మీమాంస

-అక్షర

ఇండియన్ నేవీ నుంచి ఉద్యోగ విరమణ చెంది మా నాన్నగారికి ఏడాది అవుతున్నది. మా నాన్నగారికి మంచి స్నేహితుడు, సహకర్మచారి అయిన రామనాథం గారు సంవత్సర వ్యత్యాసంలో ఉద్యోగ విరమణ పొందారు. చిన్నప్పటి నుంచీ ఒకే దగ్గర ఒకే కాలనీలో ఉండటం వల్ల మా మొత్తం కుటుంబానికి మిగతా కుటుంబాలికి మధ్య మంఛీ స్నేహం కుదిరి ,ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలగోవటం పరిపాటి.

నేను పెళ్లి అయి వైజాగ్ నుంచి ముంబై కోలాబాలో మా వారితో స్థిర పడిన పై ఏడాది అమ్మ నాన్నాను కలవటానికి వైజాగ్ వచ్చాను. వెంటనే గాలి కబురు అంది నన్ను కలవటానికి వచ్చింది మానసి. మానసి తులసి అక్క చెల్లెలు. మాది చిన్నపటి నేస్తం. మా మధ్య ఎటువంటి అరమరికలు కానీ దాపరికాలు లేవు. మా చదువులు పూర్తి ఐన వెంటనే నా పెళ్లి అయిపోయింది. తులసి మా కంటే రెండేళ్లు చీన్నది. ఇంకా చదువులో ఉంది. మానసి మంచి ఉద్యోగంలో చేరింది.

ఒక రోజు మానసి ఆఫీస్ నుంచి వచ్చాక కలవటానికి వెళ్ళాను. మానసి అన్యమనస్కంగా ఉండటం గమనించి ‘ఏమని’ అడిగితే చెప్పింది ‘ వాళ అమ్మకు యూట్రస్ లో క్యాన్సర్ డిటెక్ట్ అయిందని. థర్డ్ స్టేజ్ అని. దుఃఖంతో గొంతు పూడుకు పోతుంటే ఎలాగో విషయం చెప్పి ఏడవటం మొదలెట్టింది. తనని అలా చూసి నాకు కూడా చాలా బాధగా అనిపించింది. కాసేపు అలా నిశ్శబ్దంగా ఉండిపోయాము. కొంచెము తెరుకున్నాక వివరాలు అడిగాను. “వైద్యులు ఎక్కువ ఆశ చూపలేదు కానీ చేయవల్సిన ప్రయత్నాలన్నీ చేద్దాము, ఆవిడ మనోబలం కూడా సహకరిస్తే క్యాన్సర్ నుంచి బయట పడిన కేసెస్ చాలానే ఉన్నాయి. వచ్చే వారం నుంచి కిమో తెరేపి మొదలేడదామ్మన్నారు.” మరి ఇంకేం మానసి నువు ధైర్యంగా ఉండి తులసికి కూడా ధైర్యం చెప్పు. కష్టమే కానీ తప్పదు కదా. మా నుంచి ఎటువంటి సాయం కావాలన్నా చెప్పు మానసి.” అని తనకి ధైర్యం చెప్పి వచ్చాను.

కర్నల్ రామనాథంగారికీ హోదా పలుకుబడీ రెండూ ఉండటం వల్ల భార్య కామాక్షిగారికి ఏ లోటూ లేకుండా కంటికి రెప్పలా చూసుకుంటూ, ఎవరు ఏ వైద్యం చెపితే అది చేయిస్తూ వచ్చారు. కాలక్రమేణ కబురు తెలిసిన క్షణంలో పడిన వ్యథ చోటున ధైర్యం స్థైర్యం చోటు చేసుకున్నాయి. ఆవిడ ఉన్నంత కాలం ఆవిడ మనసుని కష్ట పెట్టకుండా చూసుకున్నారు అందరూ. ఎన్ని రకాల వైద్యాలు చేయించినా మరో రెండేళ్ళకి కామాక్షి గారు ప్రశాంతంగా కళ్ళు మూశారు. ఎంత ముందు నుంచీ తెలిసిన విషయం అయినా మనకి కావల్సిన వ్యక్తి ఇక మనకి కనిపించరని తెలిసాక దుఃఖం ఆగదు. రామనాథంగారు వంటరీ అయిపోయారు. స్త్రీ వంటరీ అయిన కొన్నాళకి నిలదొక్కుకుని ధైర్యంగా బ్రతకటం నేర్చుకుంటుంది. కానీ ఎంత పెద్ద హోదాలో బ్రతికినా పురుషుడు మాత్రం వంటరిగా బ్రతకటానికి చాలా కష్ట పడతారు. అయినా సమాజం స్త్రీని అబల అని సంబోధిస్తుంది. అప్పుడూ ఇప్పుడూ కూడా స్త్రీ శారీరకంగా పురుషుడ్ని అధిగమించలేక పోయినా మానసికంగా మాత్రం ఎప్పుడూ సబలే.

