కన్నీటి సాంద్రత… ఆశల తలం…

-దిలీప్.వి

అక్కడెక్కడో బాంబుపేలిన ఘటన
ఇక్కడేవరి హృదయాన్నో తూటా చీల్చుతున్న సంఘటన
నీకిప్పుడూ ఉత్త వార్తలు మాత్రమే…
ఆ పక్కనే ఛానల్ మార్చితే మెరిసిన ఆఫర్ ప్రకటన
చేతిలోని మాయా తెరపై నీ మునివేళ్ళ వెతుకులాట

రాతిరి
రోడ్డు మీద కుక్కపిల్ల ఏడుపు గొంతు
రోడ్డుపక్కన గుడిసె నుండి
గట్టిగా ఏడిస్తే ఆకలెక్కువైతుందని చిన్నపిల్లల మూలుగులు
ఒకదానికొకటి శృతి కలిసినట్టు సాగుతుంటే
కర్ణభేరి నోటిలో ఇయర్ బడ్స్ పోస్తున్న పాప్ పాటల మత్తులో
ఇవేమీ పట్టనట్లు కదులుతున్న పాదాలు

మనిషికి మనసుకి,మనుషులకు మనసులకు
నిత్యం ఎడతెగని యుద్ధం చీకట్లో
వెలుగుల్లో యుద్ధ విరమణ ఓ బూటకం
నెత్తురేమీ ఒలుకకుండానే
లెక్కకు మిక్కిలి నేలకొరుగుతున్న దేహాలు
హృదయాలిప్పుడు తడిలేని బీళ్ళవుతున్నవి
ప్రేమ నీటి పారకం జేసి సాగుచెయ్యాలి

అవసరమైతే…
ఒరిగేటి హృదయానికి హృదయాన్ని ఆనిచ్చి ఆసరవ్వాలి
తప్పనిసరైతే…
కూలే హృదయాలకు హృదయాన్ని నిట్టాడజేసి నిలబెట్టుకోవాలి
పాలపుంతలకు ఆవల పదార్థాన్ని గూర్చి
పెద్ద పెద్ద టెలిస్కోపులేసి విశ్వాన్ని గాలించే మానవుడా
పక్కనున్న నీ మనిషి కన్నీటి గురించి పట్టించుకోకపోతే
నీవు పైపైన మెరిసి లోలోన కుళ్ళిన ఉత్తి కొబ్బరికాయ తీరువే

అనాదిగా కురుస్తూనే ఉన్న ఈ కన్నీటి వానను
భూమ్మీద నికురంగా నిలిపుంచే తావులేకనే
ఇంకుతూ,ఆవిరవుతూ నిరంతరం కురిసే విపత్చక్రమైంది
లేకుంటేనా…
నేలమీది సంద్రాలన్నీ కన్నీటి సంద్రంలో ఓ నీటిబొట్టు విలువే
అయినా…
ఇంతటి కన్నీటి వరదలో కూడా మనిషి తేలియాడెదేట్లానో ఎరుకేనా?
కన్నీటి సాంద్రత…మనిషి ఆశల తలం…
రెండూ ఎక్కువే…!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.