గారడి

-కృష్ణ గుగులోత్

 
ప్రకృతి కట్టుకున్న ఆకుపచ్చని కోటల్లాంటి
కొండల నడుమ కొలువై నాలుగు గిరిజన గూడేలకు-తండాలకు మా నాచారం
బడే నాడు గిరి గుమ్మపు విద్యాదీపమై 
ఓ వెలుగు వెలిగింది, అమ్మ మంగ్లి నాయన లక్పతీల పట్టుదలకు ప్రతిరూపమై ప్రతి తరగతిలో ప్రథముడిగా నిలిచి, విద్యా వన్నెల్ని అనుభూతులుగా మూటగట్టుకున్న నాకు, నాటి ఆ బాల్యం ఇప్పటికీ నా .. గుండెసడి అంటే అతిశయోక్తియేమి కాదు, ఎందుకో మనస్సుకు మబ్బుపట్టినప్పుడల్లా 
ఆ మకిలంటని తండా – గూడెపు దోస్తానాల తలపుల్ని అప్రయత్నంగానే అలా తడుముకుంటాను,అంతే బాల్యం విరగ్గాసిన రేగిపండు చెట్టై జలా-జలా రాలి,ఇదిగో ఇలా కనులందు నిలుస్తుంది.
 
                     ( 1 )
 
నా ఐదో తరగతి దాంక మా బడికి
బిల్డింగే లేదు, శివపార్వతుల్లాంటి జయరాంసూరి-తాయారమ్మగార్లు మాకు చదువుజెప్పిన ఉపాధ్యాయ దంపతులు, ఆఫీసుపరమైన విషయాలు – జీతాలు 
ఇతర పనులకై జయరాంసూరి 
గారెపుడు ఎక్కువగా బయటే తిరిగేవారు,
కానీ మాకు చదువుల తల్లీ అంటే తాయారమ్మ మేడమ్ గారే .. మాకు 
విద్యతోపాటు వినయాన్ని కూడా
ఉగ్గుపాలలా ఒంపిన అమ్మ , తాయారమ్మ
మేడమ్ గారు. మా పూరిపాక బడిగూటిలో
తాయారమ్మ మేడంగారు తల్లికోడైతే ..
మేం తరగతుల వంతులవారిగా పాఠాలకై  ఆమె చుట్టూ కోడిపిల్లల్లా మూగేటోళ్ళం.
 
 
రాత్రి గాలిదుమారపు వానకి సగం పైకప్పులేచిపోయిన మా పూరిపాక 
బడిని ఊడ్చేదాంక ఓపిక ఉగ్గవట్టి, 
నీడ ఉన్న చోటును పోటిబడిమరీ దక్కించుకొని వీరవిజేతలా మొఖాన చిరునవ్వు పులుముకొని నేను,నా పక్కనే రాత్రి కురిసిన వానకి పాకలో కొలువుదీరిన చిన్నపాటి కొలనులో గండుచీమల్నేసి ఈతకొట్టించే దోస్తు ఎంక్టియగాడు.వాడి వినోదాన్ని పరికించే దోస్తులు జగన్నాధం, రామారావు వెంకటేశం,కన్నయ్య,దస్రూ.. థావుర్యాలు “ఎందుకురా   వాటినలా.!” (“కసన్ర వుందూఁన్ హనూఁ కర్రోచి” ) అని నే అంటే “నీకెందుకాయ్ బోడి!”(హేయ్! తోన్ కసన్ర డోడ్కా!”)అని రుసరుసలాడే వాడి కోరచూపు, వీడితో నాకెందుకని వాడిమానాన వాణ్నొదిలి 
నా పుస్తకంలో నే లీనమయ్యేటోణ్ని.
 
పాకలో ఓ మూలకు పై క్లాసు అన్నలక్కలకు పద్యపారాయణంతో తలమునకలై విద్యతో
పాటు వ్యక్తిత్వాలకు నగిషీలద్దుతున్నారు మేడంగారు,పొద్దెక్కినా కొద్ది పాకలో నీడ మారుతూవుంది ఇప్పుడు నే ఉన్న చోటుకు విచ్చేసింది ఎండ, వెలుగు-నీడలు అందరికీ సమానమేయని గుర్తుజేస్తూ..!
 
