జీవితమే నవీనం

అనుభవాలు -జ్ఞాపకాలు-3

-వెనిగళ్ళ కోమల

సీతమ్మ పెద్దమ్మ ఒంటరి. అమ్మమ్మ నాటి నుండి స్నేహమట. అమ్మమ్మ, తాతయ్యలను నేను ఎరుగను. అది నా జీవితంలో లోటుగానే ఉండేది. ఆమె మా యింట్లో పెద్ద తోడుగా సహాయపడేది. అన్నయ్య తెనాలిలో చదువు కుంటుంటే దగ్గర ఉండి వండి పెట్టింది. నా పెండ్లి దాకా ఉన్నది పెద్దమ్మ. మేమంతా గౌరవించి, ప్రేమించిన సీతమ్మ పెద్దమ్మ. 

నాన్నగారి తరఫున తాతయ్య, బాబాయిలు, నాగమ్మత్తయ్య ఎక్కువ వచ్చిపోతుండేవారు. నాన్న స్థితిమంతుడవటాన వారికి కావలసిన ఆర్ధిక సహాయం లేదనకుండా అందించేవాడు. చిన్న బాబాయి నారాయణ నా చిన్నప్పుడు మా యింట్లో చాలాకాలం ఉన్నాడు. నన్నుభు జాలమీద మోసి ఆడించేవాడు. – నాకు చాలా యిష్టమైన బాబాయి. అమ్మ బాబాయిని సొంత కొడుకులా చూసుకునేది. నాగమ్మత్తయ్య మా యింట్లో అన్ని శుభకార్యాలకు పెనమలూరు నుండి వస్తుండేది. కిలారు వారి కోడలు. ఒక అగ్ని ప్రమాదంలో మరణించింది వారింట్లోనే. నాయనమ్మ అనారోగ్యకారణం వల్ల వచ్చేది కాదు. మేము ఆమెను చూడటానికి వెళ్ళేవాళ్ళం. మాకు అక్కడ సౌకర్యాలు బాగా ఉండవని నాన్నే ఎక్కువగా వెళ్ళి తన వాళ్ళను చూసి వచ్చేవాడు. 

చుట్టుపక్కల వాళ్ళు – సామ్రాజ్యమక్కయ్య, సౌభాగ్యం అక్కయ్య (ఇద్దరు తోటికోడళ్ళు) కమలాంబ పెద్దమ్మ, లలితాంబ పిన్ని (వసుమతి అత్తగారు) మన్సుబు అన్నయ్యగారి కుటుంబం – వదిన, మాణిక్యమ్మ పెద్దమ్మ, సరస్వతి, అనసూయక్కయ్యలు, అన్నయ్యగారి పెద్దమ్మాయి ప్రమీల, మేడ తులశమ్మ పెద్దమ్మ, ఇంటి వెనకరత్తమ్మక్కయ్య – వాళ్ళందరి పిల్లలు ఇప్పటికీ నాకు బాగా గుర్తు. వాళ్లంతా అమ్మను వరుసబెట్టి పిలిచి, ఎంతో గౌరవంగా చూసేవారు. శుభసందర్భాలలో పనులకు వారంతటవారే సహాయపడటానికి వచ్చేవారు. నాన్నంటే భయం, భక్తీ ఉండేవి వారందరికీ. అమ్మ గడపదాటి బయటకు వెళ్ళే రకం కాదు. రాత్రిపూట అప్పుడప్పుడూ పైన చెప్పిన వారంతా కాసేపు మా యింటికి వచ్చి ఆ కబురు, ఈ కబురు చెపుతుండేవారు. నేను నిద్రవస్తున్నా ఆమ్మ వడిలో కూర్చొని వారి సంభాషణలు వినేదాన్ని. 

