ఛత్తీస్కోసత్తాయీస్

-వసంతలక్ష్మి అయ్యగారి

 

రాజభాషలో టైటిలోటా..అనుకుంటున్నారా…!

ముప్ఫైఆరుకి యిరవైఏడు…అన్నమాట.

ఇవేం పరీక్షా ఫలితాలబ్బా…అన్నది మీ తరువాతి సందేహం..అవునా?

కట్చేసి కథలో కెళ్తే….

***

మా పనమ్మాయి సంగీ మరాఠీది. బ్రహ్మాండంగా తెలుగుని తనభాషలోకి మలచుకునిమేనేజ్చేస్తుంటుంది. ఆ మలచడంలోంచే నాకు జోకులూ, కతలూ పుట్టుకొచ్చేది.
మామూలుగా వీథి తలుపు తెరచుకుని వస్తూ నే చెవిలో సెల్లు అతికించుకునే వుంటూ కూడా ఊరంతా వినిపించేలా తనవారితో ఏదో ముచ్చటిస్తూనే తలుపు కొడుతుంది. మంచీచెడూ నాతో చెప్పుకుంటుంది.

ఆవిడ గోడంతా ఎక్కువగా హమ్నాబాదులోఉండే తన తల్లిదండ్రుల ఏకైక కుమారుడు, ఏడాది క్రితం భార్యను కోల్పోయిన పాతికేళ్ళ తన గారాల తమ్ముడు గురించే. తండ్రి ఆరోగ్యం సరిలేక వాడికి దీని బావగారి కూతుర్నిచ్చి, దీని సిఫారిష్మీద..అర్జంటుగా పెళ్ళిచేస్తే..ఓ పసిపిల్లకి జన్మనిచ్చిన కొద్దినెలలకే ఆయిల్లాలు బలవంతంగా జీవిడిషిందంట.

యిహ ఆకష్టాలూ, కతలూ కోకొల్లలని మీకు వేరే చెప్పక్కర్లేదుగా..మన మెగా సీరియళ్ళు సరిరావనుకోండి. ఎలాగూ పోయిన పిల్లజీవి ఫ్లాష్బేక్ని బేక్లో పెడదాం.

పిల్లవాడు తంబాకు, పాను, ధూమపాన్,  చుక్క, ముక్కల స్పెలింగ్ కూడా  తెలియని బంగారు కొండన్నది యీవిడిచ్చే కితాబు.

గత యేడాదంతా కన్నీటి గాథలయ్యాక..యీమధ్యే…వాడిని రెండోపెళ్ళికి ఒప్పించడం, సఫలీకృతురాలవడం వంటి గాథలకు శ్రీకారం చుట్టింది.

బీదరు పిల్లకి తండ్రి లేడనీ, తుల్జాపూర్లో పిల్లకి సదువులేదనీ, గుల్బర్గా పోరికి సనిపోయిన ఆమెపోల్కే ఎక్వాఉందనీ పెళ్ళిచూపులూ…బోలెడు డుమ్మాలు…మామూలైపోయింది నాకు. తిరిగి వచ్చాక పోసుకోరు షరా మామూలే.

యీవిడకి ముగ్గురు చెల్లాయిలున్నా అమ్మతో పాటూ అందరికీ వీరే అతి పెద్ద సలహాదారని తెలుస్తుంది. ఈ ఆరిందాకి ముప్ఫైరెండు..!పళ్ళుకాదండోయ్..ఏళ్ళు.!!
మొన్న వస్తూనే ముఖం వెలిగిపోతోంది..పెళ్ళి పెద్దగారిది.

అమ్మా..నాకష్టం యింకా అయిపోయిందీ.. యేదో ఆబగ్వంతు నీదయాతోని..యీపెండ్లీ అయిపోతే నాకదేసాలు..అంటూమొదలు.

హమ్మయ్య! నీ ఉపవాసదీక్షలకి బ్రేకుపడితే నాకూ సంతోషమే…అన్నాను. డుమ్మాలు తగ్గితే మరీ సంతోషం అని మనసులోఅనుకున్నాలెండి. ఇంతకీ పిల్లయెవరు.. యేంటి..అనాలి కనక అనేశాను.