ఈ మండుటెండలో నిన్న చెప్పిన ‘హిమాలయాలు’ పాఠం జవాబులప్పజెప్పాలని మేడంగారి హుకుం.! చీమల ఈతమాస్టర్ ఎంక్టియగాడు చీమల్ని వదిలి తనకలవాటైన రీతిలో ‘ఆల్ ఇన్ వన్ సుకుమార్ గైడ్’ తీసి, బట్టీయం మొదలెట్టేడు,”హిమమంటే మంచు, హిమమంటే మంచు” అంటూనే
ఒక్కసారిగా నా వళ్ళో “స్స్ ..ఆ ..అమ్మా.!” 
(“స్స్.. ఆఁ.. యే.. యా !”) అంటూ, తూలబోయిన వాణ్ని ,”రే ! ఏమైందిరా..!”
(” ఏ ..! కాఁయ్ వేగోరా!”) అని నేను సంబాళించేలోపే  ఆదరాబాదరగా లేచి తన లాగు దులుపుకుంటే..! తాటతీసిన గండు చీమలు రెండూడిపడ్డయ్.! సరిపోయింది సంబడమని నే మనసున గుంబనంగా నవ్వుకుంటే .. మిగిలిన దోస్తులంతా పొట్టచెక్కలయ్యేలా పడిపడి నవ్వేరు బుంగమూతెట్టుకొని,
బాధనణిచిపెట్టుకొంటూ..
“స్స్ .. ! హిమమంటే మంచు, స్స్ ..! హిమమంటే మంచు, ఎప్పుడు మంచు 
చేత”చదువుతున్న ఎంక్టియగాడికి లోపలి రోదనతో పాటు గండు చీమలు నేర్పిన గుణపాఠపు బోధన బాగా బోధపడినట్లైంది.
 
ఇక మధ్యాహ్నమైతే ఇండ్ల నుంచి తెచ్చుకున్న అన్నం బాక్సులిప్పి ఒకరన్నం కూరలు మరొకరికి పంచుకూటూ కబుర్లాడుతూ .. భోజనాలు చేసేటోళ్ళు దోస్తులు,మధ్యాహ్నభోజనాలైనంక బడి పక్కనే ఉన్న బీట్లోకెళ్ళి రేగిపండ్లతో జేబులు నింపుకొని, తిన్న రేగిపండ్ల విత్తుల్ని పెదాలపై ఉంచి గాలూదుతూ ఆటలాడేటోళ్ళు. ఇక
మధ్యాహ్నపాఠాలైనంక బడొదిలే ఓ గంట మునుపు మేడమ్ గారిని బ్రతిమలాడిమరీ 
ఓ కథ (భారతం – భాగవతాల నుంచి) చెప్పించుకొని, చివరి అరగంట ఒకట్నుంచి ఇరవై ఎక్కాలు ఓ రెండుమార్లు
వల్లెవేసినంక ( ఇంటికి పంపుతారనే ఆనందంలో చివరి ఇరవయ్యవ ఎక్కం మారుమోగిపోయేది ) “ఇక వెళ్ళండి!” అనే
మేడమ్ గారి మాట విన్నంతనే అప్పటిదాంక కూర్చున్న గోనె-సూపర్ పట్టాల దులుపుడుతో పాకంత దుమ్ము గోధూళిలా పరుచుకునేది! పుస్తకాల సంచుల్ని చంటిబిడ్డల్లా చంకనేలాడేసుకొని కేరింతలతో పరుగులంకించుకునేటోళ్ళం.
ఓ ముప్పై శాతం ఊరి కమ్మపిల్లలను
మినహాయిస్తే మిగిలిన డెబ్భైశాతం గిరిజన – బహుజన పిల్లల పాలిట ప్రతిదినం బడుగు గుడై మోగిన  మా బడి యొక్క నాటి దినచర్య ఇది.
 
                         (2)
 
ఓ రోజు ఉదయమే గారడివాడొచ్చాడని ఎంక్టియగాడు చెప్పిండు. అవును,ప్రతి ఏడాది ఆనవాయితి ప్రకారం దీపావళికి 
కొద్దిరోజుల ముందే విచ్చేసే ఆత్మీయ అతిధి తను. మా ఊరి చివర చింతలతోపులో చిన్నపాటి చిరుగుల గుడారంలో తను , భార్య-పిల్లలు, వాళ్ళతో పాటు ఓ కోతి జంట ఉన్నారు.
 
