రచయిత్రుల కథానికా సాహిత్యంపై వెనకబాటుతనం ప్రభావం

-శీలా సుభద్రా దేవి

భౌగోళిక, రాజకీయ కారణాల వలన రాష్ట్రమంతటా ఇటీవలకాక యింతకు పూర్వం చాలాకాలంనుండీకూడా అభివృద్ధి ఒకే రకంగా లేదు. తెలుగు మాట్లాడే ప్రాంతం కొంత ఆంగ్లేయుల పాలనలోనూ, మరికొంత నవాబుల పాలనలోనూ వున్న కాలంనుండీకూడా అభివృద్ధి ఎగుడుదిగుడులుగానే వుంటూ వస్తోంది. భౌగోళికంగాకూడా రాష్ట్రం మొత్తం సమతలంగా లేదు. సుమారు సగభాగం దక్కను పీఠభూమిగా వుండి రాళ్ళూ రప్పలతో పూర్తి మెరకప్రాంతంగా వుంది. సముద్ర తీర ప్రాంతం పల్లంలో వుండటం వలన నదీగమనం ఎగువనుండి పల్లానికి ప్రవహిస్తూ సారవంతమైన మట్టి దిగువ ప్రాంతాలకు కొట్టుకురావటం కారణంగా మిగతా సగం ప్రాంతం పంటలకు అనువుగా వుంది. దీనికితోడు ఆంగ్లేయ పాలకులు తీసుకున్న ప్రత్యేక చర్యలవల్ల, కృష్ణాగోదావరీ జీవనదులూ, వాటి ఉపనదులకు, పంటనీటి కాలవలు ప్రధానంగా ఆంగ్లేయుల పాలన క్రింద వున్న ప్రాంతంలోనే నిర్మాణం కావటంతో అక్కడ సమృద్ధి అయిన పంట పండి, ఆదాయ వనరులు పెరిగి జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందిన చోటే వైద్య, విద్య తదితర సౌకర్యాలు విస్తరించటం సహజం. ఆ విధంగా రాష్ట్రంలోని బ్రిటీష్‌ పాలనా ప్రాంతంలోని ఆనకట్టలు, కాలవల నిర్మాణం పరోక్షంగా ఆ ప్రాంత జనజీవితం మీద ప్రభావం చూపించింది. రాష్ట్రంలోని నవాబుపాలనలోని ప్రాంతంలోనూ, ఆంగ్లేయపాలనలోని వర్షాధార ప్రాంతాల్లోనూ వున్న ప్రజల జీవితాలకూ మధ్య కేవలం ఆర్థిక రంగంలోనేకాక యితర జీవన రంగాలలోనూ ఎంతో వ్యత్యాసం ఏర్పడటానికి ఇదే కారణమైంది.

 

ఆర్థికంగా వ్యక్తులు పరిపుష్టిగా వున్నప్పుడు జీవితానికి మెరుగులు దిద్దుకొనే వీలుంటుంది. చదువులు విస్తరిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా వుంటుంది. పనుల ఒత్తిడి కొంత తగ్గి విశ్రాంతి సమయం పెరుగుతుంది. తమ తీరిక సమయాన్ని కొంత సాహిత్య, సంగీత తదితర కళారంగాల వైపు మళ్ళించటానికి వీలు ఏర్పడుతుంది.

 

ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని చూసినపుడు తొలి రోజుల్లో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే కళాకారులు, సాహిత్యకారులు ఎక్కువగా ఉండటానికి గల కారణం అర్థమౌతుంది. వీరిలోకూడా పురుషుల సంఖ్యే అధికంగా వుంది. స్త్రీలు బహుతక్కువ సంఖ్యలోనే వున్నారు. ప్రధాన కారణం సామాజికమే. స్త్రీల కార్యకలాపాలు ఆ రోజుల్లో ప్రధానంగా ఇంటికే పరిమితమైపోయి వుండటంవల్లా, విద్యాబుద్ధులన్నీ నాలుగ్గోడల మధ్యనే సమకూర్చబడడంవల్లా – అది కూడా రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలకూ, నోములూ వ్రతకథలూ, నీతి శతకాలు, కుమారీ శతకాలు, ఊర్మిళ నిద్ర, లాలి పాటలు వంటివి స్త్రీలకు సంబంధించిన సాహిత్య పఠనానికి మాత్రమే పరిమితమైపోయి, ఆధునిక విజ్ఞాన వాహికకు ఆమడదూరంలోనే వుండిపోవడం జరిగింది.

