“షార్ట్” ఫిల్మ్ వెనక “లాంగ్” స్టోరీ-2 (దూరపు కొండలు నునుపు)

డా||కె.గీత

          “దూరపు కొండలు నునుపు” అనే రెండో షార్ట్ ఫిల్మ్  గురించి చెప్పే ముందు మొదటి షార్ట్ ఫిల్మ్ “అమెరికా గుడి” కి ఇంకా ఏమేం చెయ్యాల్సి వచ్చిందో చెపుతాను. 

          శర్మ గారు కాలిఫోర్నియాలో మా ఇంటికి వస్తున్న వారంలోనే మా పెద్దమ్మాయి వరూధిని కాలేజీ నించి సెలవులకి ఇంటికి వస్తోంది. కాబట్టి అదే వారాంతంలో మా చిన్నమ్మాయి సిరివెన్నెల పుట్టిన రోజు కూడా చెయ్యాలని అనుకున్నాం. నిజానికి తన పుట్టినరోజు జూలై పదో తారీఖున. తన తొమ్మిదవ పుట్టినరోజునే నెచ్చెలిని కూడా ప్రారంభించాను. అలా ప్రతి సంవత్సరం నెచ్చెలికి, మా సిరివెన్నెలకి కలిపి జన్మ దినోత్సవం జరుపుకుంటామన్న మాట!

          అయితే ఈ సారి మా అమ్మాయి పుట్టినరోజు పండగతో బాటూ, శర్మగారితో ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేస్తే బావుంటుందని అనిపించింది నాకు. అనుకున్నదే తడవుగా ఆయనకు తెలియజేసి, అందుకనుగుణంగా ప్రయాణంతో కలిపి అయిదారు రోజులు ఉండేటట్టు ప్లాను చేశాను. మొదటి రోజు ప్రయాణం, తరువాతి రెండు రోజులు షూటింగు, ఒక రోజు సమావేశం, ఒక రోజు చుట్టూ ఎటైనా చూపించడానికి తీసుకు వెళ్ళడం, ఆఖరి రోజు తిరుగు ప్రయాణం అనుకున్నాను. 

          సమావేశ ఆహ్వానం అందుకున్న మా మోర్గాన్ హిల్ మిత్రులు, వీక్షణం మిత్రులు ఆయన్ని తప్పక కలవాలన్న ఆనందాన్ని వ్యక్తపరిచారు.  

          అనుకున్నట్టుగా శర్మ గారు శానోజేకి ఆ రోజు సాయంత్రం ఆరేడు గంటలకి రావాల్సి ఉంది. ఇంతలో ఎయిర్ పోర్టు నించి శర్మ గారు మెసేజీ పెట్టేరు. మరో గంటలో ఆయన ఫ్లైట్ ఎక్కాల్సి ఉండగా చెకిన్ వరకు వచ్చేక, ఆయన కొత్త పాసుపోర్టు ఇంట్లో మర్చి పోవడం వల్ల వెనక్కి వెళ్లిపోవాల్సి వస్తోందని ఆ మెసేజీ సారాంశం. నేను వెనువెంటనే శర్మ గారికి, వారి అబ్బాయికి ఫోను చేసి, ఆన్ లైనులో నేను టిక్కెట్టు బుక్ చేసిన సైటుకి వెళ్లి, అప్పటికప్పుడు మొత్తం టిక్కెట్టు పోకుండా అదనంగా మరికాస్త కట్టి, ఉన్న టిక్కెట్టు ని రాత్రి తొమ్మిదిన్నరకి మార్చాను. మొత్తానికి అలా కథ సుఖాంతమైనా ఆయన వచ్చే సరికి రాత్రి పదకొండు గంటలు దాటిపోయింది.  

