బతుకు చిత్రం-26

– రావుల కిరణ్మయి

జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది .

***

          దేవతతో పాటు పట్నంలో తనకు తెలిసిన పెద్ద డాక్టర్ ను కలిసిన తరువాత
జాజులమ్మకు పెద్ద పెద్ద పరిచయాలు కాసాగాయి. ఏ మాత్రం ఇంగ్లీష్ పరిజ్ఞానం లేని తనకు క్యాన్సర్ సంబంధిత కీమోతేరపి వంటి అత్యాధునిక వైద్య విధానాల పరిచయం కలిగింది.

          అత్తమ్మకు వచ్చింది రొమ్ము క్యాన్సరేనా? అక్కా?అడిగింది ఆదుర్దాగా.

          అవును. నా అనుమానం నిజమయింది. ఆమెకు రొమ్ము క్యాన్సర్. తీవ్ర స్థాయికి
చేరుకుంది. నాకు తెల్సి ఆమెకు ఇలా నొప్పి ఇంతకు ముందు కూడా వచ్చి ఉంటుంది. ఆమె చెప్పుకోలేక ఒర్చుకోనుంటుంది.

అన్ని చెప్తుంటే ..

          అక్కా! నా పాణం అడ్డేసైనా అత్తను కాపాడుకుంటా. నాకు తల్లి ఆమె. ఆమె లేకుంటే
నేను బతుకుడు దండుగే ..అంటూ వెక్కి వెక్కి ఏడ్వసాగింది. చేతగానోనికి
ఆకలెక్కువన్నట్టు మా దరిద్రానికి ఇంత పెద్ద జబ్బు రావాల్నా? దేవుడా? అంటూ
ఏడుస్తున్న జాజులును చూసి దేవత,

          అత్తకు ఏమీ కాదు. మన ప్రయత్నం మనం చేద్దాం. అని ఓదార్చుతూ లోలోన మాత్రం చాలా మధనపడింది. ఇంక ఆలస్యం చేయడం మంచిది కాదు. వీలైనంత తొందరగా స్కానింగ్ చేయించి మందులు వాడాలి. డబ్బులు చాలా అవసరమవుతాయి. ఎవరినైనా సాయం చేయమని అడుగుదాం. అన్నది.

          దానం అడుక్కొని వైద్యం చేయించుకోవడానికి అత్త, మామ ఒప్పుకుంటారా?
అనుమానంగానూ, భయంగానూ అడిగింది జాజులమ్మ.

          ఇజ్జతు కోసమని ఒక నిండు ప్రాణం బలి తీసుకుంటామా? నువ్వు దాని గురించి
మర్చిపో! నేను చూసుకుంటాను. కానీ అత్తను ధైర్నంగా ఉంచే బాధ్యత నీదే అని
చెప్పింది.

          ఇలా ఆమె దైర్యం చెప్పినా, జాజులమ్మకు లోలోన సందేహంగానే ఉంది. దానం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకుంటె ఎట్లా? ఒకవేళ వచ్చినా అత్త ఒప్పుకోకుంటే
ఎట్లా? అన్న అనుమానాలతో ఇల్లు చేరింది.

***

          సైదులు జాజులమ్మ కోసమే ఎదురు చూస్తున్నట్టుగా వాకిట్లోనే ఎదురుపడ్డాడు.
లోనికి వేళ్ళనీయకుండా నీతో మాట్లాడాలె …పద ..!అంటూ, జాజులమ్మ జవాబు కోసం
కూడా చూడకుండా .. ఊరవతల ఉన్న ఎల్లమ్మ గుడికి తీసుకుపోయాడు. అందరూ పనులు ముగించుకొని ఇంటిదారి పడుతున్నారు. గుడి ఆవరణలో కూడా ఎవరూ కనిపించలేదు. బావి పక్కన ఉన్న రావి కింద వేయబడిన సిమెంటు బెంచీ మీద
కూర్చుండబెట్టి..