 

స్వాతంత్య్రానంతరం పాఠశాలలూ, కళాశాలలూ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చి, ఆధునిక విజ్ఞాన సముపార్జనకు స్త్రీలు దూరప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం తగ్గిన కారణంగా చదువుకునే స్త్రీల సంఖ్య విస్తరించి, పత్రికలూ గ్రంథాలయాలూ ఎక్కువై చదువుకొన్న స్త్రీల జ్ఞానావసరాలు తీర్చుతూ వుండడంతో వారిలోంచి రచనారంగంవైపు దృష్టిమళ్ళించేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. అరవై దశకంనాటికి వేళ్ళమీద లెక్కపెట్టగలిగే సాహితీవేత్తలు స్త్రీలలో కన్పించే స్థితినుండి బహుళసంఖ్యలోకి యీనాడు రావటం గర్వించదగిన విషయమే. అయితే ఈ అభివృద్ధి ఎక్కువగా అగ్రవర్ణ స్త్రీలలోనే కన్పిస్తోంది. చదువుకునే అవకాశాలున్నా జీవన పోషణకు కష్టించి పనిచేయాల్సిన అవసరం లేని కులవృత్తేతర సంపన్న వర్గాలలోంచి మాత్రమే కవయిత్రులూ, రచయిత్రులూ ఎక్కువమంది పుట్టుకొచ్చారు. దళిత బహుజన తదితర మైనార్టీ స్త్రీలనుండి వచ్చినవారు ఎక్కడో అక్కడక్కడ ఒకటీ అరా చొప్పున మాత్రమే కనిపిస్తారు.

 

ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని గత శతాబ్ది నుండి వందేళ్ళ తెలుగు కథాప్రస్థానంలో తెలుగునాడులోని ఆయా ప్రాంతాలలో జరిగిన ఉద్యమ నేపథ్యాలూ, వాటి నుండి కథానికా సాహిత్యంలో మహిళా రచయిత్రుల స్పందనా, మహిళా సమస్యల్ని రచనలలో ప్రతిబింబించిన విధానం గురించీ ఒక విహంగావ లోకనం చేయడం యీ ప్రసంగ వ్యాసం ముఖ్యోద్దేశం.

 

ఆధునిక తెలుగు కథ వెలుగులోనికి వచ్చేటప్పటికి జాతీయోద్యమ ప్రభావం దేశమంతటా ఉంది. స్వాతంత్య్రోద్యమ కాంక్ష ప్రజల్ని నిలువెల్లా కదిలిస్తున్న రోజులు. ఆనాటి సామాజిక పరిస్థితులలో అన్ని వర్గాల స్త్రీలు పూర్తిగా ఇంటికే అంకితమై అనేక సాంప్రదాయాలనూ, కట్టుబాట్లనూ ఇష్టపూర్తిగా అనుసరిస్తున్న రోజులు. దానికి ముఖ్యకారణం అవిద్య, అగ్రవర్ణ స్త్రీలు సైతం నోములూ వ్రతకల్పాలూ, నీతిశతకాల వరకే తప్ప మరో విషయార్జనకి సమయం చాలని పరిస్థితులలోకూడ అతి తక్కువమందే అయినా కొందరు తమ ఆలోచనలకు కథానికారూపం కల్పించారు. వారిలో భండారు అచ్చమాంబ ఒకరు. ఈమె రచించిన సంభాషణారూపంలోని ‘స్త్రీవిద్య’ కథానిక ‘హిందూ సుందరి’ సంచికలో 1902లోనే ప్రచురితమైంది. ఈమె యితర కథలు ‘ధనత్రయోదశి’, ‘ప్రేమ పరీక్ష’, ‘ఎరువు సొమ్ము, బరువుకి చేటు’, ‘బీదకుటుంబము’ చెప్పుకోదగ్గవి. తొలిదశలో స్త్రీపరమైన సంస్కరణోద్యమ ప్రభావంతో రాసినవే అయినా స్త్రీ వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటించే కథలే ఆమె రాశారు.