          ఎయిర్పోర్టులో పికప్ కి వెళ్ళినపుడు మొదటిసారి శర్మ గారిని దూరంనించి చూడగానే ఎందుకో హఠాత్తుగా మా నాన్నగారు కళ్లెదురుగా కనిపించినట్టయ్యి  నా కళ్ళు నిండుకున్నాయి. ఆయన్ని నేను అదే మొదటిసారి చూడడం. చాలా విచిత్రంగా,ఆయన మా నాన్నగారు ‘ఇప్పుడు ఉండి ఉంటే ఇలా ఉండేవారేమో’ అన్నట్టుగా ఉన్నారు. మేనిచ్ఛాయలో తేడా ఉందంతే. మా నాన్నగారు విదేశాలు చూడాలని ఎన్నో కలలు కన్నారు. అవేవీ నిజం కాకుండానే అరవై ఏళ్ళ చిన్న వయసులో మాకు దూరం అయ్యారు. ఆ బాధ నా గుండెల్లో ఎప్పుడూ రగులుతూ ఉంటుంది. ఇవేళ శర్మ గారి రూపంలో ఇక్కడికి వచ్చారని అనిపించి భలే సంతోషం వేసింది. ఆయన ఇక్కడున్న నాలుగు రోజులూ నా సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది.   

          ఇంటికి వచ్చేసరికి అర్థరాత్రి అయ్యి, నిద్రపోవడం ఆలస్యం అయినా శర్మ గారు పొద్దున్నే లేచి షూటింగ్ మొదలుపెడదామన్నారు. అలా ఆ మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకి షూటింగ్ ప్రారంభించిన వాళ్ళం రాత్రి పదకొండు గంటలకి చివరి షాట్ పూర్తి చేసి, శర్మ గారు “పేకప్” అనే వరకు షూటింగ్ చేస్తూనే ఉన్నాం. 

          ఆ కథ వివరంగా చెప్పి తీరాల్సిందే. 

          ఉదయం నేను, శర్మ గారు కెమేరా పట్టుకునే ఆదిత్య వచ్చే వరకు ఇంట్లో తీయాల్సిన షాట్స్ కి  లైటింగ్, క్లారిటీ, లొకేషన్ ల అవగాహన కోసం కొన్ని శాంపిల్ షాట్స్ తీసాం. 

          రెండు స్క్రిప్టులని చూడను కూడా చూడకుండా ఆయన కంఠోపాఠంగా వరసపెట్టి షాట్స్, డైలాగ్స్  చెప్పెయ్యడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను అప్పటి వరకు రాసుకున్న డిజిటల్ నోట్సులన్నీ పక్కన పడేసి ఆయన రాసిన కాగితాల్ని చేతుల్లోకి తీసుకున్నాను. 

          షూటింగు తరువాత ఎడిటింగులో ఎక్కువగా తికమక పడకుండా ఉండడం కోసం ఆయన స్క్రిప్ట్ లో ఉన్న ప్రకారం లొకేషన్ ల వారీగా ఒక షాట్ తరువాత మరొక షాట్ తీయించారు మాతో. 

          ఆదిత్య పన్నెండు గంటలకి రాగానే ముందుగా మొదటి ఫిల్మ్ “అమెరికా గుడి” లో ఇంటి షాట్లతో ప్రారంభించాం. ఆ వెంటనే రెండవ ఫిల్మ్ “దూరపు కొండలు నునుపు”లోని ఇంటి షాట్లు కొన్ని తీసాం.

          నా షాట్స్ కి ముందుగా ఆయన యాక్షన్ చేసి చూపించడం, అది చూసి నేను చెయ్యడం గా మొదలుపెట్టినా, క్రమంగా నాకు నేనుగా చెయ్యగలిగేను. నాకు సహజంగా స్టేజ్ ఫియర్ లేనందు వల్ల సులభంగా చేయగలిగినా, డైలాగులు తప్పు చెప్పడం వల్ల  రీటేకులు తప్పేవు కావు. 

          నాలుగుగంటల వేళ ఆదిత్య వెళ్ళగానే నేను కెమేరా తీసుకున్నాను. మా ఇంటి బయట, పరిసర ప్రాంతాల్లో శర్మ గారి అవుట్ డోర్ షాట్స్ ఓ గంటలో పూర్తి చేసేసాం. 

          ఇక సాయంత్రం ఆరుగంటల నించి గుడి దగ్గిర మా ఇద్దరి షాట్స్ తీసేందుకు మోహన రావాల్సి ఉంది. కానీ తనకి మరేదో తప్పనిసరి పనిబడి ఆలస్యం అవుతూ ఉండడంతో మా పెద్దమ్మాయి వరూధినికి కెమేరా అప్పగించాం. అలా మా వరు కూడా సినిమాటోగ్రాఫర్ అయిపోయింది. అంతే కాకుండా ఇక అక్కడి నించి ఇంటికొచ్చేక కూడా రాత్రి పదకొండింటి వరకూ ఓపిగ్గా షాట్స్ తీసింది. 

