యుద్ధం ఒక గుండెకోత-19

(దీర్ఘ కవిత)

-శీలా సుభద్రా దేవి

ఉగ్రమో ఆగ్రమో
పదునెక్కిన రెండు కొమ్ముల అమానుష మృగాలు
ఆవురావురుమంటూ కాలుదువ్వుతున్నప్పుడు
మదం తలకెక్కినవి కొన్ని, మతం దిమ్మెక్కినవి కొన్ని
రెండు తలల సర్పాలు
రెండు నాల్కల సరీసృపాలు
పెనుబుసల ఊపిర్లతో
అంతకంతకూ మంటని రాజేస్తున్నప్పుడు
ఇతిహాసాలలోంచి
సైతాన్లూ, హిరణ్యకశిపులూ
నల్లమాంత్రికులూ, భస్మాసురులూ
ఏ మత గ్రంథాలలోంచో
ఊపిర్లు పోసుకొని
భూగర్భ సమాధుల్లోంచి పైకి లేస్తున్నప్పుడు
మూఢనమ్మకాల అగ్ని పర్వతాల్ని రగిల్చి
భూ ఆవరణల్ని స్మశానాల్ని చేస్తున్నప్పుడు
జనజీవనాలు స్తంభించిపోయి
నిర్జన సమాధులౌతున్నప్పుడు
నిస్సహాయ మానవీయ విలువలు
గుప్పున గాలిలో తేలిపోతున్న
బూడిద కుప్పలుగా మారుతున్నప్పుడు
ఊళ్ళు భూగర్భంలోకి కుంగి పోతున్నప్పుడు
గుండె సముద్రాలు మరిగే లావాలౌతున్నప్పుడు
మనుషులు శిలాజాలౌతున్నప్పుడు
భస్మాసురుని చేతిలో భూగోళం తిరుగుతున్నప్పుడు

ఇప్పుడు
అవును ఇప్పుడిక్కడ
ఒక నునులేత చిగురుకేక వేసేందుకు
అంధకార స్మశానంలో దారి చూపేందుకు
ఒక సంపూర్ణ మానవాంకురాన్ని పొదిగేందుకు
ఒక తల్లి గర్భం కావాలి

ఆకాశంలోనో భూమిపైనో
పంచభూతాల నడుమ ఏ మారుమూలనైనా
శాపగ్రస్తులై రాతిగా మారిన అహల్యల్లారా
మీ గర్భాన్ని అరువియ్యండి
మళ్ళీ ఈ భూగోళాన్ని
మానవీయ స్పర్శతో పునీతం చేసే
మనుషులతో నింపుదాం.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.