మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

మర్నాటి ఉదయానికల్లా నా ఇంటి తలుపు మీద ఒక నోటీస్ ఉంది. ‘ఇరవై నాలుగు గంటల లోపల నేను ఆ జిల్లా వదిలేసి వెళ్లిపోవాలి’. అదే చివరి హెచ్చరిక అని కూడ దాంట్లో రాసి ఉంది. దాని మీద కంపెనీ మేనేజరూ, ఇద్దరు మిలిటరీ అధికారులూ సంతకాలు చేశారు. భర్తలు జైల్లో ఉన్న స్త్రీలందరికీ ఇలాంటి నోటీసులొచ్చాయి.

అంతేగాక బడికి కూడ కం పెనీ ఒక లోపాయికారీ నిర్ణయం పంపింది. దాని ప్రకారం బడిపిల్లలందరికీ వాళ్ళవాళ్ళ సర్టిఫికెట్లిచ్చేసి బడి మూ సెయ్యమని కంపెనీ ఆదేశించింది. అలా సంవత్సరం మధ్యలోనే వాళ్ళ చదువులను ఆ పేయించదలచుకొంది. అంటే మేం ఇక్కడే ఉండడానికి ఏ ఒక్క కారణాన్నీ లేకుండా చేయదలచుకున్నారు వాళ్ళు. అలా ప్రతి దారీ మూసేశారు.

చాల ఆందోళనపడుతూ ఏడుస్తూ స్త్రీలు నా దగ్గరికి వచ్చారు. “ఏం చేద్దాం? ఏం చేయగలం?” అని మా ఇంట్లో చాలమందిమి కూచుని ఆలోచనలు చేశాం.

చాలమంది స్త్రీలు మేనేజర్ దగ్గరికి వెళ్ళారు. నేను మాత్రం వెళ్ళలేదు. అక్కడ కల్నలు ఆ స్త్రీలను చాల హీనంగా చూశారని, వాళ్ల తర్వాత నాకు చెప్పారు. “వెళ్ళండెళ్ళండి” అని వాళ్ళు గద్దించి చెప్పారట. మా ఇంట్లో సమావేశానికి హాజరైన ఒక స్త్రీ “సరే! దొమితిలా చెప్పిన సంగతి వాళ్ళకు చెప్పండి” అందట. ఓ ఏజెంటు ఈ మాటవిని “ఓహో అలాగా? ఏదీ, ఏం చెప్పింది? ఎవరమ్మా ఇలా రా! పాపం, ఆవిడకెవరో ఏమో చెప్పారు. ఎవరో ఆమెను ఆవహించారు. ఇలా రామ్మా! నీ యజమానురాలేమందీ?” అని ఆవిడను ఒత్తిడి చేశారట. ఆవిడకు భయంతో గొంతు పెగల్లేదట.

నా భర్త కేసు గురించి మాట్లాడాల్సి ఉంది. గనుక వెంటనే రమ్మని వాళ్ళు నన్ను కార్యాలయానికి పిలిపించారు. అక్కడ అధికారులందరూ కూచుని ఉన్నారు. అక్కడ మేం కొద్దిగా ఘాటుగానే మాట్లాడుకోవాల్సి వచ్చింది.

“ఎంత ఆశ్చర్యం! నీకింకా బుద్ధిరానే లేదు. ఇంకోసారి శాస్తి జరగాలా ఏం?” అన్నాడు మేనేజర్.

“ఆ స్త్రీలకు నేను నా ఇంట్లో నా వ్యక్తిగత అభిప్రాయమేదో చెప్పాను. మీరు నా భర్తను అరెస్టు చేసి, నన్ను ఇంట్లోంచి తరిమేస్తున్నారు. నేనక్కడ్నుంచి వెళ్ళిపోలేను. నా భర్త నన్నక్కడ వదలివెళ్ళాడు గనుక నేనక్కడ్నుంచి కదలను. అదీగాక ఆయన ఉద్యోగం, నష్టపరిహారం సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఆయనకు కంపెనీ ఎన్ని డబ్బులివ్వాలో నాకేమైనా తెలుసా? ఇప్పుడు మీరు నా మొఖాన పారేసినంత తీసుకుకోవచ్చునో లేదో? మీరు తక్కువివ్వవచ్చు. కనుక ఎలా చూసినా నేను ఒక్క దాన్నే ఏ నిర్ణయమూ తీసుకోలేను. అట్లయినా, కాదూ కూడదని వెళ్ళిపొమ్మంటే, నా భర్తను విడుదలచెయ్యండి. ఆయనతో కలిసి వెళ్ళిపోతాను. నేనా స్త్రీలకు కూడా ఈ సంగతే చెప్పాను” అన్నాను.

