మా కథ (దొమితిలా చుంగారా)- 35

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

          ఆరు నెలల తర్వాత నన్ను చూడడానికి నాన్న వచ్చాడు. నేను ఆరోగ్యంగా ఉన్నందుకు, పని కూడా చేయగలుగుతున్నందుకు, అక్కడ స్నేహాలు కలుపు కుంటున్నందుకు నాన్న చాల సంతోషించాడు. లాస్ యుంగాస్ జనం నాతో చాల మంచిగా ఉండే వారు. నేను వాళ్ళతో సాటిగా పొలాల్లో పని చేయడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయే వారు. మా ప్రాంతం వాళ్ళు తమలాగ పొలం పని కష్టపడి చేయ లేరని వాళ్ళకు తెలుసు. అందులోనూ స్త్రీని! వాళ్ళు నాకెంతో సాయపడ్డారు. నాకు తామివ్వ గలిగిందంతా ఇచ్చారు. మేం మంచి నేస్తాలమై పోయాం . నేను నా దగ్గరున్న మందులు వాళ్ళకిచ్చాను. మొత్తానికి నేను వాళ్ళ బాధలు కొంత వరకు నివారించే ప్రయత్నం చేశాను. ఆ గ్రామస్తులు నన్నెంతగానో ఇష్టపడ్డారు.

          నాన్న రావడం నాకెంతో ఆనందమైంది. చివరికి మాట్లాడడానికి ఒక మనిషి దొరికాడు గదా అనిపించింది. ఆయన ఎట్లా ఉన్నావని కుశలం అడిగితే నాకు దుఃఖం కట్టలు తెంచుకొని పొర్లింది. .

          “నాన్నా – నీకూ రాజకీయానుభవం ఉంది గదా! రాజకీయాల్లో పనిచేస్తే ఫలితం ఇలా ఉంటుందని నువు నాకెన్నడూ ఎందుకు చెప్పలేదు? చాల దారుణాలు భరించవలసి ఉంటుందని నువు నన్ను హెచ్చరించనేలేదేం?…” ఇలా నేనిన్నాళ్ళుగా తలపోస్తున్న వ్యధలన్నీ ఆయన ముందు పరిచాను.

          అప్పుడాయన తాను రాజకీయాల్లో దిగి ఉన్నప్పుడు తనకందరూ కూతుళ్ళే ఉన్నందుకు, ఒక్క కొడుకైనా లేనందుకు విచారిస్తూ ఉండే వాణ్నన్నాడు. తన ఆశయాలు కొనసాగించడానికి, తన ఆదర్శాల కోసం పని చేయడానికి, జనం విముక్తి అయ్యే వరకూ, కార్మిక వర్గం అధికారానికొచ్చే వరకూ పోరాడడానికి కొడుకు ఉంటే బాగుండుననుకున్నాడట. ఆ తర్వాత నేనా మార్గంలో నడవడం చూశాక, నాకు తన లక్షణాలే వచ్చాయని ఆయనకెంతో సంతోషం వేసిందట. ఇప్పటి దాకా నన్ను చూసుకొని గర్వపడుతున్నానని అన్నాడాయన. అలాంటి నేను ఇప్పుడిలా మాట్లాడడ మేమిటి?

          “వద్దు తల్లీ! అలా మాట్లాడొద్దు – నువు ఎన్నో అద్భుతమైన పనులు చేశావు. నువు చేసిందల్లా ప్రభుత్వం అమాయక ప్రజానీకం మీద చేసిన అంతులేని దౌర్జన్యాల్ని ఖండించడమే! అదేమీ నేరం కాదే! నిజానికది చాల గొప్ప విషయం. నువు అంత సాహసివి కనుకనే జనం నిన్ను ప్రేమిస్తారు. నీ కోసం వెతుక్కుంటారు. సైగ్లో-20లో నేనెక్కడి కెళ్ళినా జనం నీ గురించే అడుగుతుంటారు. ఏదో ఒక రోజు ఈ దుర్మార్గ ప్రభుత్వం కుప్పకూలి పోతుంది. ఇలాంటి ప్రభుత్వాలు ఎల్లకాలమూ ఉండవు. ఈ ప్రభుత్వం పడి పోయాక నువు సగర్వంగా వెనక్కి వెళ్లవచ్చు. అయితే నువ్వందుకు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు నువు ఉన్న స్థితిలో అయితే వెనక్కి వెళ్ళినా ఏమీ ప్రయోజనం ఉండదు. నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. జనం నీ పై ఉంచిన విశ్వాసానికి తగినట్టు నువ్వు నడుచుకోవాల్సి ఉంది. నాయకత్వంలోకి రావడమంటే ఓ హోదా సంపాదించడం మాత్రమే కాదు. అది ఒక గురుతర బాధ్యత. అందుకు నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలమ్మా!” అన్నాడు.

