
బ్యాంకాక్ నగరం
-డా.కె.గీత
బ్యాంకాక్ నగరం
సంధ్యాకాంతులకివతల
మత్తుగా ఒళ్ళు విరుచుకుంటూ ఉంది
అంతా
అతనూ ఆమె కాని
శరీరాన్ని చూస్తున్నారు
నాకు
పైకి మిసమిసా మెరుస్తూన్నా
లోపల పుళ్ళు పడ్డ దేహం మీద
మచ్చలు మాత్రమే కనిపిస్తున్నాయి
ఆమె నునుపైన దేహాన్ని
కళ్ళతో తాగడం
వేళ్ళతో తాకడమేనా లక్ష్యం?
కళ్ళలో వలపు వెనక
కడుపులో సుడి తిరిగే ఆకలిని
తాకిచూడు
ఆమెవరో తెలుస్తుంది
అతనెవరో తెలుస్తుంది
మైమరపు రంగుల కాన్వాసు
మీద ఎవరేం గీస్తే
అలా మలచ బడిన చిత్రం
బ్యాంకాక్ –
ఏముంది ఇక్కడ?!
ఒక వైపు
బుద్ధుడు వ్యాపించిన నేల మీద
ఆకాశాన్నంటే సుడిగుడులు
పొడి రాలే స్తూపాలు
బుద్ధం శరణం గచ్ఛామి-
మరో వైపు
కాలే కడుపుకి
పైనా కిందనా
చూపులు చేతలు పాకే మగ పురుగులు
దొలిచిన విచ్ఛిన్న శరీరావయవాలు
ఆనందం శరణం గచ్ఛామి-
పగటికి
రాత్రికి
పోలిక లేని
లాస్ వేగాస్
బ్యాంకాక్ నగరం-
రెప్పపాటులో
పగటిని
రాత్రిగా
మార్చే
మాయావి!
దాని వలలో
డబ్బుమద్యం సేవించి
గంజాయి నిద్ర తూగి
ఒళ్లంతా దాని పచ్చబొట్టు
సుఖాలు పొడిపించుకుని
కండకావర మసాజు
చొంగ కార్చుకోవడానికి
తండోపతండమయ్యే
వంకర బుద్ధి పుంగవుల
శతకోటి సుఖజూదాల
బ్యాంకాక్ నగరం
రాత్రి రహస్యాల్ని
మాత్రమే కాదు
పగటి నిజాల్ని
కూడా గుంభనంగా
దాచుకుంటుంది
అతనూ ఆమే కాని
అర్థ నారీశ్వర
బ్యాంకాక్ నగరం
ఎవరో చెరిచిన
రంగుల వర్ణ చిత్రమై
నా దుఃఖపు గుండెని
వేళ్ళాడుతూ ఉంది!
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023), అనగనగా అమెరికా (కాలమ్స్)(2025) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

బ్యాంకాక్ నగరం కవిత బాగుంది మేడం
బ్యాంకాక్ నగరాన్ని కళ్లెదుట చూపించారు. చాలా బాగా అక్షరకరించారు. శుభాకాంక్షలు మేడం
Thnak you Kishore Kumar garu.
బ్యాంకాక్ నగరం ఎవరో చెరిచిన రంగుల వర్ణ చిత్రమై నా దుఃఖపు గుండెని వెళ్ళాడుతూ ఉంటుంది..
బ్యాంకాక్ నగరం యొక్క
విశృంఖల స్థితిని చాలా బాగా అక్షరీకరణ చేశారు మేడం.
Udayagiri Dastagiri.
ధన్యవాదాలు దస్తగిరిగారూ!