ప్రమీల మా పెద్దక్క మాదిరిగానే తన జీవితాన్ని తనవారి సేవలకే అంకితం చేస్తున్నది. సంవత్సరానికి ఒకసారి ఊరి గుడితిరణాల 5 రోజులు జరిగేది. నన్ను రోజూ కొత్తబట్టలు కట్టి, నగలు పెట్టి మిగతావారి జతలో గుడికి పంపేది అమ్మ. ఆ రోజుల్లో దోచుకుంటారని, అత్యాచారం చేస్తారని భయాలుండేవి కాదు తలి-దండ్రులకు. మంచికాలమది. బొందిలీ లక్ష్మీబాయి (మిఠాయి వ్యాపారస్తులు) తిరణాలలో దుకాణం పెట్టి పరిశుభ్రంగా రకరకాల మిఠాయిలమ్మేది. మా యింటికి కూడా అక్కయ్యల పెళ్ళిళ్లలో, ఇతర శుభకార్యాలలో పెద్ద ఎత్తున మిఠాయిలు చేయటానికి తన మంది, మార్బలంతో వచ్చేది. మనిషి నీటు, పని నీటు, చక్కని రూపం, ఖచ్చితమైన పనితనం. నాకామెయిష్టంగా ఉండేది. 

మాకు మేనమామ, వరుసయ్యే రామదాసు కమ్మబ్రాహ్మణుడు మూల్పూరులో పూజలూ, పెళ్ళిళ్లూ అన్నిటికి పౌరోహిత్యం నిర్వహించేవాడు. నన్నాటపట్టించేవాడు. మీ నాన్నకు ఇంకో అమ్మాయి పుడితే ఏమి పేరు పెట్టేవాడు – కమల, విమల, శ్యామల, కోమల తరువాత చుట్టేసి నమల అని పెట్టేవాడేమో అంటూ. నేను – నీకెందుకు మామయ్యా ఆచింత – ఇంత చక్కని పేర్లు పెట్టిన నాన్న మరో చక్కని పేరు పెట్టలేకపోడులే అనేదాన్ని.  

పనివాళ్ళలో ఇద్దరిని గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. గురవయ్య పెద్దమామయ్య దగ్గర పని. ఇంటికి తరచు వస్తుండేవాడు. ఒకసారి నేను అన్నం పెడితే తింటూ ఏమిటో ఊరిలో వాళ్ళ ముచ్చట్లు చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా అర్ధం కాక ఏమిటీ అని మరొకసారి అడిగాను – విసిగిపోయి – ఏమమ్మా! నీకు అన్నం పేగు తప్ప, వివరం పేగు లేనట్లున్నది అన్నాడు. అది అర్ధం అవటానికీ చాలాసేపు పట్టింది. ఇప్పటకీ ఆ సంగతి నవ్వు పుట్టిస్తుంది. నిజంగా వివరం పేగు లేదా అని అనుకుంటాను. 

చినమామయ్య వాళ్ల పనివాడు వెంకటప్పయ్య రావికంపాడనే ఊరివాడు. పని ముగించుకుని ఎక్కువ మాదగ్గరే గడిపేవాడు. చదువుకోలేదు. నాకు ఇంగ్లీషు నేర్పుతానంటూ పేపర్లు తిరగేసి పట్టుకుని కుర్చీలో కూర్చొని  పీస్ పాస్ అంటూ చదివేవాడు. నవ్వేవాళ్ళం. మేము పిలిచినట్లే మా వాళ్ళనందరినీ అండి చేర్చి పిలిచేవాడు. నాన్న అండీ, అమ్మండి, పెద్దమాండి (సీతమ్మ పెద్దమ్మని, నీ పెద్దబాండి పాడుగానూ, ఊరుకోరా అనేది పెద్దమ్మ) చిన్న మామయ్యాండి, పెదమామయ్యాండి, చిన్న అమ్మాయాండి అంటుంటే నవ్వురాదా మరి. వైద్గుడు (వైద్యుడు), డాస్కరు (డాక్టరు), గోయిత్రాకు (గోరింటాకు), నందొద్దన పువ్వూ (నందివర్ధన పువ్వు) యిలా మాటలు పలికి వినోదం కలిగించేవాడు.

మునియ్య అని మా వ్యవసాయం, ఎడ్ల పనులు చూసేవాడు. ఒక జత పొగరుగా ఉండేది. అతనికే మాట వినేవి. అతను జబ్బుపడితే చూడటానికి వాళ్ళింటికెళ్లాం. ఎద్దుల ప్రస్తావన తెచ్చాడు. వాటితో సమస్యగా ఉన్నదని నాన్న అంటే అంతటి నీరసంలోనూ వచ్చి వాటిని సవరించి మేతపెట్టి వెళ్ళాడు. అనతి కాలంలోనే టైఫాయిడ్ తో మృతి చెందాడు. నాన్న ఆ ఎడ్లజతను అమ్మవలసి వచ్చింది అతను లేనందువలన.