          అలా రెండవ షార్ట్ ఫిల్మ్ “దూరపు కొండలు నునుపు” లో ఆదిత్య, వరూధిని పూర్తిగా కెమెరా సహాయం చేశారు. ఇక మా సత్య కిందటేడాది డ్రోన్ ఒకటి కొని, మా ఇంటికి కొన్ని డ్రోన్ షాట్లు తీశాడు. వాటిని పనిలో పనిగా ఎడిటింగ్ సమయంలో అవసరమైన చోటల్లా ఉపయోగించుకున్నాం.

          ఇక ముఖ్యంగా శర్మ గారి ఓపికకు జోహార్లు అర్పించకుండా ఉండలేక పోయాను. ప్రతి షాట్ లో కెమేరా పట్టుకున్న వారికి ముందుగా ఎంతో నేర్పించాల్సి వచ్చేది. 

          అసలు షాట్ ని ఎక్కడ మొదలుపెట్టాలో, ఎక్కడ కట్  చెయ్యాలో ముందే చెప్పినా, పూర్తిగా తెలిసేది కాదు మాకు. 

          “3, 2, 1 – యాక్షన్” అని నేర్పించినా, షాట్ మొదలయ్యి పోయేక కెమేరాని రోల్ చెయ్యడమో, లేదా షాట్ పూర్తి అవుతూనే కాస్త కూడా గేప్ ఇవ్వకుండా టక్కన కెమేరాని ఆపేసెయ్యడమో చేసే వాళ్ళం. 

          ఇక కొన్నిసార్లు అంతా అర్థమైనట్టు తలూపి, తీరా షాట్ తీసే సమయానికి మరోలా తీసేసేవాళ్ళం.

          ఆయన, నేను ప్రతి షాట్ మళ్ళీ వెంటనే ప్లే చేసి చూసేవాళ్ళం. ఆయన అను కున్నట్టు సరిగ్గా రాకపోతే, రాజీ పడకుండా మళ్ళీ  రీ టేక్ చేయించేవారు.  

          ఇక మరో ప్రధాన పాత్రధారినైన నా సంగతి సరేసరి. డైలాగ్ ఎలా చెప్పాలి? ఎటు చూస్తూ చెప్పాలి? ఎక్కడి  నించి నడిచి రావాలి? మాడ్యులేషన్, కెమేరా పొజిషన్ వగైరా లన్నీ వివరంగా చెప్తూ, అవసరమైన చోట ముందుగా ఆయన చేసి చూపిస్తూ, ఎక్కడా విసుగూ, విరామం లేకుండా గంటలతరబడి పని చేశారు శర్మ గారు. 

          స్క్రిప్ట్ లో ఉన్నట్టుగా వరుసగా సీన్లు తియ్యడం వల్ల కాస్ట్యూమ్స్ మార్చుకోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజే అయ్యింది. షాట్లకి, సీన్లకి అనుగుణంగా కాస్ట్యూమ్ లు ఆయనంత స్పీడుగానూ సమయం ఎక్కువ పట్టకుండా నేను కూడా చకచకా మార్చుకు రావాల్సి వచ్చేది.    

          ఇక షూటింగులో పడి తినడం మర్చిపోకుండా నేను షాట్స్ మధ్యలో గబగబా వంట చెయ్యడం, వడ్డించడం, సమయానికి చిన్న తేనీటి విరామాలు తీసుకోవడాన్ని గుర్తు చేసేదాన్ని.  

          ఆయన తన షాట్స్ సింగిల్ టేక్స్ లో పూర్తి చెయ్యడమే కాకుండా షాట్ నించి షాట్ కి మమ్మల్ని ఒక చక్కని ఫ్లోలో నడిపించారు. అందువల్లే మొత్తం రెండు షార్ట్ ఫిల్ముల షూటింగంతా ఒక్క రోజులో పూర్తి చెయ్యగలిగాం. 

