ఊహించని సృష్టి

-చందలూరి నారాయణరావు

ఈ నిశబ్దం బాధిస్తుంది.
సరిగ్గా ఇప్పుడే ఎవరైనా మాట్లాడితే బాగుండు.
నా బాధను చెప్పకుండానే
తెలుసుకుని ఓదార్చితే బాగుండు.

నా అంతట నేనే
ఒంటరిగా గొంతు తలుపు తెరచుకుని
లోపలికి రమ్మంటే చులకనవుతాను
బయటకొచ్చి నిలబడితే పలుచనవుతాను.

పూసల దండలా చప్పుడు చేస్తూ
నా అక్షరాలను తిరుగుతున్నాయగా
లోపలికి తొంగి చూస్తే నన్ను గుర్తుపట్టేవారేగా
నేను పడే బాధ కొంచెం అర్థమయ్యేదిగా!

ఒక్క భావం వెనుక
ఒక్క రాత్రిలో ఎన్ని మెలికలు తిరుగుతానో
ఒక్క అక్షరంలో జీవం కోసం
ఎన్ని పగళ్లు కింద పడి నలుగుతానొ

చివరకు స్పందన లేక నిశ్శబ్దంలో
మనసు పక్కనే నిలబడ్డా
పలుకరింపే లేదు….
పచ్చి చూపు కూడా లేదు.

ఈ ప్రశాంత యుద్ధంలో
నా ప్రచండ గమనంలో
ఈ ప్రపంచం ఊహించని
నా సృష్టి వైపు దృష్టి పెడితే అర్థమయ్యేదిగా…

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.