మూల్పూరులో అత్యంత స్థితిమంతులు, గౌరవనీయులూ, పెద్దలూ బాపమ్మ నాయనమ్మ. ఆమె కుమారుడు ఆవుల సాంబశివరావు బాబాయిగారు. ఊరికంతటికీ ఆస్తిపరులైనా వారి మాటలో, మర్యాదలో అతిశయం దొర్లేది కాదు. ఎంతో నమ్రతగా అందరినీ పలకరించేవారు. బాబాయి పెద్దలాయరు. హైకోర్ట్   చీ ఫ్   జస్టిస్ గానూ, ఆంధ్రాయూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గానూ అతి పెద్ద పదవులు నిర్వహించారు. వారిది చక్కని సువిశాలమైన యిల్లు. మమ్మల్ని ఆడుకోమని పిలిచేది నాయనమ్మ. ఆమె బంగారు రంగులో బంగారు మురుగులే వెలవెలబోయాయి. బాబాయిగారు నా పెళ్ళి నిశ్చయంలో, నిర్వహణలో ప్రధాన పాత్ర వహించారు. వారి సతీమణి జయప్రద పిన్ని, ఆయన మా దంపతులను – intellectual companions గా జీవించగలరని దీవించారు. వారిచిన్నమ్మాయి మంజులత చదువుకునే రోజుల్లో, ఉద్యోగిగా, తెలుగు యూనివర్సిటీ ఉపకులపతిగా నాకు బాగా పరిచయం. 

అప్పట్లో మూల్పూరులో యువకులు చదువుపట్ల మొగ్గిన వారెవరూ లేరు. నా తరవాత కాలం వారు బాగా చదువుకున్నారు. వారెవరితో నాకు పరిచయం లేదు.

హిమశైలావతి, పద్మావతి, నాగేంద్ర స్నేహితవర్గంలో బాగా గుర్తుండిపోయారు. వారి జతన ఆడిన ఆటలు ఇంకా గుర్తుండిపోయాయి. సామ్రాజ్యమక్కయ్య పిల్లలు స్వరాజ్యం, మాణిక్యం, వెంకటేశ్వర్లు (డెంటిస్ట్), కమలాంబ పెద్దమ్మ పిల్లలు చినామణి, సావిత్రి, సత్యవతి వాళ్ళతో బాగా పరిచయం. లలితాంబ పిన్ని కొడుకు గురుమూర్తి అన్నయ్య వసుమతి భర్త. 

మూల్పూరులో మరికొందరి గురించి చెప్పి మూల్పూరుకు బై చెపుతారు.

రాఘవ, భర్త కుండలు చేసి అమ్మేవారు. రాఘవ యింటి వడ్లదంపుడు, (మిషన్లు లేటుగా వచ్చాయి) పప్పులు తయారీ, ఇంటి (గచ్చులేనిచోట) అలుకులూ అన్నీ పనుల నిర్వహణ బాధ్యత వహించింది. తన దగ్గరే నేను రోకటిపోటు, ధాన్యం జల్లించడం, చెరగటం నేర్చుకున్నాను. అతి తక్కువ మాట్లాడేది రాఘవ. ఆమె కూతుళ్ళు చక్కటి వాళ్లు. విమలక్క పెండ్లి అయిన కొత్తలోనూ, ఆమెకు పిల్లలు కలిగాక రాఘవ పిల్లలు వంతులవారీగా అక్కతో సహాయంగా ఉండేవారు. రాఘవ కడ్డీలాగా ఉండేది. వయసు తెలిసేది కాదు.

