కాళరాత్రి-7

ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌”

అనువాదం : వెనిగళ్ళ కోమల

            ప్రవేశ ద్వారం దగ్గర కంపు కొడుతున్న లిక్విడ్‌ బ్యారెల్‌ ఉన్నది. అందరం అందులో మునిగాం. తరువాత వేడినీళ్ళ స్నానం అన్నీ అర్జెంటే. తరువాత బయట ఇంకొంచెం పరుగెత్తించారు. అక్కడ ఇంకొక బ్యారెక్‌ అందులో పొడవాటి బల్లలమీద బట్టల గుట్టలు ఉన్నాయి. మా మీదకు ప్యాంట్లు, షర్టులూ, జాకెట్లు విసిరారు.

            పెద్దవాళ్ళకు చిన్నసైజు బట్టలు చిన్న వాళ్ళకు పెద్దసైజు బట్టలు దొరకటంతో అవి ధరించి వింతగా కనిపించాం. మామూలు పరిస్థితుల్లో అయితే మా ఆకారాలు నవ్వు పుట్టించేవి. మాలో మేము మార్చుకున్నాం బట్టలు.

            నాన్నను చూశాను. ఏదో లోకంలో ఉన్నట్లున్నాడు ఆయన చూపులో. ఏదో చెప్పాలనుకున్నాడు గాని మాటలు కరువయ్యాయి.

            రాత్రి గడిచింది. నాలోనూ చాలా మార్పు వచ్చింది. టల్‌ముడ్‌ చదివే పిల్లవాడిని ఇప్పుడు మంటల్లో కాలి మాడినట్లు అనిపించింది. నా పోలిక గల ఆకారంలా మిగిలాను. అంతే! నా ఆత్మను నల్లని పొగలు మింగినట్లనిపించింది.

            కొద్ది గంటల్లో ఎన్నో మార్పులు జరగటంతో నాకు కాల జ్ఞానం నశించినట్లయింది. మేము మా యిళ్ళను ఎప్పుడు వదిలాము? గెటోలు, ట్రైయిన్‌ ప్రయాణం అన్నీ వారం క్రితం ఒక్క రాత్రి జరిగాయి.

            గడ్డ కట్టిస్తున్న చలిగాలిలో ఎంతసేపు నిలబడ్డాము? ఒక గంట 60 నిముషాలు. అదంతా కల అయి ఉండాలి.

            మాకు కొంచెం అవతల జైలు పక్షులు పనిచేస్తున్నారు. కొందరు గుంటలు తవ్వు తున్నారు. కొందరు యిసుక మోస్తున్నారు. ఎవరు ఏమీ మాట్లాడుతున్నారో తెలుసు కోవాలనిపించ లేదు. ఎడారిలో వాడిన చెట్లలా ఉన్నాము. అక్కడ గార్డులు కాపలా లేకున్నా ఎవరూ గట్టిగా మాట్లాడటం లేదు. గుసగుస లాడుతున్నాము. అక్కడ దట్టమైన పొగతో మా గొంతులు పూడిపోయాయేమొ!

            మరో బ్యారక్‌లోకి తోలారు మమ్మల్ని. జిప్సీ క్యాంపు. 5 మంది చొప్పున వరుసలు కట్టాము.

            కదలొద్దన్నారు. పైకప్పు, గోడలే, నేల బదులు అంతా బురద. కాళ్ళు కూరుకు పోయాయి.

            నిలబడే నిద్రపోయాను. అమ్మ నా నుదుటి మీద చేయి వేసినట్లు, నా పక్కమీద పడుకున్నట్లు కల. మెలకువ వచ్చింది. బురదలో నిలబడి ఉన్నాను. కొందరు బురదలో పడిపోయారు. కొందరు అరుస్తున్నారు. మనల్ని నిలబడమన్నారు. పడిపోతే  కష్టాలొస్తాయి అంటున్నారు. అప్పటికింకా మాకేవో కష్టాలు మిగిలి ఉన్నట్లు.

            ఒక్కొక్కరం బురదలోనే కూర్చుండిపోయాము. కపోలు చెక్‌ చేయటానికి వస్తే లేచి నిలబడ్డాం. మాలో ఎవరి దగ్గరైనా కొత్త బూట్లు ఉన్నాయేమొ అని పరీక్షిస్తున్నారు. ఉంటే అవి వాళ్ళకి ఇచ్చివేయాలి. ఇవ్వకపోతే కొట్టి తీసుకుంటున్నారు.

            నావి కొత్త బూట్లు. వాటికి బురద అంటటాన వాళ్ళు గ్రహించలేదు. దేవుడు ప్రపంచంలో బురద సృష్టించినందుకు కృతజ్ఞత మనసులోనే తెలిపాను.

            ఒక ఎస్‌. ఎస్‌. వచ్చి ఉపన్యాసం మొదలు పెట్టాడు.