 

ఇంకా, పొణకా కనకమ్మ (‘వీరమాత’-అనసూయ-మార్చి 1918), పులవర్తి కమలాదేవి (రాగిణీకుమారి-భారతి-జ.1927), కైక-(భారతి. జ. 1928), లీలావతి (‘పెద్దపండుగ’-భారతి-జు.1929) లీలాసరోజిని (‘మాదిగవాడు’-జయంతి-1930) ద్రోణంరాజు సీతాదేవి (‘లలిత’-భారతి-సె. 1930), బొడ్డపాటి సీతాదేవి (‘చింతలపూడి సంభావన’-భారతి-ఏ 1928) కనపర్తి వరలక్ష్మమ్మ ఆనాటి చెప్పుకోదగిన రచయిత్రులు.

 

జాతీయోద్యమ ప్రభావం వలన కుటుంబపరమైన బాధ్యతేకాక సమాజంలో తమకొక లక్ష్యం ఉందనీ, దానిని సాధించాలంటే విద్య అవసరమనీ గుర్తించి అప్పటి రచయితలతోపాటూ రచయిత్రులుకూడా స్త్రీ విద్యకు ప్రాధాన్యత యిస్తూ రచనలు సాగించారు. కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల్తోపాటు శారదాచట్టం, వితంతు పునర్వివాహాలు వంటి సంస్కరణ భావాలకికూడా తమ రచనలలో చోటిచ్చారు. కుటుంబ సేవకంటే దేశసేవ గొప్పదనే భావనల్ని కొన్ని కథలలో సునిశితంగా చెప్పినవారూ ఉన్నారు.

 

సంస్కరణ చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలకి ఒరిగేదేమీ ఉండదనే భావాన్ని ఆ రోజుల్లోనే కనపర్తి వరలక్ష్మమ్మ తమ రచనల్లో వ్యక్తపరిచారు. బాల్యవివాహాలు, ఇంగ్లీషు విద్య, కుటుంబ సంబంధిత సంస్కరణల వలన స్త్రీలకు ఒనగూరే లాభనష్టాలను బేరీజువేసుకొంటూ, సంప్రదాయాలూ ఆధునికత మధ్య సమతుల్యత సాధించేదెలా అనే సందిగ్ధంలోనూ కొందరు రచనలు సాగించారు.

 

అయితే సాహిత్య రంగంలోకి వచ్చినవారు అతి తక్కువమందికాగా             వాళ్ళుకూడా, కారణం ఏదైనా, పదికి మించని కథలు మాత్రమే రాసినట్లుగా తెలుస్తోంది. వీరిలో కనపర్తి వరలక్ష్మమ్మ మాత్రమే ఎక్కువగా రచించినట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా వీరందరూ ఆనాటి సంస్కరణోద్యమ ప్రభావంవల్ల స్త్రీవిద్య, బాల్యవివాహాలు, వరకట్నం, బహుభార్యత్వం, వితంతు వివాహాలు వంటి ప్రాధాన్యత కల్గిన అంశాల్ని తమ కథల్లో ప్రతిబింబించారు.

 

అప్పట్లోనే ప్రత్యేకంగా చెప్పుకోదగిన వ్యక్తి మొట్టమొదటిసారిగా దళిత స్త్రీ రాసిన దళిత కథ (అయ్యోపాపం-1935-గృహలక్ష్మి) గొట్టుముక్కల మంగాయమ్మ అని చెప్పుకోవాలి. ఆమె తర్వాత యాభైయ్యవ దశకం వరకూ ఏ దళిత రచయిత్రీ దళిత సమస్యపై రాసినట్లు కన్పించటం లేదు.

