నా జీవన యానంలో- రెండవభాగం- 23

-కె.వరలక్ష్మి

          తర్వాతి కాలంలో రాసిన కథల్లో ‘ప్రత్యామ్నాయం’ కథలో ఒరిస్సా లోని కేవ్స్ దగ్గర కోతుల గురించి ; బస్సెక్కేటప్పుడు ఆపేసేరని, ధర్నా చేసిన ఆమె గురించి ఇటీవల రాసిన ‘అపరాజిత ‘ కథలోను రాయడం జరిగింది.

          మేం కొత్త ఇల్లు కట్టుకునే నాటికి జగ్గంపేట గ్రంథాలయం మా శ్రీరాంనగర్ కి బాగా దూరమైంది. అయినా, అక్కడి బుక్స్ లో ఎన్నుకున్న బుక్స్ అన్నీ ఎప్పుడో చదవడం పూర్తైంది. నేను సాహిత్య సభలకు రాజమండ్రి వెళ్లడం ప్రారంభించాక గౌతమీ గ్రంథాలయంలో చందాకట్టి సభ్యత్వం తీసుకున్నాను. కేటలాగ్లో  చూసి అప్పటి వరకూ నేను చదవని గొప్ప రచయితల పుస్తకాలెన్నో ఎంపిక చేసుకుని తెచ్చుకుని చదివేదాన్ని, అంత పెద్ద గ్రంథాలయంలో నేననుకున్న పుస్తకం దొరకడానికి సన్నిధానం శర్మగారు సహాయపడేవారు. అలా చదివిన పుస్తకాల నుంచి నాకు నచ్చిన కొటేషన్స్ ఎన్నో డైరీలో నోట్ చేసుకునేదాన్ని.

          1995 ఫిబ్రవరి లో సూరంపూడి సీతారాంగారి అనువాదంలో వచ్చిన విభూతి భూషణ్ బందోపాధ్యాయ బెంగాలీ నవల’అరణ్యక’ చదివేను. అది నన్నెంత ఆకట్టుకుందో చెప్పలేను.

          ఆ సంవత్సరం ఫిబ్రవరి 20న రాజమండ్రి లేడీస్ క్లబ్ వారు తూర్పుగోదావరి జిల్లా కవయిత్రుల సమ్మేళనం ఏర్పాటు చేసి పిలిచారు, ఆ సభలో చక్కని కవితలు చదివేరు కవయిత్రులంతా. అప్పటికింకా స్త్రీవాద కవిత్వ ప్రభావం తూర్పుగోదావరి రచయిత్రుల మీద పడలేదు, అందుకని చిక్కని కవిత్వం ఎవరూ చదవలేదు.

          అంతకు ముందే ఫిబ్రవరి 18న, 19నహైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో అస్మిత సమావేశానికి రమ్మని ఆహ్వానం వచ్చింది. నేను అటెండైన అస్మిత మొదటి సమావేశం అదే.

          ఉదయం 8కి అన్న సభ 11 కి ప్రారంభమైంది, అప్పటికీ పెద్దగా ఎవరూ రాలేదు. హైదరాబాద్లోని  కొందరు రచయిత్రులు, కవయిత్రులు,చేరారు, త్రిపురనేని శ్రీనివాస్, జి.లక్ష్మీనరసయ్య, బి.తిరుమల రావు వచ్చారు. ఉదయం పెద్దగా చర్చ ఏం జరగలేదు, మధ్యాహ్నం మాత్రం వర్గం, కులం, లింగం బేస్ తో  లక్ష్మీనరసయ్యగారు మంచి ప్రసంగం చేసాడు. ఆ తర్వాత చర్చకొంత స్పీడందుకుంది. మధ్యాహ్నం లంచ్ అబ్బూరి ఛాయాదేవి గారి ఇల్లు అక్కడికి దగ్గర్లోనే ఉండడం వల్ల అక్కడ ఏర్పాటు చేసారు. నాకు ఆ ప్రాంతమంతా కొత్త మా తమ్ముళ్లు ఉన్న బేగంపేట తప్ప తెలీదు. మధ్యాహ్నం మరో అయిదు మంది వచ్చారు. అటెండైన రచయిత్రుల పేర్లు తెలిసినా, చాలా మందిని నేను అదే మొదటిసారి చూడడం.

