వ్యాధితో పోరాటం-42

కనకదుర్గ

శ్రీని కూడా నేను ఇంట్లో ఉన్నపుడు కొంచెం రిలాక్సింగ్ గా కనిపించేవాడు. కానీ తను ఎంత బిజీగా ఉన్నా, తనొక్కడే అన్నీ పనులు చేసుకోవాల్సి వస్తున్నా ఒక్కరోజు కూడా మొహంలో చిరాకు కానీ, కోపం కానీ కనిపించనిచ్చేవాడు కాదు. ఇండియాకి ఫోన్ చేస్తే మా మామగారితో అందరం మాట్లాడేవారం. నేను ఆసుపత్రులలో వున్నప్పటినుండి తనే మాట్లాడి ఇక్కడి విషయాలు చెప్తుండేవాడు. నాకు వాళ్ళతో మాట్లాడకపోతే చాలా బాధగా అనిపించేది. మా అత్తగారు సడన్ గా హార్ట్ ఫేయిల్యూర్ తో పోయినప్పట్నుండి మేము వెళ్ళిపోదామనుకుని నాకు ఈ జబ్బు మళ్ళీ తిరగబెట్టడంతో ట్రీట్మెంట్ అయ్యాక వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము, అయినా అక్కడ మా అవసరం ఉంది మేము వెళ్ళలేకపోయాము అని ఏదో అపరాధం చేసినదానిలా అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంట్లో వున్నపుడు మాట్లాడితే మా మామగారు మాట్లాడేవారు, “నీకు త్వరగా తగ్గిపోయి మీరు ఇక్కడికి వస్తే మనం అందరం కల్సి వుండాలమ్మా,” అని అంటూ వుండేవారు. శైలు, ఆడపడుచు కూడా మాట్లాడేది కానీ ఈ మధ్యన మాట్లాడటం లేదు.

నేను మా మామగారిని అడిగితే, ” శైలు బాగానే వుందమ్మా! ఇపుడు దానికి మాట్లాడే మూడ్ లేదు,” అని చెప్పేవారు. శ్రీనిని అడిగితే, “మెల్లి మెల్లిగా శరీర భాగాలు పనిచేయడం ఆగిపోతాయని డాక్టర్ గారు చెప్పారట. ఈ మధ్యనే మాట రావడం లేదు. నువ్వు కంగారు పడతావని నాన్న నీకు చెప్పడం లేదు.”

“అయ్యో! శైలు మాట్లాడకుండా వుండడం నేనూహించలేకపోతున్నాను.” అన్నాను. ఆ రోజంతా శైలు గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను. నాకే ఇట్లా ఉంటే శ్రీనికి ఎలా ఉందో! ఇపుడే వెళ్ళలేం, చెల్లి గురించి బాధ పడ్తున్నాడేమో! కానీ దాని గురించి కానీ, తల్లిని మిస్సవుతున్నానని కానీ ఏ రోజు తన మనసులో మాట చెప్పడు. నేను మాత్రం తనకి అన్నీ చెబ్తూ ఉండేదాన్ని. ఎప్పటికయినా తను కూడా
నాలా మాట్లాడతాడేమోనని ఆశ.