 

స్వాతంత్య్రానంతరం సాహిత్యంలో మధ్య తరగతి జీవితాన్నీ, కుటుంబం లోని స్త్రీ పురుషుల మానసిక స్థితిగతుల్నీ రచయితలు అనేక కోణాల్లో అక్షరబద్ధం చేసారు. స్త్రీకికూడా మనసుంటుందని, ఆలోచన్లుంటాయని స్త్రీ విముక్తోద్యమ దిశలో చలం రచనలు సాగించారు.  సామాజిక విలువలూ, ఆర్థిక విలువల పట్లా నిరసన వెలిబుచ్చుతూ సాంప్రదాయరీతుల్నీ, పురుషాధిక్య సమాజంలోని రెండు నాల్కల ధోరణినీ, కులవివక్షలతో సమాజాన్ని ముక్కలు చేస్తున్న విధానాల్నీ, మూఢనమ్మకాల్నీ నిరాడంబర శైలిలో మనస్సుకి హత్తుకునేలాగే కాదు, గుండెలకి సూటిగా గుచ్చుకొనేలా కొడవటిగంటి కుటుంబరావు రచనలు సాగించారు. వీరి రచనలు అక్షరాస్యత కలిగిన చదువుకొన్న స్త్రీలని ఒక కుదుపు కుదిపి ఆలోచనలు విస్తరించుకొనేలా చేసాయి.

 

అప్పట్లోనే అనుభూతివాదానికి ప్రాధాన్యత కల రచనలు రచయిత్రుల కలాల నుండి జాలువారాయి. అచంట శారదాదేవి, శివరాజు సుబ్బలక్ష్మి, కొమ్మూరి పద్మావతి, వేదుల మీనాక్షీదేవి, ఇల్లిందల సరస్వతిదేవి, నందగిరి ఇందిరాదేవి, ఎల్లాప్రగడ సీతాకుమారి వంటి రచయిత్రులు మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబ పరిధిలోని సమస్యల్నీ, స్త్రీ పురుష సంబంధాల్నీ తమదైన శైలిలో కొంతవరకూ రాజీధోరణి కనపరుస్తూ రాసారు. మరోవైపు క్రమక్రమంగా అధికారం భారతీయ సంపన్న అగ్రవర్ణాల వారి చేతిలోకి మారిపోవడంతో అంతవరకూ వల్లించిన మానవ హక్కులు మాయమయ్యాయి. ఆర్థిక రాజకీయ పరంగా సమాజంలో ఆధిపత్యం, అణచివేతా, దోపిడి వంటివి కొన్ని కులాల అసంతృప్తికి దారితీశాయి. మొదట్లో వృత్తులు క్రమక్రమంగా కులాలుగా స్థిరపడి వృత్తిపరంగా సామాజిక విభజన ఏర్పడింది. సంపన్నవర్గం, పేదవర్గం రూపొంది వైరుధ్యాలూ, సంఘర్షణలూ ఏర్పడ్డాయి. అస్పృశ్యతా, అవమానాల నుండి బయటపడే క్రమంలో మతాంతరీకరణలు తాత్కాలిక ఉపశమనాలు కలిగించినా శాశ్వత పరిష్కారాలు కాలేకపోయాయి. జీవితాల మధ్యా, జీవన విధానాల మధ్యా అనేకానేక వైరుధ్యాలు పొడచూపాయి. బహుజనులూ, దళితులూ కులపరమైన చిన్నచూపునీ ఆర్థిక రాజకీయ నియంతృత్వాన్నీ ప్రతిఘటించారు. కానీ సాహిత్యంలో ఎక్కువగా వాటి ప్రభావం అప్పట్లో ప్రతిఫలించలేదు.

 

అరవయ్యో దశకంలో పత్రికలు పెరిగి నవలలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న కాలం రచయిత్రుల స్వర్ణయుగంగా చెప్పబడింది. దానితో పాటుగా మహిళా పాఠకుల సంఖ్య పెరిగింది. అంతవరకూ వేళ్ళమీద లెక్కపెట్టేలా ఉండే రచయిత్రుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. నవలలతోపాటు కథల్నీ విరివిగా రాశారు. అవి ప్రచురితం కావటం జరిగింది. అనేకమంది కేవలం యువతీయువకుల మధ్య ఆకర్షణలూ, ప్రేమలూ, అపార్థాలూ, వైవాహిక సమస్యలకే పరిమితమైనా స్త్రీ మానసిక స్థితినీ, ఆలోచనా విధానంలోని మార్పునీ, మారుతున్న స్త్రీ చైతన్యాన్నీ కూడా కొందరు ఆకర్షణీయమైన శైలిలో అక్షరబద్ధం చేశారు.

