జీవితమే నవీనం

అనుభవాలు -జ్ఞాపకాలు-7

-వెనిగళ్ళ కోమల

వివాహం, పిల్లలు, బాధ్యతలు

అన్నయ్యకు చదువుతుండగానే పెండ్లయింది. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో డి్గ్రీ చదివారు. ముగ్గురు పిల్లల తండ్రయ్యారు. తార, నాగమణి, కృష్ణమోహన్ – వదిన ఎంపికే ముగ్గురి పేర్లు. పెంచే విధానం గూడా ఆమెకు తోచినట్లే. ఆ తరుణంలో మా అమ్మ నాకూ శ్యామలక్కకూ పెండ్లి విషయం నాన్న, అన్నయ్య శ్రద్ధ పట్టటం లేదని కొంత బెంగ పడింది. స్నేహితుల పెళ్ళిళ్ళ విషయంలో చూపే శ్రద్ధ మాపట్ల చూపటం లేదని ఒకసారి బాధపడింది నా ముందు. అవే అవుతాయి లేమ్మా, బాధపడకు అన్నాను నేను.

ఇన్నయ్యతో నా పెళ్ళి ప్రస్తావన మొదలు తెచ్చింది ఆంధ్రపత్రిక కరస్పాండెంట్ వెంకటప్పయ్యశాస్త్రిగారు. ఆయన కన్యాకుమారి తండ్రి. కన్యాకుమారి ఇన్నయ్య సోదరుడు విజయరాజ్ కుమార్ భార్య. నాతోటికోడలు. 1963, ఆగస్టు 17న నాన్న ఆవుల సాంబశివరావుగారూ, ఇన్నయ్య, వాళ్ళ బావగారు చెరుకూరి వెంకట సుబ్బయ్యగారు నేనుంటున్న హాస్టల్ కి వచ్చారు. పెళ్ళిచూపులన్నమాట. ఇన్నయ్య హేతువాద ఉద్యమంలో పనిచేయటం వలన సాంబశివుగారికి, ఆవుల గోపాలకృష్ణమూర్తిగారికి బాగా పరిచయమున్న వ్యక్తి. ఇద్దరం ఇష్టపడ్డాము, పెండ్లి నిశ్చయమయింది. నాన్న ఎంతకట్నమివ్వగలడో చెప్పాడట. అందుకు ఇన్నయ్య కట్నం ఆశించడంలేదు. ఇద్దరం చదువుకున్నాం. స్వశక్తితో బ్రతగ్గలమనే వివాహానికి ఒప్పుకున్నానన్నాడట. 

మాపెళ్ళిలో కట్న కానుకల ప్రసక్తి లేనేలేదు. అప్పుడు ఆవుల గోపాలకృష్ణమూర్తిగారు అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై అమెరికా టూర్ లో ఉన్నారు. ఆయన ఇన్నయ్యకు గురుతుల్యులు. ఆయనే వివాహం జరిపించాలని ఇన్నయ్య కోరిక. తానప్పుడు సంగారెడ్డిలో గ్రాడ్యుయేట్ టీచర్ గా పనిచేస్తున్నాడు. వేసవి సెలవుల్లో పెండ్లి చేసుకుంటామని ఇన్నయ్య సాంబశివరావుగారికి తెలిపాడు.

ఇంతలో శ్యామలక్క పెళ్లి ఎం. నాగయ్య గారితో కుదిరింది. నాగయ్యగారు అద్దంకిలో పి.టి.టీచరుగా పనిచేస్తున్నారు. వారి స్వగ్రామం సంక్రాంతిపాడు సత్తెనపల్లి తాలూకా అనుకుంటాను.

మే 31, 1964న మా  యిద్దరి వివాహం తెనాలి తాలూక హైస్కూలు బిల్డింగ్ లో సాయంత్రం 5 గంటలకు జరిగింది. గోపాలకృష్ణమూర్తిగారు  ఆధ్వర్యం వహించారు. దండల పెళ్ళి, మంత్రాలు, మేళాలువంటి తతంగంలేదు.  సాంబశివరావుగారు చిన్న ఉపన్యాసం చేశారు. ముహూర్తం అంటూ లేని పెళ్ళియిది. ఆదివారం, సాయంత్రం అందరికీ వీలు చిక్కే టైములో అంటూ సీతారాముల పెళ్ళి ముహూర్త బలం గురించి చమత్కరించారు.

