సంఘర్షణల యాత్ర

(కల్పనా రెంటాల కథాసంపుటి “అయిదో గోడ” పై సమీక్ష)

  -సుధామురళి

“యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అని ఎందుకు పొగిడారో, ‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి’ అంటూ ఎందుకు ఓ స్పష్టమైన స్థాన నిర్దేశం చేస్తూ ఆడది అంటే ఇలానే ఉండాలనే వువాచలు నుడివారో కానీ అసలు ఆడవారిని గూర్చి చెప్పాల్సి వస్తే ‘ ఏ దేశమేగినా ఎందుకాలిడినా కష్టాలు కన్నీళ్లు తప్పవా ఆడజన్మకు’ అని ఆక్రోశించాల్సి వస్తోంది. 
 
ఈ సంపుటి నిండా అమెరికా వాతావరణం, అమెరికాకు వెళ్లిన భారత సంతతి సంసారాల సాధక బాధకాలు ఉన్నప్పటికీ అక్కడి స్త్రీలు, వారి అబహిర్గత వ్యధలు కూడా కళ్ళముందు నుండీ నడచిపోతూ కంటినీరుగా ప్రవహిస్తాయి. 15 కథల ఈ గాథలు రాసిన కాలాలు వేరైనా, ఇప్పటికి కొన్నేళ్ల క్రితపు మూలాలుగా చూపెట్టబడుతూ వున్నా వీటినిండా నిత్య స్త్రీ వేదనా వాసన గుప్పుమంటుంది. అసలేం కావాలి స్త్రీ కి , స్వేచ్ఛనా? స్వతంత్రతా? అస్తిత్వ గుర్తింపా? స్వేచ్ఛ అయితే ఏ రకపు స్వేచ్ఛ? స్వతంత్రమంటే ఎవరి నుంచీ?ఎక్కడినుంచీ? అస్తిత్వ గుర్తింపు కావాలంటే అది ఏరూపంలో కావాలి!? ఎవరు ఇవ్వాలి!? ఇలా రకరకాల ప్రశ్నలతో, పరి ప్రశ్నలతో ఆలోచనలోకి దింపిన ఈ కథలు చివరికి నాకు చెప్పింది ఏమిటంటే స్త్రీ ని ముందు మనిషిగా గుర్తించగలగాలి, అదే ఆమె కోరుకునే అతి పెద్ద విలువైన బహుమతి అని, అలా గుర్తించడం చేతనైన సమాజం ఉన్న చోట ఏ స్త్రీకి దుఃఖం కలగదు అని. 
 
ప్రేమ వైఫల్యం, పెళ్లి వైఫల్యం వైఫల్యం ఏదైనా అంతిమంగా శిక్షించబడేది స్త్రీ నే ఎందుకు కావాలి!?  అది ఎవరు రాసిన రాత!? ప్రకృతా!? స్త్రీ శారీరక , మానసిక దుర్భలతా!? లేదా సమాజం , అందులో నిండుకున్న మానవ మనస్తత్వాలు రాసిన కనపడని చట్టాలు, ఆంక్షలా!? ఇంకా సమాధానాలు వెతికే పనిలోనే ఉన్నాం సగం లోకం నిండా. అవునతను కాదన్నాడు, ప్రేమలో వున్న మైకం తగ్గిన తర్వాత పెళ్లి బరువుగా మారిందన్నాడు, ఇప్పుడు ఆమె మనసులో చెలరేగే తుఫానులు తట్టుకోవాలి, తాను నిలదొక్కుకోవాలి, మళ్లీ మరో పురుషుడే ఆమెకు అండ అవ్వాలి ఇలా సాగిన కథ ‘అయిదు శాజరాక్ ల తర్వాత ‘ ఓ విఫల ప్రేమ ప్రయాణాన్ని మరో ఒంటరి ప్రయాణపు అనుభవ ధ్వనితో చెబుతూ మరో స్నేహ హస్తపు మజిలీని చూపెడుతుంది. కానీ ఈ స్నేహం ఆమెని ఏ తీరానికి చేర్చిందో ఆలోచిస్తే ఓ విరక్తి నవ్వుతో కూడిన చిన్న గగుర్పాటు మనసుని కుదిపేస్తుంది. 
 
