షర్మిలాం “తరంగం”

పరువు తీస్తున్న హత్యలివి !

-షర్మిల కోనేరు 

ఇప్పుడే ఒక వార్త చదివాను. మహారాష్ట్రలో ఒక యువతి తల ఆమె తమ్ముడే తెగ నరికి తల్లితో సహా పోలీసులకి లొంగిపోయాడు. 

ఈ హత్యకి కారణం ఆమెకు నచ్చిన యువకుడ్ని పారిపోయి పెళ్ళిచేసుకోవడమే !

తమ పరువు పోయిందన్న కోపంతో రగిలి పోయారు.

పెళ్ళి చేసుకుని అదే వూరిలో ఆ యువకుడి కుటుంబంతో వుంటోంది ఆ అమ్మాయి.

తల్లి, తమ్ముడు ఆ యువతిని చూడటానికి వచ్చామంటూ వెళ్ళారు .

వారు తనను చూడడానికి వచ్చారన్న ఆనందంలో టీ పెడదామని ఆమె వంటింట్లోకి  వెళ్ళింది.

అంతే స్వంత తమ్ముడే పదునైన ఆయుధంతో ఆ యువతి తల నరికేశాడు.

ఆ తలను అందరికీ చూపించి అక్కడే పడేసి మరీ తల్లీ కొడుకులు పోలీస్టేషన్ కి వెళ్ళి లొంగిపోయారు.

వారు ఆ అమ్మాయిని  కడతేర్చి పరువు నిలబెట్టుకున్నామనుకున్నారు 

జీవితాంతం ఊచలు లెక్కపెట్టడం పరువైన పనా ?

ఇటువంటి సంఘటనలు మనకి కొత్తేం కాదు. తమిళనాడు లో 2016 లో ఒక దళిత యువకుడిని పెళ్ళాడిందని ఆ యువకుడిని నిలువునా యువతి తండ్రి, ఇంకొందరు చంపారు.

ఈ సంఘటన ప్రత్యక్ష సాక్షి అయిన ఆ యువతి సాక్ష్యంతో గత ఏడాది డిసెంబర్ లో కోర్టు వారికి మరణ శిక్ష విధించింది.

ఆంధ్రా లో ప్రణయ్ హత్య ఎంత సంచలనమో అందరికీ తెలుసు.

ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో నలుమూలలా లెక్కలేనన్ని పరువు హత్యలు జరుగుతున్నాయి.

ఒక్కో చోట జంటలు పెళ్ళి  చేసుకుని ఎక్కడో వుంటున్నా వెళ్ళి లాక్కొచ్చి మరీ ఆ ఆడపిల్లలకి మళ్ళీ పెళ్ళిళ్లు చేసిన ఎన్నో సంఘటనలు నాకు తెలుసు.

ఇంటి ఆడపిల్ల కులాంతర పెళ్ళి చేసుకుంటే పరువు పోతుందా ?

మగ పిల్లడు ఇష్టానుసారం తాగి తందనాలాడి ఎన్ని అరాచకాలు చేసినా పోని పరువు

 ఇష్టమైన వాడిని పెళ్ళి చేసుకుంటే పోతుందా ?

ముందుకు వెళ్ళాల్సిన సమాజం మళ్ళీ వెనక్కి పరిగెడుతోంది.

సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ అనే ముసుగు తొడుక్కున్న తీవ్రవాదం కదం తొక్కుతోంది.

మనం సృష్టించుకున్న కులాలకి లేని గొప్పదనాలని పరువుల్ని ఆపాదించుకుని  అమాయకుల్ని వధించడం ఏం న్యాయం?

పోనీ ఇష్టం లేకపోతే వారి మానాన వారిని వదిలేయండి !

వారితో సంబంధాలు తెంచుకోండి అది మీ ఇష్టం.

అంతే గానీ ప్రాణాలు తీసే హక్కు మీకెవరిచ్చారు?

కులం, మతం, జాతి ఇవన్నీ మనుషులకెందుకు ?

మనిషి జంతువే కదా ! 

బుర్ర లేని జంతువులు పశుపక్ష్యాదులకు లేని అంతరాలు మనిషికి అవసరమా !

బుర్ర వున్నది విచక్షణతో ఆలోచించడానికి.

‘అందరం మనిషి పుట్టుక పుట్టాం, మనుషులంతా ఒక్కటే’ అన్న సత్యాన్ని ఎందుకు 

అంగీకరించలేకపోతున్నారు ?

ఇంకెన్నాళ్ళు ? ఇంకెన్నేళ్ళు  ఇలాంటి వార్తలు చదవాలి !

కులం ప్రసక్తి లేని భారతదేశం రావాలంటే ఎన్ని తరాలు పడుతుంది ?

ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు ...

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.