          ‘ఈ అమ్మవారి సాచ్చిగా చెప్పు. అమ్మ పానానికి ఏమీ భయం లేదుకదా? అడిగాడు.
దేవతసాచ్చిగా అనగానే, జాజులమ్మ నిజం దాచలేక పోయింది. దేవతక్క చెప్పిన
విషయాలన్నీ పూసగుచ్చినట్టుగా చెప్పింది. బోరున ఏడుస్తూ. సైదులు కూడా కన్నీరు ఉబికి వస్తుండగా జాజులమ్మను గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్వసాగాడు.ఇద్దరినీ ఓదార్చే వారు ఎవరూ లేకపోవడంతో తనివి తీరా ఏడ్చారు. కాసేపటికి తేరుకొని, జాజులమ్మ ఇప్పుడు చెప్పయ్య? అన్ని పైసలు యాడతెద్దాం? దేవతక్క చెప్పినట్టు ఎవరినైనా
దానం అడుగుదామా? దానికి మీ నాయన, అమ్మా సరేనంటారా? నాకు చాలా నమ్మకంగా
ఉంది. ఇజ్జతుగల్ల మనుషులు పానమైనా ఇడుస్తారు గావచ్చు గని, ఒప్పుకోరని. నాకు
నేనే కుములుకుంట ఉండుడు కంటే నీకు చెప్పకుండా కమలను సాయం
అడుగుదామనుకున్నా. నువ్వు తట్టుకోలేవని తెలిసి. అన్నది.

          దానానికే ఇష్టపడని అమ్మా, నాయినలు కోడలి సొమ్ముకు ఆశపడుతరా! అదీగాక, అమ్మ పై కమలకు నీకున్నంత పాయిరం ఉన్నాడని, సాయం చేస్తుందని నేను అనుకోవడం లేదు. తనత తానె చేస్తే తప్ప, అడిగి లాభం లేదు. అన్నాడు నిరాశగా.

          మరేట్లా? మీ తమ్ముడికి చెప్పి సదరమంటవా ? కొద్దో గొప్పో సంపాయిన్చవట్టే. పట్నంల ఉండవట్టే. ఎరుకున్నోల్ల దగ్గర అప్పోసోప్పో అన్న చేసుకత్తడు గదా! తల్లీ కన్నా ఎక్కువేమున్నది? నాకైతే ఒడ్దేకిస్తడనిపిస్తాంది. అన్నది ఆశగా.

          ఏమో! నువ్వన్నట్టు వానికూడా పానం తోక్కులాడి ఏదో సాయం చేసి అమ్మను
కాపాడుతడు. రేపు పొద్దటీలి పోన్జేత్త. కని, వాడు గూడ చేతులెత్తేస్తే ఎట్లా? అన్నాడు.

          అలాగే గనుక జరిగితే నేను నాకున్న గుడిసెను తాకట్టు వెట్టి తెస్త. మా నాయ్న
అస్సలు అడ్డు చెప్పడు. ఆ నమ్మకం నాకున్నది. 

          మీ అన్నలు, వదినెలు అడ్డం తిరిగితే ఎట్లా?

          ఎందుకు తిరుగుతారు? ఒక మంచి పని కోసం చేస్తుంటే వాళ్ళకేం నొప్పి? ఎప్పుడో
నన్ను, మా నాయ్నను కాదని వెళ్ళి పోయిండ్రు. ఆ నాడే మా నాయన అది నాకే
చెందుతదని చెప్పిండు.

          చెప్పడం వేరు. చెయ్యడం వేరు. ఆస్తి పాస్తులే బంధాలను మింగుతయి. అట్నే నీ వాళ్ళు కూడా అవుతారని …..అని సందేహంగా మాట్లాడుతుండగా …..

          అలాగయితే ఏం చేద్ధమో నువ్వే చెప్పయ్యా? ఇప్పుడైతే ఇంటికి పోదాం. అంతా
ఎదురుచూస్తాండ్రు కావచ్చు. చీకటి పడ్డది, అనగానే సైదులు ఏమీ మాట్లాడకుండా ఇద్దరూ ఇంటి దారి పట్టారు.