ఇన్నయ్యగారి ఆప్తమిత్రులు సి.రాజారెడ్డిగారు, పెద్దరికం వహించి  ఒక చక్కని పట్టుచీర, మంగళసూత్రం, బంగారు గొలుసు కొని తెచ్చారు. రాజారెడ్డిగారిది చీరాల, వేసవి అంతా ఇన్నయ్య అక్కడ హేతువాద మిత్రులతోనే గడిపి అటునుండే స్నేహితులందరితో కలిసి తెనాలి వచ్చారు.

శ్యామలక్క, నాగయ్యగారు సరిజోడు. ఇద్దరూ నెమ్మదస్తులు. అట్లా మాపెళ్ళిళ్ళయినాయి. అమ్మకు ఊరట కలిగింది. నేను ఎక్కువ హాస్టళ్ళలో ఉన్నాను. శ్యామలక్క అమ్మతో ఎక్కువ కాలం గడిపింది. అక్క వెళ్ళిపోతుంటే అమ్మ ఒంటరితనం అనుభవించింది. తప్పదుగదామరి!

ఇన్నయ్యగారి అక్క కమలగారు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో డెప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తూ హైదరాబాద్ లో ఉంటున్నారు. వారుంటున్న ఇంటికి అనుబంధంగా ఉన్న పోర్షన్ మాకూ అద్దెకు కుదిర్చారు. ఇసామియా బజారులో చిన్న పెంకుటిల్లు. సరుకు, సరంజామా కొనుక్కుని కాపురం ప్రారంభించాం నేనూ, ఇన్నయ్య.

ఇన్నయ్య ఆంధ్రాయూనివర్సిటీలో ఫిలాసఫీ డిపార్ట్ మెంట్ లో చదువుతూ తండ్రి రాజయ్యగారి మరణంతో అక్కడ చదువు మానవలసి వచ్చిందట. పెండ్లినాటికి ఉస్మానియా యూనివర్సిటీలో మొదటి సంవత్సరం యం.ఎ. ప్రైవేటుగా రాసి పాసయి ఉన్నాడు. ఉద్యోగం మాని 1964లో యూనివర్సిటీలో చేరి యం.ఎ. పూర్తిచేశాడు. వెంటనే పిహెచ్.డి.కి పేరు నమోదు చేసుకుని చదవటం ప్రారంభించి 18 నెలలలో ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు డిటర్మనిజంలో పిహెచ్.డి. సిద్ధాంతం తయారు చేశాడు, గైడ్ దురుద్దేశ్యంతో 12 ఏళ్ళు పట్టించాడు ఆయనకు డిగ్రీరావటానికి. అదో పెద్ద కథలెండి! మరోచోట ప్రస్తావిస్తాను ఆ కథ.

ఆగస్టు 1964 మొదటి బిడ్డ కడుపున పడింది. మొదటి నాలుగు నెలలు అసౌకర్యంగా, ఇబ్బందిగా నీరసంగా గడిచాయి. తిండిమీద ప్రీతి పోయింది. కానీ ఉద్యోగ ధర్మం నిర్వర్తించవలసే వచ్చింది. ప్రసవం ముందు దాకా ఏ డాక్టరును చూడలేదు. ఏ మందులూ వాడలేదు. ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి స్త్రీ ప్రసవం తల్లి సమక్షంలో జరగాలని పుట్టింటికి పోగోరుతుంది. నేను అందుకు భిన్నం కాదు. హైదరాబాద్ లో మంచి డాక్టర్లు ఉన్నా ఏప్రిల్ లో సెలవులు ప్రారంభం కాగానే మూల్పూరు వెళ్ళిపోయాను. నాన్న తెనాలిలో డా.ఝాన్సీ వాణికి చూపించి ప్రసవానికి వారం ముందు చిన్నఇల్లు అద్దెకు తీసుకుని తెనాలి చేరాడు. అమ్మ, అక్కలు అందరూ నాతోనే ఉన్నారు. ఇల్లు సౌకర్యంగా లేదు గాని డాక్టరు క్లినిక్ ఎదురుగా ఉండటం ప్లస్ పాయింట్. మే 20వ తేదీన (1965) రాత్రి డాక్టరు నన్ను చూచి యింకా ప్రసవానికి టైమున్నది. తిరుపతి వెళ్ళి రెండవరోజు తిరిగి వస్తానని బయలుదేరి వెళ్ళారు. నాకు అదే అర్ధరాత్రి నుండి ప్రసవవేదన ప్రారంభమయింది. అవసరమైతే తనకు తెలిసిన లేడీ డాక్టరును పిలవమని నర్సులకు చెప్పారట. తీరా చూస్తే ఆమె సెలవులో ఎక్కడికో వెళ్లారని తెలిసింది. పగలు 11 గంటలు (21 మే) సమయంలో నర్సులకు దిక్కు తోచక డాక్టరు చావా సుబ్బారావుగారిని పిలుచుకొచ్చారు. సిజేరియన్ కేసది. కాని ఆయనకు సిజేరియన్ లు చేసే అలవాటులేదు గనుక ఇంటర్నల్ టేర్ (కోత) యిచ్చి పసి తల్లిని బయటకు తెచ్చారు. 23 కుట్లు వేసానన్నారు లోపల.