నాగులు బుర్ర మీసాలతో పింక్ కలర్ లో దిట్టంగా ఉండేవాడు. హుందాతనం ఉట్టిపడేది. పెదమామయ్యతో చనువెక్కువ అతనికి. మామూడిళ్లలో ఏ పెండ్లి, పేరంటాలు జరిగినా పనులన్నీ నాగులు ఆధ్వర్యంలో జరిగేవి. నిలకడగా నిలబడి, సవ్యంగా అన్నిపనులు జరిగేలా చూసుకునేవాడు. వంటల దగ్గర వడ్డనల దగ్గర అన్నీ తానై ఏదీ పొల్లుబోకుండా, ఎక్కడా మాటరాకుండా నిర్వహించేవాడు. 

ఇద్దరు అత్తరు అమ్మే సాయిబులు బాగా గుర్తున్నారు. వారిది మూల్పూరు కాదు. ఏ వూరి నుండో వచ్చి అత్తరులు, పాలమడ్డి అమ్మేవారు. మా యింటిలోగానీ, బాపమ్మ నాయనమ్మ యింటిలోగానీ బసచేసేవారు. పెద్ద సాయిబు చక్కగా, నీటుగా ఉండేవాడు. చిన్న సాయిబు బక్కగా, కొంచెం కంత్రీగా (cunning) ఉండేవాడు. అత్తరు  సీసాలు చెక్కపెట్టె అరలలో సర్ది, ఎర్రని బట్టతో కట్టి తెచ్చేవారు. ఖాళీ సీసాలే ఎన్నేళ్ళయినా సువాసనలు వెదజల్లేవి. నిఖార్సయిన సరుకు పెద్దసాయిబు అమ్మేవాడు. చిన్నాయన కొంత కల్తీ చేస్తాడని పెద్దవాళ్ళంటుండేవాళ్ళు. ఇద్దరూ ఎప్పుడూ తెల్లటి బట్టలతో మెరుస్తూ ఉండేవారు.   పెదపూడి (పెద్దక్కదగ్గరకు) యడ్లపల్లి (చిన్నక్క ఊరు) వెళితే వారిద్దరికి అతిథులుగా ఉండేవారు. వారి రూపాలు ఇప్పటికీ గుర్తే.

సంక్రాంతి నెలలో ఎర్ర హరిదాసు, నల్లహరిదాసు పై ఊరినుండి వచ్చి నెలంతా యింటియింటికీ  తిరిగి పాటలు పాడుకుంటూ భిక్ష స్వీకరించేవారు. ఎర్రటి హరిదాసుకాషాయ గుడ్డలు కట్టేవాడు. చక్కగా పాడేవాడు. నల్లహరిదాసు తెల్లటి బట్టలు ధరించేవారు. పాట కొంచెం క్లాసికల్ గా ఉండేది. రాగి అక్షయ పాత్రలు (గుమ్మడికాయ ఆకారంలో) నెత్తిన పెట్టుకొని, చేతిలో చిడతలు వాయిస్తూ పాడేవారు. చిన్నపిల్లలం బియ్యం పాత్రలో, వేయాలంటే మునికాళ్ళమీద కూర్చొని పెట్టించుకుని కృష్ణార్పణం అనేవారు. నెల అయి వారెళ్ళిపోతుంటే అప్పుడే వెళ్ళిపోతున్నారనిపించేది. వారిప్పుడూ పాడుతూ వస్తున్నట్లు మనోఫలకం మీద కనిపిస్తుంటారు. 

