రాగో (నవల) 

– సాధన

సృజన ప్రచురణలు, మలుపు బుక్స్ సౌజన్యంతో “నెచ్చెలి” పాఠకుల కోసం ప్రత్యేకంగా “రాగో” నవలను ఈ నెల నుండి ధారావాహికగా అందిస్తున్నాం. 

అడగగానే “రాగో” నవలను ప్రచురించడానికి సమ్మతించిన శ్రీ ఎన్. వేణుగోపాల్ గారికి, శ్రీ బాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు.

***

“రాగో అంటే రామచిలుకే గాని పంజరంలో చిలుక కాదు. అర్థం లేని కట్టుబాట్లను మనస్సు లేని మనువును ఎదిరించి, అడవిలోకి, అక్కడి నుంచి ఆశయంలోకి పయనించిన వీరవనిత. మట్టి మనుషులు, అడవి మనుషులు మహా సంగ్రామంలో అద్భుత శక్తులుగా ఎదిగే చారిత్రక క్రమాన్ని వ్యక్తిమాత్రం నిదర్శనం రాగో. అడవి కడుపులో ఆయుధంతో అనునిత్యం కత్తి అంచుమీద నడుస్తూనే మిగుల్చుకోవడానికి కాలం వ్యాకోచించదు కనుక క్రమశిక్షణకు లోబడి ఓవర్ టైం పనిచేసి సృజనశీలియైన సాధన రాసిన రెండో నవల రాగో. అడవిలో మనుషులుంటారని, ఆ మనుషులకు అభిమానాలు, అభిజాత్యాలు ఉంటాయని – ఆ మనుషులు, వాళ్ళ మధ్యన మరో ప్రపంచపు మనుషులు కలిసి అనురాగాల, అభిమానాల, ఆదర్శాల ఒక స్వాప్నిక ప్రపంచం కొరకు ఒక కఠోర సాయుధ పోరాటం చేస్తున్నారని సాధన నవలలు ‘సరిహద్దు’, ‘రాగో’ సాధికారికంగా ప్రతిఫలిస్తాయి.”

***

అంకితం 

దండకారణ్య రాగోలను ప్రపంచానికి పరిచయం చేయడానికి క్షణం క్షణం ఆరాటపడి వారి జీవితాల్లో జీవితమై, వారి కష్టసుఖాల్లో భాగమై వారి ప్రేమకు పాత్రుడై వారికి నిజమైన నాయకుడైన మా ప్రియమైన ‘భూమన్న’ కే అంకితం-

– సాధన (మల్లోజుల వేణుగోపాల్)

***

 

నా రాగో మా మాస్టర్ కే అంకితం

1991 జూన్ నెలలో నేను రాగో నవలను పూర్తి చేశాను. సాహితీ మిత్రులు సృజన మాసపత్రికలో సీరియల్ గా వేసి, తదనంతరం మొత్తం నవలను అచ్చువేసి తెలుగు పాఠకులకు అందించారు. వారికి నా కృతజ్ఞతలు. నా రాగో నవలను సంస్కరించడంలో మాస్టార్ సల్పిన కృషి, నన్ను ఒక రచయితగా ఎదిగించడానికి ఆయన చెందిన తపన నాకు చిరస్మరణీయం. నవల ప్రారంభం నుండి చివరి వరకు పదం – పదం అత్యంత శ్రద్ధతో విని, తగిన మార్పులు సూచించడంలో మాస్టార్ కనపరచిన ఆసక్తిలో దండకారణ్య రాగోలను ప్రపంచానికి తెలపాలన్న, ప్రపంచంలో కలపాలన్న ఆరాటం వ్యక్తమయ్యేది. ‘రాగో’ పేరు సూచించినది, ఒక రకంగా ఖరారు చేసిందీ మాస్టారే అని సగర్వంగా నేను గుర్తు చేసుకుంటున్నాను. ‘రాగో’ పేరు సూచించిన సందర్భంలో ‘రెక్క విప్పిన రెవల్యూషన్’ జ్ఞాపకం చేసేవాడు. ఎందుకో! ఆరు పదులకు దగ్గరవుతున్న వయస్సులో రోజుకు కనీసం 4-5 గంటలు (15-20 కి.మీ) నడుస్తూనే, విరామ సమయాల్లో నన్ను పలకరించేవాడు. దానర్థం కలం – కాపీ తీసుకొమ్మనే. అలసిన మాస్టారు విశ్రాంతి అవసరమనే సలహా ఇచ్చినా, చిరునవ్వులతో “ఫరవాలేదు” అనేవాడు. మరీ ఎండాకాలంలో మా అవస్థలు అనేకం. స్నానానికి నీళ్ళుండవు. వారానికి ముందు అలాంటి ఆలోచనే రాదనుకోండి. చెమట “కంపు”తో తడిసిన ఒంటి బట్టలు, దుమ్ముబట్టిన ఒళ్లు, దాహం గొన్న గొంతుక, నీడ కూడా కరువైన అడవి, పొద్దుతో పోటీ పడుతూ నడక గల సాధారణ గెరిల్లా జీవితంలో అంబలి తాగడంతోనే – మా దిద్దుబాటు (నవల) పనికి మేం ఉపక్రమించే వాళ్ళం. “వెళ్దాం పదండి” అంటూ కమాండర్ కాషన్ ఇచ్చేవరకు మా పని ఆగేది గాదు. మధ్యలో ఉండబట్టలేక “మాస్టారు టీ అడుగుదామా” అని అడిగితే కోటా లేదని గుర్తు చేసేవాడు. అబ్బా! మీకు ఇంత ఉచితంగా ఉంటే మేధావులు జడుసుకొని, మనలను అనరాని మాటలంటారంటే, అనకుంటే వాళ్లు ‘మేధావులే’ కారని గమ్మత్తు చేసేవాడు. ఇలాంటి ఎన్నెన్నో అనుభవాల మధ్యనే ‘రాగో’ను నడిపించేవాడు.