రాను రాను రామనాథం గారి శరీరానికి లేని వృద్ధాప్యం మనసుకు వచ్చి బాధ పడుతున్నారు. ఆయన కూతుళ్లు ఇద్దరూ ఇవాళో రేపో పెళ్లి చేసుకుని వెళ్లిపోవల్సిన వారే. అందుకని ఆయన శ్రేయాభిలాషులు మిత్రులూ అయిన వారు రామనాథంగారిని తన ఈడుకి తగిన వారిని చూసి పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. పెళ్ళికి ఎదిగిన కూతుళ్లు ఏమనుకుంటారో అన్న సందేహం వ్యక్త  పరిచారు రామనాథంగారు. మళ్ళీ ఆ మిత్రులే మానసి, తులసిని సంప్రదించారు. వారు చెప్పింది విన్నాక మానసికి కూడా తమ తండ్రికి ఈ పెద్ద వయసు ఎవరైనాతోడు నిలుస్తే తాముకూడా నిశ్చింతగా  ఉండవచ్చని ‘సరే’ అన్నారు.

వైజాగ్ లోనే దేశ రక్షణ కోసం ప్రాణాలు ఆర్పీచిన సైనికుడి భార్య అయిన ఊర్మిళ అయితే రామనాథంగారికి సరిగ్గా సరిపోతుందని అనిపించి ఈ మిత్ర బృందం ఊర్మిళ సమక్షంలో ప్రస్తావన తెచ్చారు. యాభయ్యో పడిలో పయనిస్తున తనకి మారు వివాహం అంత అవసరం ఏం లేదనిపించింది. అలాని స్త్రీ మారు వివాహం పట్ల పెద్దగా విముఖత కూడా చూపించ లేదు. కానీ ఎదిగిన తన పిల్లలు ఏమాత్రం ఈ విషయంలో అయిష్టత చూపించినా తను సహించలేదు. ఆవిడ మనోభావం అర్థం చేసుకున్నరెండు పక్షాల పెద్దలు ఊర్మిళ గారి అబ్బాయితో సంప్రదించటానికి పూనుకున్నారు.

ఊర్మిళ కొడుకు నాగేష్ చదువు పూర్తి చేసుకుని ఆ రోజుల్లోనే ఉద్యోగంలో చేరాడు. అమ్మాయి దామిని ఇంకా చిన్నది. ఏం.ఎస్.సి మొదటి ఏడాది. మిత్రులయిన పెద్దలు నాగేష్ ముందు విషయం ప్రస్తావించినప్పుడు విని కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ తరవాత సర్దుకుని,ఈ విషయంలో తనకి అభ్యంతరం లేదు కానీ తన చెల్లి వివాహం అయ్యెదాకా ఆగాలని అన్నాడు. నాగేష్ అభిప్రాయం సబబుగానే అనిపించింది అందరికీ. రామనాథంగారు కూడా నిజమే కదా ఇంట్లో ఎదిగిన కూతురి పెళ్లి చేయకుండా నేను కూడా నా మారు పెళ్ళికి సమ్మతించను అన్నారు. ఇలా అందరూ ఒక ఒప్పందానికి వచ్చారు.

ఈ మధ్యలో నేను ముంబై వెళ్ళాను. వైజాగ్ వదిలి నేను కానీ మానసి కానీ ఎక్కడకి వెళ్ళినా ఫోనులో తరుచూ మాట్లాడుకునేవారం. ఈ సారి మాత్రం మానసి సరిగ్గా మనసు విప్పి మాట్లాడటం లేదనిపించింది. ఎన్ని రకాలుగా అడిగినా ఏదో చెప్పి దాటేస్తున్నది. ఒకవేళ తనకి వాళ  నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదాని అడిగాను. అదేం కాదంది. పండగలకి వైజాగ్ వెళ్ళి కలిసి నప్పుడు చూడాలనుకున్నా.