ఎవరో చేసిన నేరానికి ఎవరు శిక్ష అనుభవించాలి!? ఎందుకు పశుత్వ పంజాకు స్త్రీ శరీరం బలిపశువుగా మారాలి!? దుఃఖం ఆపుకోనివ్వని , మనసును స్థిమితానికి దగ్గర చేయని కథ ఈ క్రైమ్ సీన్. శ్రియ రేప్ కిట్ పరీక్షకు వెళ్లడం , అక్కడ తన మానసిక స్థితి చదువుతూ ఉంటే ఎందుకు ఆడజన్మ ఇచ్చావురా?  దేవుడా అని గట్టిగా అరవాలనిపించే బాధ,  ఆ తర్వాత అసలా ఘోరం ఎలా జరిగిందో చెప్పే విషయంలో ఆ పశువును పట్టుకుని ఏదోలా శిక్షించాలనే కసి ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. ఏం పాపం చేసింది శ్రీయ స్నేహితురాలిని నమ్మడమా, లేక ఆప్యాయంగా పలకరించిన ఓ ద్రోహిని నమ్మడమా, సమాధానం లేని ప్రశ్నలు. కోల్పోయిన శీలానికంటే , కోల్పోయిన నమ్మకమే తన మనసుని ఎక్కువ బాధ పెట్టింది. తండ్రీ, అన్నలలోనూ ఓ పురుష రూపాన్ని ఊహించుకోవాల్సి రావడం ఆమె పడ్డ నరకానికి ప్రత్యక్ష ఉదాహరణ. డబ్బు, పరపతి , అహంకారం, అధికారం ఏ నేరాన్ని అయినా నీరుగారుస్తాయని, అది ఏ దేశం అయినా బలి కాబడేది అమ్మాయిలే అని నిరూపించిన కథ. కానీ శ్రీయా అతి కష్టం మీద అయినా సరే ఆ క్రూరుడికి శిక్ష పడేలా చేయాలి అనుకోవడం హర్షించదగిన నిర్ణయం. దానికి తల్లీ, అన్నా అండగా నిలబడటం సమాజంలో మార్పుకు శ్రీకారం చుట్టే అంశం. 
 
ఇక పుస్తక శీర్షికగా ఎంచుకోబడిన ‘అయిదో గోడ’ కథ ఓ మలుపుకు తలుపు తెరిచే కథ. సతీసహగమనం నాటి నుండి డైవర్స్ , మళ్లీ పెళ్లి దాకా పయనించిన ఆడవాళ్ల జీవితాలు అసలెందుకు సతీసహగమనాన్ని పాటించాల్సి వచ్చిందో తెలీకుండానే పాటించాయి, అక్కడా సామాజిక అభద్రతే రాజ్యం ఏలింది. డైవర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి ఎందుకు అంటే అక్కడా సామాజిక అభద్రత, భర్త మరణించిన తర్వాత మళ్ళీ ఎందుకు పెళ్లి అక్కడా ఎక్కువగా వినిపించే కారణం ఎవరో ఒకరి తోడు ఉండాలి, లేకుంటే ఆడది ఒంటరిగా బతకడం కష్టం ఇలా ఏ ముందడుగు వేసినా వాటన్నింటినీ వెనుక ఓ వెనుక అడుగే ప్రధాన కారణంగా నిలిచింది. కాదూ కూడదూ అని మరేదో కారణాన్ని ప్రస్తావించినా, లేదా తన మనసుకే ఓ తోడు కావాలని ఆశ పడినా ఎదుర్కొనే బహుమతులు తిరుగుబోతు లాంటి అతి అన్యాయ బిరుదులు. చాలా మంది స్త్రీలు తమకు పర్సనల్ స్పేస్ కావాలని యుద్ధం చేస్తుంటే ఈ కథలోని శారద భర్త తనకు ఇచ్చిన పర్సనల్ స్పేస్ ఎందుకు వద్దనుకుందో నాకు అర్థం కాలేదు. భర్త తో కలసి అతని అభిరుచుల్ని పంచుకోలేనప్పుడు, తన అభిరుచులు భర్త పంచుకోవాలని అనుకోవడం ఎందుకో కాస్త అసహజంగా అనిపించింది. తీసుకున్న అంశం చాలా అవసర అంశమే అయినా దానికి చెప్పిన కారణాల పట్ల నాకు కొంత విముఖత కలిగింది. ఆడవాళ్లు మళ్లీ పెళ్లి చేసుకోడానికి, లేదా నచ్చిన వ్యక్తితో, తోడు నిలిచిన వ్యక్తి తో సహజీవనం లాంటివి చేయడానికి చాలా కారణాలే ఉంటాయి. ఆ రకంగా కారణాలను చెప్పుకోలేక పోవడమే అయిదో గోడ కట్టుకోవడం ఏమో!?  కానీ ఆమె తీసుకున్న నిర్ణయం ఎక్కడ ఆమె స్వేచ్ఛను ఇబ్బందు పెట్టేది అవుతుందో అనే ఓ చిన్నపాటి సంశయం కలిగింది కథ పూర్తి అయిన తర్వాత. 
 