పై చదువు

15 ఏట విద్యావనం (పామర్రు పొలిమేరలు)లో మెట్రిక్ చదవటానికి అన్నయ్య చేర్పించారు. తాను బందరు (మచిలీపట్నం)లో ఇంటర్ చదువుతుండగా ఆ సంస్థ గురించి తెలిసినట్లున్నది. అది ప్రముఖంగా హిందీబోధనా సంస్థ. యలమంచిలి వెంకటేశ్వరరావు, సరస్వతీ నిర్వహించేవారు. మెట్రిక్ ఒక సెక్షన్ నడిచేది. టీచర్లంతా అక్కడే బస చేసేవారు. పొలాలలో పూరి పాకలలో విద్యాబోధన, విద్యార్థుల నివాసం ఉండేది. పాములు, మండ్రగబ్బలు తిరుగాడుతుండేవి. కాని ఎవరికీ హాని జరగలేదు. పుల్లేరు గట్టున ఉన్నది సంస్థ. దాటితే బందరు రోడ్డు. అక్కడే బస్ ఎక్కి విజయవాడ వచ్చి, తెనాలి వెళ్ళి మూల్పూరు చేరుకోవాలి. చావా వెంకటేశ్వర్లు మాష్టారు బాగా యిష్టంగా ఉండేవారు నాకు. చక్కని విగ్రహం, ఎంతో నిబద్ధతో పాఠాలు చెప్పారు. అక్కడ ప్రకృతి వైద్యం నడిచేది. జ్వరం వస్తే కంట్లోకలిగ్గం, ఒండ్రుమట్టి వైద్యం చేసేవారు. చిట్టెక్క, ఆమెభర్త హిందీ చదివేవారు. వారికొపాప. హాస్టలు దగ్గర పాక అద్దెకు తీసుకుని ఉండేవారు. నాకెలా పరిచయమయిందో గుర్తులేదు గాని చిట్టెక్క నన్ను సొంత బిడ్డలా చూడటం గుర్తు. శీతాబాయి, శాఖమూరి సామ్రాజ్యం, బోయపాటి కృష్ణకుమారి (హిందీ ప్రేమామండలి, తెనాలి) సరోజిని, ప్రసూన (పెనమలూరు) హేమలత (లవణం భార్య) సన్నిహితులుగా వుండేవారు నాతో. నా క్లాస్ మేట్ రత్నం అక్క. తాను డాక్టరు చదివి ఇంగ్లండులోనూ, ఉయ్యూరులోనూ వైద్యసేలందించింది. ఆ అక్క కొడుకే జయరాంగారు, భార్య జయప్రద. సహృదయులు. ఇన్నయ్య ద్వారా ఫామిలీ ఫ్రండ్స్ గా కొనసాగుతున్నారు. 

ఇటీవల ఇన్నేళ్ళ తరవాత 2013లో సామ్రాజ్యాన్ని ఫోనులో కలవగలిగాను. చాలా సంతోషం కలిగింది.

లెక్కలు ఒంటికి ఆట్టే పట్టలేదు. మెట్రిక్ లో 64శాతం వస్తే 100 శాతం వచ్చినంత పొంగిపోయాను. నా బాచ్ లో ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకొక్కదానికి. అది సర్వసాధారణం. అన్న లెక్కలోనే తీసుకున్నాను. 1953 సంగతి అది. 

1953-55 తెనాలి కాలేజీలో ఇంటర్మీడియేట్ చదివాను. కుటుంబం అంతా తెనాలి మారింది. చినరావూరులో ఉండేవాళ్ళం. ఆర్ట్స్ గ్రూపులో చేరాను. రాజేశ్వరి (చిత్తూరులో నా క్లాస్ మేట్, స్నేహితురాలు) గూడా అదే గ్రూపు తీసుకున్నది. ఇద్దరం కలిసే రోజూ కాలేజికి వెళ్ళి వచ్చేవాళ్ళం. ఆమె తల్లి, అక్క పుణ్యవతిగారు నన్ను ఆప్యాయంగా పలకరించేవారు. 

ప్రిన్సిపాల్ రాగ్లండ్ ఇంగ్లీషు గ్రామరు, షేక్స్ పియర్ నాటకం బోధించారు. కె.ఎస్. రామ మరో ఇంగ్లీషు లెక్చరర్. బ్రిటీష్ హిస్టరీ, సివిక్స్ భాస్కరరెడ్డిగారు బోధించారు. ప్రతిపాఠం తరువాత నోట్స్ డిక్టేట్ చేసేవారు. ఎస్.ఎ.ప్రసాద్ గారు ఇండియన్ హిస్టరీ లెక్చరర్. ఆయన క్లాసు ఇష్టంగా ఉండేది. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాటా రాసుకో ప్రయత్నించేదాన్ని. ఇంగ్లీషు ధారాపాతంగా మాట్లాడేవారు. Busy ని మేమందరం బిజీ అన్నా ప్రసాద్ గారు బుజీ అనే అనేవారు. ఆయన సోదరి సజ్జా కమల యూనివర్సిటీలో నా సమకాలీకురాలు. రాజేశ్వరికి క్లాస్ మేట్. ఆమె లాస్ ఏంజిలస్ లో ఉన్నారు. ప్రసాద్ గారు ఆస్ట్రేలియాలో ఉన్నట్లు తెలిసింది. 

