విజ్ఞానశాస్త్రంలో వనితలు-10

మొట్ట మొదటి ఈజిప్షియన్ మహిళా శాస్త్రవేత్త సమీరా మూసా     (1917-1952)

– బ్రిస్బేన్ శారద

          అణు ధార్మిక శక్తి (న్యూక్లియర్ ఎనర్జీ) వల్ల ప్రపంచానికి రాబోయే పెను ముప్పుల గురించీ అందరికీ కొంతవరకైనా తెలుసు. ఆ మధ్య విడుదలైన ఒపెన్‌హైమెర్ చిత్రం అణు బాంబు తయారీ, మాన్‌హాటన్ ప్రాజెక్ట్ గురించీ చర్చించింది.

          అయితే అణు ధార్మికతకు వైద్య శాస్త్రంలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ ప్రయోజనాలని “న్యూక్లియర్ మెడిసిన్” అని పిలుస్తారు. కేన్సర్ చికిత్స మొదలుకొని కొన్ని రకాల రోగ నిర్ధారణ వరకూ న్యూక్లియర్ మెడిసిన్ ప్రయోజనాలున్నాయి. కేన్సర్ చికిత్స కోసం మెడికల్ ఫిజిక్స్ అనే శాస్త్ర విభాగం వృద్ధి చెంది, ఇప్పుడు కేన్సర్ ఆస్పత్రు ల్లో మెడికల్ ఫిజిసిస్టు అనే ఉద్యోగాలు కూడా వుంటున్నాయి.

          “అణు చికిత్సను ఆస్పిరిన్ మాత్ర కంటే చవకగా దొరికేలా చేయడమే నా ధ్యేయం” అని ప్రకటించి, అణు చికిత్సను వైద్యంలో మెరుగు పరచటానికి శాయాశక్తులా ప్రయత్నించిన శాస్త్రవేత్త ఈజిప్టు దేశానికి చెందిన డాక్టర్ సమీరా మౌసా.

          సమీరా 1917లో ఈజిప్టులోని ఉత్తర భాగంలోని ఘార్బియా అనే ప్రదేశంలో జన్మించారు. ఆమె తండ్రి ఆ ప్రాంతంలోని రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఆమె తల్లి సమీరా చిన్నతనంలోనే కేన్సర్ బారిన పడి మరణించారు. బహుశా కేన్సర్ వ్యాధి బారిన పడ్డ తల్లి దురవస్థ చూడడం వల్లే సమీరా న్యూక్లియర్ మెడిసిన్ ప్రయోజనాల వైపు ఆకర్షితురాలై వుండొచ్చు!

          చిన్నప్పట్నించే సమీరా స్కూలు చదువులూ, ముఖ్యంగా సైన్సులో చాలా చురుకు గా ముందుండేది. స్కూలు చదువు ముగిసి పై చదువు కోసం సమీరా యూనివర్సిటీ ఆఫ్ కైరోలో చేరారు. అప్పట్లో ఈజిప్టు దేశంలో ఆడవారు సైన్సు చదవడానికి ముందుకు వచ్చేవారు కాదు. సమీరా ప్రథమ శ్రేణిలో రేడియాలజీ చదివి ఆనర్స్ డిగ్రీ తెచ్చుకు న్నారు. ప్రత్యేకించి భౌతిక పదార్థాల పై ఎక్స్-రే కిరణాల ప్రభావం మీద సమీరా పరిశోధనలు చేసారు.

          డిగ్రీ పొందిన పిదప సమీరా న్యూక్లియర్ శాస్త్రంలో పీహెచ్‌డీ కొరకు పేరు నమోదు చేసుకున్నారు. ఈ పరిశోధనలో సమీరా రేడియోధార్మిక శక్తిని ఉపయోగించి కేన్సర్ కణాలను నిర్మూలించే ప్రక్రియను అధ్యయనం చేసారు. 1939లో సమీరా ఇంగ్లండులో పీహెచ్‌డీ ముగించారు. ఇంగ్లండులో సమీరా న్యూక్లియర్ టెక్నాలజీ ఉపయోగించి కేన్సర్ చికిత్స చేయడం పైన పరిశోధనలు చేసారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె చేసిన పరిశోధన వల్ల ఎక్స్-రే టెక్నాలజీ చాలా చవక అయింది.