స్లీపింగ్ పిల్ కథ ఇంటింటి రామాయణం, ఎన్నో కుటుంబాల్లో భార్యలు అయిష్టంగానో, తప్పక తప్పని ఓ దిన కృత్యంగానో భరిస్తున్న మారిటల్ రేప్. వాంఛలు ఒకరివి, అవి వరాలుగా అపాదింపబడేది ఒకరిపైన చిత్రమైన బతుకులు. ఇక్కడా పై చేయి ఆ మగతనపు రూపానిదే. నిన్ను తల్లిని చేసిన ఘనత ఎవరిది!? నాది కాదా!? నీకా మాతృత్వాన్ని వరంగా ప్రసాదించింది ఎవరు!? నేను కాదా!? ఇది అనాది ప్రశ్నలు. మరి నిన్ను తండ్రిని చేసిన ఘనత, నీకు సంఘంలో నాన్న అనే హోదాని కట్టబెట్టిన ఘనత అది ఎవరివి!? అడగకూడని ప్రశ్నలు, అడిగినా సమాధానాలు శూన్యాలు. దేహం అనేది కోరికలు తీర్చే, లేదా తీర్చుకోబడే యంత్రం అనే భావన వేళ్లూనుకుపోయిన మనుషుల్లో మనసుల బాధలు అస్సలు బాధలే కాదు. అవి ఎన్ని తరాలకైనా అలా ప్రయాణిస్తూనే ఉంటాయి, పడక గది పనివాళ్లుగా ఆడవాళ్లను మిగులుస్తూనే ఉంటాయి. ఇక్కడ స్లీపింగ్ పిల్స్ అవసరం ఆడవాళ్లకు కాదు మగత్వ మృగాలకు, వారి కోరలకు. ఆ రోజులు వస్తే బాగుండు. 
 
ఇదే దేహం ఎప్పుడు పెద్దది అయ్యిందో, ఎందుకు ఆడదేహంగా పెద్దరికాన్ని సంతరించుకుందో అదో మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రతీ పిల్ ఆడవారి కోసమే కనిపెట్టబడినట్టు ఈ ఈస్ట్రోజెన్ పిల్ కూడా. ఏది వరమో, అదే ఇక్కడ శాపం. గర్భసంచి, మాతృత్వాన్ని మోస్తుంది, రక్త చరిత్రను లిఖిస్తుంది. ఇక్కడ తప్పు ఛాన్స్ అంటూ లేకుండానే ఆడపిల్లగా పుట్టడమా!? లేదా శరీర నిర్మాణ పుణ్యాన సంక్రమించిన దశలలో అర్థం చేసుకునే మనుషులు కరువవ్వడమా!? పవిత్ర గర్భసంచిని అవసరం తీరాక అదో పనికిరాని వస్తువుగా చూసే కుసంస్కార మనుషులలో మార్పును ఆశించడమా!? అంటే దీనికీ సమాధానాలు ఇప్పటికీ కరువే. అయితే ఈ కథలో చర్చించిన తెలుపు నలుపుల పురా, ఆధునిక అంశాలు మాత్రం ఆలోచించదగ్గవి. అయితే సమస్యల్లా ఏంటంటే ఏ కాలమైనా శరాలు తగిలేది స్త్రీ శరీరానికే, రక్తమోడేది ఆమె మనసు నుంచే. అర్థం చేసుకోలేని తనాలు తన చుట్టూ వున్నంతకాలం, ఆమె కూడా ఓ మనిషే అనే గుర్తింపు రానంతకాలం ఏ పిల్ కూడా ఆమె బాధను తగ్గించలేదు. ఆ మూడు రోజులూ దూరంగా ఉన్నా, అందరితో కలిసి తిరుగుతూవున్నా ఆమె మనసుకు మాత్రం ప్రశాంతత దొరకదు. 
 