          ఇక అతిథి నటుల విషయానికి వస్తే అక్కడక్కడా చిన్న  చిన్న షాట్స్ లో కెమేరా సహాయం చేస్తున్న ఆదిత్యని, వరుని, మా సత్యని కూర్చోబెట్టి తీసేసాం. గుళ్ళో తీసిన షాట్లలో కొన్ని లైవ్ షాట్లు కావడంతో అనుకోకుండా ఆ సమయానికి అక్కడ ఉన్న మా మిత్రులు కూడా షాట్లలోకి వచ్చేసారు. 

          ఇక షూటింగ్ కోసం అట్టే పెట్టుకున్న రెండో రోజు ఖాళీగా ఉండకుండా షాట్లని సరిగ్గా కలిపి కుట్టే దారమైన ఎడిటింగ్ కార్యక్రమం మొదలుపెట్టాం. 

          నాకు కొద్దో గొప్పో నెచ్చెలి ఇంటర్వ్యూల ఎడిటింగ్ నాలెడ్జి ఉండడం వల్ల శర్మగారు ఉదయాన లేచేసరికే నేను అన్ని సీన్లనీ మూవీ ఎడిటర్ లో ఓ క్రమంలో పెట్టి ఉంచాను. 

          నా లాప్ టాప్ నించి మా హాల్లోని టీవీలో ప్రొజెక్ట్ చేస్తూ సాగిన ఎడిటింగ్ కార్యక్రమంలో అటూ ఇటూ తిరుగుతూ పిల్లలు కూడా అప్పుడప్పుడు ఆసక్తిగా వచ్చి కూర్చుని, సరదాగా చూస్తూ ఉండేవారు.  

          సాయంత్రం ఓ గంట విరామం తీసుకుని శర్మగారికి మా మోర్గాన్ హిల్ చుట్టూ ఉన్న పర్వతాలు, ఆండర్సన్ సరస్సు, ద్రాక్ష తోటలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తిప్పి చూపించాను.  

          శర్మగారితో కలిసి అప్పటికప్పుడు అలా ఎడిటింగ్ చెయ్యడం వల్ల అక్కడక్కడా ఇంకా ఏం మిస్ అయ్యాయో వెంటనే తెలిసింది. అయితే ఏదీ రీ-షూట్ చెయ్యకుండా, ప్రతి షాట్ నీ అర్థవంతంగా మార్చడం కోసం ఉన్న సీన్లతోనే శర్మ గారు రకరకాల ముక్కల్ని ముందుకు, వెనుకకు మార్చమని, కలపమని, తీసెయ్యమని నాకు చెప్తూ ఉంటే ఎంతో నేర్చుకున్నాను. రెండు షార్ట్ ఫిల్ముల ఎడిటింగ్ పూర్తయ్యేసరికి మళ్ళీ రాత్రి పదకొండు అయ్యింది! 

          మర్నాడు శర్మ గారితో ఆత్మీయ సమావేశం, మా అమ్మాయి పుట్టినరోజు కార్యక్రమం కోసం ఏర్పట్లకి నేను ఎడిటింగ్ మధ్య విరామ సమయాన్ని కేటాయిస్తూ ఉండేదాన్ని. 

          ఇక సమావేశం రోజున మధ్యాహ్నపు పార్టీ కోసం నేను తెల్లారగట్ల మూడింటికి లేచి తొమ్మిది గంటల వరకు పదిపదిహేను రకాలు చకచకా వండేసాను. దాదాపు అరవై డెబ్బై మంది వరకూ వచ్చిన ఆ ఆత్మీయ సమావేశం ఉదయం పదకొండు నించి సాయంత్రం అయిదు వరకు ఆహ్లాదంగా జరిగింది. 

          పుట్టినరోజుకి వచ్చిన పిల్లల వినోదం కోసం మా పెద్దమ్మాయి వరూధిని, తన స్నేహితురాలు ఆన్ మేరీ కలిసి ఫేస్ పెయింటింగు, ఆర్ట్ సెంటర్ వంటివి నిర్వహించారు. మా ఇంటి పక్కనే పార్కులో ఏర్పాటు చేసిన “జంపర్” లో ఆడుతున్న పిల్లలకి కాపలాగానూ, భోజనాల దగ్గిర ఎక్కడివక్కడ అన్నీ చకచకా సర్దిపెట్టడానికి, కేకు పార్టీ ఏర్పాట్లకి, మా ఇద్దరమ్మాయిల స్నేహితుల తల్లులు, నా మిత్రురాళ్ళు ఎంతో సహాయం చేసారు. 