          మధ్యాహ్నం సెషన్ లో ఇంద్రగంటి జానకీబాల ‘మనసున మల్లెల మాలలూగెనే’ పాట పాడినప్పుడు ‘మాల’ అన్న పదం వేరే అర్థం లో తీసుకుని తనని ఎలా ఇబ్బంది పెట్టేరో చెప్పేరు. అంతే, అందరూ ఆమెని ఖండించడం మొదలు పెట్టేరు. ఆమె కొంత హర్టయినట్టు కన్పించారు.

          ఘంటసాల నిర్మల అప్పటికి ఆంధ్రజ్యోతి లో పనిచేస్తోందట. ఆవిడ ‘ఓ కధో కవితో రాసేసి పత్రికకి పంపించేసి, చాలా గొప్పవాళ్ళు అని కొంత మంది తెగ ఫీలైపోతూ ఉంటారు’, ‘అదో జాడ్యం’అంటూ మాట్లాడింది. లక్ష్మీనరసయ్య మృదువుగా ఖండించాడు. “అలా మాట్లాడే అధికారం తనకెవరిచ్చారు? తన బ్రాహ్మణ జన్మా? లేక తననో శాడిస్టు అనుకోవాలా?” అంది నా పక్కనున్నావిడ  నాతో.

          స్త్రీ వాద సభ అని ఇలా మాట్లాడుతున్నారేమిటి? అన్పించింది? నాకు. ఇలాంటి సభలో పాల్గోవడం నాకు అదే మొదటి సారి, బిత్తరపోయి చూస్తున్న నన్ను “ఇలాంటి వివాదాల్లో చిక్కు కోవడం అవసరమా? ” అన్నాడు నాతో వచ్చిన మా మోహన్, ఆయనకేదీ మృదువుగా చెప్పడం రాదు కాబట్టి నావైపు కోపం గా చూసి బైటికెళ్లిపోయాడు. సభ జరిగిన విధానం కొంతా, మోహన్ కోపం కొంతా నన్ను స్థిమితంగా ఉండనియ్యలేదు,

          రెండవరోజు సమావేశానికి వెళ్ళలేక పోయాను. ఆ రాత్రికే తిరిగి వచ్చేసాం. రాజమండ్రిలో దిగి లేడీస్ క్లబ్ కవిసమ్మేళనం  లో పాల్గొని తిరిగి ఇంటికి చేరుకున్నాను.

23.2.95 విశాలాంధ్ర డైలీ ఈ తరం శీర్షికలో డా॥ ఎస్వీ సత్యనారాయణ నా రచనల గురించి మంచి వ్యాసం రాసారు.

9.4.95 న కొప్పర్తి వ్యాసం ఒకటి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆ వ్యాసంలో ‘జరగాల్సింది ఏమిటంటే ఒక యుద్ధం ముగింపు మరో యుద్ధానికి దారి తీయకుండా చూడడమే, ఐక్యత కోసం జరిగే యుద్ధఫలితం కొత్తరకం అనైక్యతను సృష్టించకూడదు. అందరూ ఒకటి కావాలనే ఆలోచనే ఉద్యమలక్ష్యమైతే అందర్ని కలుపుకొని పోవాలనే మార్గమే సరైనదౌతుంది’ అంటాడాయన.

          ‘సంగీతం మానవాళి సార్వత్రిక భాష – అన్నాడు షెల్లీ, ఆచంట జానకిరాం గారి ‘సాగుతున్నయాత్ర’, ప్రేమ్ చంద్ జీవితం నన్ను ఆకట్టుకున్న పుస్తకాలు, నా కల్లోల కడలి లాంటి జీవితంలో నన్ను ఒడ్డుకు చేర్చి రక్షించినవి పుస్తకాలే.

          ఆ సంవత్సరం జులైలో మా చిన్నమ్మాయికి కొడుకు పుట్టేడు. అక్టోబర్ లో మా అబ్బాయికి పెళ్లి జరిగింది.