          కమల,ఈర్లచ్చిమి ఇద్దరూ పిల్లలకు సాయంత్రం స్నానాలు చేపించి తినడానికని శనగలు పెట్టిచ్చి వంట చేస్తున్నరు. 

          వీరిని చూడగానే పిల్లలు
అమ్మా !అని ఉరికి రాగా .. ఆగుండ్ర్, బిడ్డా! అమ్మ ను కాళ్ళు రెక్కలు కడుక్కోనియ్యున్ద్రి కడుక్కోనియ్యున్డ్రి, అని ఈర్లచ్చిమి దగ్గరకు తీసుకున్నది.

          జాజులు.,ముందుగాల శుబ్బరంగా తానం ప్పోస్కోపో! పొద్దున పోయినవ్! ఇంత ఎంగిలి పడుదువు పో ! అన్నది.

          సైదులు , తల్లి దగ్గర జేరి చేతుల పిల్లను తీసుకొని , అవ్వ నువ్వు ఈడ కూసో ..!నీతోని మాట్లాడాలె అన్నడు.

          జాజులమ్మ, ఈర్లచ్చిమి పరేషానుగా చూశారు. ఎప్పుడూ లేనిది ఇవ్వాళ పుర్సతుగా కూచోమంటాండు అని ఈర్లచ్చిమి, తను చెప్పిన ముచ్చట చెప్పుతడా ఏందని జాజులమ్మ కంగారు పడింది.

          ఏంది? బిడ్డా? ఇయ్యాల నాతోని ఏం మాట్లాడుదామనుకుంటానవ్? కమల ముచ్చటనా? అన్నది.

          కమల ముచ్చటే మున్నది? ఏమన్న ….అని పూర్తి చేయకుండానే ఆగి పోయాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన రాజయ్య .

          ఆంతర్యం అర్థమైన ఈర్లచ్చిమి మౌనంగా ఉండడంతో, సైదులే ఇక ఇది సమయం కాదని మాట మార్చి, రేపు తమ్మునికి పోను జేద్దామనుకుంటానా అన్నాడు.

          అవును కొడుకా! నేనే చేయ్యమందామనుకున్న. నాకు పాణం బాలేదన్న సంగతి వానికి చెప్పకు గని, ఊ పారి వచ్చి పొమ్మను అన్నది.

          సరేనే నువ్వు నీ పాణం గురించి పికరు పడకు , అన్నాడు చేతులో చేయి తీసుకొని.
నాకెందుకురా? నాకేమైతది? గుండ్రవుతు లేక్కనున్న అన్నది.

          అట్లనకే ! దిష్టి తలుగుతది, మా అవ్వ ఎప్పుడు సుఖంగా ఉండాలే అన్నడు బాధతో గొంతు పూడుక పోతుండగా , బయటకు కనబడనియకుండా.

          కమల మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోతున్నది.

          జాజులమ్మ తనకు పనిలో సాయపడి, అందరూ నిద్ర పోయాక కమలను అడిగింది.
కమలా ! ఏమిటే ? ఎట్నో ఉన్నవ్? అని.

          ఏం చెయ్యనే, నేను చేసిన తప్పుకు బాధ పడుతున్నాను. 

          తప్పా ?తప్పేమిటి?