 కొద్దిసేపైతే మధ్యాహ్నభోజనానికి 
మమల్ని ఇళ్ళకు పంపుతారనగా 
మా బళ్ళోకొచ్చి  ప్రదర్శనకై  మేడం తాయారమ్మ గారి దగ్గర అనుమతి తీసుకున్నడు గారడివాడు. గారడి ప్రదర్శనకుగాను ఊళ్ళో పిల్లలు ఈ మధ్యాహ్నమే తలో అర్ధరూపాయి తెచ్చుకోవలసిందిగా బయటూళ్ళ 
పిల్లలు మాత్రం మరుసటి రోజు
తెచ్చుకోవాలని మేడంగారి ఆదేశం, 
నేనెంత వేగంగా ఇంటికి పరిగెత్తేనో నాకే తెలీదు, రొప్పుతున్న నన్ను చూసి అమ్మ మంగ్లి గాబరపడి ఏం జరిగిందని అడిగేలోపే “అమ్మా.! మరే.! మరే.. మా బళ్ళో ఇప్పుడూ.! అదే.,అదే ..!?” (“యాఁ ! ఇదే ఇదే .. హమార్ బడిమాఁ! అబ్ ఊజ్ యా..! ఊ ..!”) గారడిమాట గుర్తుకురాక ఆయాస పడుతుంటే “గారడి ఉందా” (“కోతి నచావ్చకా..!) అని అమ్మ అందుకొనే సరికి,” హా.! హా..!అదేనమ్మ.!”ఒక్క అర్థరూపాయి ఇవ్వమ్మా ..! (“హావ్ హావ యాడీ ..! ఊజ్ ..యాడీ!” ఏక్ ఆట్నా ద యాడీ ..!”) అని అమ్మ కొంగట్టుకొని తిరుగుతుంటే,” “ఇస్తాలేగాని ముందు అన్నం తిను” ( దూఁచూఁ పణన్ అగ్డ్యా దళ్యా ఖో ..!”) అంటూ అన్నమెట్టిందమ్మా. ఆబాగా అన్నం మెక్కేసి,అర్దరూపాయి పుచ్చుకొని పరుగులంకించుకుంటే ..” నాయనా పుస్తకాలొద్దా.!?”(“బా..! పుస్తకాల్ చాయ్నిక .. ?”) ఎనకనుంచి అమ్మ పిలుపు,”ఆఁహఁ! అవసరం లేదు.!” 
(ఆఁహఁ అవసరం ఛేయ్ !”) పరుగాపకుండానే నా జవాబు.
 
     నాకంటే ముందే గారడివాడి కుటుంబాన్ని,కోతులజంటని,చూస్తూ తెగఉత్సాహపడుతున్నారు మా స్కూలు దోస్తులు, మరి కొంతమంది పిల్లకాయలు కోతులకు రేగిపండ్లను విసురుతున్నారు. గారడివాడు తన ప్రదర్శనకు కావలసిన ఏర్పాట్లుచేసుకుంటున్నాడు.
మేడంగారొచ్చాక  మొదలైంది గారడి.! మేమంతా గోళాకారంలో కూర్చోని ఆసక్తిగా చూడసాగేము, ముందుగా కోతి జంటను రంగంలో దించాడు గారడివాడు,పొలం పనిలో పూర్తిగా నిమగ్నమై చాలా కోపంగా ఉన్న మగకోతికి, ఇల్లాలైన ఆడకోతి భోజనమట్టుకెళ్ళడం, భోజనం ఇంత ఆలస్యంగా తీసుకరావడమేంటని !? భార్యను,పక్కనున్న చింత బరికె పుచ్చుకొని,కొట్టడానికి ఉరుకుతుంది మగకోతి,బెదిరిన ఆడకోతి, అందకుండా గారడివాడి వెనక దాక్కోని,ఉసూరంటూ చూస్తుంది.! మరోమారు తన ముద్దుల పతికి,భయపడుతూనే భోజనమీయబోతుంది ఆడకోతి. ఇప్పుడు గిన్నె పుచ్చుకున్న మగకోతి, కూరగాయల భోజనమేంటని?! గిన్నెని గిరాటేసి.! మరోమారు చింత బరికెనందుకొని,!  చిందులేస్తు దూసుకొస్తున్న తీరును చూసి,బిత్తరపోయిన ఆడకోతి పరుగు పరుగున వెళ్ళి, మళ్ళీ గారడివాణ్ని  శరణువేడుతుంది.! చూస్తున్న మేమంతా మైమరచిపోయి,ఒకటే.. నవ్వులు. ఇలా వాటి హావభావాలకు తగ్గట్టుగా గారడివాడి రన్నింగ్ కామెంట్రి చాలా గమ్మత్తుగా సాగుతూ మమల్ని మంత్రముగ్దుల్ని చేసేది.!
 