మేము రెండు వారాలకోసారి న్యూట్రిషనిస్టుల దగ్గరకి వెళ్ళి వస్తున్నాం. డా.రొసాటో నొప్పి భరించలేనంత ఎక్కువైతే మాత్రం ఫోన్ చేసి చెబితే న్యూట్రిషనిస్టులు పోషకాహార విలువలు పెరిగాయి అంటే సర్జరీ చేసేస్తానని చెప్పారు. నొప్పయితే మధ్య మధ్యలో ఎక్కువవుతూనే వుంది. ఒకట్రెండు సార్లు దగ్గరున్న హాస్పిటల్ కి వెళ్ళి కొన్నిరోజులు వుండి వచ్చాను. బుక్స్ చదవడంతో నా దృష్టి మరలి కొంచెం బరువు పెరగడానికి సాయం చేసిందని చెప్పవచ్చు. నొప్పి చాలా వరకు భరించేదాన్ని ఎందుకంటే బరువు పెరగకుండా సర్జరీ చేస్తే కోలుకోవడం ఆలస్యమవుతుందని కూడా అన్నారు. అందుకే నాకు కొంచెం భయం వేసేది. సర్జరీ తర్వాత కొంత బరువు తగ్గుతుంది, కోలుకునేపుడు చాలా సమస్యలొస్తే కష్టం అవుతుందేమోనని భయం వల్ల నొప్పి భరించేదాన్ని. కానీ రోజు రోజుకి నొప్పి ఎక్కువవుతుంటే పిల్లల మొహాల్లో ఆదుర్దా, అమ్మకి మళ్ళీ నొప్పి వస్తుందేమోనని ఎప్పటికప్పుడు ముఖ్యంగా చైతన్య గుండెల్లో రైళ్ళు పరిగెడుతుంటాయేమో. పెద్దదాన్ని నేనే భరించలేకపోతున్నాను విపరీతమైన సర్జరీ ఆలోచనలతో, పదేళ్ళ పిల్లవాడు వాడెట్లా తట్టుకుంటాడు.

ఈ ఆలోచనలను ఎట్లా ఆపాలో అర్ధం అయ్యేది కాదు. హోమియోపతి డాక్టర్ దగ్గరకు వెళ్ళే రోజుల్లో “నువ్వు ఒక చాలా క్లిష్టమైన జబ్బుతో పోరాడుతున్నావు. ఒకోసారి ఈ పోరాటం కఠినం కావొచ్చేమో. అందుకని ఒకసారి సైకాలజిస్ట్ ని కలిస్తే బావుంటుందేమో,” అన్నారు. ఆయన ఒక సైకాలజిస్ట్ పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ కూడా ఇచ్చారు. “ఈయన నాకు చాలా మంచి మిత్రుడు. భయంకరమైన జబ్బులతో బాధపడ్తున్న నా పేషంట్లకు చాలా సాయం చేసాడతను. మీక్కూడా సాయం చేస్తాడని నాకు నమ్మకముంది,” అని అన్నారు.

శ్రీని అప్పాయింట్మెంట్ తీసుకుని ఆఫీస్ నుండి మధ్యాహ్నం వచ్చేసాడు. జోన్ కి ముందే చెప్పడంతో తను పిల్లల్ని చూసుకోవడానికి వచ్చింది. మేమిద్దరం ఆ అడ్రస్ పట్టుకుని వెతుక్కుంటూ వెళ్ళాం.
డా. జెఫ్రీని చూడగానే మంచి అభిప్రాయం వచ్చింది. మొదటిసారి కలవడం కాబట్టి చాలా ప్రశ్నలు అడిగారు, కేవలం నా గురించే కాదు, మా కుటుంబం గురించి, కుటుంబంలో ఎవరికైనా డిప్రెషన్, ఆందోళన, లాంటి సమస్యలతో పాటు క్లిష్టమైన మానసిక సమస్యలున్నాయా, ఉంటే అది ఎవరికి, ఇపుడు వాళ్ళ వయసెంత, లాంటి ఎన్నో ప్రశ్నలేసారు. అన్నింటికి సమాధానాలు చెప్పాను. అదయిపోయిన తర్వాత కొంచెం సమయం ఉంటే నా బాల్యం, మా కుటుంబం గురించి అడిగితే చెప్పాను. మా తమ్ముడి గురించి చెప్పాను. చిన్నోడి గురించి చెప్తుంటే నాకు తెలియకుండానే కన్నీళ్ళు, దుఃఖం ముంచుకొచ్చాయి. ఆయనకు ఆశ్చర్యం వేసింది. “యూ స్టిల్ హావ్ టియర్స్ ఫర్ యువర్ లిటిల్ బ్రదర్!” అన్నాడు.

“లేదు ఈ రోజే అలా అయ్యింది. చాలా ఏళ్ళయ్యింది కదా! కన్నీళ్ళు రావు సామాన్యంగా ,” అన్నాను.

నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తర్వాత సంభాషణ నా జబ్బు పైకి మళ్ళింది. ఎలా మొదలైంది, ఎంత ఇబ్బంది పెట్టింది. ఇపుడు ఎలా వుంది? లాంటి విషయాలు మాట్లాడుతుంటే, “నా వల్ల అందరికీ ఇబ్బందే కల్గుతుంది. నా బాధ చూడలేక శ్రీని నా బాధ తను తీసుకోలేడు కాబట్టి డాక్టర్లు, ట్రీట్మెంట్లతోనన్నా తగ్గుతుందేమోనని ఆయన కష్టపడుతున్నాడు. పిల్లలను కూడా సరిగ్గా చూసుకోలేను, వాళ్ళకి కూడా అమ్మ ఎప్పుడూ పడుకునే ఉంటుంది, అందరి అమ్మల్లా లేదని అనిపిస్తుంది కదా! అందుకే ఉండి వీళ్ళని బాధ పెట్టడంకంటే పోతేనే బాగుంటుందన్పిస్తుంది. డబ్బు పోతుంది, పిల్లల చదువులకోసం దాచాల్సిన డబ్బంతా అయిపోతుంది నా జబ్బుకే….. అసలు నేనుండి ఏం ప్రయోజనం అన్పిస్తుంది…” అని అంటుంటే నాకు తెలియకుండానే కన్నీళ్ళు రాసాగాయి.

ఈసారి ఆయన నా ఏడుపు ఆగేదాక ఏం అనలేదు. ముందు టీపాయ్ పైన ఉన్న టిష్యూస్ కళ్ళు తుడ్చుకోవడానికి ఇచ్చారు. నేను కళ్ళు తుడ్చుకున్నాక మెల్లిగా అడిగారు, “దుర్గా, మీ పిల్లలకి ఏదైనా జబ్బు చేస్తే మీరేం చేస్తారు?”

“వాళ్ళకి త్వరగా తగ్గడానికి డాక్టర్లు ఏం చేయమంటే అది చేస్తాను, పిల్లలకి ఏమైనా అయితే నేనస్సలు తట్టుకోలేను, వాళ్ళు కోలుకునేవరకు ఏం చేయాలన్పించదు నాకు….”

“మరి మీకు బాగాలేకపోతే పిల్లలు మీరు పోతే బాగుంటుందనుకుంటారా? వాళ్ళకి వాళ్ళ అమ్మ కావాలి, అది ఎలా వున్నా సరే! మీకు త్వరగా తగ్గాలనే అనుకుంటారు, పిల్లలకు చిన్న ఆరోగ్యసమస్య వస్తేనే మీరెలా తల్లడిల్లుతారో పిల్లలకు కూడా అలాగే వుంటుంది. మీకైతే బాధ వుంటుంది పిల్లలకు ఉండదా?” అని అడిగాడు.

“ఆ బాధే వాళ్ళకి ఉండకూడదని నేననుకుంటున్నా…. మా అమ్మకు చిన్నపుడు ఒంట్లో బాగాలేనపుడు, తను హాస్పిటళ్ళల్లో ఉన్నపుడు చాలా మిస్ అయ్యేవాళ్ళం, చాలా భయపడేవాళ్ళం అమ్మకి ఏమవుతుందోనని. అందుకే నాకు తెల్సు పిల్లలకి ఎంత బాధ వుంటుందో!” అన్నాను.

“అయితే ఒక అమ్మపోతే మరొక అమ్మని తెచ్చుకోవడానికి అమ్మలేమన్నా సూపర్ మార్కెట్లో దొరుకుతారా?” అని సూటిగా అడిగాడు డా.జెఫ్రీ. నాకు లాగి చెంపపైన కొట్టినట్టయ్యింది. నేను అవాక్కయ్యి అలా ఆలోచిస్తూ ఉండిపోయాను.