 

కళ్యాణ సుందరీ జగన్నాథ్‌, వాసిరెడ్డి సీతాదేవి గ్రామీణ నేపథ్యం నుండి కథలు రాశారు. కళ్యాణ సుందరీ జగన్నాథ్‌ కథల్లో తెలుగుతనం ఉట్టిపడ్తూ పితృస్వామ్య భావజాలంలో నలిగి సంఘర్షిస్తూనే రాజీపడి బతికే జీవన విషాదం అంతర్లీనంగా సాగుతుంది. సీతాదేవి తన కథల్లో కింది తరగతి జీవితాన్నీ, కర్షక జీవితంలోని ఒడిదుడుకుల్నీ  చిత్రించారు. కె. రామలక్ష్మి తమ కథల్లో వ్యక్తిత్వాన్ని కలిగివున్న స్త్రీ పాత్రల్ని సృష్టించారు. చలం తర్వాత తెలుగు సాహిత్యంలో  స్త్రీవాదం ప్రాచుర్యంలోకి రాకముందే రంగనాయకమ్మ తన కథల్లో స్త్రీ సమస్యల్ని అనేక కోణాలలో స్పృశిస్తూ స్త్రీ అస్తిత్వ చైతన్యాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. కుటుంబ బాధ్యతలు తీరిన తర్వాతైనా స్త్రీలు తమ గురించి తాము ఆలోచించుకోవాలని, తమకు నచ్చిన విధంగా జీవితాన్ని దిద్దుకోవాలని ఆశించారు. స్త్రీలలో ఆర్థిక స్వావలంబన గురించి విద్యాధికులైన స్త్రీ ఇంటా బయటా పడే ఆత్మగౌరవ సంఘర్షణల గురించి పలువురు ప్రస్తావించారు. 

 

క్రమక్రమంగా అన్ని వర్గాల మహిళల్లోనూ అక్షరాస్యత కొంత పెరిగింది. మధ్య తరగతి మహిళలుకూడా అంతో ఇంతో చదువుకొని ఉద్యోగార్థులై బయటకు వస్తున్నారు. కుటుంబంలోనేకాక బయట ప్రపంచంలోకూడా పలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఆ రకంగా సాహిత్యంలోకూడా సమస్యల్ని ప్రతిబింబింప చేయటమేకాక వాటికి పరిష్కారంకూడా చూపే ప్రయత్నం మొదలైంది. అంతవరకూ కుటుంబపరమైన, వ్యక్తిపరమైన సమస్యల చుట్టూనే పరిభ్రమించే సాహిత్యం రాను రానూ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న ఆర్థిక, రాజకీయ మార్పుని కలుగచేస్తున్న విప్లవోద్యమ ప్రభావానికి లోనయింది. అయితే అన్ని ప్రాంతాలలోనూ మొట్టమొదట ప్రతిస్పందించినవారు కవులు మాత్రమే. రచయిత్రులు అనేకమంది కేవలం సామాజిక సమస్యల్ని పైపైన మాత్రమే స్పృశించి తమ ధోరణిలోనే రాసుకుపోయారు. అతి తక్కువ మంది మాత్రమే సమస్యలలోతుకి వెళ్ళారు. స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ విముక్తి, వైవాహిక సంబంధాలలోకి వెళ్ళినా అగ్రకుల సమస్యల వరకూ మాత్రమే చూడగలిగారు. దానికి కారణం అప్పటివరకూ సాహిత్యం – ముఖ్యంగా కాల్పనిక వచన సాహిత్యాన్ని  ఏలుతున్నది వారే. పైగా ఎక్కువమంది కోస్తా ప్రాంతానికి చెందిన రచయిత్రులు కావటం, మధ్యతరగతికి చెందినవారే అయినా ఆర్థికపరమైన, సామాజికపరమైన వెనుకబాటుతనం లేకపోవటంతో జీవితంలో ఆటుపోట్లు పెద్దగా లేక సాఫీగా సాగుతున్న జీవితాలు కావటంవల్ల వాళ్ళ కథలుకూడా అదేవిధంగా నల్లేరుమీద ప్రయాణం సాగించాయి. బ్రాహ్మణ కుటుంబాలలోనో కాకపోతే ఇతర అగ్రకుల కుటుంబాలలోనో ఉండే కట్టుబాట్లు, సాంప్రదాయక వ్యవహారాలనుండి విముక్తి పోరాటం వరకే తీసుకోగలిగారు. ఆచార వ్యవహారాల్లోనే గాక, కుటుంబ జీవితంలోగానీ, ఇతరేతర కట్టుబాట్లలో వారికీ, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుగల దళిత, బహుజన కులాలకూ, గిరిజన, మైనారిటీ కులాలకూ అంతరం చాలా ఎక్కువ. ఒక్కొక్క వర్గానిదీ ఒక్కొక్క జీవనశైలి. అందుచేత అప్పటివరకూ సాహిత్యం ఒక వర్గపు జీవితాన్ని మాత్రమే చాలావరకూ ప్రతిబింబించింది.