***

పండక్కి నాలుగు రోజులు ముందు వైజాగ్ వెళ్ళాను. ఇంటికి వెల్లంగానే సామాను పడేసి అమ్మకి చెప్పి మానసిని కలవటానికి బయల్దేరాను, “భోజనం చేసి వెల్లవే అని అమ్మ కేక వేసినా వినిపించుకోకుండా. వెళ్ళిన వెంటనే మానసిని బయట గార్డన్ లోక్కి లాక్కు వచ్చి కూర్చోపెట్టి చిక్కి పోయిన తనని చూస్తూ కారణం అడిగా కొంత బాధగా కొంత అధికారంగా.

ఇక తప్పించులేక ఉబికి వస్తున్న కన్నీళని తుడుచుకుంటుంటే నాకు కంగారుఎక్కువ అయి తనని దగ్గరకు తీసుకుని అడిగాను-‘ఒంట్లో ఏమీ చికాకు లేదు కదా’అని. అదేం లేదంది.“మరయితే ఏమైందో చెప్పవే ఇక నన్ను చంపక” ఈ సారి కొంచెం విసుగ్గా.

“నాన్నకి ఊర్మిళా అంటీకి పెళ్లి నిశ్చయమైందని తెలుసు కదా?”అన్నది ఆఖర్కి గొంతు పేగుల్చుకుని.

“తెలుసు, మీ సహమతి తరవాతే కదా అందరూ సరే అనుకున్నారు”.

“అదంతా బాగానే ఉంది. కానీ ఈ ప్రస్తావన రాక మునుపే నేను, ఊర్మిళా ఆంటీ పెద్ద కొడుకు నాగేష్ ఒకర్ని ఒకరు ఇష్ట పడ్డాము. నాగేష్ ఉద్యోగంలో చెరీ వాళ అమ్మకి మన విషయం చెపుదామనుకున్నాడు. ఈ లోగా కథ ఇలా మలుపు తిరిగింది. మన వారందరూ నాగేష్ తో విషయం చెప్పినప్పుడు, వెంటనే  ఎలా విషయం చెప్పాలో తెలియక తన చెల్లి పెళ్లి అయ్యేదాకా ఆగమని అడిగాడు. ఈ లోపున ఏం చేయటానికీ, ఆలోచించటానికి కొంత సమయం చిక్కుతుందని.” చెప్పటం ఆపి నా వేపు చూసింది మానసి. ఈసారి మౌనం వహించటం నా వంతు అయ్యింది.

“చూశావా నీకు కూడా ఏం మాట్లాడాలో తెలీటం లేదు కదా! మరి నా పరిస్థితి ఏమిటి?

“పెద్ద సమస్యే వచ్చి పడింది. ఐనా నువు కంగారూ పడకు. పరిష్కారంలేని సమస్య ఉండదు. నేను మా అమ్మ నాన్నతో మాట్లాడుతా .సరేనా ?”మానసిని శాంతపరిచాను కానీ నా మనసు పలు రకాల ఆలోచనలతో బరువెక్కింది. వారి వివాహం అయ్యేదాకా ఎటువంటి సంబద్దం లేని మానసి నాగేష్, ఊర్మిళా అంటీకి రామనాథం గారెకి పెళ్లి అయ్యాక అన్నా చెల్లి వరస అవుతారు. పైకి కనిపించే ఈ వరసని ఆదరిస్తే తమ మనసును చంపుకుని బ్రతకవల్సిందేనా? ఆలోచిస్తూ ఇంటికి చేరిన నేను అన్యమనస్కంగా అమ్మ పెట్టిన అన్నం తినేసి తనని కూర్చోపెట్టి విషయం చెప్పాను.