          ఒంటిగంటకల్లా పుట్టినరోజు పార్టీ పూర్తి చేసి, భోజనాదులు కానిచ్చి, వచ్చిన వారందరితో కలిసి శర్మ గారి చుట్టూ కూర్చుని ఆనందంగా ఆత్మీయ సమావేశాన్ని  జరుపుకున్నాం.  

          శర్మ గారి నటనానుభవాలు, జ్ఞాపకాలతో కూడిన  ప్రసంగం, ప్రశ్నలు, సమాధానాలు, ఫోటోలు, కబుర్లతో ఆ రోజు ఒక మరపురాని రోజయ్యింది మాకు. పనిలోపనిగా కిరణ్ ప్రభ గారి టాక్ షో లకి సంబంధించిన సంక్షిప్త  ప్రసంగాన్ని కూడా వినే అవకాశం కలిగింది మాకు. 

          అదే రోజు రాత్రి ఫ్లైటుకి మా పెద్దమ్మాయి తిరిగి కాలేజీకి వెళ్ళిపోయింది. 

          నాలుగో రోజు బాగా పొద్దున్నే లేచి ఓ గంట పాటు ఇంటి చుట్టుపక్కల శర్మ గారిని వాకింగుకి తీసుకెళ్లాం. 

          ఆరోజు మేం శర్మ గారిని శాన్ఫ్రాన్ సిస్కోకి తీసుకువెళ్లాల్సి ఉంది. అయితే  శాన్ఫ్రాన్ సిస్కో ఇది వరకు చూసిందే కాబట్టి, ముందు డబ్బింగు పూర్తి చేసి ఎటైనా వెళదామన్నా రు శర్మ గారు. 

          ఆ ఉదయం మొదటి షార్ట్ ఫిల్ముకి ఆయన డబ్బింగు పూర్తి చేశారు. 

          అయితే మధ్యాహ్నం మరో కార్యక్రమానికి అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది. ఆ ముందు రోజు సమావేశానికి వచ్చిన విజయ గారు, వేణు ఆసూరి గార్లు  శర్మ గారిని తమ విరిజల్లు రేడియోలో ఇంటర్వ్యూకి ఆహ్వానించారు. అలాగే శానోజేలోనే  ఆ దగ్గర్లో ఉన్న  శర్మ గారి చిరకాల మిత్రుల ఇంటికి వెళ్లాల్సి ఉండడంతో డబ్బింగుని సాయంత్రానికి వాయిదా వేసాం. 

          ఆ రెండు కార్యక్రమాలకీ ఆయన్ని నేను తీసుకువెళ్లాను. అవన్నీ అయ్యేటప్పటికి నాలుగయ్యింది. 

          అయితే మేమంతా కలిసి శర్మ గారిని బయటకు తీసుకువెళ్లాలనుకున్నది బాకీ ఉండి పోయింది కదా! 

          ఇక వస్తూనే సత్య, నేను అప్పటికప్పుడు ప్లాన్ చేసి మా చిన్నమ్మాయితో సహా బయలుదేరి శర్మ గారు అమెరికాలో ఇంత వరకు చూడని, చూడాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్న సముద్రతీరాన్ని చూపించాలని మా ఇంటి నించి ఓ అరవై  మైళ్ళ దూరంలో ఉన్న “సీ సైడ్” అనే ఊర్లోని సముద్ర తీరానికి  తీసుకువెళ్లాం. తీరా మేం వెళ్ళేసరికి అప్పటి వరకు దేదీప్యమానంగా ఉన్న ఎండిపోయి మబ్బు ముంచుకొచ్చి, తీరాన చలిగాలి మొదలయ్యింది. ఎక్కువసేపు ఉండలేకపోయినా, ఉన్న కాస్సేపైనా ఆహ్లాదంగా గడిపాం. 

          అక్కణ్ణించి వచ్చి భోజనాదులు అయ్యేసరికి తొమ్మిది అయ్యింది. రోజల్లా అలిసి పోయినా రెండో షార్ట్ ఫిల్ము డబ్బింగు పూర్తి చెయ్యాల్సిందేనని పట్టుబట్టారు శర్మ గారు. 