          “లేదునాన్నా, లేదు, ఇంక నేనేమీ చేయలేను. నా కిన్నిన్ని అన్యాయాలు జరిగి పోయినాక కూడా ఇంకా నేను ,సంబంధం పెట్టుకుంటానా? నేను బతికే ఉండి, ఈ ప్రభుత్వం మారిపోయి, నేను వెనక్కి పోవడమంటూ జరిగితే నేనింక దేనితోను సంబంధం పెట్టుకోను. అసలు నేనలాంటి ఆలోచనైనా ఎట్లా చేయగలను?”

          “సరే… మంచిది…” అని నాన్న విచారంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ వారంలో వస్తానన్నాడు.

          నా దగ్గర్నుంచి వెళ్ళాక ఆయన . లాపాజ్ యూనివర్సిటీకి, ఒరురో యూనివర్సిటీకి వెళ్ళాడు. నాయకుల్ని కలిసి, నా గురించి చెప్పి నన్ను భవిష్యత్తుకు సిద్ధ పరచాలని కోరాడు. నాకు ముఖ్యంగా ఇప్పుడు అందవలసింది నైతిక సహాయమనీ, నా ఆశయం న్యాయమైనదని నేను గుర్తించేటట్టు చేయాలని ఆయన చెప్పాడు. పరిస్థితిని సవ్యంగా అర్థం చేసుకోవడంలో నాకు సాయపడవలసిందని ఆయన వాళ్ళను అభ్యర్థించాడు.

          ఆయన తిరిగివస్తూ నాకు కొన్ని పుస్తకాలు పట్టుకొచ్చాడు. అవి బొలీవియా చరిత్ర గురించీ, సోషలిజం గురించి వివరించే పుస్తకాలు. ఆ పుస్తకాల్లో విషయం పక్కన ఖాళీల్లో ఒరురో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకాయన రాసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. నేనా పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆ వ్యాఖ్యలు నాకు మార్గదర్శకంగా పని కొచ్చాయి. ఉదాహరణకు ఎవరో ఇతర ప్రజల గురించిన ప్రస్తావన ఉన్న చోట ఒక వ్యాఖ్య రాసి ఉంది.  దొమితిలా? ఈ దేశంలో తలెత్తిన సమస్యల్లాంటివే బొలీవియాలో రాలేదంటావా? వ్యవసాయ సంస్కరణలేమయ్యాయి? ఇక్కడ వివరించినట్టు సోషలిస్టు విప్లవం వచ్చిన చోట రైతాంగానికి ఎన్ని సౌకర్యాలు కలిగాయో చూశావా? కాని బొలీవియాలో మాత్రం వ్యవసాయ సంస్కరణల్ని విద్రోహం కాటేసింది”. అలా ఆ పుస్తకాలు నాకెంతో పని కొచ్చాయి. అదే సమయంలో నేను నా చిన్నప్పట్నించి కలలు గన్న సంగతొకటి నాకు స్పష్టంకావడం మొదలైంది. ఏ లోకంలో పేదరికం ఉండదో, ఏ లోకంలో అందరికీ చాలినంత తిండి ఉంటుందో, ఏ లోకంలో అందరికీ కట్టుకోవడానికి తగిన గుడ్డ లుంటాయో ఆ లోకాన్ని నేను చిన్నప్పుడు కలలో దర్శిస్తుండేదాన్ని. నాకున్న ఈ ఊహలన్నీ నిజమై, నేను చదువుతున్న పుస్తకాల్లో ఉండడం నేను గమనించాను. కొంత మంది దోపిడీ దార్లు అనేక మంది ప్రజల్ని దోపిడీ చేసే పద్ధతి అంత మవుతుందని కూడ ఆ పుస్తకాల్లో రాసి ఉంది. పని చేసిన వాళ్ళకే తినే హక్కు ఉంటుందనీ, గౌరవంగా బతికే హక్కు ఉంటుందనీ నా కర్థమైంది. ప్రభుత్వమే ముసలి వాళ్ల, రోగుల ఆలనా పాలనా చూసుకుంటుంది. ఈ ఆలోచనలు నాకు అద్భుతంగా తోచాయి. నేను బాల్యంలో చేసిన ఊహల్లాంటివి, కన్న కలల్లాంటివి, నా ఆలోచనలే ఎవరో ఇక్కడ రాసి పెట్టారనుకున్నాను. అంటే నేను మార్క్సిజంతో పూర్తిగా మమేకమై పోయాను. ఈ ఏకీభావం నాకు పోరాడడానికి తగిన శక్తినిచ్చింది. నేనేమనుకున్నానంటే, చిన్నప్పట్నుంచీ తలపోసిన ఊహలనిక నిజం చేయవలసి ఉంది. మున్ముందుకు సాగడానికి ఈ సిద్ధాంతం మీదనే నిలబడవలసి ఉంది.