వాళ్ళింక నన్ను బూతులు తిట్టారు. నేనూ ఆ భాషలోనే జవాబిచ్చాను. “సరే – మీకు నా భర్తను విడుదల చేయడం ఇష్టం లేకపోతే నన్నూ, పిల్లల్ని కూడా జైలుకి తీసుకెళ్ళండి. నా భర్త ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్ళండి. బతికినా చచ్చినా మేమంతా కలిసే ఉంటాం. లేదూ – మీరు నా పిల్లల బాధ్యత తీసుకుంటారా? వాళ్ళ తిండీ తిప్పలూ చూస్తారా? వాళ్ళ చదువు సంధ్యలు చూస్తారా…”

అప్పుడు వాళ్ళు బూతుల జోరు మరింత ఎక్కువ చేశారు. నా పిల్లల బాధ్యత తీసుకోవడానికి తాము ఆ పిల్లల తండ్రులమా అని అడిగారు. నేనింక బాగా ఉద్రేకపడిపోయి “మీరందుకైనా పనికొస్తారా?” అని తిట్టాను. ఆ మాటకు అక్కడున్న స్త్రీలందరూ భయపడ్డారు. వాళ్ళు నాతో “ఏమమ్మా? అలాంటి మాటలు అనడానికి నీకు నోరెట్లా వస్తుంది? నువు నీ భర్తను, మా భర్తల్ని కూడా మరింత ఎక్కువ శిక్షకు గురి చేస్తున్నావు….” అని అరిచారు.

“సరే మీరు వెనక్కి తగ్గదలచుకుంటే తనొచ్చు. రండి – వచ్చి ఈ కల్నల్ బూట్లు నాకండి. నేను మాత్రం చచ్చినా ఆ పనిచేయను. వాళ్ళు నన్నెందుకు అవమాన పరచాలి? నేనెప్పుడూ వాళ్ళకు లొంగను, లొంగను…” అంటూ బయటికొచ్చేశాను.

వాళ్ళు నా వీపులోకి. కాల్పులు జరుపుతారనీ, లేదా నన్ను వెనక్కయినా పిలుస్తారనీ, నాకనిపించింది. “వాళ్ళు నన్నిప్పుడిక్కడ అరెస్టు చేస్తారు… ఇక్కడే, ఇప్పుడే…” అనుకున్నాను. అలా అనుకుంటూనే నడిచాను. అలా చాల దూరం వచ్చాక వెనక్కి చూస్తే ఎవరూ లేరు. నాకేమీ జరగలేదు కూడా. ఇది నాకుచాల ఆశ్చర్యం కలిగింది.

ఆ రోజే వాళ్ళు నా భర్తను తీసుకు రావడానికెళ్ళారు. నేను సైగ్లో-20కి వచ్చేసిన వారం రోజులకే ఆయనను కూడా విడిచి పెట్టారు. అప్పుడు వాళ్ళు ఆయనతో “నువ్వు కొజ్జావు గనుక, నీ భార్య చేసిన తప్పులకి నీ ఉద్యోగం పీకేస్తున్నాం . మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరో నీకు తెలుసా? నీ ఉద్యోగం పీకేస్తే గాని భార్యను అదుపులో పెట్టడం నేర్చుకోవు. నీ అడ్డూ ఆపూ లేకపోవడంతోనే నీ భార్య జైలుకు పోయి వచ్చినా బుద్ధి రాక, ఈ పనులు ఇంకా ఎక్కువగా చేస్తోంది. నీకు శిక్ష నువు చేసిన పనులకు కాదు, నీ భార్య చేసిన పనులకు. అది సరే – ఆ రాజకీయాల రాక్షసితో నువు ఏం చేస్తావు? ఆమెను వదిలేసెయ్యి. నీకు ఉద్యోగం ఇస్తాం. అలాంటి స్త్రీ నీకెందుకూ పనికిరాదు. ఆలోచించు. నువు బాగా కష్టపడి పనిచేసి రేపటి రోజున ఓ ఇల్లు కట్టుకుంటావనుకో, లేదా కొనుక్కుంటావనుకో – కాని ఏం లాభం! నీ భార్య రాజకీయాల్లో ఉందని చెప్పి రేపు లేదు ఎల్లుండే నీ ఇంటిని ప్రభుత్వం తీసేసుకుంటుంది. అలాంటి ఆడదానికోసం నువు ఎందుకు చిక్కుల్లో ఇరుక్కుంటావు? ఇప్పుడిక ఉద్యోగం పోయిందిగదా, మీ కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళెవరు? ఇప్పుడైనా దానికి బుద్ధివచ్చిందేమో చూడు. అది ఆడది కాదు, బ్రహ్మరాక్షసి. చూస్తుంటే దాని పని మరీ శృతి మించుతోంది” ఇలా ఆయన బుర్ర నిండా విషపు మాటలు ఎక్కించి వాళ్ళాయనకు అక్కడికక్కడే నష్టపరిహారం ఇచ్చేశారు.

“మనం వెళ్ళోద్దు” అని ఆయనతో చెప్పాను. మేం అలాగే కొన్నాళ్ళపాటు ఉండగలిగాం.

కాని ఓ రాత్రి ఏజెంట్లు ఇంట్లోకి తోసుకొచ్చారు. వాళ్ళు దయ్యాల లాగా ఇంట్లోకి జొరబడ్డారు. ధనా ధన్ మని వచ్చేసి, వాళ్ళు మా సరుకుల్ని బైట ఆగి ఉన్న ఒక ట్రక్కులోకి విసిరివేయడం మొదలెట్టారు.