 

1970 తర్వాతే వృత్తిపరకులాలకు, దళిత మైనార్టీలకు చెందిన రచయిత్రుల కథల్లోకి తిరుగుబాటు ప్రవేశించింది. ఆయా కులాల రచయిత్రులు రాసినపుడు మాత్రమే వారి జీవితం, స్వభావం, నేపథ్యం సజీవంగా ఉంటాయి. అంతకుముదు బహుజన దళిత నేపథ్యం నుండి దళితాభ్యుదయం వాంఛించే కథలు, దళిత జీవితాన్ని దళితేతర నేపథ్యం నుండి అగ్రవర్ణాలవారు చిత్రించిన కథలుమాత్రమే వచ్చాయి.

 

సామాజిక పరిధినీ, పరిస్థితుల స్వభావాన్నీ అర్థం చేసుకొని 1975తర్వాత సాగిన ఉద్యమాలలో స్త్రీ భాగమైంది. నిరాశా, నిస్పృహ, లైంగిక అణచివేతా, పెత్తందారీతనం నుండి, ఇటు సవర్ణుల దౌర్జన్యాలూ అటు దళిత పురుషాధిక్యాల నుండి అణచివేతకు గురైన స్త్రీ, గతంలో తన బాధలకు కర్మసిద్ధాంతాన్ని ముడిపెట్టి ఒదిగిపోయిన స్త్రీ నేడు వీటన్నిటినీ నిరసిస్తూ ఆత్మగౌరవంతోపాటూ, స్వావలంబనతో జీవితం సాగించటానికి పోరాటం ఆరంభించింది. స్వేచ్ఛ, సమానత్వం, స్వయంశక్తి వంటి మౌలిక హక్కుల కోసం పోరాటం సాగిస్తోంది. సామాజిక జీవన పరిణామంలో కొట్టుమిట్టాడే అనేకానేక సమస్యలన్నీ నేడు కథాంశాలైనాయి. ఈ దశలో అస్తిత్వ పోరాటాలు సాహిత్యంలో ఊపు అందుకొన్నాయి.

 

జండర్‌ పరంగా స్త్రీ వెనకబాటుని అంతవరకూ సాహిత్యంలోకి తెచ్చినా తర్వాత్తర్వాత స్త్రీసమస్యలు అన్ని వర్గాలవారికీ, అన్ని వర్ణాలవారికీ, అన్ని ప్రాంతాల వారికీ సమానం కావనే నిజం బయటపడింది. విద్య, వైద్యం, కనీసావసరాలూ అందుబాటులోలేని నిమ్నకుల స్త్రీల సమస్యలలోని వైరుధ్యాలు వివిధ కథల రూపంలో మొదట రచయితల కలాలనుండే వచ్చినా రానురాను రచయిత్రులు ఒక్కరొక్కరే తమ గొంతు విప్పి తమ ఆలోచనల్ని కథారూపంలోకి తెచ్చారు.