అమ్మకు ఎంత బాగాలేకున్నా, హాస్పిటల్లో వున్నా, అమ్మ ఇంటికొస్తే మాత్రం ఎంత సంతోషమేసేది. అపుడు చిన్నపిల్లలం కదా! అమ్మకు ఏం కాకూడదని త్వరగా తగ్గాలని దేవుడిని కోరుకునేవాళ్ళం కూడా!
దాశరధి పెద్దమామయ్య రాసిన అమ్మ పాట గుర్తొచ్చింది, “అంగడిలో దొరకనిది అమ్మ ఒకటే, అందరికి ఇలవేల్పు అమ్మ ఒకటే… అమ్మ అన్నది ఒక కమ్మని మాట…” బుల్లెమ్మ బుల్లోడు సినిమాలో పాట.
“చెప్పండి దుర్గా, సూపర్ మార్కెట్లో దొరుకుతారా అమ్మలు? చెప్పండి!”

“నో డా. జెఫ్రీ…వియ్ కెన్నాట్ బయ్ మదర్ అండ్ హర్ అఫెక్షన్….” అన్నాను.

“యస్! దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు హియర్. ప్లీజ్ టేక్ గుడ్ కేర్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ కిడ్స్, హజ్బెండ్ అండ్ యువర్ సెల్ఫ్ టూ…”

“ఈ రోజుకి సమయం అయిపోయింది. మనం మళ్ళీ వచ్చే వారం కొనసాగిద్దాం ఈ సంభాషణ.” అన్నారు.

నాతో పాటు వచ్చి వేయిటింగ్ రూంలో కూర్చున్న శ్రీనిని కల్సి తనతో చెప్పాడు, “మీ ఇంటి అడ్రస్ ఇస్తే నేనే వస్తాను. అనారోగ్యంతో తను, మీరు ఆఫీస్ నుండి త్వరగా రావాలి తనను తీసుకురావడానికి. నేను సామాన్యంగా క్రానిక్ పేషంట్స్ ఇంటికి వెళ్తుంటాను. వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.”

” ఏం పర్వాలేదు, నేను తీసుకువస్తాను….”

“ఇట్స్ ఓకే మిస్టర్ డింగారి, ఇది మీకొకరికే చేయటం లేదు. చాలామంది క్రానిక్ పేషంట్స్ ఇంటికి వెళ్తుంటాను…. మీ వివరాలతో పాటు అడ్రస్ కూడా రాసారు కదా! నేను వచ్చేవారం మీ ఇంటికే వచ్చి కలుస్తాను. బై,” అని చెప్పి వేరే పేషంట్ ని చూడడానికి వెళ్ళారు.

అప్పటినుండి ఆయన దాదాపు 18 ఏళ్ళ నుండి 20 ఏళ్ళవరకు నాకు చాలా సాయం చేసారు.

నాకు నొప్పి ఎక్కువయ్యి నేను మళ్ళీ ఆసుపత్రులకు వెళ్ళడం చిరాకుగా అనిపించసాగింది. ఇంకా ఎన్నాళ్ళు భరించను అని రాత్రుళ్ళు ఏడ్చేదాన్ని. న్యూట్రనిష్టులు నా పోషకాహార విలువలు పెరుగుతున్నాయి కానీ సర్జరీకి కావాల్సినంత పెరగటం లేదని చెబ్తున్నారు. అందుకని నేను నొప్పెక్కువయినా ఫోన్ చేసి డా. రొసాటోకి చెప్పలేకపోతున్నాను. దాదాపు ఆర్నెల్లు అయ్యాక నొప్పి తట్టుకోలేకపోతున్నానని డాక్టర్ రొసాటో ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్పేసాము. ఆయన అప్పాయింట్మెంట్ తీసుకుని రమ్మన్నారు.

నేను శ్రీని వెళ్ళాము. ఈ సారి కూడా మొదటిసారిలా అందర్ని పిలిచారు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా.కోచ్మెన్, న్యూట్రిషనిస్టులు, డా.రొసాటో ఉన్నారు. ముందు డా.కోచ్మెన్ ని త్వరగా సర్జరీ చేయడం గురించి ఆయన అభిప్రాయం అడిగితే, “నాకేం అభ్యంతరం లేదు ఒకవేళ పేషంట్ ఇంత పెద్ద సర్జరీని తట్టుకోగలిగితే,” అని అన్నారు. డా.రొసాటో న్యూట్రిషనిష్టులను, “మీరేమంటారు?” అని అడిగారు. వాళ్ళు తీసుకొచ్చిన అన్నీ రిపోర్ట్స్ ఆయనకి చూపించారు.