          నిజానికి ఎక్స్-రేలని జర్మన్ శాస్త్రవేత్త విల్‌హెల్మ్రాంట్‌జెన్ 1895లోనే కనుగొన్నారు. వాటిని మానవ శరీర నిర్మాణం గురించి నేర్చుకోవడానికీ, శరీరంలోపల రుగ్మతలనీ, గాయాలనీ కనిపెట్టటానికీ ఉపయోగించేవారు. అయితే 1940ల్లో ఎక్స్-రే వాడకమూ ప్రయోగమూ కొంచెం శ్రమతో కూడిందైవుండేది. సమీరా తన పరిశోధనలతో ఎక్స్-రే టెక్నాలజీని మానవ వైద్యానికి ఉపయోగించడంలో కొత్త కొత్త మెళకువలు కనిపెట్టారు. ఉదాహరణకి ఎక్స్-రే యంత్రాల పరిమాణం తగ్గించి, వాటిని తేలికగా ఎక్కడికైనా తీసుకుపోగలగడం, కొత్త కొత్త పద్ధతులనుపయోగించి రోగిని ఎక్స్-రేలకి బహిర్గతమయ్యే సమయాన్ని తగ్గించడంలాటివి.

          పీహెచ్‌డీ చేస్తూండగానే సమీరాని కైరో యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు యూనివర్సిటీ సైన్సు విభాగం డీన్. ఇంకా పీహెచ్‌డీ ముగియకుండానే యూనివర్సిటీలో బోధన చేయడం ఎంతో అసాధారణమైన విషయం, ఆ రోజుల్లోనే కాదు, ఇప్పుడు కూడా.

          1940ల్లో సమీరా పీహెచ్‌డి పరిశోధనల్లో భాగంగా ఇంగ్లండు వెళ్ళారు. అక్కడ సాగించిన పరిశోధనల్లో సమీరా రాగిలాటి చవకరకం లోహాల నుంచి ఎక్స్-రేలు ఉత్పత్తి చేసే సమీకరణాన్నీ, పద్ధతినీ కనుగొన్నారు. దీనివల్ల వైద్యరంగానికి జరిగిన మేలు ఇంతా అంతా కాదు.

          రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సమీరా ఎక్కడ నివసించే వారో ఇదమిధ్ధంగా చెప్పగల రికార్డులేవీ లేవు కానీ, బహుశా ఇంగ్లాండులోనే వుండివుండొచ్చు. హిరోషిమా, నాగసాకీల విధ్వంసం తరవాత ప్రపంచ దేశాల్లో, ప్రపంచ నాయకుల్లో అణు శక్తి పట్ల ఒకరకమైన విముఖతా, భయమూ చోటుచేసుకోసాగాయి. ఆ నాటి రాజకీయ నాయకులూ, సామాజిక వేత్తలూ అణూ ధార్మికత గురించిన పరిశోధనలు సాగించకూడదని శాస్త్రవేత్త లపై వొత్తిడి తెస్తారన్న భయం ఆ రోజుల్లో శాస్త్రజ్ఞులకు వుండేది.

          ఆ భయాన్ని పోగొట్టి అణు ధార్మికతకున్న శాంతియుత ప్రయోజనాలని చర్చిండా నికి ఇంగ్లండులో సమీరా “శాంతి కోసమై అణు శక్తి” అనే కాన్‌ఫరెన్సు ఏర్పాటు చేసి దానికి తానే సారధ్యం వహించారు. ఆ సమావేశానికి ఆ నాటి పేరున్న భౌతిక శాస్త్రవేత్తలందరూ హాజరయి వాళ్ళ ఆలోచనలని పంచుకున్నారు.

          1950లో సమీరా అమెరికా పర్యటించారు. ( ఆమెకి ఫుల్‌బ్రైట్స్కాలర్షిపు లభించిం దన్న వార్తలున్నాయి కానీ, వాటిని నిర్ధారించలేం.) అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కుపయోగించాలన్న ఆమె ఆశయాన్ని గుర్తించిన అమెరికా ప్రభుత్వం, ఆమెని తమ అణుశక్తి కేంద్రాలని సందర్శించవలసిందిగా కోరింది.

