షర్మిలాం “తరంగం”

మచ్చల్ని చెరిపేద్దాం !

-షర్మిల (Sharmila)

బుల్లీబాయ్ అనే యాప్ లో ముస్లిం మహిళల ముఖాలతో అసభ్యమైన ఫొటోలు మార్ఫింగ్ చేసి వారిని వేలం పాటకు పెడుతూన్న ఉదంతం ఇప్పుడు ఎందరో మహిళల్ని కలవరపెడుతోంది .
ఈ ఏప్ లక్ష్యం చేసుకున్న మహిళలు అందరూ హక్కుల కోసం పోరాటం చేసేవారు , అణచివేతకు వ్యతిరేకంగా తమ గొంతు వినిపించే అభ్యుదయ భావాలు కలవారే !
ప్రశ్నించే ఈ గొంతులను నులిమేందుకే ఈ బుల్లీబాయ్ ఏప్ వినియోగించుకుంటున్నారు.
శీలహననమే ఆడవారిని అణచివేయడానికి ఆయుధంగా వాడడం అనవాయితీగా వస్తోంది.
అది ఉద్యమకారులైనా , రాజకీయంలో వున్న వారైనా మహిళల్ని భయపెట్టాలంటే ఆమె శీలాన్ని గురించి అభ్యంతరకర వ్యాఖ్యలతోనే దాడి మొదలవుతుంది.
ఇదంతా మహిళలపై లైంగిక దాడి జరపడమే అవుతుంది.
ఇవి తట్టుకోగల దృఢచిత్తం గలవారే ఇటువంటి అవాకులు చెవాకుల్ని పట్టించుకోకుండా ముందుకు సాగుతారు.
మొన్న ఒక టీవీ షో లో అమరావతి ఉద్యమకారిణి ఒకామె చెప్పారు.
తను ఈ ఉద్యమం లో పాల్గొన్న కొత్తల్లో తన గురించి సోషల్ మీడియాలో ఎన్నో అసభ్యమైన రాతలు రాసేవారని చెప్పారు.
ఆమె సోదరుడు ఎందుకు ఇన్ని మాటలు పడడం ఉద్యమాలు మనకు వద్దు అనేవాడట!
నిజంగా వాటికి భయపడాల్సిన అవసరం వుందా?
మనం పైకి ఎదగాలంటే కాళ్ళు పట్టి కిందకు గుంజాలని ప్రయత్నించే వారిని తల తన్ని మరీ పైకి ఎదగాలి.
అంతెందుకు మొన్న మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో సాక్షాత్తూ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి భువనేశ్వరి నైతికత పైన మచ్చ వేసే నిందలు మోపారు.
ఇవన్నీ తాను పట్టించుకోనని , టైం వేస్ట్ చేసుకోకుండా జీవితంలో చేయాల్సిన ముఖ్యమైన పనుల్ని చేస్తానని ఆమె ఇచ్చిన సమాధానం ఆడవారిలో పెరుగుతున్న పరిణితికి నిదర్శనం.
బుల్లీ బాయ్ ఏప్ లో వేలం పాటకు పెట్టిన ముస్లిం మహిళలైనా ఇదే విధంగా స్పందిస్తున్నారు.
మమ్నల్ని ఈ విధంగా జుగుప్సాకరమైన మార్ఫింగ్ ఫొటోలను పెట్టి సోషల్ మీడియాలో రేటు కట్టినా భయపడేదిలేదంటున్నారు.
ఈ సందర్భంగా నాకూ నా చిన్నతనంలో జరిగినది గుర్తొస్తోంది.
సుమారు 40 ఏళ్ళ కిందట నేను నా కో ఎడ్యుకేషన్ కాలేజీలో జనరల్ సెక్రెటరీ గా ఎన్నికల్లో నిలబడ్డాను.
నాతో విత్ డ్రా చేయించడానికి నామీద చాలా నీచమైన వ్యాఖ్యలు కాలేజీ గోడల నిండా రాసారు.
నేను వాటిని చూసి ఏడ్చాను వెంటనే విత్ డ్రా అవడానికి సిద్ధమయ్యాను.
కానీ అప్పుడు నా మగ స్నేహితులు ఇద్దరు నాకెంతో ధైర్యం ఇచ్చి నన్ను ముందుకు నడవమన్నారు.
నాతో కలిసి నడిచేందుకు అతి తక్కువమంది ఆడపిల్లలే ముందుకొచ్చారు.
మిగతా వాళ్ళందరికీ ఇటువంటి వ్యాఖ్యలు చేయించుకున్న ఆడపిల్లతో కలిసి తిరిగితే వారిని కూడా ఏమన్నా అంటారనే భయం.
కానీ ఆ ఎన్నికల్లో నేను బంపర్ మెజారిటీతో గెలిచాను.
ఆ గెలిపించినవారిలో ఆడా మగా అంతా వున్నారు.
నేను గెలిచిన మర్నాడే గోడలమీద రాతలన్నీ తెల్ల సున్నం తో మాయమయ్యాయి.
నేను ముందడుగే వేశాను.
ఎన్నేళ్ళైనా ఆ పరిస్థితి మారలేదు ఇకపై మారడానికి ఎన్నేళ్ళు పడుతుందో !
ఎన్నేళ్ళయినా కానీ మనం ముందడుగే వేద్దాం ! వేస్తూనే ముందుకు పోదాం !! 

****

Please follow and like us:

3 thoughts on “షర్మిలాం“తరంగం”-29”

  1. బాగా చెప్పారండి.
    స్త్రీలను నైతికం గా దెబ్బ తీయాలనుకునే వారి అనైతిక అకృత్యాలు ఇవన్నీ.

  2. చాలా బాగా చెప్పారు.
    మీకు ఎదురైన అనుభవం మిమ్మల్ని రాటుదేల్చింది.
    మహిళలు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటేనే ముందుకు పోగలం.

    1. అవును స్త్రీలు సున్నితంగా వుంటూనే దీటుగా ఎదగాలి , తమ బలాన్ని గుర్తించగలగాలి .

Leave a Reply

Your email address will not be published.