ఇప్పటిదాకా చర్చింకున్నట్టు మాతృత్వం ఎంత వరమో అంతే శాపం. గర్భ ధారణకు కారణాలు ఏవైనా, ఎవరైనా ఫలితం లిఖించబడేది మాత్రం ఆడజన్మ నుదుటిపైనే. పోగొట్టుకోలేని నరకం, కాపాడుకోలేని స్వర్గం రెండింటినీ పెట్టి ఈ భూమి మీదకు పంపాడేమో దేవుడు ఆడవారిని. నమ్మించి మోసం చేయడం ఒకరి వంతు, ఆ మోసానికి పరువును , ప్రాణాన్ని ఫణంగా పెట్టి అయితే ప్రాణం తీసుకోవడం, లేదా వరమైన మాతృత్వాన్ని శాపంగా మార్చుకుని గర్భ విచ్చిత్తి, తద్వారా అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకోవడం, సమాజంలో చులకన కాబడడం, ఇంకా రకరకాల బిరుదులతో బతుకును సాగించడం ఇది ఒకరి వంతు. అనిపిస్తూ ఉంటుంది ఇంతటి అదృష్టాలన్నీ ఒక్క ఆడవారికే ఎందుకు అందించాడా ఆ బ్రహ్మ అని!? ఇలా సాగిన కథలే ఎండమావులు, కోట్ హేంగర్. ఒక కథ ప్రియుడి చేతిలో మోసపోయి ప్రాణాన్ని కోల్పోయిన అబలత్వాన్ని చూపిస్తే, మరో కథ చేసిన తప్పును దిద్దుకోబోయి మొత్తానికే దారుణం అయిపోయిన జీవితాన్ని కళ్ళకు కడుతుంది. సంఘటనలే వేరు నిర్దోషి అయినా దోషిగా మారి శిక్ష అనుభవించింది మాత్రం ఆమె నే. 
 
ఇక హోమ్ రన్ మాతృభాష మీది, మాతృదేశం మీది మమకారంతో సాగిన కథ. కానీ స్పృశించిన అంశాలు విభిన్నం. ఆ ముగ్గురూ మనుషుల్లోని ఈర్ష్యాద్వేషాలు , స్వార్ధ అవసరాలు ఎవరిని ఎలా మారుస్తాయో తెలియచేస్తే, టూ డాలర్స్ ప్లీస్ కథ మనిషి లోలోపలి తత్వాన్ని చర్చిస్తుంది. టింకూ ఇన్ టెక్సాస్ పిల్లల మానసిక స్థితిని, పెద్దవారు అర్థం చేసుకోవలసిన అవసరాన్ని విడమరిచి చెబితే, ఇట్స్ నాట్ ఓకే మరో వ్యధా భరిత సంసార జీవనాన్ని కళ్ళకు కడుతుంది. అమ్మకో ఉత్తరం అమెరికా వైచిత్రిని చూపిస్తే, ది కప్లేట్, సంచయనం మారుతున్న వ్యక్తి పరిమాణ క్రమాలు, శారీరక మానసిక అవసరాల దృష్ట్యా దగ్గరౌతున్న ఆడా- ఆడా, మగా-మగా సంబంధాలు , వాటి పర్యవసానాలు చర్చిస్తాయి. ఈ రెండు కథల్లోనూ తప్పెవ్వరిదీ ఉండదు, వారి ఇష్టం, ప్రమేయం లేకుండానే వారి మనసుల్లోనూ, శరీరంలోనూ సంభవించే మార్పులు, ఆ మార్పులను అనుసరించి వారి నిర్ణయాలు, జీవితాలు, జీవిత గమ్యాలు, లెస్బియన్స్ గా, గే లుగా వారి ప్రయాణం, అందులోని ఒడిదుడుకులు , సమర్ధించే వ్యవస్థ, వ్యతిరేకించే వ్యవస్థ వాటి మధ్య ఘర్షణ తప్ప. 
 
మొత్తానికి అయిదో గోడ సంపుటి పదహైదు కథల విందు. ఎక్కువశాతం స్త్రీ వాద కోణంలో సాగినా కథలు అన్ని రకాల అంశాలను, సామాజిక సమస్యలను చర్చకు పెట్టిన వస్తు, విషయ నిర్మాణ పరంగా భిన్నత్వాన్ని కలిగిన కథా ప్రయాణం.
 
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.