మాయింటి పంతుల్చెప్పినంకనే..పోయి షూషి వచ్చాం. చాబిస్కీట్  అంతామంచిగనేపెట్టారు. సనిపోయినా మెదీల కోండి ఉందంటమ్మా..యీ పిల్లది మంచిగ..చాందీపాఁవ్అంట..! ఛత్తీస్కూసత్తాయీస్ అనీకూడా చెప్పాడు పెద్దామన్షీ..అంది.

ఆగాగాగు, అన్నాను. కొత్తమాటలంటేయిష్టంకదామరి..ఆపి వివరాలడిగాను.

అంతేకాదులెండి. ఎక్కడో ఈమాటలు తెలుగులోనూ విన్న గురుతు లీలగా తోచింది.

కారణం మా నానగారు చాలాగొప్ప ఆస్ట్రాలజర్!

మనిషి రూపురేఖలను చూసి జాతకం చెప్పేసేవారు. ఆయనకి ఆవిద్య దైవికంగా సంప్రాప్తించింది. క్షణం తీరిక లేకుండా మాయిల్లెపుడూ..జనాలతో కిటకిటలాడడమే కాకుండాకళకళలాడేది…! బంధుమితృలంతా నాన్నగారి పుణ్యమాఅని మాయింటికి రావడం నిత్యం హడావుడీ..తలచుకుంటే భలేకదా అనిపిస్తుంది.

వారు యీ విద్యను మంచి హాబీగా మలచుకుని గణనీయమైన సేవలందించి,కీర్తి సంపాదించుకుని సునాయాసంగా సద్గతులు పొందారు. స్వంతఖర్చులతోసుదూరతీరాలకు వారే స్వయంగా తపాలాసేవలూ అందించి బాధల్లోఉండే అవతలి మనిషికి ఎంతో మనోబలాన్నందించేవారు. అలాంటి మరోవ్యక్తిని నేనింకా చూడలేదంటే నమ్మండి. పరోపకారార్థంయిదమ్ శరీరం టైపు.

ఇంతకీ విషయమేంటంటే…వారినోట్లో...ముప్ఫైఆరుకియిన్ని..అన్నిమార్కు లంటూ తరచు వినేదాన్ని. అందుకనే ఠక్కున మా సంగీని ఆపి..దానిమాటలకర్థం  కాస్త క్యూరియస్ గానే అడిగాను. ముందుచెప్పు..లకోండీ..లకౌండీ..అన్నావే..అంటే ఏంటి..  యీమార్కులేంటీ..అని.

అదే అమ్మా..పంతులు చెప్తార్కదా..పెండ్లికి ఒకల్తోని ఒకల్కీ జమ్తా..నైజమ్తా అనేడిదీ…లకోండీ    అంటే..లోహ్…లోహ్పావ్..మీరు కూడా సెప్తార్కదా..యినుము..ఉందీ ఆమె కాల్ అనీ …

ఓహో..ఐరన్లెగ్గా…?!?

హాఁ,,అదీ కరెక్ట్మాటా ఉందీ..సన్పోయినా ఆమెదీ..యిన్ప పాదం ఉందంటమ్మా.అప్పుడుపంతుల్కీ సూపెట్టా కుంటా. మానాయన జల్దీ లషే షేషిండూ..యీసారీఅయితే అన్నీకూడా..సూపెట్కోని సేస్తు న్నం.

నిన్న మేం సూసినా పిల్లాది..వెండిపాదంఉంది..ఇరవైయేడు కల్షిందంట. రేపు మా తమ్ముడూ హైద్రాబాద్వస్తుండు కూడా..ముందుగాల నేను సూడాలనీ ఆయన మొడ్చేసిండు.

అవునా..మరిపిల్లెలాఉందీ..సంగీ..

పిల్లా..అంతమంచిగలేదూ. టెన్త్పాస్. కొద్దిగామెల్లంవుందమ్మా..

