మార్పు

-ఎరుకలపూడి గోపీనాథరావు

అగచాట్ల పోటులను,
అదవదల కాటులను,
వంచనల పాటులనూ
అమితంగా అనుభవించిన ఆతనిని
బాధల గిలి ఇక ముట్టలేదు!

ప్రభుత్వ ప్రణాళికల ప్రదర్శనల చేత,
పాలకుల ప్రతిజ్ఞల ప్రవాహల చేత,
బాబాల భవిష్య వాణి ఫర్మానాల చేత,
జాతక చక్ర తంత్ర జాల తీర్మానాల చేత
అనేక మార్లు మోసగించబడి
విసిగి వేగి వేసారిన అతనిని
పరాభవాల గేళి ఇక చుట్టుముట్ట లేదు!

ఆశల పత్రాలను రాల్చే
శిశిర కాలానంతరం
అభిలాషలను వికసింపజేసే
వసంత ఋతువు వచ్చి తీరుతుందనే
కాల సూత్రాల సూచనల చేత,
ఆశల అంచనాల చేత
పలు దఫాలుగా దగా చేయబడి
శూన్యాన్ని చూస్తూ,
దైన్యాన్ని మోస్తూ
తుదకు అదురు బెదురూ లేని
అచల మనస్కుడైన అతణ్ణి
నిరాశల నిర్ఘాతాల
నలి ఇక ముట్టడించలేదు!

జీవనయానం
అడుగడుగు అశ్వమేధంలా,
గమ్యం
గంధర్వ నగర సౌధంలా,
ప్రార్థన
అరణ్య రోదనంలా
ప్రవర్తిస్తూ, పరితపింప జేస్తుంటే
కాల గతులకు,
మనః స్థితులకూ
లొంగుతూ క్రుంగుతూ
బలహీనుడై బానిసై
కష్ట నష్టాలకు తలవంచి
తలవంపులతో తల్లడిల్లలేక
కడకాతడు
సమస్యలకు స్పందించే
స్వభావానికే తిలోదకాలిచ్చేసి
అంతర్బాహ్య పరిస్థితులకు పట్టుబడని
అత్యంత స్థిర చిత్తుడైనాడు!
అప్రమత్తుడైనాడు!

ఇప్పుడతడు
యోగిలా
ఆత్మానంద భోగిలా రూపొంది
తననూ, తన కృషిని మాత్రమే
ధ్యానిస్తూ, విశ్వసిస్తూ
జీవించేందుకు తెగబడుతున్నాడు!
బ్రతుకు కడలిలో ఎదురొచ్చే
కడగండ్ల కెరటాలను ఎదిరిస్తూ
అనుకున్నది సాధించేలా అగబడుతున్నాడు!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.