రాగో నవల పూర్తయ్యాక సాహితీ మిత్రులకు పంపిస్తే, అందులో ఒక దగ్గర రాగో జీవితంలో ఏదో వెలితి ఉందని, పూడ్చాలనీ కోరారు. ఆ పని ఇక నేను చేయలేనని చేతులు ఎత్తేసి మాస్టార్ నే చేసి పెట్టమంటే, ఎంతో అనునయంగానే తృణీకరిస్తూ, సాహితీ మిత్రులు కోరినట్టు ఆ గ్యాప్ నాతోనే పూర్తి చేయించాడు. స్వతహాగా ఏ వాక్యం, ఏ ఒక్క పేరా కూడా ముట్టుకోవడానికి పూనుకోక పోయే వాడు. ప్రతీది నాతోనే, నా చొరవ పెరిగే విధంగా, నా రచనా విధానం మెరుగుపడే విధంగా నన్నెదిరించడానికి మాస్టార్ ప్రతి మాట, ప్రతి చర్య తోడ్పడింది. అలాంటి కామ్రేడ్ మాస్టార్ 28 ఫిబ్రవరిన అమరుడైనట్టు, 25 ఏప్రిల్ నాడు ఒక సహచరుడు అందించిన పేపర్ క్లిప్పింగ్ ద్వారా తెలుసుకొని మా ప్రియతమ నేతను, ఒక గొప్ప సహచరుడ్ని ముఖ్యంగా నేనొక అత్యంత ఆప్తుడ్ని కోల్పోయిన జ్ఞాపకంతో నాతో నున్న సహచరులందరితో కలిసి వినమ్రంగా విప్లవ జోహార్లర్పించాము.

ఆ సంస్మరణ సభలోనే నేను నా రాగోను మా మాస్టార్కి అంకితమివ్వాలన్న నిర్ణయానికి వచ్చాను.

1990 మార్చి నుండి 1991 జూన్ వరకు కామ్రేడ్ మాస్టార్ తన 64 సంవత్సరాల జీవితంలోని 15 నెలలు ఆలివ్ గ్రీన్ డ్రెస్సులో, తలకు ఐదు కోణాల నక్షత్రం గల టోపి, భుజానికి 30 కార్బైన్ తుపాకి వేళ్ళాడుతుంటే, వీపుకు కిట్టుతో, కళ్ళజోడు పెట్టుకొని మా మధ్య తిరిగిన ఆయన జీవితాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నాం.

1989-91 మధ్యకాలంలో గల ఆనాటి నాయకత్వం ఆయనపై అతిగా తీసుకున్న క్రమశిక్షణా చర్యకు నిజమైన కాకలు తీరిన కమ్యూనిస్టుగా కట్టుబడి ఉన్న కాలమది. కామ్రేడ్ మాస్టార్ 15 నెలల కాలమే మా మధ్య ఉన్నప్పటికీ, దండకారణ్య ఉద్యమ ప్రారంభం నుండి మొదలుకొని నేడు చేపట్టిన గెరిల్లాజోన్ ఉన్నత కర్తవ్యాల వరకు ప్రతి అభివృద్ధితో విడదీయరాని సంబంధం పెనవేసుకపోయి ఉంది.