ఆయన అన్నీ చూస్తూ, “నాకయితే అన్నీ న్యూట్రిషన్ లెవెల్స్ బాగానే ఉన్నాయనిపిస్తున్నాయి, మనం సర్జరీ చేయొచ్చేమో! మిస్టర్ డింగారి, మీకు 2-3 రోజులు లీవ్ దొరుకుతుందా? లేకపోతే వియ్ కాన్ షెడ్యూల్ ఆన్ ఏ వీకెండ్.” అన్నారు.

శ్రీని, “మీరు డేట్స్ చెపితే అప్పటికి లీవ్ తీసుకుంటాను. నేను ఆఫీసులో ఆల్రెడీ చెప్పాను. సో వాళ్ళకి తెలుసు.” అన్నాడు.

“మిస్ ఆండ్రియా, టెల్ మి వెన్ యామ్ ఐ అవేలబుల్ టు పర్ఫార్మ్ మిసెస్ డింగారీస్ సర్జరీ?” అని తన సెక్రటరీని అడిగారు.

ఆమె ఆయన షెడ్యూల్ చూసి, ” రెండు వారాల్లో ఒక ఒపెనింగ్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ 4 వారాలదాకా మీకు కుదరదు,”అని చెప్పింది.

“సో టూ వీక్స్ లో సర్జరీకి రెడీనా మీకు ఎక్కువ టైమ్ కావాలంటే నాలుగు వారాల తర్వాత చేయొ…”

“ఐయామ్ రెడీ డాక్టర్ రొసాటో… టూ వీక్స్ లోనే చేసేయండి ప్లీజ్!” అన్నాను నేను.

“యస్ డా.రొసాటో వియ్ విల్ బి రెడీ ఇన్ టూ వీక్స్ … నాలుగు వారాల తర్వాత వద్దు.” అన్నాడు శ్రీని.

“సరే, రెండు వారాల తర్వాత సర్జరీ చేద్దాం. డేట్ కూడా ఫిక్స్ చేద్దాం!” అని తేదీ నిర్ణయించారు.

“సర్జరీకి ముందు ప్రీ సర్జరీ కన్సల్టేషన్ కి రండి! మళ్ళీ ఒకసారి సర్జరీ ఎలా చేస్తాము, ఏం మందులు వాడతాము, ఐ.సి.యూలో ఎన్ని రోజులుండాలి? మీ రూమ్ కి ఎపుడు వస్తారు? కోలుకోవడం ఎలా ఉంటుంది లాంటి విషయాలు మాట్లాడతాము. మనం సర్జరీకి కావాల్సిన బరువు పెరిగేదాక ఆగటం లేదు కదా, అందుకని కోలుకోవడానికి చాలా సమయమవుతుంది. ఇది గుర్తు పెట్టుకోండి.” అన్నారు డా. రొసాటో. సర్జరీ తేదీ నిర్ణయించడం అయ్యింది.