            మీరు ఆష్‌విట్స్‌లో కాన్‌సంట్రేషన్‌ క్యాంపులో ఉన్నారు. ‘‘మా వైపు చూశాడు ఏమనుకుంటున్నామొ’’ అని. మేము కుష్టురోగం వచ్చిన కుక్కలన్నట్లు మా వైపు చూశాడు. వాడిది పెద్ద క్రిమినల్‌ ముఖం.

            మీరు ఆష్‌విట్స్‌లో ఉన్నారు అంటే విశ్రాంతి కోసం కాదు అని తెలుసుకోండి. ఇది కాన్‌సంట్రేషన్‌ క్యాంపు. మీరిక్కడ పని చేయాలి. పని చేయకపోతే మీ దారి చిమ్నీయే ` ఎలక్‌ట్రిక్‌ స్మశానానికే పనిచేస్తారా, చస్తారా మీరే నిర్ణయించుకోండి.

            అప్పటికీ అన్ని కష్టాలను భరించాం. ఆ రాత్రి ఇంకేమీ మిగలలేదు. అయినా అతని మాటలు వెన్నులో వణుకు పుట్టించాయి. చిమ్నీఅనేమాట మాకు చావును గుర్తు చేస్తుంది. అతను వెళ్ళగానే కపో వచ్చి అరిచి చెప్పాడు.

            ‘‘మీలో ఇనుప పనివారు, కార్పెంటర్లు, గడియారాలు చేసేవారూ ఉంటే ముందుకు రండి’’.

            మిగిలిన మమ్మల్ని మరో బ్యారెక్‌కు పంపారు. జిప్సీ అధీనంలో ఉన్నాము. ఇది రాతి కట్టడం, మమ్మల్ని కూర్చోనిచ్చారు.

            ‘‘నాన్నకు కడుపునొప్పి రాగా టాయిలెట్స్‌ ఎటు ఉన్నాయి?’’ అని ఎంతో వినయంగా జర్మన్‌లో అడిగాడు.

            జిప్సీ నాన్నను తేరిపార జూసాడు ` మాట్లాడేవాడు మనిషేనా అన్నట్లు. నాన్నను గట్టిగా కొట్టాడు. నాన్న కిందపడి పోయాడు. కానీ దేకుతూ పైకిలేచాడు.

            నేను అచేతనంగా ఉండిపోయాను. నాన్నను నా ముందే కొట్టాడు. నేను చూసి కూడా మెదలకుండా ఉన్నాను. ఏమయింది నాకు? అదే నిన్నటి దాకా అయితే ఆ దుర్మార్గుడిని గోళ్ళతో రక్కేవాడిని. నాలో అంత మార్పు వచ్చిందా? నాలో పశ్చాత్తాపం సుడులు తిరిగింది. ఈ దుర్మార్గులను నేనెప్పటికి క్షమించను. నాన్నకు నా ఆలోచనలు అర్థమయినట్లున్నాయి. నా చెవిలో గుసగుస లాడాడు  నొప్పి పుట్టలేదు అని. ఆయన చెంప మీద దెబ్బ తాలూకు ఎర్రని వేళ్ళ ముద్రలు స్ఫుటంగా కనిపిస్తూనే ఉన్నాయి.

            అందరూ బయటకు పదండి. అంటూ ఒక డజను జిప్సీలు గార్డుతో వచ్చి అందర్నీ కొడుతున్నారు. నేను పరుగెడుతూ దెబ్బలు తప్పించు కోవటానికి ప్రయత్నించాను.

            బయట ఎండకాస్తున్నది. ‘‘5 మంది చొప్పున వరుసలు కట్టండి’’ అన్నారు. దరిదాపుల్లో ఖైదీలు పనిచేస్తున్నారు. నేను ఆలోచనల్లో మునిగాను. నాన్న నా చొక్కా పట్టుకులాగి పదఅన్నాడు.

            మమ్మల్ని ముళ్ళ కంచె మధ్య నడిపించారు. నల్లని పుర్రెల బొమ్మలు అడుగడుగునా కనిపిస్తున్నాయి, అపాయం చావు అని వార్నింగులు ఉన్నాయి. ఇక్కడ అపాయంగాని స్థలంగానీ, చావురాని స్థలంగానీ ఉంటే గదా ప్రత్యేకంగా వార్నింగు లివ్వటానికి.

            ఒక బ్యారక్‌ దగ్గర జిప్సీలు ఆగిపోగా ఎస్‌.ఎస్‌.లు మెషీన్‌ గన్లు పట్టుకొని పోలీసు కుక్కలతో మమ్మల్ని చుట్టుముట్టారు. అరగంట మార్చింగ్‌ తరువాత ముళ్ళకంచె దాటామనిపించింది. నాకు క్యాంపు వదిలామని అర్థమయింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.