పుట్టిన బిడ్డ దృఢంగా, చక్కని శరీర చాయ కలిగి నల్లని కురులతో ముద్దుగా ఉన్నది. ఆ విధమైన ప్రసవం వలన నా శరీరంలో కొన్ని లోపాలేర్పడ్డాయి. అవి ఇప్పటికీ లోపాలుగానే మిగిలాయి. డాక్టరు ఝాన్సీవాణి జరిగిన తప్పును గ్రహించారు. 10వ రోజు మరల మత్తు యిచ్చి కుట్లు సరిచేశారు. కాని జరిగిన నష్టంపూడలేదు. నేను లేచి తిరగటానికి నెలపట్టింది. ఇన్నయ్య చీరాలలో ఉండటాన మూడవ రోజు వచ్చి బిడ్డను చూచి వెళ్ళిపోయారు. అన్నయ్య, పిల్లలు, చిన్నక్క పిల్లలు – అశోక్, నరేంద్ర, సతీష్, కల్పన, కుసుమ, సురేషు అందరూ పాపచుట్టూనే ఉన్నారు. కాసేపు మంచం పక్కన ఎవరూ కనిపించకపోతే బేర్ మని ఏడ్చేది. నీ కూతురుకు చుట్టూ మనుష్యుల సందడి కావాలి అని అక్కలు మురుసుకున్నారు.

రోహిణీ కార్తె, మండుటెండలు. లేత అరటి ఆకులు తెప్పించి పసితల్లిని అందుమీద పడుకోబెట్టి వేడి నుండి కాపాడారు. అత్తయ్యలు, మామయ్యలు వచ్చి చూచి వెళ్ళారు. ఎడం కన్నులో విపరీతమైన బాధతో విలవిలలాడాను. డాక్టరుకు చూపించారు నాన్న – భయపడ్డారు. కన్ను ఏమవుతుందోనని. నెలకి మూల్పూరు వెళ్ళాం అందరం బిడ్డతో సహా. 24వ రోజు అమ్మ ఉయ్యాల వేసి సింపుల్ గా పేరంటం గావించింది. అదే రోజు కమలగారి దగ్గర నుండి పార్సెల్ అందింది. పసిదానికి రంగుల రంగుల జుబ్బాలు అందంగా కుట్లతో పంపించారు. పెద్దక్క మిషన్ కుడుతుంది. ఎన్నో రకాల గౌనులు, డైపర్ ల మాదిరిగా సైను బట్టతో అనేకం కుట్టింది. అక్కే స్నానం చేయించేది పసిదానికి. ఎప్పుడూ ఎవరో ఒకరు ఎత్తుకుని ముద్దాడుతుండేవారు. అక్కలు బంగారు గాజులు చేయించి యిచ్చారు బిడ్డకు.