 

రచయిత్రులు కూడా స్త్రీ దృక్పథంలో రావాల్సిన మార్పునేకాక అంతకు ముందు అక్షరబద్ధం కాని అనేక విషయాలను నిస్సంకోచంగా కథారూపంలోకి తీసుకువస్తున్నారు. బహుకొద్ది సంఖ్యలో రచనారంగంలోకి వచ్చిన బహుజన దళిత మైనారిటీ రచయిత్రులుకూడా అన్ని ప్రాంతాల నుండీ తమ తమ సమస్యల్ని కథలుగా మలిచి పాఠకుల దృష్టికి తీసుకువస్తున్నారు.

 

ఈ దృష్టికోణంతో సాహిత్యం ఇంకా రావల్సి ఉంది.

 

జన జీవితంలో వస్తోన్న అనేకనేక మార్పుల్ని రచయితలతోపాటే రచయిత్రులందరూ తమ కథలలో ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఆధునిక ప్రచార మార్గాల వల్ల గ్రామీణ ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా చేతివృత్తులు బాగా దెబ్బతినటంవల్లనూ, ప్రధాన వృత్తిగా వున్న వ్యవసాయం లాభసాటిగా లేకపోవటం వల్లనూ పల్లె ప్రజలు, శ్రామిక జనం జీవనోపాధిని వెతుక్కొంటూ పట్టణాలకీ వలసపోవటం, చదువుకున్నవారు ఉద్యోగవేటలో పల్లెల్ని విడిచివెళ్ళటం, డాలర్లవేటకై ఉన్నవూరినీ కన్నవారినీ వదిలి విదేశాలకు తరలిపోవటం, ప్రపంచీకరణ నేపథ్యంలో దేశమంతా ఒక గ్రామంలో మారిపోవటం, ఒంటరి జీవితాన్ని గడుపుతోన్న వృద్ధుల జీవితాల్నీ, మారుతోన్న జీవితంతో రాజీపడలేకపోతున్న జీవితాల్నీ, జీవితమంతా అస్తిత్వ పోరాటం చేస్తున్న మహిళల్నీ, కొత్తరూపం దాలుస్తోన్న వైవాహిక సంబంధాల్నీ, గ్రామీణ రాజకీయాల్నీ, నీటిపోరాటాల్నీ, ప్రాజెక్టుల నిర్మాణంతో చిన్నాభిన్నం అయిన కుటుంబాల్నీ, గిరిజన పోరాట సమస్యల్నీ, చివరికి బీటీవంకాయల గురించి ఒకటేమిటి ప్రతీ ఒక్క విషయమూ రచయిత్రుల కలాలనుండి కథారూపం దాల్చుతోంది.

 

ఇంత విస్తారంగా కథానిర్మాణ జరుగుతున్నా కొన్ని ప్రాంతాలనుండి, కొన్ని వర్గాలనుండి మాత్రమే రచయిత్రులు అధికసంఖ్యలో కలాల్ని ఝుళిపిస్తున్నట్టు కన్పిస్తోంది. కానీ ప్రాంతాలవారీగా ఆ ప్రాంత అగ్రవర్ణేతర రచయిత్రులని గుర్తించాలంటే ఒకరిద్దరుకన్నా లేని పరిస్థితే కన్పిస్తోంది.

 

దళిత నేపథ్యం నుండికానీ, ముస్లిం మైనారిటీల నుండిగానీ వచ్చిన రచయిత్రులు అతి తక్కువమందే ఉన్నా తమ కథలలో తమ జీవితాలలో ఉండే అనేకానేక సమస్యల్నీ, అసమానతల్నీ అణచివేతల్ని శక్తివంతంగా అక్షరబద్ధం చేస్తూ ఇప్పుడు రచనారంగంలో తమ గొంతుని బలంగా విన్పిస్తున్నారు.