చివరికి వాళ్ళు మమ్మల్నికూడా ట్రక్కులోకి నెట్టారు. పిల్లలకి అక్కడ్నించి వెళ్లడం సుతరామూ ఇష్టం లేకుండింది. వాళ్లు కిందికి జారి కొన్ని సామాన్లు దించారు. ఏజెంట్లు వచ్చి మళ్ళీ ఆ సామాన్లు లోపల వేశారు. ఇలా కొంత సేపు సాగింది.

అది ఒక దయనీయమైన దృశ్యం. మా పొరుగువాళ్లు ఏడ్చారు, మొత్తుకున్నారు. చుట్టూ ఉన్న జనం మా దగ్గరికొచ్చి మాకు సాయపడకుండా సైన్యం మా చుట్టూ దడి కట్టింది. ఓ వైపు మా పొరుగువాళ్ళు “ఆవిడే తప్పూ చేయలేదే! ఆవిడ్నెందుకు తీసుకెళుతున్నారు. ఆవిడ చాల మంచిది” అని అరుస్తున్నారు. మరోవైపు ఏజెంట్లు మాత్రం మా సామానంతా ట్రక్కులో నింపే పనిలో మునిగిపోయారు. నా పెద్ద కూతురు మా ఇంటి తలుపుకు కరుచుకొని ఉండిపోయింది. దానికి అక్కడ్నించి రావాలని లేదు. ఏజెంట్లు దాన్ని ఆ తలుపు దగ్గర్నుంచి ఇవతలికి లాగారు. అది రానని మొరాయిస్తూ వాళ్ళ చేతులు కొరికింది. వాళ్ళెలాగో కష్టపడి నా కొడుకును ట్రక్కులోపలికి చీకట్లోకి తోయగలిగితే, వాడు మళ్ళీ బయటికి జారి సామాన్లు ఇంట్లోకి తీసుకెళ్తూనే ఉన్నాడు.

చివరికి నేను నా పిల్లలతో పెద్దగా “యజమానులు మనల బయటికి తో సేస్తున్నారు. మనం పేద వాళ్లం. పేదవాళ్ళనట్లాగే తోసేస్తారు. ఈ ఇల్లు మనది కాదు. మీ నాన్న పనిచేసినంత కాలం మాత్రమే కంపెనీ మనకీ ఇల్లు ఇచ్చిందని మీకు తెలియదా? ఆ కంపెనీయే మననిప్పుడు తోసేస్తోంది. సైన్యం కూడా కంపెనీ వాళ్ళకి వంత పాడుతోంది. అందుకే మీరు రేపెప్పుడైనా సైన్యంలో చేరితే జనానికి వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేయకండి. మనం పరువు ప్రతిష్టలతో బతుకుతున్న వాళ్ళం, వాళ్ళేమో ‘ మనను బయటికి గెంటేస్తున్నారు. కనుక మనం వాళ్ళను ప్రాధేయపడ గూడదు. మనకు ఇక్కడుండాల్సిన అవసరం లేదు. పదండి” అని ట్రక్కులోకెక్కి కూచున్నాను. ‘మరియా! వచ్చెయ్యమ్మా’ అని పిలిచాను. అప్పుడు పిల్లలందరూ ఒకరి వెనుక ఒకరు ఏడుస్తూ ట్రక్కులోకెక్కారు. ట్రక్కు కదిలింది. మెల్లగా నాకు నేను ధైర్యం తెచ్చుకొని పిల్లల్ని సముదాయించాను. వాళ్ల ఏడుపు చూస్తూ నా కన్నీళ్ళు దిగమింగుకున్నాను? మా స్వదేశంలో, మా స్వగ్రామం నుంచి గెంటేయబడిన మేం.. ఎక్కడికెళ్తాం. మేం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, మా బతుకంతా ఇక్కడే గడిపాం.

పనిచేసే వాడికే భూమి అంటుంటారు గదూ? మరి మా తండ్రుల కాలం నుంచీ మేం పని చేస్తున్న ఆ గని. తప్ప మాకు మరో బతుకుదెరువేముంది? వాళ్ళు మమ్మల్ని అక్కడ్నించి తో సేశారు. మేం మా స్వదేశంలోనే పరాయి వాళ్లలా బతకాల్సి వస్తున్నది. .

వాళ్లు మమ్మల్ని మొదట ఒరురో తీసుకెళ్ళారు, అక్కడ ఒక నాటక శాలలో మమ్మల్ని దింపేసి, మా సామాన్లన్నీ కుప్పపడేసి వెళ్ళిపోయారు. మేమెక్కడికి పోగలం? కనీసం సామాన్లయినా ఎక్కడ పెట్టుకోగలం?

నేను నాన్న వాళ్ళింటి కెళ్ళాను. ఆయనా అప్పుడు కటిక పేదరికంలో ఉన్నాడు. ఓ రెండు గదుల ఇంట్లో ఉంటున్నాడు. దాంట్లోనే మాకో గది ఇచ్చి మా సామాన్లక్కడ పెట్టుకోమన్నాడు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.