నాన్నను పేరు పెట్టమని అడిగాను. ఇన్నయ్య పెట్టుకుంటాడు లేమ్మా, తండ్రిగా అది అతని హక్కు అన్నారు నాన్న. రెండవ నెల పూర్తి కాకుండానే ప్రయాణం కట్టాను హైదరాబాద్ కు ఇన్నయ్య రమ్మని చెపితే, ఆలోగా నారాయణగూడాలో స్కూలు దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. సౌకర్యంగా ఉన్నది ఇల్లు. ఇంకా రెండు రోజులాగితే ఆషాఢం వెళుతుంది అన్నాడు నాన్న. ఎప్పుడూ తిథులూ, మంచి చెడులూ చూసే అలవాటు లేదు గనుక ప్రయాణం సాగింది. అమ్మనాతో గూడా హైదరాబాద్ వచ్చింది. పాపకు నాలుగు నెలలకు వచ్చినదాకా అమ్మ ఉన్నది. అప్పటికి పసి తల్లికూర్చుంటున్నది గనుక స్నానం చేయించటం కష్టం అవలేదు నాకు.

ఇంటివాళ్ళ అమ్మాయి శైలజ నా స్టూడెంట్ స్కూలులో. ఇంటిల్లిపాదీ పాపను ముద్దు చేసే వారు. వాళ్ళే సోనీ అనిపిలిచేవాళ్లు. వారందరి మధ్య బిడ్డ సంతోషంగా పెరిగింది. ఇంతలో నాన్ననుండి ఉత్తరం వచ్చింది. పాపకు రెండు, లేక మూడు అక్షరాలతో నవీనంగా ఉండే పేరు పెట్టుకోండి. ఆలస్యమైనకొద్దీ బుజ్జి, బేబి అంటూ పిలుపులు అలవాటైపోతాయి అని రాశాడు నాన్న. అప్పటికే ఇన్నయ్య బుజ్జమ్మ అని పిలుస్తున్నాడు. ఉత్తరం చదివి, ఒక్క నిముషం ఆలోచించి, నవీన అని పేరు పెడదామా అన్నాడు. ఆ పదం నాన్న ఉత్తరంలోని నవీనంగా అన్న పదం నుండి తీసాడు.  ఇక నవీన పేరు స్థిరపరచుకున్నాం. పేరు నాన్న పెట్టినట్లే. నేను నటాషా అని పెడదామా అని ఆలోచించాను కాని సౌండ్ హార్ష్ గా ఉంటుందేమో అని ఊరుకున్నాను. చాలామంది ఇప్పటికీ సోనీ  అంటారు. అక్కలు చిన్ని  అనేవాళ్ళు. మా అమ్మకు ఆఖరి మనవరాలని అలా ముద్దుగా పిలుచుకునేవారు. నేను ఇప్పటికీ చిన్ని అనే పిలుస్తాను. అఫీషియల్ గా నవీన నమోదయింది.

నవీన పసితనం నుండి వింతగా, మెచ్యూర్డుగా వ్యవహరించేది. ఇన్నయ్య ఎక్కువ శ్రద్ధ చూపేవాడు నవీనపట్ల. మోకాళ్ళమీద పాకలేదు. మంచిదే అయింది. మోకాళ్ళు గీరుకుపోకుండా అనుకున్నాను. మా యింట్లోకంటే యింటివారివద్దనే ఎక్కువ సమయంగడిపేది. సోనీ దగ్గర మంచివాసన వస్తుంటుంది అని వాళ్ళు మెచ్చుకునేవారు. వారు టేబుల్ పై భోజనాలు చేస్తూ సోనీని మధ్యలో కూర్చోబెట్టుకునేవారు. కెలికినా వాళ్ళకి యిష్టంగానే ఉండేది. వాళ్ళ దగ్గర నుండి తీసుకు రాబోతే రానని మారాం చేసేది. శైలజ పెళ్ళికి, సోనీకి గూడా బట్టలు కొని పెళ్ళికి తీసుకు వెళ్ళారు. ముద్దుగా నడుస్తూ పువ్వులేరుతుంటే ఫోటోతీశారు.

సంవత్సరం లోపల నడక మాటలు వచ్చాయి. రెండు నెలలు పలకలేదు. అనేది. మీ అమ్మ పేరు ఏమిటి అని ఎవరన్నా అడిగితే తోమల అనేది. వాళ్ళు నవ్వితే కోపగించుకునేది. మరలా అడిగితే తెలియదు అనేది. అలిగిందన్నమాట.

