నేనే తిరగ రాస్తాను

-అరుణ గోగులమంద

ఎవరెవరో

 ఏమేమో

చెప్తూనే వున్నారు.

యేళ్ళ తరబడి..నా అడుగుల్ని, నడకల్ని

నియంత్రిస్తూనే వున్నారు.

నా పడకల్ని, చూపుల్ని, నవ్వుల్ని

నిర్ణయిస్తూనే ఉన్నారు.

వడివడిగా పరిగెత్తనియ్యక

అందంగా బంధాల్ని,

నా ధైర్యాన్ని హరించే పిరికి మందుల్ని

శతాభ్దాలుగా

అలుపూ సొలుపూ లేక

నూరిపోస్తూనే వున్నారు.

నన్ను క్షేత్రమన్నారు..

వాళ్ళబీజాల ఫలదీకరణల ప్రయోగాలకు

నన్ను పరీక్షాకేంద్రంగా మార్చారు.

వాడి పటుత్వ నిర్ధారణకు

నన్ను పావుగా వాడిపడేశారు.

నేనో ప్రాణమున్న పరీక్ష నాళికను.

నాలోకి యేవేవో యాసిడ్లు పంపి

విస్తృతంగా..వికృతంగా..

విస్తారంగా..

వంశాంకురాల కోసం

గర్భాశయపు సారాన్ని పెంచే

పరీక్షలు చేసారు.

తొలిరాత్రిపేరుతో శృంగారం రంగరించి

ఘాటైన విషాల్ని

కామమనే కషాయాన్ని

నా మౌనాన్ని అంగీకారంగా నిర్ణయించినపెద్దవాళ్ళఆసరాతో..

నా పచ్చి గాజుదేహంలోకి

రాక్షసంగా ఒలికించారు

గాజు పొరలు చిట్లి..నెత్తురోడిన నన్ను.

ఆనందంగాకన్యనని తేల్చారు.

యెవరెవరో..

నన్ను దేవతని చేసారు.

గుళ్ళనే, ఇళ్ళనే జైళ్ళలో బంధించి

నా ప్రమేయంలేకుండా చీరలను చుట్టబెట్టి..

గంగిరెద్దు అలంకరణలు ఒంటినిండా చేసి..

నలుగు పెట్టి, పసుపూ పారాణి పూసి….

మొద్దులా నిలబెట్టారు.

తలరాతలు వాళ్ళేరాసి..

దాసిగా, తల్లిగా,రంభలా..

జన్మంతా సోమరిపోతుసేవకై..

బలిపశువును చేసారు.

నాకోసం వంటగదులు కట్టారు

వంటపాత్రలు కొన్నారు.

నా అస్థి పాస్తులు నిర్ణయించి

నన్నేలుకోమన్నారు.

మహరాణివని, దేవతని..

గ్రంధాలు రచించి

నా మూగనోము ఆసరాతో

గ్రంధసాంగులయ్యారు.

యెవరెవరో..

శీలపరీక్షలు చేసారు..

యేళ్ళకేళ్ళు నను మత్తులోకి తోసారు..

ముక్కూ చెవులూ కోసారు, శాపగ్రస్తను చేసారు..

కులటనే ముద్రవేసి..

నా బ్రతుకు బండలు చేసారు..

ఇంకెవరో రాకముందే..

నేను మేల్కోవాలి.

వడిగా నా నడుము కట్టుకొని

నా శాపాల సిలువ నుండే..

నా ఆయుధాల్ని చెక్కుతాను.

నా ఒంట్లోని యెముకలనుండి

నా బాణాల్ని సానపడతాను.

నా సంకెళ్ళను తెంచుకొని..

ఎవరెవరో రాసేసిన తలరాతను చెరిపి,

నా కంపిస్తున్న నరాలతో తాళ్ళను పేని,

నాపై

నీ తరతరాల పెత్తనాన్ని..

దశాబ్దాల నేరాల్ని.. 

నేనే ఉరివేస్తాను..

నా రేపటి భవిష్యత్తును

నేనే..

తిరగ రాస్తాను.

*****

ఆర్ట్: మన్నెం శారద

Please follow and like us:

5 thoughts on “నేనే తిరగ రాస్తాను (కవిత)”

  1. అరుణ గారూ…..ఇది నిజంగా అరురారుణ కవిత.మీ పదునైన శైలికి అభివాదాలు

  2. నిర్మొహమాటంగా
    మనసులోని మాటగా నడిచింది కవిత.
    చెప్పదలచుకున్నది,సూటిగా చెప్పడమే
    రచయిత్రి లక్ష్యం.నూటికి నూరు పాళ్లు కవయిత్రి అది సాధించారు.
    అరుణ గారికి
    అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.