          అయితే ఈ ఆహ్వానం పెద్ద దుమారాన్నే లేపింది. ఈజిప్టుకి చెందిన అణు శాస్త్రవేత్త కు అమెరికాలోని అణు శక్తి కేంద్రాలని చూసే అవకాశం కల్పించడం దేశ భద్రతకు ముప్పుకాగలదని కొందరు ప్రభుత్వ అధికారులు అభిప్రాయపడ్డారు. దాన్ని ఎదుర్కునేం దుకు ప్రభుత్వం ఆమెకి అమెరికా పౌరసత్వాన్ని ఇవ్వచూపారు. కానీ సమీరా అమెరికా పౌరసత్వం తీసుకోవడానికి నిరాకరిస్తూ, “నేను ఈజిప్టుకి వెళ్ళిపోయి అక్కడే నా పరిశోధన లు సాగిస్తాను,” అన్నారట.

          ఇది జరిగిన కొద్ది రోజులకే ఆమె అమెరికాలోని ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు.

          ఆమె మరణం గురించి ఎన్నో ఊహాగానాలున్నాయి. అదసలు రోడ్డు ప్రమాదం కాదనీ, ఇజ్రాయెల్ ప్రభుత్వం చేయించిన హత్య అనీ ఈజిప్టు ప్రభుత్వం ఆరోపించింది. ఇందులో నిజానిజాలెవరికీ తెలియవు.

ఈజిప్టు వార్తా పత్రికల కథనం ప్రకారం-

          ఆ రోజు (15 ఆగస్టు 1952)  మధ్యాహ్నం ఆవిడకి కేలిఫోర్నియాలోని న్యూక్లియర్  లేబోరటొరీని చూడమని ఆహ్వానిస్తూ ఒక ఫోన్ వచ్చింది. ఫోన్‌లో చెప్పినట్టుగానే ఆమెని తీసికెళ్ళడానికి ఒక కారుతో డ్రయివరూ వొచ్చాడు.

          డ్రయివరుతో ఆమె ప్రయాణమయ్యారు. మార్గ మధ్యంలో వాళ్ళ కారు యాభై అడుగుల లోయలో పడిపోయి ఆమె మరణించారు. డ్రైవరు తప్పించుకుని పారి పోయాడు. అయితే కేలిఫోర్నియాలోని లేబొరేటొరీ అధికారులు అటు వంటి ఫోన్ తామేదీ చేయలేదన్నారు. కాబట్టి నిస్సందేహంగా ఇది హత్యే, అని ఈజిప్టు దేశం అభియోగం.

          అమెరికన్ పత్రికలు మాత్రం ఆమె కార్లో స్నేహితులతో ప్రయాణిస్తూండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు లోయలోపడి మరణించినట్టు వ్రాసాయి. ఆమెతోపాటు కారు డ్రైవరూ మరణించాడని పేర్కొన్నాయి.

          నిజానిజాలూ ఏవైనా, ప్రపంచం మాత్రం ఒక మంచి శాస్త్రవేత్తను కోల్పోయింది. ఆమె మరణానంతరం ఈజిప్టు ప్రభుత్వం ఆమె సేవలనీ, మేధస్సునీ, పరిశోధనలనీ అనేక విధాల గుర్తించింది. 1953లో ఆమెని ఈజిప్షియన్ ఆర్మీ ప్రశంసించింది. 1981 లో అప్పటి దేశాధ్యక్షులు అన్వర్ సాదత్ “ఆర్డర్ ఆఫ్ సైన్స్ ఎండ్ ఆర్ట్స్” ఇచ్చి గౌరవించారు.

          ఆమె పుట్టిన ఊరిలోని ఒక పాఠశాలకూ, ఒక సైన్సులేబోరేటొరీకి ఆమె పేరు పెట్టారు. 

          వైజ్ఞానిక రంగం మానవాళికి చేయగల ఉపకారాల గురించి కలలుగన్న స్వాప్నికురా లు డాక్టర్ సమీరా మూసా.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.