రెండు వారాల తర్వాత “విపుల్ సర్జరీ,” (Whipple Surgery) చేస్తారు. చాలా పెద్ద సర్జరీ అంటారు. మొత్తం సర్జరీ చేయడానికి 6 గంటలు పడ్తుంది, కానీ ఒకోసారి ఎక్కువ సమయం కావొచ్చు. ఇది సామాన్యంగా పాన్క్రియాటిక్ క్యాన్సర్ వారికి చేస్తే, వారి జీవితాన్ని అయిదేళ్ళవరకు పెంచుతుంది, కొంతమందికి క్యాన్సర్ మళ్ళీ రాకపోతే ఎక్కువ సంవత్సరాలే బ్రతుకుతారు. ఈ సర్జరీ కేవలం క్యాన్సర్ పేషంట్లకే పరిమితం కాలేదు, నాలాంటి వారికి అంటే పాన్క్రియాస్ లో దాని తల, బాడీ (మధ్య భాగం), ఒకోసారి తోక తీసేస్తారు, దీన్ని”కంప్లీట్ పాన్క్రియాటెక్టమీ,” అని అంటారు. క్యాన్సర్ లేని ట్యూమర్లు వచ్చినా, లేదా నాకు అయినట్టు పాన్క్రియాస్, తల, బాడీ (మధ్యభాగం) పాడయిపోయి గట్టిగా రాళ్ళలా అయిపోతే అవి రెండు తీసేసి దాంతోపాటు చిన్నప్రేవులుకూడా ఒకోసారి దెబ్బ తింటాయి ఈ జబ్బులో, చిన్నప్రేవుల్లో మొదటి భాగం ఎంతవరకు దెబ్బతిన్నాయో అంతవరకు తీసేస్తారు, దీంతో పాటు పిత్తాశయం (గాల్ బ్లాడర్)లో రాళ్ళు వచ్చి పాడయితే అది కూడా తీస్తారు, ఒకోసారి అవసరం పడితే పిత్తనాళం (bile duct) కూడా తీస్తారు చివరిగా కడుపు కొంతభాగం తీసేస్తారు. అన్నీ తీసిన తర్వాత సర్జన్, మిగిలిన పాన్క్రియాస్ ని, పిత్తనాళం ( bile duct) ని, కడుపుని, చిన్న ప్రేవులకి మళ్ళీ కలిపి జీర్ణవ్యవస్థని పునర్నిర్మిస్తారు, జీర్ణక్రియ కొనసాగడానికి. ఇదంతా సరిగ్గా జరిగి పనిచేయాలంటే సర్జన్ పనితనంపై ఆధారపడిఉంటుంది. నాకు ముందే ఒక సర్జరీ జరగింది. అది చేసేపుడు పిత్తాశయం (గాల్ బ్లాడర్)లో రాళ్ళు వచ్చి పాడయితే అది అపుడే తీసేసారు.

డా.రొసాటో పైన పూర్తి నమ్మకముంది, ఎందుకంటే ఆయన ఎంతోమంది పాన్క్రియాటిక్ క్యాన్సర్ పేషంట్లకు సర్జరీలు చేసి ప్రాణాలు నిలబెట్టారు. డాక్టర్ గానే కాదు ఆయన మంచి మనిషి కూడా. నాకు ఆయనను చూస్తే మా నాన్నను చూస్తున్న భావన వస్తుంది. ఆయన కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు.

నేను బరువు పూర్తిగా పెరగకుండానే చేయమంటున్నాను ఒకవేళ సర్జరీ సమయంలో ఏవైనా క్లిష్టమైన సమస్యలొస్తే, నా శరీరం తట్టుకోలేక చేతులెత్తేస్తే…. అపుడు నేనంటూ లేకపోతే పిల్లలేమవుతారు, శ్రీని ఎలా వుంటాడు? అమ్మా, నాన్న చిన్న కొడుకుని పొగొట్టుకొనే చాలా దు:ఖాననుభవించారు! మళ్ళీ అదే బాధని ఈ వయసులో తట్టుకోగలరా? ఒకోసారి “ఏం పర్వాలేదు, అంతా బాగానే వుంటుంది, పిచ్చి పిచ్చిగా ఆలోచించకు,” అని నాకు నేనే చివాట్లు పెట్టుకునేదాన్ని. కానీ ఈ భయాలు పోవాలంటే ఏం చేయాలి.

డా.జెఫ్రీ వచ్చినపుడు నా భయాలన్నీ బయటపెట్టాను. ఆయన అన్నీ విని ఇన్నిరోజులు భయపడ్తూ బయటకు చెప్పకుండా బాధపడినందుకు కొంచెం కొప్పడ్డారు.

“ఎవరికైనా అంత పెద్ద సర్జరీ జరుగుతుందంటే తప్పకుండా భయం వుంటుంది. సర్జరీ అపుడు కాంప్లికేషన్స్ వస్తే ప్రాణంపోతే కుటుంబం ఎలా తట్టుకుంటుందనే భయం, ఇంత చిన్న వయసులో చనిపోవడం ఎవరికీ ఇష్టం వుండదు. మనం అంతా మంచే జరుగుతుందని ఎలా ఆలోచించాలనుకుంటామో, ఒకవేళ అంతా మంచే జరగకపోతే ఎలా వుంటుందో కూడా ఆలొచించాలి ఒకోసారి. మీకున్న పెద్ద భయమేంటి?”