నాకు సుపరిచితుడైన మా మాస్టారు అతని 54వ యేట తొలిసారిగా నేను నా మూడు పదులు నిండని వయస్సులో సైనిక దుస్తుల్లో, ‘మిలట్రి క్యాంపు’లో చూశాను. సైనిక శిక్షణా శిబిరంలో మేము ఇద్దరమే గాకుండా మరెందరో విద్యార్థులున్నారు. అందరిలోకి మా మాస్టార్ దే పెద్ద వయసు. నెల రోజులు సాగిన ఆ కఠినమైన శిక్షణలో ఒక సైనిక విద్యార్థిగా మిలటరి ఇన్‌స్ట్రక్టర్ నేర్పిన ప్రతి అంశాన్ని పట్టుదలగా, ఉక్కు క్రమశిక్షణతో నేర్చుకున్నాడు. 40 నిముషాలు రన్నింగ్ ట్రాక్ లో మాతోపాటు పరిగెత్తిన పిదప, మెయిన్ గ్రౌండ్ లో మొబిలిటి, విండ్యూరెన్స్ వ్యాయమాలు చేయడంలో లీనమయ్యేవాడు. ఇవి అవుతుండగానే ‘ఇమ్మిడియేట్ ఆక్షన్ డ్రిల్’లకు రంగంలోకి దిగాలనే కాషన్ ఇచ్చేవాడు ఇన్ స్ట్రక్టర్. ఇంకేం! అనుసరించాల్సిందే! కాకపోతే బెత్తంతో వాయించేవాడు ఆ ఇన్స్ట్రక్టర్. వయసురీత్యా మా మాస్టారు క్రాలింగ్, బెండ్ రన్ కష్టమనుకునేవాడిని నేను. కానీ, వీపున పెట్టిన బండ కింద పడకుండా, బండను పట్టుకునే ప్రయత్నానికి పూనుకోకుండా (అలా చేస్తే బెత్తం పిర్రలను బాదేస్తుంది). మాతో పోటీ పడ్డట్టే పాల్గొనేవాడు. ఒక మేధావిననో, నాది సున్నిత మనస్తత్వమనో ఎలాంటి ఫాల్స్ ప్రిస్టేజికి గురికాకుండా తన గొప్పదైన ఆశయం కోసం అతను తనలాగే విప్లవాశయం కోసం నడుం బిగించిన వారందరితో కలిసి బ్బాడ్ వైర్ కింద లెపర్ట్ క్రాల్ చేసేవాడు. విప్లవ వీరుల సైనిక శిక్షణా శిబిరంలో కూడా బెత్తం పట్టి కొట్టి నేర్పడమేంటి? అన్న చర్చ ముందుకు వచ్చిననాడు, బెత్తం పట్టడాన్ని ఖచ్చితంగా ఖండిస్తూనే మా మాస్టారు, మనకు నేర్పే మిత్రుడు పొందిన శిక్షణే అలాంటిదైనప్పుడు అతని నుండి మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు మరిక భరించక తప్పుతుందా అంటూనే రేపు మనమే స్వంతంగా నిర్వహించే ఏ క్యాంపులోనూ మీరు ఇలాంటి బెత్తాలు పట్టి నేర్పబోకండి సుమా? అంటూ చేసిన హెచ్చరిక నేటికి అక్షరాలా అమలవుతుంది. బూర్జువా సైనిక అధికారులు జీతాల కోసం నేర్చేవారికి దెబ్బలతో, తన్నులతో, శిక్షలతో నేర్పిస్తారు. కానీ, విప్లవ చైతన్యం కల గెరిల్లాలకు, తమ చివరి నెత్తుటి బొట్టు వరకు పోరాడి శత్రువును నిర్మూలించాలన్న దృఢమైన సంకల్పంతో రణరంగంలో నిలిచిన ప్రజా యోధులకు శిక్షణ ఇచ్చే పద్ధతుల్లో కూడా ఖచ్చితమైన తేడాలుండాలనీ మాస్టార్ వివరణ ఇచ్చేవాడు. 1989 తర్వాత మా పార్టీ మిలటరీ క్యాంపుల్లో ఈ పద్ధతి పాటించడాన్ని నిషేధించింది. 1987 మిలట్రి క్యాంపుల్లో అభ్యసించిన ఢిల్లులు, ఎక్సర్ సైజులు మా మాస్టారు అడవి జీవితంలో ఎంతో ఉపయోగపడినాయి.

1990 మార్చిలో మాస్టార్ గడ్చిరోలి చేరుకున్నాడు. గోండి రాదు. గోండుల మధ్య జీవించాలి. వృత్తిరీత్యా ఒకనాడు ఉపాధ్యాయుడు. ఇవాళ పూర్తి సైనిక జీవితం గడపాలి. ఉద్యోగ జీవితంలో ఫైళ్ళు మోసోడో లేదో తెలియదు కానీ గెరిల్లా జీవితంలో తుపాకితో పాటు కనీసం 10 కిలోల బరువు ప్రతివారికి తప్పదు. సాహితీ కళా రంగాలలో ఎంతో అభిరుచి. కానీ ప్రజా సైనికుడిగా సమర రంగాన యుద్ధం చేయక తప్పదు. ