ఆత్మీయ నేస్తం
-ములుగు లక్ష్మీ మైథిలి
ప్రతి ఉదయం అలారమై పిలుస్తుంది
బ్రతకడానికి పాచిపని అయినా
ఇంటి మనిషిలా కలిసిపోతుంది
ఒక్క చేత్తో ఇల్లంతా తీర్చిదిద్దుతుంది
నాలుగు రోజులు రాకపోతే
డబ్బులు తగ్గించి ఇచ్చే నేను..
ఇప్పుడు లాక్ డౌన్ కాలంలో
పనంతా నా భుజస్కంధాలపై వేసుకున్నా
అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ
పని మొత్తం చిటికెలో చేసేది
నిత్యం ముంగిట్లో ముగ్గులు
ఆమె రాకను తెలియచేస్తాయి
పెరట్లో చిందరవందరగా వేసిన గిన్నెలన్నీ
ఒద్దికగా బుట్టలో చేరేవి
ఒక్కోరోజు రాకపోయినా
ఇంతెత్తున ఎగిరే నేను
కరోనా కాలంలో చప్పున చప్పబడిపోయాను..
భౌతిక దూరం అంటూ
రావద్దని చెప్పటానికి ఎంతసేపూ దిగులు పడ్డానో..నాకే తెలుసు
ఎందుకు రావద్దన్నానో …
అర్థం కాని ఆ అమాయకురాలి బుర్రకు తట్టక ‘నగ్గోయకమ్మా.. నేను బానే సేత్తన్నా ‘అంటూ బాధపడినప్పుడు..
కారణమిదనీ చెప్పి..’ మరలా వద్దువులే ‘
చెపుతున్నపుడు…
ఏదో ఆలోచిస్తూ వెళుతూ చూసిన చూపులకు .. నాకు అర్థం తెలిసింది..
నా దిన చర్య లు నేను చేసుకుంటూ..
నెలజీతం మాత్రం.. ఆమె ఖాతాలోకి పంపిస్తున్నాను..
నా ఆత్మీయ నేస్తం పస్తులండరాదనీ…
తోచిన సాయం చేస్తున్న..!!
*****
ఆర్ట్: మన్నెం శారద