          అదేనే !పెళ్ళి చేసుకోవడం. అత్తకు ఇష్టం లేకపోయినా, ఒప్పుకుంది కానీ , లోపల
మాత్రం రందితోనే ఉన్నట్టున్నది, అందుకే పాణం తెర్లుజేసుకుంటాంది. రేపు ఆమెకు
ఏమన్నైతే మంది నన్ను తిట్టిపోస్తరు. “బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళని” ఈమె కాలువెట్టి ఆమెను మంచమేక్కించిందని నన్ను ఆడి పోసుకుంటరు కదా ! అని ….తన మూలంగానే ఇలా జరిగిందని చెప్పుకుపోతున్న కమలకు నిజం చెప్పడమే మంచిదని జాజులమ్మ అత్త ఆరోగ్యం గురించి , తానూ సైదులు మాట్లాడుకున్న సంగతుల గురించి కూడా చెప్పి ,
ఏం చేద్దాం? అని అనగానే కమల , నోటమాట రాకుండా , ఉలుకూపలుకూ లేకుండా కళ్ళు తిరిగి పడిపోయింది. జాజులమ్మ భయంతో,
కమలా !కమలా !అని పిలుస్తూ ..నీళ్ళను తెచ్చి ముఖం మీద చిమ్మింది.అప్పుడు తేరుకున్న కమల మాట్లాడబోతుంటే ఇప్పుడు ఏమీ వద్దు ,వెళ్ళి పడుకో !అని చెప్పి తానూ పడుకోడానికి లేచింది.

          మరునాడు సైదులు తమ్మునికి ఫోన్ జేసి అమ్మకు మొన్న పాణం బాలేకుంటయిందిరా! నిన్నోపారి వచ్చి పొమ్మంటాంది. అన్నడు. ఎందుకుంటది? పాణం బాలేకుంట చేసిందే నువ్వు, ఏమైనా నీదే బాధ్యత. ఇప్పుడు నేనచ్చి చేసేదే మున్నది. మనసు మంచిగుంటే మంత్రం తంత్రం సుత అక్కేరకురావు. మనసు తెర్లైతే అమృతం పోసినా అరుగది.

          అరేయ్ ! గట్లనవడితివి ఏందిరా? అని అంటే ,

          నేను గిట్నే అంట. అని ఆవేశంగా, కోపంగా తలా తోక లేకుండా వాదిస్తున్న తమ్మునితో లాభం లేదని ఫోన్ పెట్టేశాడు. ఏ పని జెయ్య బుద్ది కావడం లేదు. పచ్చని చెట్టుకు ఎవరో అగ్గి వేట్టినట్టు తన కుటుంబం మీద ఎవరో నిప్పులు ఓసుకున్నరు. గందుకే అమ్మ పాణం దెబ్బతిన్నదని పనికి పోకుండా కల్లు పాకల చేరిండు.

          అప్పటికే అక్కడ చాలా మంది పోగయ్యారు. గౌడు భార్య సరూప వేడి వేడి మిరపకాయ బజ్జీలు ఒక వైపు , పప్పు గారెలు ఒకవైపు వేస్తూ గౌడుకు అందిస్తున్నది, కల్లు ఆనది అనుకున్న వాళ్ళు మందు తెమ్మని పురమాయిస్తుండగా అక్కడి వాతావరణం
సోమరిపోతులంతా ఒక కాడ జేరి గౌడును బతికిస్తున్నట్టుగా అనిపించింది.

          సైదులు లోపలికి అడుగుపెట్టగానే బండకోట్టేటి మోదయ్య ,
ఎట్లెట్ల వచ్చినవయ్యా సైదులు …..
నువ్వు గిట్లెట్ల వచ్చినవయ్యా సైదులు …
నీ ఇంటి ఇల్లాలు కన్నెట్ట గప్పితివీ ….
ఈ పాక లోనికి నువ్వు అడుగెట్టా పెట్టితివి …

***

అని వచ్చినట్టు పాట అందుకోగానే …..
పళ్ళెం లో మిరపకాయ బజ్జీల తో వచ్చిన సరూప ,
ఎహే ! నీ పాటాపు. రాక రాక చానోద్ధులకు వత్తే నువ్వేందో పరాచికం ఆడవడితివి. అని
సైదులు వైపు తిరిగి ..

          బావా ..!బావా ..! ఏడి ఏడిగున్నయ్! నీ కోసమే స్పెషలుగ ఏసిన , తిను. అన్నది అదోరకంగా చూస్తూ.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.