            ఆ తరువాత కోతి జంటను పక్కన కట్టేసి,తను,తన కుటుంబీకులతో చేసే కొన్ని విన్యాసాల్లోంచి మొదటగా వెదురు గడపై తన పాపను పడుకోబెట్టి,ఆపై ఆ గడని పైకెత్తి నోట కరుచుకొని చేసిన విన్యాసం మమల్ని రోమాంచితం చేసింది.! తన భార్య పొడవైన ఇనుపచువ్వను గొంతుకెట్టుకొని వంచడం,గెడల మధ్య తీగపై,కళ్ళకు గంతలతో నడవటం.! ఎడ్లబండి చక్రాన్ని గారడివాడు,తన మెడకేసుకొని గిరా గిరా తిరగడం.!, వీటన్నిటిని చూస్తూ,మేము సంభ్రమాశ్చర్యాలకు లోనైయ్యేవాళ్ళం.
 
        మొత్తానికి ప్రదర్శన ఐపోయింది,ఊరి పిల్లల నుంచి వసూలైన 30 రూ,లకు ఇంకో 70 రూ,లను తన వంతుగా కలిపి,మొత్తం 100 రూ,లను,తాయారమ్మ మేడం గారు,మా చప్పట్ల మధ్య,గారడివాడి చేతిలో పెట్టారు.వినయంగా ఆ చిల్లరతో కూడిన డబ్బును కళ్ళకద్దుకొంటూ.. తీసుకుని మా అందరికి కృతజ్ఞతలు చెప్పుకొని తన కుటుంబాన్ని తీసుకొని గారడివాడు వెళ్ళిపోయేవాడు.
 
         మమల్ని మైమరపించిన ఆ గారడికై,
మరో ఏడాది వరకు కళ్ళొత్తులేసుకొని మరీ చూడ్డం మావంతయ్యేది. ఆనవాయితి, ప్రకారమే మళ్ళీ వచ్చీ,తనకే అలవాటైన తీరున మమల్ని ఓలలాడించి వెళ్ళిపోయేవాడు గారడివాడు.
 
   కానీ .. ఆ మరుసటి ఏడాదెందుకో రాలేదు.!!  మేమంతా తను వస్తాడనే 
ఆశలో ఎదురుచూస్తూ ఉసూరుమంటూ ఉండిపోయేము.! మరో ఏడాదొచ్చేసింది దీపావళి దగ్గర పడుతుంది అతని రాకై ఉత్సుకత ఎక్కువై ఈసారి ఉండబట్టలేక మేడం గారిని అడిగేము,”గతేడాది తను రాకపోవడానికి ఆరోగ్యం సహకరించక, ప్రస్తుతం భౌతికంగా తను లేక” అన్నారు! 
అర్థం కాక “ఏంటి మేడంగారు” అని 
మేం మళ్ళీ అడిగితే ” “గుండెపోటుతో చనిపోయాడట! సార్లు చెప్పుకోగ విన్నానని” విచారంగా చెప్పేరు మేడంగారు.! ఒక్కసారిగా హతాశులమైన మా మనస్సుల్లో ఆ ‘గారడి‘ ఓ కలగానే మిగిలిపోయింది.
 
   ఇప్పటికి మా ఊరెళ్ళాక, బోసిపోయిన మా స్కూలు మొండిగోడల్ని పడదోసి వెలసిన ‘రైతువేదిక’ ఆవరణలో 
ఓ మూలకు కోతిజంట కట్టేసి ఉన్నట్లు !, గారడివాడు తన గారడికై ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు.!! కుర్చీలో కూర్చున్న తాయారమ్మ మేడంగారి చుట్టూ మూగిన మేము,గారడి ఇంకెప్పుడా అని ఎదురుచూస్తున్నట్టూ.,! భ్రమిస్తుంటాను.!!
 
       నా కలల్ని-భ్రమల్ని ఇంకా మెలిపెడుతూ..! ఎక్కడో FM రేడియో లోంచి,ఘంటసాలగారి గానం ” బొమ్మను చేసి ప్రాణం పోసి,ఆడేవు నీకిది వేడుకా..! గుండెను కోసి.,పుండును చేసి, నవ్వేవు నీవింక చాటుగా..!” భారమైన నా హృదయాన్ని ద్రవింపజేయడానికన్నట్టుగా.. ఇంకా కొనసాగుతూనే ఉంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.