సాధనా కట్ అనేవారు అప్పటి హెయిర్ స్టైల్ ని అది చేయించాము. కేన్వాస్ షూజ్ వేసుకుని హుందాగా నడిచేది. పసితనంలో పాలపొడి డబ్బాలు దొరకకుండా మార్కెట్ లో బ్లాక్ లో అమ్మేవారు కొన్నాళ్ళు. చీరాల నుండి రాజా రెడ్డిగారు, మండవ శ్రీరామమూర్తిగారు వాటిని తెప్పించి పంపేవారు. నెమ్మదిగా గేదెపాలు అలవాటు చేశాము.

అత్తగారు, పనిమనుషుల సహాయంతో పెంచగలిగాము. నేను డ్యూటీకి వెళ్ళవలసి వచ్చింది గనుక. రెగ్యులర్ గా డాక్టర్ చెక్ అప్ చేయించేవాళ్ళం. ఆరోగ్యంగా ఆనందంగా, ఏ ట్రబుల్  లేకుండా చక్కగా పెరిగింది నవీన. రెండు సంవత్సరాలు నిండగానే శిశువిహార్ మోంటిసోరీ స్కూలుకు పంపించాము. ఆయా ఎత్తుకుని తీసుకెళ్ళేది స్కూలుకు. 20 రోజులు పోనని ఏడ్చింది. అంతమంది కొత్తవారి మధ్య ఉండటం నచ్చినట్లు లేదు. తరువాత అలవాటుపడింది.

నవీన తమ్ముడు మరుసంవత్సరం జూన్ 26న (1966) పుట్టాడు.  హైదరాబాద్ లో డా. లక్ష్మీదేశాయి హాస్పిటల్లో ప్రసవించాను. మొదటి కాన్పులో జరిగిన లోటు యిబ్బంది కలిగించింది. డాక్టరు శ్రద్ధగా వైద్యం చేశారు. మరొకసారి కాన్పు వస్తే ముందునుండే జాగ్రత్త వహించాలి అని ఆమె వార్నింగ్ యిచ్చారు. ఆ ప్రమాదం కొని తెచ్చుకోలేదు. ఆదివారం తెల్లవారుతుండగా బాబు పుట్టాడు. సన్నగా, పొడవుగా ఉన్నాడు. మేము నవీనకు ఈ కొత్త ప్రాణి గురించి సరైన అవగాహన యిచ్చినట్లు లేదు. నా పక్కలో పసివాడిని చూసి ఈర్ష్య కలిగినట్లున్నది. పరుగెత్తుకొచ్చి మంచం ఎక్కుతుంటే నా పక్కన పడుకుంటుందేమో అని చోటు చేసుకున్నాను. శరవేగంగా పసివాడి నెత్తిమొత్తి మంచం దిగిపోయింది. ఇక అప్పటి నుండి తమ్ముని గురించి చెపుతూ, వాడిని ముట్టుకోమని, అడించమని చెప్పటం వలన త్వరలో అలవాటు పడింది. ఇద్దరూ కలిసి పెరిగారు. తమ్ముడిని అన్నివేళలా …ప్రొటెక్ట్.. చేయటం  అలవాటు చేసుకుంది ఇప్పటికీ తానే కస్టోడియన్ తన బేబీ బ్రదర్ కి.

మా అత్తగారు రాజు అని బాబును పిలవటం మొదలెట్టారు. మామగారు రాజయ్యగారి పేరు మీదుగా అందరం రాజు అన్నాం, వేరే పేరు పెట్టలేదు. బలహీనంగా ఉండేవాడు. సరిగా పాలుతాగేవాడు కాదు. సీసాపాలంటే వెగటు అనిపించేది. రెండు స్పూన్లకు మించి తాగేవాడు కాదు ప్రతిసారీ. పెరుగుతుంటే భోజనం తినిపించటం గూడా బ్రహ్మప్రయత్నంగా ఉండేది. ఒక ముద్ద మింగాలంటేనే నేను ఎంతో మాట్లాడి, బతిమాలి, బామాలి, అది చూపించి, ఇది చూపించి చాలా శ్రమ తీసుకునేదాన్ని. ఎప్పుడూ ఏదో అనారోగ్యం సూచనలుండేవి. చెవిలో చీము రావటం, కాళ్ళకి కర్పాణి రావటం, వైద్యం అవసరమయ్యేది.  పక్కనే డా. ఉమక్లినిక్ ఉండేది. ఆమె వైద్యం చేసేవారు. చక్కని వ్యక్తి. శ్రద్ధ చూపేవారు. తరువాత ఆమె అమెరికా వెళ్ళి సెటిల్ అయినట్లు తెలిసింది. మరల కలవలేకపోయాను.