          ఆ సంవత్సరం నవంబర్లో స్కూలు పిల్లల్ని శాంతి ఆశ్రమం విహారయాత్రకు తీసుకెళ్లాం. స్కూలు ప్రారంభించిన కొత్త ల్లో వెళ్లిన శాంతి ఆశ్రమం, ఇరవై ఏళ్లకు అంతా మారిపోయింది. నన్నూ స్కూలు పిల్లల్నీ కూర్చోబెట్టి మంచి వాక్యాలు చెప్పిన స్వామీజీ కాలం చేసారు, అప్పుడు అందరికీ భోజనాలు ఆశ్రమం లోనే పెట్టేరు. ఇప్పడు పట్టుకెళ్లిన బాక్సుల్ని దూరంగా ఏ చెట్లు కి౦దో విప్పితినడానికి కూడా అనుమతి లభించలేదు. లోపలివరకూ చాలా దూరం నడిచి ఆశ్రమం మొత్తాన్ని, చెట్లు పుట్టల్నీ చూసాం, ఎప్పుడూ రెండు మూడు బస్సుల్లో వెళ్లే విహారయాత్ర 20 మంది పిల్లల్తో ఒక మినీవేన్ లో వెళ్లడం గొప్ప అశాంతిని రేపింది నాలో.

          ఆశ్రమంలో నేనొక్కదాన్నే దూరంగా నడిచి ఓంకారనాదం ఉన్న చోట వేపచెట్టు కింద కూర్చుండి పోయాను. ఆ ఏకాంతం నాలో ఇంకాస్త భయాన్నీ, దుఃఖాన్నీ పెంచింది. ఆ దుఃఖంలో పడి దగ్గరగా వచ్చిన మాతాజీని కూడా గుర్తించలేదు. ఆవిడే “ఏ ఊరు నుంచి వచ్చారమ్మా” అని ప్రేమగా పలకరించేరు, మరి కాస్సేపట్లో కాకినాడ’ఐడియల్ కాలేజ్’ బికాం ఫైనలియర్ స్టూడెంట్స్ ఓ పది పదిహేను మంది కళకళలాడుతూ వచ్చేరు, గలగల మాటలాడుతూ వచ్చేరు, వాళ్ల కబుర్లు సందడితో నాకు పోయిన ప్రాణం తిరిగొచ్చి నట్టైంది. ‘నాకు మనుషులు కావాలి. ఏ ఆర్థిక సంబంధాలూ, నిష్ఠూరాలు లేకుండా నాతో మాట్లాడే మనుషులు కావాలి ‘ అన్పించింది.  ఆ శాంతి ఆశ్రమ ప్రయాణమే తర్వాత ‘మధుర’ కథ గా రూపుదిద్దుకుంది.

          12 గంటలకి ఆశ్రమం నుంచి బైటికొచ్చి పక్కనే ఉన్న వెంకటనగరం ఊర్లోంచి, తోటపల్లి మధ్య నుంచి ఒక సన్నని కాలిబాట గుండా ధార దగ్గరకి వెళ్లాం. మెట్లు కట్టి ధారనీరు ఒక శివలింగం మీద పడేలా ఏర్పాటు చేసారు. పచ్చని కొండలు, అడవి మధ్య ఒక ఆహ్లాదాన్ని అనుభూతి చెందుతూ బాక్సులు విప్పి భోజనాలు చేసాం. తర్వాత – ఆ కొండల పై నున్న మహా వృక్షాలకి ఆటోలంతేసి ఉన్న పెద్ద పెద్ద తేనెపట్లు చూసాం.

” ఉలివాత పడని వరకు అది బండరాయి

సృష్టికే కానుక కలికి తురాయి

మనసద్దం ముక్కలైతే, చెక్కలైతే

 తాళి సైతం తల్లడిల్లే పరాయి” – 95 నవంబర్ ‘ఆహ్వానం’ నుంచి.

