వి ఐ లెనిన్ సంక్షిప్త జీవిత చరిత్ర

పుస్తకాలమ్’ – 25

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

పాత పుస్తకాలూ పురాస్మృతులూ…

          ఒక పుస్తకం అనేక జ్ఞాపకాల్ని రేకెత్తిస్తుంది. ఎవరో చెపితే విని, ఏ పత్రికలోనో సమీక్ష చదివి, ఆ పుస్తకం సంపాదించడానికి చేసిన ప్రయత్నాలు, ఏ దుకాణంలోనో, ఏ మిత్రుడి దగ్గరో దాన్ని చూసిన క్షణం, అది కొన్న స్థలం, కొన్న వెంటనే పేజీలు తిరగేసి దాని వాసన చూసిన క్షణం, చదువుతూ ఉద్వేగాలు అనుభవించిన గంటలు, ఒక మాట దగ్గరో, వాక్యం దగ్గరో ఆగి ఏవేవో ఆలోచనల్లోకి వెళ్ళిన సందర్భాలు, కింద గీతలు గీసుకున్న సందర్భా లు, మిత్రులతో ఆ పుస్తకం గురించి పంచుకున్న సందర్భాలు… ఒక పుస్తకమంటే వేనవేల జ్ఞాపకాలు. అసలు ఒక ప్రత్యేక పుస్తకమనే కాదు, ఏ పుస్తకమైనా దానిలో రాసిఉన్న దానికన్నా ఎన్నోరెట్లు ఎక్కువ విషయాల్ని, ఎన్నో మానవానుబంధాలను, మరెన్నో ఆలోచనలను, ఎన్నో సంఘటనలను, ఎన్నెన్నో జీవనశకలాల స్ఫురణను ప్రేరేపిస్తుంది.

          అట్లా పురాస్మృతులనెన్నిటినో ప్రేరేపించిన ఒకానొక పుస్తకం గురించి మీతో పంచుకోవాలి.

          హైదరాబాద్ బుక్ ఫేర్ లో సెకండ్ హాండ్ పుస్తకాల దుకాణాలు ఈసారి కూడ ఎప్పటి లాగనే తరగనిగనుల్లా ఉన్నాయి. ఒక దుకాణంలో ఓ వంద దాకా సోవియట్ పుస్తకాలు కనిపించాయి. వాటిలో ఎక్కువ సైన్స్, ఇంజనీరింగ్ వంటి నాకు పెద్దగా ఆసక్తి లేని సబ్జెక్టులవి కాగా ఉన్న కొద్ది రాజకీయార్థిక పుస్తకాలు నా దగ్గర ఉన్నవే. అలా ఒక్కొక్కటీ చూస్తుండగా ‘వి ఐ లెనిన్ సంక్షిప్త జీవిత చరిత్ర’ అనే ఈ చిన్న పాకెట్ సైజ్ బౌండ్ పుస్తకం నన్ను ఎన్నెన్నో పాత జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళింది.

          ఆ పుస్తకం ఎమర్జెన్సీకి కొద్ది ముందు వెలువడింది. ఇప్పటికి నలబై ఎనిమిదేళ్ళ కింద శత జయంతి సందర్భంగా లెనిన్ పేరు మొదటిసారి విన్నాను. అది నా తొమ్మిదో ఏడు. అప్పటికే మా బాపు కొనిపెట్టిన పురాణాలు, కావ్యాలు ఒక పక్కనా, జడ్చర్లలో, హనుమకొండలో వరవరరావుగారి ఇంట్లో, సృజన ఆఫీసులో ఎక్కువైపోయి మా ఇంటికి చేరిన అభ్యుదయ, విప్లవ సాహిత్యం మరొకపక్కనా మా రాజారం ఇంటికి బోలెడన్ని పుస్తకాలు చేరాయి. లెనిన్ శతజయంతి సందర్భంగా శివసాగర్ రాసిన దీర్ఘ కవిత నోటికి భట్టీ పట్టి ఎక్కడపడితే అక్కడ చదువుతూ లెనిన్ మైకంలో పడ్డ నేను, ఆ మైకంలోనే మా ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ మా బంగ్లామీద అర్రలో సర్ది, ఆ అర్ర తలుపు మీద లెనిన్ స్మారక గ్రంథాలయం అని ఒక బోర్డు తగిలించాను. ఏవో బట్టలు కొంటే వచ్చిన అట్టడబ్బా మీద ఒకవైపు ఇంద్రధనుస్సు లాగ నాలుగైదు రంగులు, వాటి మధ్య తెల్లగా గుండ్రని ఖాళీ స్థలం చూసి ఆ ఖాళీ స్థలంలో లెనిన్ స్మారక గ్రంథాలయం అని రాశాను. లోపల గోడల నిండా శివసాగర్, కాళోజీ కవితల లైన్లు పెన్సిల్ తో రాసి పెట్టాను. బహుశా హనుమ కొండలోని రాజరాజనరేంద్రాంధ్ర గ్రంథాలయం ప్రభావం నా చేత అలా చేయించిందేమో అని ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే అనిపిస్తున్నది.

