తుందో విషయాల విశ్లేషణ పట్ల అంతగానూ దృఢంగా ఉండడంలో ఈమె దిట్ట. రాయలసీమ కన్న రాతి బిడ్డ కదా మరి!

          ఈ కవిత్వ పుస్తకానికి విలువైన ముందుమాట రాశారు. కవయిత్రి ప్రేమ కవిత్వం, స్త్రీ చైతన్య స్ఫూర్తి కవిత్వం మాత్రమే రాయలేదు. కొన్ని సామాజిక అంశాలను కూడా కవిత్వంలోకి తెచ్చిందని తూముచ్చర్ల రాజారాం గారు అభిప్రాయపడ్డారు. అలాగే రాయపాటి శివ- ముక్కు సూటితనం, కలుపుగోలుతనం, ప్రేమ తత్వం, ప్రశ్నించే మనస్తత్వంతో నిండైన మనస్తత్వంతో నిండైన మనిషితనం నింపుకున్న నిఖార్సయిన వ్యక్తిత్వం గల కవయిత్రి అన్నారు.

          ప్రకృతి నుండి మనిషి పంచభూతాలు పొందినట్లు మనిషి నుండి మనసు పొందు నవరసాలే రజితాక్షరాలు అని పొట్లూరి హరికృష్ణ గారు ప్రకటించారు. తనలో రగిలిన భావావేశాన్ని కవితలుగా మలచడం ద్వారా కవయిత్రికి సమాజం పట్ల తనకు గల బాధ్యత ఏమిటో ఎరుక పరుస్తుందని’ వేంపల్లి రెడ్డి నాగరాజు భావించారు. అలాగే సురగౌని రామకృష్ణ గారు సమాజం పట్ల బాధ్యతయుతమైన ప్రవర్తన చక్కని అభివ్యక్తి, భావపుష్టి ఉన్న కవయిత్రి. అక్షరాలను అందంగా పేర్చి మధురభావాలను పూయించగల దిట్ట’ – అని భావించారు.

          రజిత తాతగారి మరణం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిన ఆమె డాక్టర్ల సలహా మేరకు సాహిత్య ప్రవేశం చేయడం, దాని నుండి బయటపడటం హర్షించదగ్గ విషయం. సాహిత్యం నిజానికి అంత బలమైనది కూడా. నాలుగు రోజుల క్రితం రజిత రాసిన కవిత ‘మరల పో ఇప్పటికి’-


కడుపులోకి గుండెజారి
కొట్టుకుంటుంటే
నిన్ను ఎలా ఆహ్వానించేది?
నీకెలా స్వాగతం పలికేది
అంటూ మొదలై చివర్లో
ధాన్యంతో కడుపు
నింపుకోవాల్సిన
గాదెల్ని శూన్యపు చూపులతో
ఆకలి కేకలు పెట్టి అల్లాడుతుంటే
నువ్వు ‘సిరిమాలచ్చిగా’ ఎలా రాగలవు
గంగిరెద్దులు, గాలిపటాలు లేవిక్కడ
నోట మెతుకులు లేని మనుషులున్నప్పుడు
నీకెలా ఆతిథ్యం ఇస్తాం?
నిన్నెలా ఆహ్వానించగలం?
మరిలిపో ఇప్పటికీ!
మా నాగళ్ళ కన్నెర్ర చేసి
మా భూములు సర్రున లేచి

మా చెట్లు ఉద్రేకంతో కొమ్మలు పడగలెత్తి
మాకు జ్ఞాన బోధ చేస్తున్నాయి 
బతుకు మీది కలుపు మొక్కలు
ఏరి పారేయమని-


          ఆర్ద్రతను నింపుకున్న రైతు బతుకు,  గ్రామీణ స్థితిగతుల దర్పణమిది. త్వరలో మరో పుస్తకం రాబోతున్నది. రజిత కొండసాని ని మరోమారు అభినందిస్తూ..

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.