ఏంటేంటీ,,[అల్లం,బెల్లంలాగా..]మెల్లంఉందా. అంటేఅణకువగాఉంటుందనేమో అనుకున్నా సుమండీ,

మెల్లంతెల్వదా…ఒకాకన్నూ..పక్కలసూస్తుందమ్మా..

ఓహ్ఫ్..ఓకేఓకే..మరి ఫరవాలేదా మీకూ..

మల్లా రెండోసారీ పెల్లీ అంటే..యిగ యిట్లనే ఉంటయ్. అయితే గూడా అదే మంచిగ. మా తమ్ముని పిల్లన్గూడా సాకాలే..మాయమ్మకూ..సాత్కూడా ఉండాలే కదమ్మా.. నాకు ఆమె గుణం సాలా మంచి గన్పించిందమ్మా..

అబ్బా..యేంటో?

చూడూ హారికా..నీవు రెండో పెండ్లి యెందుకు ఒప్పుకుంటావ్  అనినేనడ్గితే..

మా అమ్మ చెప్పినంక మేం యేది గూడా..కాదనం..మన మంచి చూసేడిదీ యింకా వాల్లేగదా..అనీ చెప్పిందమ్మా..! నేను యింక గూడా అడిగినా..ఆయనకి ఒకాపిల్లా వుంది.. నువ్వు చూస్కుంటవా అనీ. అయితే ఆమె..మంచిగజూస్కుంటా అనే వరకు నాకుమస్త్   

అనిపించిందమ్మా..ఇంకా వకటి అడిగినా..చూడు హారికా,, మేం నల్గురు అక్కచల్లీ ఉన్నాం..ఆయన ఒక్కడే మగ వున్నడూ..మాప్రేమా చాలా ఎక్వా వుందీ …మాలెక్కలో..ఆడబిడ్డల్కీ మంచిగా సూస్కోంటేనే మగడినీ కూడా మంచిగా సూస్తరూ అనీ..యిదీ ఒకలెక్క ఉందీ అని..నేను చెప్తే..

ఆమె అంది కదా…మీరేం చెప్పే అవసరం లేదు. మేమూ కూడాఅయిదు అక్కచల్లే ఉన్నం. మాకు అదే ప్రేమ తెల్సూ అని అనే వరక్..నాక్చాలా మంచిగనిపించిందమ్మా..

యిరవై యేడు మార్కులన్నావ్గా..నాకూ మా ఆయనకీ యిరవై నాలుగే ఆలెక్కన. పైగాపద్దెనిమిదొస్తే చాలట..అని నా పాండిత్యాన్నీ, పెద్దరికాన్నీ జోడించి ఆరోజుకి ముగింపు పలికాను.

ఆవిడగారు మరీ జోష్మీద పని కానిచ్చేసిందనుకోండి.

మరునాడు రాదనే అనుకున్నా.కానీ డీలా ముఖమేసుకుని వచ్చిందమ్మగారు.

ఏంటని నేనడిగితే…ఎవరుపొగపెట్టారో..ఏం మంటాపెట్టారో..పురుగుల్పట్టిసస్తరూ….క్యానసలయిందమ్మా..

అయ్యో..అదేమిటీ.

మానాయనకూ, నిన్నఅర్దరాత్రీకి..పిల్లనాయనా ఫోన్జేషి అర్జంట్పనీ మీద ఊర్కిపోతున్నం..రావద్దు..అన్నడంట. మాకర్తమై పోయింది. అంది.

……మీకర్తమైపోయిందా లేదా చెప్పాలి మరి!!

ఏఁవిటో…యిప్పుడు మనమంతా….”ఆతమ్ముడు కలకాలం ఈవిడతో అదే అనురాగంకలిగి ఉండాలని ఆశించడంలోతప్పులేదుగా! ఆ..మె..న్”

*****

    

  

 

Please follow and like us:

2 thoughts on “వసంత కాలమ్ -1 ఛత్తీస్కోసత్తాయీస్”

  1. వాహ్, వసంతలక్ష్మి గారూ !క్యా బోలూ…

Leave a Reply

Your email address will not be published.