విని నిర్ఘాంత పోయింది అమ్మ. గడ్డు సమస్యే వచ్చిపడింది కదా. నా మనసులో ఉన్నది దాపరికం లేకుండా అమ్మతో చెప్పాను. రక్త సంబంధం ఉనప్పుడే మన వాళ్ళు మేనరికం చేస్తున్నారు. మేన మామతో పెళ్లి జరిపిస్తున్నారు. ఏమంటే గోత్రం వేరు కాబట్టి అన్న చెల్లి కారంటున్నారు. అలాంటప్పుడు రామనాథంగారు ఊర్మిళా ఆంటీ పెళ్లి చేసుకున్నంత మాత్రాన నాగేష్ మానసి అన్నా చెల్లి అవుతారని నిర్బంధించటం అన్యాయం కాదా? వారిద్దరి తండ్రి కానీ తల్లి కానీ ఒకరు కాదు. ఇద్దరూ మానసికంగా పరిపక్వత చెందిన వారు. మరి ఒక వివాహం అయితే మరో జంట మనసు చంపుకుని విడిపోవల్సిందేనా ?” నా ప్రశ్నలకి అమ్మా నాన్న ఏం జవాబు ఇవ్వలేక మౌనంగా ఉండి పోయారు. ఒక క్షణం తరువాత నాన్న అన్నారు-

“సరే మాకు కూడా ఇది కొత్త రకం సమస్య కదా. మిగతా వారితో మాట్లాడి సరైన నిర్ణయానికి రావాలి. మానసిని మనసు పాడు చేసుకోక ధైర్యంగా ఉండమని చెప్పు.”

సంఘంలో ఈ నియమ-నిష్టలు, మన పెద్దలు అప్పటి సామాజిక పరిస్థితులకి వీలుగా పెట్టుకున్నారూ. అవసరం బట్టీ కాలక్రమేణ వాటిల్లో మార్పులు చేస్తూ వస్తున్నారు. ఈ మార్పుల్ని ఇష్టం ఉన్న వారు స్వీకరించి ముందు అడుగు వేస్తుంటే ఇష్టం లేని వారు స్వీకరించలేక కొన్ని విషయాల్లో మనసు చంపుకుని బ్రతుకుతున్నారు.

ఏమైతేనేమీ మన పెద్దలు కూడా విషయం తెలిసి చాలా తర్జన భర్జన పడ్డారు. వాదించుకున్నారు. రెండు పక్షాలుగా విడిపోయారు. రామనాథం ఊర్మిళగారి వివాహం అయినా అవ్వాలి లేదా నాగేష్ మానసి వివాహం అయినా అవ్వాలి. అంతే  కానీ రెండు వివాహాల్ని స్వీకరించమని ఒక పక్షం. రెండో పక్షం వారు రెండు వివాహాలు ముందు వెనక జరపటానికి సమ్మతించారు. ఆఖరికి రెండో పక్షం వారు బహుమతి పొందినందువల్ల రెండు వివాహాలకి ఇష్టం ఉన్న లేకపోయినా అందరూ అంగీకరించారు.

పద్ధతి ప్రకారం పిల్లల పెళ్లి అయనాకే తమ పెళ్లి రిజిస్టర్ చేసుకుంటామని రామనాథంగారు తేల్చి చెప్పారు. తమ కుటుంబ బాగోగుల ఇంతలా ఆలోచించి తమతో నిలిచి చక్కటి పరిష్కారం చూపినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నారు రామనాథంగారు.

పెద్దల నిర్ణయం తెలిపాక పరుగున వెళ్ళి మానసికి విషయం తెలియచేశా ఆనందంగా తనని కావలించుకుని. ఇన్నాళకి మానసి కళ్ళలో మునపటి వెలుగు చూశాను. అప్పుడే వచ్చిన రామనాథం గారు మానసిని దగ్గరకు తీసుకుని “పిచ్చి పిల్లా మీ సుఖం కంటే నాది ముఖ్యం కాదురా. అందరూ కలిసి రెండు వివాహాలకి అనుమతించారు. వారు ఏదో ఒక పెళ్లికి అనుమతించినా నేను మీ పెళ్లికే  ప్రాధాన్యత ఇద్దును.”

“మరి అందుకే కదా మీకు చెప్పలేక ఇంత బాధ పడ్డాను.” వారిద్దరిని అలా వదిలి నేను మా అమ్మ నాన్నతో నా సంతోషం పంచుకోవటానికి వెలిపోయాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.