          అలా లెనిన్ ప్రభావంలో తలమునకలుగా ఉన్నప్పుడే ఈ పుస్తకం ‘వి ఐ లెనిన్ సంక్షిప్త జీవితచరిత్ర’ మొదటిసారి చూశాను. సోవియట్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన మార్క్సిజం లెనినిజం ఇన్ స్టిట్యూట్ తయారుచేసిన పుస్తకానికి రాచమల్లు రామచంద్రా రెడ్డి అనువాదం అది. మాస్కో ప్రగతి ప్రచురణాలయం ప్రచురించిన చిన్న, అందమైన, పొందికైన హార్డ్ బౌండ్ పుస్తకం విశాలాంధ్ర ప్రచురణాలయం నుంచి సృజనకు సమీక్షకు వచ్చిన పుస్తకాల్లోనో, మరో రకంగానో రాజారం చేరింది. దాన్ని ఎన్నిసార్లు నిమిరానో, ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. ఆ తర్వాత పది, పదిహేనేళ్ళు ప్రగతి ప్రచురణాలయం ఆ పుస్తకాన్ని పునర్ముద్రిస్తూనే ఉంది. వరంగల్ లోనూ, హైదరాబాదులోనూ విశాలాంధ్ర షాపుల్లో కనీసం అరడజను సార్లయినా నేనది కొన్నాను.

          ఇప్పుడు సెకండ్ హాండ్ పుస్తకాల దొంతరలో అది కనబడగానే, ఉన్నాసరే, మరొకటి ఉంటుందిలే అని కొన్నాను.

          ప్రతి సెకండ్ హాండ్ పుస్తకమూ నన్ను ఆశ్చర్యపరుస్తుంది, కలవరపరుస్తుంది, ఆలోచింపజేస్తుంది. ఎవరి మునివేళ్ళు ఈ పేజీలను తిప్పాయో, ఎవరి కళ్ళు ఈ అక్షరాల మీద ప్రవహించాయో, ఎవరు ఈ పుస్తకాన్ని గుండెలకు హత్తుకున్నారో, ఏ కారణం వల్ల ఇది వాళ్ళ నుంచి దూరమై ఎక్కడెక్కడ తిరిగి ఈ సెకండ్ హాండ్ పుస్తకాల దుకాణం చేరిందో అని ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఈ పుస్తకపు తొలి యజమాని అయిన ఆ అపరిచిత మిత్రుడో, మిత్రురాలో అత్యంత సన్నిహిత ఆత్మీయులన్నట్టుగా ఆలోచిస్తాను. ఇప్పుడీ పుస్తకం పట్టుకుని ఒకప్పుడు ఇలాగే ఈ పుస్తకం పట్టుకున్న మిత్రుల గురించి ఆలోచిస్తాను. ఆ పుస్తకం మీద ఏవైనా పేర్లు, సందేశాలు, ఎక్కడైనా కిందిగీతలు, అంచుల్లో వ్యాఖ్యలు ఉన్నాయా అని వెతుకుతాను. పాతరోజుల్లో సందేశం రాసి సీసాలో పెట్టి, బిరడా బిగించి, సముద్రంలో వదిలేసి, తెలియని భవిష్యత్ చిరునామాదారు ఎవరికో అందజేసే సంప్రదాయం లాగ నాకూ ఎవరో ఈ పుస్తకంలో అజ్ఞాత సందేశమేదో బట్వాడా చేయడానికి ప్రయత్నిస్తున్నారనుకుంటాను.

          నిజంగానే ఈ లెనిన్ పుస్తకంలో ఒక ఉద్వేగభరిత పురాస్మృతి అజ్ఞాత సందేశంగా ఉంది.

          తెరవగానే ఎస్ ఎ భాషా అనే సంతకం కనబడింది. ఆయనెవరో తెలియదు గాని, రెండో కవర్ మీద చూస్తే విజయనగరంలో కంటోన్మెంట్ లోని ఆర్ సి ఎం సేంట్ ఆంథొనీస్ హైస్కూల్ లో 1984 బాలల దినోత్సవం సందర్భంగా హిందీ వ్యాసరచన పోటీలో మొదటి బహుమతిగా ఎస్ ఎ బాషా అనే ఏడో తరగతి విద్యార్థి ఈ పుస్తకం గెలుచుకున్నారని ఉంది. ఆయన ఎవరో, ఈ పుస్తకం చదివారో లేదో, ఆయన ఆ తర్వాత ఏయే ఊళ్ళు తిరిగారో, ఇప్పుడెక్కడ ఉన్నారో, ఈ విలువైన బహుమతిని ఆయన ఎక్కడ ఎలా పోగొట్టుకున్నారో, అది హైదరాబాదులోని సెకండ్ హాండ్ పుస్తకాల దుకాణం మజిలీకి ఎలా చేరిందో ఇప్పటికి తెలియవుగాని ఎప్పటికైనా తెలిసే, ఒక కాల్పనిక నవలకు వస్తువు కాదగిన ఆసక్తికరమైన అన్వేషణాంశాలు. (అలా పోగొట్టుకుని, సెకండ్ హాండ్ పుస్తకాల షాపుల్లో దొరికిన పుస్తకాల ఆసక్తికర కథనాలు నాదగ్గర ఎన్నో ఉన్నాయి!)