 

దళిత సాహిత్యం వచ్చినంతగా బహుజన, గిరిజన కులాల గూర్చి కథలు ఎక్కువగా రాలేదు. దీనికి కారణం బహుజనాభ్యుదయం అజెండాలో లేకపోవటం కావచ్చు.

 

ఈ దిశగా బహుజన రచయిత్రులు తమ మూలాల్ని వెతికి పట్టుకొని చిత్రించాల్సి ఉంది. అత్యధిక సంఖ్యలో కులాలు ఉన్నా బహుజన రచయితల సంఖ్య అతి తక్కువ. అందులోనూ ఆ యా కులాలలోని మూలసమస్యల్ని వెతికి వెలికి తెచ్చినవారు ఇంకా తక్కువ. ఇంకా బహుజన రచయితలుగానీ రచయిత్రులు గానీ దళిత సానుభూతి అనే నేపథ్యంతోనే కథలు రాయటం గమనిస్తున్నాంకానీ తమ తమ అస్తిత్వాలను తెలిపే కథల్ని రాయటంలేదు.

 

ఇంతవరకూ అడవిలో, కొండ ప్రాంతాలలో నివసించే గిరిజనులగూర్చి ఇతరులు రాసిన కథలు అవికూడా అతి తక్కువేఅయినా అవిమాత్రమే గిరిజన జీవితాన్ని అర్థంచేసుకునే పరిస్థితి ఉండేది. అయితే ఇటీవల గిరిజన జీవితాల్ని అత్యద్భుతంగా మనముందుకు తెచ్చిన గిరిజన రచయితలు మల్లిపురం జగదీష్‌ మాత్రమే కాక ఆదివాసీ సాహిత్యాన్ని జీవితాన్నీ లిఖితరూపంలో అందిస్తున్న ఆదివాసీ రచయిత్రి పద్దం అనసూయ తమ అస్తిత్వాన్ని తెలుగు సాహిత్యంలో చాటి చెప్పటం ఒక విశేషం.

 

ప్రాంతీయ వెనుకబాటుతనం, ఆర్థికంగా వెనుకబాటుతనం మాత్రమేకాక సామాజికమైన వెనకబాటుతనం ఈ మూడూ అల్లుకొనిఉన్న కారణంగా ఒకే కాలంలో వచ్చిన సాహిత్యంలోకూడా ఎగుడుదిగుళ్ళు ఉన్నట్లు మనం గమనించగలం. రాష్ట్రంలోని భౌగోళికమైన వైరుధ్యాలవల్ల, ఆర్థిక సామాజికమైన అసమానతల వల్లా, రాజకీయ నాయకుల స్వార్థపూరిత వ్యవహారాల వల్లా విద్య వైద్యం ప్రజలందరికీ ఒకేవిధంగా అందటం లేదు. వీటన్నిటికీతోడు జండర్‌ పరమైన, కుటుంబపరమైన ఒత్తిళ్ళు స్త్రీలకు భావస్వేచ్ఛని కల్పించటంలేదు. తమ ఆలోచనల్ని రచనలద్వారా వ్యక్తపరిచే వెసులుబాటు, అవకాశం కొన్ని వర్గాల మహిళలకు నేటికీ పూజ్యంగానే ఉంది. ఆలోచనలు విచ్చుకోవాల్సిన కొద్దిపాటి సమయాన్ని దృశ్యమాద్యమం చాలావరకూ ఆక్రమించుకొంటోంది. మరోవైపు మాతృభాషమీద సడలిపోతున్న పట్టు మరికొంత పఠనాసక్తినీ, రచనాభిలాషనీ దూరం చేస్తోంది. ఈ అవరోధాలన్నిటినీ అధిగమించినప్పుడు మాత్రమే అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల, అన్ని వర్ణాల మహిళల నుండి సుసంపన్న మైన సాహిత్యాన్ని పొందటానికి ఆస్కారముంది. అప్పుడు ప్రయోజనాత్మకమైన మంచికథలు ఇంకా ఇంకా మరిన్ని వెలువడగలవు.

(కాకతీయ యూనివర్సిటీ సదస్సులో ప్రసంగ వ్యాసం, 2014)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.