          అప్పటి నించి కూర్చుని రాత్రి పదకొండున్నర వరకు తన డబ్బింగు పూర్తి చేసారు శర్మ గారు. 

          నాకెలాగూ రకరకాల పన్లతో రోజూ ఇదే విధంగా పొద్దున్న లేచిందగ్గర నించి పరుగులెడుతూ, దాదాపు అర్థరాత్రి వరకూ పనిచేస్తూ ఉండడం అలవాటే. కానీ నాతో బాటూ సమానంగా ఆ నాలుగైదు రోజులూ పనిచేసిన ఆయన కార్యదీక్ష నాకు చాలా అబ్బురమనిపించింది. ఆయన పట్ల ఉన్న గౌరవం పదింతలయింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన నిగర్వి, నిరాడంబరులు. ఆయన వంటి గొప్పనటులు బొత్తిగా నటనానుభవం లేని మా వంటి వారితో ఇటు వంటి ఒక షార్ట్ ఫిల్మ్ చెయ్యడమే అందుకు తార్కాణం. ఎక్కడా ఆ తేడా కనబడేది కాదు మాకు. పిల్లలతో సహా అందరితో సమానంగా కలిసిపోయి, ఆడుతూ పాడుతూ, ఎవరికీ అలసట తెలియకుండా  షార్ట్ ఫిలిమ్ పని పూర్తి  చేయించారు.  

          శర్మ గారు బయలుదేరే రోజున దగ్గర్లో ఉన్న చిన్న షాపింగు సెంటరు, మా ఊరి డౌన్ టౌన్ లని చూపించాను. 

          ఆయన్ని మధ్యాహ్నం ఫ్లైటు ఎక్కించేక తెలియని దిగులు కమ్ముకుంది. మరో పది రోజుల్లో ఆయన ఇండియా తిరిగి వెళ్తున్నారు కూడా. 

          అయితే ఆయనతో కలిసి గడిపిన ఆ నాలుగైదు రోజుల కాలం జీవితంలో నాకు లభించిన గొప్ప వరం. సినిమా ఎలా తీయాలో ప్రత్యక్ష తరగతిలో తెలుసుకున్న అత్యద్భుతమైన కాలం. అసలు శర్మగారితో కలిసి పనిచెయ్యడమే నేర్చుకోదగిన ఓ చక్కని పాఠం.  

          ఇక ఆ తర్వాత నా డబ్బింగు, చిన్నారి అవంతిక డబ్బింగు మరో వారంలో స్థిమితం గా పూర్తి చేసాం.  

          ఇక అడిషనల్ ఎడిటింగ్, టైటిల్స్, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ల కోసం ఇండియాలో నా పాటలకి మ్యూజిక్ చేసే “డ్రమ్స్ రాము” గారిని సంప్రదించాను. ఆయనే ఎడిటర్ ఇంద్ర కర్నాటిని కుదిర్చారు. అంతేకాకుండా అక్కణ్ణించి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగు అంతా రాము గారే చూశారు. 

          అయితే ఇండియాకి, మేమున్న కాలిఫోర్నియాకి టైం డిఫరెన్సు వల్ల కరెక్షన్స్ చేసి  అక్కణ్ణించి వాళ్ళ రాత్రి సమయంలో నాకు పంపినా, ఆఫీసు పని ఒత్తిడి వల్ల పగలల్లా నాకు కుదరక మా రాత్రయ్యే వరకు ఆగాల్సి వస్తూ ఉండేది. 

          ఇవి గాక ఫిలిమ్స్ అనుకున్నవి అనుకున్నట్టుగా ఇండియాలో ఎడిటింగ్ పూర్తవ్వ డానికి అవసరమైన కథ,  స్క్రీన్ ప్లే,  టైటిల్స్, సబ్ టైటిల్సు, డబ్బింగు ఆడియోలు, అదనపు షాట్ల వీడియోలు అన్నీ అందజేయాల్సి ఉండడంతో నాకు ప్రతిరోజూ పనిబడుతూనే ఉంది. స్క్రీన్ ప్లేని ఇంగ్లీషులోకి అనువాదం చేసి సబ్ టైటిల్సు కూడా నేనే రాశాను.  