          దానికన్న నన్ను మరింత ఎక్కువగా ఆకర్షించినదీ, దశాబ్దాల వెనుకకు తీసుకు వెళ్ళినదీ ఇన్నర్ టైటిల్ పేజీలో ఉన్న రబ్బర్ స్టాంప్. పి అప్పన్న దొర, బుక్ సెల్లర్, విజయనగరం!! 1970లలో, 80లలో ఒక దశాబ్దానికి పైగా ప్రతినెలా సృజన మూడు కాపీల పార్సిల్ పంపుతూ నేను నా చేతులతో అక్షరాలా రాసిన చిరునామా అది. ఆయన సృజనకు నమ్మకమైన న్యూస్ ఏజెంట్లలో ఒకరు. ప్రతి నెలా మూడు కాపీలు తెప్పించు కుని, సెల్ ఫోన్లు మాత్రమే కాదు, లాండ్ లైన్ ఫోన్ కూడ లేని ఆ రోజుల్లో కార్డు ముక్క మీదో, మనీ ఆర్డర్ కూపన్ మీదో కావలసిన పుస్తకాల గురించి రాస్తూ, ప్రతి నెలా క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తూ (మూడు కాపీలకు మూడు రూపాయలు, కమిషన్ పోను ఆయన చెల్లించవలసినది రెండు రూపాయల పావలా!), వేరే పుస్తకాలు కావాలని అడుగుతూ ఉండేవారాయన. ఆయన ఆ తర్వాత ప్రజా రాజకీయాల అభిమాని కూడ అయి, విజయనగరం జిల్లా పౌరహక్కుల సంఘం నాయకుడిగా కూడ పని చేసి దాదాపు పది సంవత్సరాల కింద చనిపోయారు. ఇరవై, ఇరవై ఐదు ఏళ్ళ కింద ఏదో సభలో మాట్లాడడానికి విజయనగరం వెళ్ళినప్పుడు ఒకసారి, తర్వాత శ్రీకాకుళంలో మరొక సభలో ఒకసారి ఆయనను చూశానని జ్ఞాపకం.

          విజయనగరం ప్రాంతానికి 1970లలో, 80లలో ప్రగతిశీల, విప్లవ సాహిత్యాన్ని, సోవియట్ సాహిత్యాన్ని పరిచయం చేసినవారు అప్పన్న దొర. ఇటువంటి వాళ్ళుదాదాపు ప్రతి జిల్లాలోనూ, అన్ని ముఖ్య పట్టణాల్లోను ఎవరో ఒకరో కొందరో ఉన్నారు. తమ తమ ప్రాంతాలలో చైతన్యవ్యాప్తిలో, ప్రగతిశీల భావప్రచారంలో వారి పాత్ర ఎంతో గొప్పది, అసాధారణమైనది. వాళ్ళలో కొందరు పుస్తకాల అమ్మకాన్ని ఒక వ్యాపారంగా, అదనపు ఆదాయ వనరుగా మాత్రమే చూసి ఉండవచ్చు గాని చాల మందికి అది ఒక పాషన్, జీవితాశయం. వాళ్ళు తాము అమ్ముతున్న పుస్తకాలు ప్రకటిస్తున్న భావాలతో, ఆ పుస్తకాలు ప్రభావితం చేస్తున్న యువతరంతో మమేకమయ్యారు. నాకు తెలిసి మా వరంగల్ లో వీరమల్లయ్య, ఖమ్మంలో బి వీరయ్య, సూర్యాపేటలో ఎన్ జి రెడ్డి (స్టార్ బుక్ హౌజ్), బెజవాడ, గుంటూరులో కళ్లం ప్రకాశరెడ్డి (సోషలిస్ట్ పబ్లికేషన్స్), రాజమండ్రిలో ఏలూరి సూర్యారావు వంటి ఎందరో ఈ భావప్రచారం వల్ల మామూలు పుస్తకాల దుకాణం కన్న ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చారు. తామూ ఆ భావాల ప్రభావంలోకి వచ్చి కార్యకర్త లుగా మారి నిర్బంధాల పాలయ్యారు. వారిలో కొందరి కుటుంబాలు కూడ ప్రజా రాజకీయా ల ప్రభావంలోకి వచ్చాయి. ఇబ్బందులు పడ్డాయి. కాని వారెవరూ చరిత్రకెక్కకుండానే అన్ సంగ్ గానే వెళ్ళిపోయారు.

          అలా వెళ్ళిపోయిన అప్పన్న దొర ఒక చిరస్మరణీయమైన పుస్తకం మీద ముద్రగా, చెరపరాని ముద్రగా, చెరగని ముద్రగా మిగిలే ఉన్నారు.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.