“పిల్లలకు నేనెన్నో నేర్పించాలనుకున్నాను, నాకా అవకాశం వస్తుందో, రాదో అని భయంగా ఉంది.”

“అయితే మీరు ఒక పని చేయండి. పిల్లలకు అంటే చైతుకి ముఖ్యంగా, వాడు పెద్దవాడవుతున్నాడు కదా! తనకు అన్నీ విషయాలు అర్ధం అవుతుంటాయి ఇపుడే! తనకు మీరు ఒక మంచి లెటర్ రాయండి. మీరు తన గురించి ఏమేమనుకున్నారో అవన్నీ ఆ లెటర్లో రాయండి. ఏ విషయం వదిలి పెట్టకండి. అలాగే మీ పాపకు కూడా రాయండి. మనసులో వునదంతా షేర్ చేసుకొండి మీ పిల్లలతో!

శ్రీనివాస్ ఏమనుకుంటున్నారు? మీ సర్జరీ సక్సెస్ అవుతుందనుకుంటున్నారా? తను కూడా భయపడుతున్నారా?”

“ఏమో! నాకేం తెలియదు. నాతో ఏది షేర్ చేసుకోడు. ఎప్పటిలా మాములుగానే వుంటున్నాడు.”

“తనని పిలుస్తారా? నేను ఒక అయిదు నిమిషాలు మాట్లాడతాను,” అన్నారు డా.జెఫ్రీ.డాక్టర్ వచ్చినపుడు ఏ ఆటంకాలు లేకుండా మాట్లాడుకోవాలి అంటే ఒక రూంలో కూర్చొని తలుపేసుకోవాలి.
ఒకోసారి లివింగ్ రూంలోనే కూర్చునేవారం, జోన్ పాపని చూసుకుంటూ లోపల బెడ్రూమ్లో ఉంటే. మేమింకా టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్లోనే వున్నాం కాబట్టి చైతన్య స్కూల్ కి వెళ్ళినపుడు, శ్రీని ఆఫీస్ కి వెళ్ళినపుడు డాక్టర్ వస్తే లివింగ్ రూంలోనే ఎక్కువ కూర్చుంటాము. ఈ రోజు చైతన్య రూంలో కూర్చున్నాం. వాడు సాకర్ ఆడడానికి వెళ్ళాడు. శ్రీని వాడిని అక్కడ దిగబెట్టి ఇంటికి వచ్చాడు.

నేను శ్రీనిని పిల్చుకొచ్చాను.

“రండి శ్రీనివాస్, మీ సమయం ఎక్కువ తీసుకోను. దుర్గ సర్జరీ దగ్గరపడ్తుంది కదా! దాని గురించి మీ ఆలోచనలేంటీ? ఈ సర్జరీ సక్సెస్ అవుతుందనుకుంటున్నారా? లేకపోతే…,”

“అఫ్కోర్స్! నో క్వశ్చన్ అబౌట్ ఇట్,” అన్నాడు ఎంతో ఆత్మవిశ్వాసంతో శ్రీని.

“మీకు ఏం భయాలు లేవా?”

“ఏవో చిన్నవి అంతే… కోలుకోవడానికి చాలా సమయం పడ్తుందని అన్నారు, దుర్గాకి కష్టమవుతుందనే కన్సర్న్ అంతే,”

” అది సర్జరీ తర్వాత సంగతి. తన సర్జరీ సక్సెస్ అవుతుందని మాత్రం మీకు చాలా నమ్మకం వుంది. దట్స్ గుడ్…సారీ ఫర్ టేకింగ్ యువర్ టైం….”

“నో..నో.. ఇట్స్ నో ప్రాబ్లెమ్ ఎట్ ఆల్. థాంక్యూ!” అని శ్రీని రూం బయటకు వెళ్ళాడు.

*****

(సశేషం)

Leave a Reply

Your email address will not be published.