          అట్లాగే నేను నా అనుభవాలన్నిటి నుంచీ, బాధల నుంచీ, అరెస్టుల నుంచీ, జైళ్ళ నుంచీ, లాస యుంగాస్ జీవితం నుంచీ రాజకీయ చైతన్యం పొందాను. ఇంకో మాటల్లో చెప్పాలంటే నా ఈ కష్టతరమైన అనుభవాల కొలిమిలో నన్ను నేను తెలుసుకున్నాను. రైతాంగం మధ్య నేను పొందిన అనుభవాలు కూడా నాకెంతో ఉపయోగపడ్డాయి. నా తల్లిండ్రులు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే అయినా నా జీవితం మొత్తం గని కార్మికుల మధ్యనే గడిచింది. మొట్ట మొదటిసారిగా నేను లాస్ యుంగాల్లో గ్రామీణ జీవిత యదార్థ దృశ్యాన్ని చూడగలిగాను. కార్మికులు,గనిపని వాళ్ళు అప్పటికే ఎంతో సంఘటిత పడి ఉన్నారు. గాని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజానీకం మీద ప్రభుత్వాధికారం ఎక్కువ మోతాదులోనే అమలవుతోందని నాకర్థమైంది.

          గ్రామాల్లో బళ్ళు ఎలా పెడతారో అక్కడ నేను స్వయంగా చూడగలిగాను. గ్రామస్తులందరమూ కూచొని, మాట్లాడుకుని “మనం ఓ చిన్న బడి పెట్టుకోవాల్సి ఉంది” అని నిర్ణయించుకుని, ఓ ప్రణాళిక తయారు చేసుకున్నాం. స్త్రీ పురుషులందరమూ కలిసి పనిచేసి ఇటుక మీద ఇటుక పెట్టి బడి కోసం భవనం కట్టడం మొదలు పెట్టాం. భవనం ముందర ఆర్చి కూడ కట్టాం. ఇంత చేశాక మేమిక దానికి కప్పు గాని రంగులు గానీ సమకూర్చలేక పోయాం. ప్రభుత్వానికీ సంగతి తెలిసింది. మా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి “నేను రైతాంగ వ్యవహారాల మంత్రితో మాట్లాడాను. ఆయన మీకు సాయం జేస్తానన్నాడు. మీ బడికి కప్పుకూడా వేయిస్తానన్నాడు. రంగులు కూడా వేయిస్తానన్నాడు” అని సంతోషంగా చెప్పాడు.

          “అమ్మయ్య – నయమే – ఇది మంచిదే” అని జనం అనుకున్నారు.

          అలా త్వరలోనే మా బడికి కప్పు, రంగులు వచ్చాయి. మేం ఆ రేకులు తీసుకొని టకటకా మేకులు కొట్టేశాం. చకచకా రంగులు వేసేశాం. మొత్తంమీద బడి సిద్ధమైనట్టే!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.