          ‘ఇంత విశాలమైన ప్రపంచంలో మన ఉనికీ, మన పరిసరాలూ చాలా పరిమితమైనవి, మన అవగాహన కేవలం మనవ్యక్తిగతమైన అనుభూతులకు, ఆలోచనలకు, అలవాట్లకు పరిమితమైపోతే నూతిలో కప్పలమై పోతాం, హృదయమూ, బుద్ధి కుంచించుకు పోతాయి. ఆర్చుకుపోతాయి, హరించుకుపోతాయి. మనిషి పుట్టింది ఇందుకు కాదు’

1995 ఆగష్టులో ముఖ్యమంత్రి N.T.R జీవితం పెద్ద కల్లోలం లోకి తోసి వెయ్యబడింది. లక్ష్మీపార్వతిని సాకుగా చూపి ఆయన్ని పదవి నుంచి దించేసారు. సొంత కొడుకులు కూడా కలిసిరాలేదు. జనం టీవీ లకు అతుక్కు పోయారు, ఆయన చైతన్య రథం మీద జనాన్ని సాయం అర్థిస్తూ, అవసరమైతే లక్ష్మీపార్వతిని త్యజిస్తానని చెప్తూ ఉండగా రాళ్లూ చెప్పులూ విసిరారు, తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ వంటి గొప్పపార్టీని రాష్ట్రంలో రెండవ స్థానానికి పంపిన ఆయనకు  ఆ సంఘటన ఎంతటి అశనిపాతమైందో తర్వాత అందరికీ తెలిసిందే!

          అప్పటి వరకూ ఈనాడు ‘ పేపర్ ఒక్కటే నడుపుతున్న రామోజీరావుది ‘ఆ కల్లోల సమయంలోనే ఆగష్టు 27న ‘ఈటీవి ‘ ప్రారంభమైంది.

          ‘క్షమించడం మంచిది. ఎదుటివారి తప్పిదాలను మరచిపోవడం ఇంకా ఉత్తమం’ – అంటాడు బ్రౌనింగ్,

95 లో నా రచనలు :

1.1.95 ‘ఆహ్వానం’ లో ‘స్వస్తి కథ’

4.4.95 విశాఖపట్నం ఆలిండియా రేడియోలో ‘జనం’ కథ

95 మే విపులలో ‘పెద్ద మామయ్య’ కథ

27.8.95 ఈనాడు ఆదివారం స్పెషల్లో ‘సమానత్వం’ కథ

26.9.95 విశాఖ రేడియోలో ‘ వెలుగురేఖలు’ కథ

95 నవంబర్ ‘ఆహ్వానం’ లో ‘ఆకస్మికం’ కథ

9531న విశాఖ రేడియోలో ‘పెళ్లంటే ‘ కథ

95 ఆగష్ట్ అన్వేషణ’మంత్లీ లో  కథావేదిక మంచి ‘ పాప’ కథ రీప్రింట్

95 తెలుగు యూనివర్శిటీ వారి ‘కథ 95’లో పెద్దమామయ్య’ కథ రీప్రింట్

 23.2.95 విశాలాంధ్రలో ‘ఈ తరం’ శీర్షికన నా కవితల పై, కథల పై డా.ఎస్వీ సత్యన్నారాయణ (రివ్యూ) వ్యాసం.

20.3.95 ఆంధ్రజ్యోతి డైలీ సాహిత్యవేదిక లో నా కథలపై రామమోహనరాయ్ వ్యాసం.

95 ఆగష్టులో ఆంధ్రజ్యోతి బుధవారం డైరీలో ‘మాజీ రంగస్థల నటి’ కవిత

95 ఆగష్టు ఆహ్వానంలో ‘లేతనవ్వు’ కవిత

23-30 అక్టోబర్ 95‘ఆంధ్రప్రభ’ వీక్లీ ‘మమతామపి’ కవిత ప్రచురింపబడ్డాయి.

          నా పెళ్లైన కొత్తల్లో తన మాటల్తో  నన్ను హడల్ కొట్టిన మా అత్తగారి ఆఖరి చెల్లెలు సరస్వతిగారు 95 నవంబర్ 23న ఈ లోకం నుంచి నిష్క్రమించింది. రెండే రోజులు హఠాత్తుగా పెరాల్టిక్కై హాస్పిటల్లో ఉంది, అప్పటికి నెల ముందు మా అబ్బాయి పెళ్లిలో ‘ఇంకేముంది, కొడుకుల పెళ్లిళ్లు చేసాక లైఫ్ ముగిసిపోయినట్టే, ఏ హిమాలయాలకో వెళ్లిపోవాలన్పిస్తుంది’ అన్నారావిడ. అప్పటికి కొన్ని నెలల ముందే వాళ్లబ్బాయి పెళ్లి అయ్యింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.