రాజు ముద్దుగా ఉండేవాడు. పసితనం ఫోటోలు చూస్తుంటే ఆనందం వేస్తుంది. ఇంటివాళ్ళ చిన్నమ్మాయి బీనా ఎప్పుడూ ఎత్తుకుని తిరిగేది. మిగతా వారెవరి దగ్గరకూ వెళ్ళేవాడు కాదు. అమ్మను అతుక్కుని ఉండేవాడు. నల్లటివారెవరైనా ఎత్తుకోబోతే బేర్మని ఏడ్చేవాడు. పనిమనిషి దగ్గరకు అసలు వెళ్ళేవాడు కాదు.

చీరాల నుండి ఇన్నయ్య స్నేహితుడు వెలిది వెంకటేశ్వర్లు అప్పుడు హైదరాబాదులో ఉంటూ ఏదో చదువు పూర్తి చేస్తున్నాడు. రోజూ నేను స్కూలుకు వెళ్ళే వేళకు వచ్చి రాజును చూసుకునేవాడు. నేను సాయంత్రం వచ్చిన తరువాత, నా బిడ్డను నా కప్పచెప్పి రూముకెళ్ళపోయేవాడు.  అతని రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. అందరం వెలిది అనే పిలిచేవాళ్ళం. పిల్లలిద్దరు అయ్ మామ అనేవారు. ఇప్పటికీ అలానే పిలుస్తారు. అతను టీచరుగా రిటైరయ్యాడు. మనవళ్ళు పుట్టారు. అయినా నా పిల్లలకి ఇప్పటికీ అయ్ మామే అతను. చిన్నప్పుడు రాజును నీకు ఎవరంటే ఇష్టం అని అడిగితే ముందు నా వంక చూచి, వెలిది ఉంటే అక్కడ అతని వైపు చూచేవాడు.

రాజుకు నడక కంటే మాటలు ముందు వచ్చాయి. మొదట వాక్యాలతోనే ప్రారంభించి తరువాత పదాలలోకి దిగాడు. రాజు మాట్లాడిన మొదటి వాక్యం నాన్నా ఎక్కడికి వెళుతున్నావు? ఇన్నయ్య ఉస్మానియాలో పార్టు టైము జాబ్ చేస్తున్నాడప్పుడు. పొద్దున్నే వెళుతుంటే రాజు అలా అడిగాడు. అప్పటి దాకా రాజు కుమాటలొచ్చని మాకు తెలియదు. అదిరిపోయాం. నమ్మశక్యంకానంతగా. అప్పటికి 10 నెలల వాడు. నడక తరవాత  వచ్చింది.

రాజు మొదటి సంవత్సరం పుట్టిన రోజుకి కొద్దిమంది స్నేహితులను డిన్నర్ కి పిలిచాం. పసివాడికి ఆరోజున విపరీతమైన జ్వరం వచ్చింది. చంకనెత్తుకునే వంట ముగించాను. డిన్నర్ ముగిసింది. మూసిన కన్ను తెరవకుండా బిడ్డ ఉన్నాడు. మరురోజుకి మీజిల్స్ బయట పడ్డాయి. రెండవ సంవత్సరంలో ఆరోగ్యం మెరుగయినట్లనిపించింది. అంత ఎక్కువ డాక్టరు విజిట్లు లేవు.

ఇన్నయ్య కూతురంటేనే ఎక్కువ శ్రద్ధ చూపేవారు. రాజును మమ్మీకా బచ్చా అనేవాడు. ఇప్పటికీ అలానే అంటాడు. రెండు సంవత్సరాలు నిండగానే రాజును శిశువిహార్ లో నర్సరీలో చేర్పించాము. ఏడ్చేవాడు కాదు గానీ మొదట్లో కళ్ళనిండా నీళ్ళు తిరిగేవి. ఆయా ఇద్దరినీ రిక్షాలో స్కూలుకు తీసుకెళ్ళి, తీసుకువచ్చేది. శ్రద్ధగా పిల్లలను చూసుకున్నది. కొద్దికాలమే ఆ స్కూలుకెళ్ళారు పిల్లలిద్దరూ. ఇల్లు మారాము, స్కూలు మారింది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.