హిందీ సెంకండ్ లాంగ్వేజ్ – దోనేపూడి రాజారావు గురువు. అప్పటికే పెద్ద క్లాసులు హిందీలో పాసయి ఉన్నాం గనుక ఆయన క్లాసులు లాంఛనంగా అటెండ్ చేసేవాళ్ళం. మొదటి సంవత్సరమంతా నేనే క్లాసుఫస్ట్ – సంవత్సరాంతం వ్యాసరచన పోటీ, మేగజైన్ కి మంచి ఆర్టికల్ రాసే పోటీలోనూ ఫస్ట్. యాన్యూవల్ డే ఫంక్షన్ లో అన్ని సబ్జెక్ట్స్ లోనూ ప్రైజులొచ్చాయి. చాలా చక్కని ఆర్ట్ పేపర్ మీద సర్టిఫికెట్లు యిచ్చారు. మోయలేనన్ని మంచి పుస్తకాలు బహూకరించారు. ప్రిన్సిపల్ గారి భార్య ఆటల్లో ప్రైజులు రాలేదేమని అడిగారు. పార్టిసిపేట్ చేయలేదని, అయినా నేను స్పోర్ట్స్ పర్సన్ ను కాదని చెప్పాను. 

ఇంటర్ సెకండ్ యియర్ పరీక్షల్లో నేనే కాలేజ్ ఫస్ట్ 87 శాతం మార్కులొచ్చాయి. నాన్నకు, అన్నయ్యకూ నన్ను డాక్టరు కోర్సు చదివించాలని ఉండేది. నేను అర్ట్స్ ప్రిఫర్ చేశాను. ఇంటర్ మార్కులు చూసి నాన్న – సైన్స్ తో ఇంటర్ రిపీట్ చేయమ్మా మెడిసిన్ చేద్దువుగాని అన్నారు. వద్దండీ అన్నాను. 

ఆ సందర్భంగా మా అన్నయ్య సంగతి ఒకటి ప్రస్తావించాలి. మొదటి సంవత్సరపు మార్కుల మెమోకార్డు మీద టైపు చేసింది పోస్ట్ లో ఇంటికొచ్చింది. కాలేజి ఆఫీసు నుండి గొప్ప మార్కులొచ్చాయి. కార్డు కింది వరసలో సిరాతో ఇరికించి ఇలా రాసి ఉన్నది. can work hard and fare better అని. నాన్న అది చూసి యిదేమిటమ్మా ఇంత మంచి మార్కులు వచ్చినా ఇలా రాశారు? అని అడిగారు. పోస్ట్ అన్నయ్య తీసుకున్నాడు సిరాతో తానే రాసి ఉంటాడు అన్నాను. అది అన్నయ్య పనే. నాన్న ముసిముసిగా మురిపెంగా నవ్వుకున్నారు. అన్నయ్యకు నన్నలా అందలం ఎక్కించాలనే ఎప్పుడూ ఉండేది. ఒక పార్కర్, ఒక షీఫర్ పెన్ను కొనిచ్చాడు. నాన్న ఫేవర్ లూబా వాచి యిచ్చాడు. 

నాన్న కాలక్షేపం కోసం కాఫీ షాపొకటి తెరిచారు. కాఫీపొడి అమ్మేషాపు. దాని మీద లాభం లేకపోయినా ఆయనకు పదిమందిని తన షాపులో కలిసే అవకాశం దొరికింది. కాలక్షేపం బాగానే ఉండేది. 

ఆ రోజుల్లోనే జి.వి.కె. మామయ్య భార్య సుజాతక్కయ్యతో పరిచయాలేర్పడ్డాయి. వాళ్ళ ఏకైక పుత్రిక డా. విజయ (డెంటిస్ట్) లాస్ ఏంజలస్ లో స్థిరపడటాన మామయ్య, అక్కయ్య ఆమెతోనే వుంటున్నారు. టచ్ లో ఉన్నాం ఇప్పటికీ. 

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.