          ఎప్పటికప్పుడు ఎడిటింగ్ పూర్తయ్యి నాకు బాగా అనిపించిన వెర్షన్లన్నీ శర్మ గారికి పంపిస్తూ, ఆయన చెప్పిన మార్పులు చేర్పులు చేస్తూ , మళ్ళీ నాకేదో గుర్తుకు వస్తూ,  రోజూ ఫిలిమ్స్ అటూ ఇటూ భూగోళానికి ఒక మూల నించి మరో వైపుకి తిరుగుతూ ఉండేవి. ఇప్పటికి ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. ఓపిగ్గా చెప్పినవన్నీ సరిగ్గా చేస్తూ, చేయిస్తూ రాము గారు ఎంతో శ్రమపడ్డారు ఈ షార్ట్ ఫిలిమ్స్ కోసం. ఆయన శ్రమ వెలకట్టలేనిది. 

          ఈ  “షార్ట్ ఫిలిమ్ వెనక లాంగ్ స్టోరీ” లో భాగస్వామ్యులైన వారిలో చెప్పుకోదగ్గ మొట్ట మొదటి వ్యక్తి నా జీవిత భాగస్వామి ‘సత్య’. అడుగడుగునా ఎటు వంటి అవాంత రాలొచ్చినా, అంతరాయాలు లేకుండా, బడ్జెటుకి వెనకాడకుండా నాకు సహకరించిన సత్యకి ముందుగా కృతజ్ఞతలు.      

          అత్యంత సహృదయులు, స్నేహశీలి, కార్యదీక్షాపరులు శ్రీ సుబ్బరాయశర్మ గారికి కృతజ్ఞతలు అనేది చాలా చిన్నమాట. 

          ఇక అమెరికాలో పెరుగుతున్నా, చక్కగా చెప్పిన మాట వింటూ, తెలుగుని అర్థం చేసుకుంటూ, అక్కడక్కడా డైలాగులు గుర్తు చేస్తూ కెమెరాకి సహకరించిన ఆదిత్యకి, ఆర్నెల్ల తరవాత వచ్చిన వారం రోజుల సెలవులన్నీ నా కోసమే వెచ్చించిన మా వరూధి నికి, హుషారుగా, ఆడుతూ పాడుతూ ఇందులో నటించిన చిన్నారి అవంతికకి ప్రేమాశీస్సులు. 

          మొదటినించి నా వెన్నుదన్నుగా నిలబడి సహకరించిన నా నెచ్చెలి మోహనకి, స్నేహితురాళ్ళు సుమిత్ర, ఉమ, స్వప్న, శుభలకు, ఇండియా నించి పూర్తి సహకారాన్ని అందించిన డ్రమ్స్ రాము గారికి, పరిచయం కాకుండానే షార్ట్ ఫిలిమ్స్ కి అడిషనల్ ఎడిటింగ్ చేసిన ఇంద్ర గారికి, మరీ ముఖ్యంగా శాన్ మార్టిన్ దేవాలయ నిర్వాహకులకు  ప్రత్యేక ధన్యవాదాలు.   

          అన్నట్టు రెండు షార్ట్ ఫిల్మ్ లు అమెరికా పసిఫిక్ కాలమానంలో జూలై 29నే విడుదల అయ్యాయి. తప్పక చూస్తారుగా! పనిలో పనిగా ఇక్కడ ఇస్తున్న  ఛానెల్ కి సబ్స్ క్రైబ్ చెయ్యడం మర్చిపోకండి. సబ్స్ క్రైబ్ చెయ్యడం వల్ల ఛానెల్ లో ఏదైనా కొత్తగా విడుదల అయితే  వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఆ వెంటనే మీరు చూడొచ్చు. చూసిన తర్వాత మీ అభిప్రాయాలు చెప్పడం మర్చిపోరు కదూ! మీ అందరి శుభాశీస్సుల కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

https://www.youtube.com/@geetamadhavimovies7980/featured

రెండు షార్ట్ ఫిల్ముల లింకులు-

AMERICA GUDI
https://youtu.be/9JhUlqnf7I8

DURAPU KONDALU NUNUPU 

https://youtu.be/YPddiGynPiE

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.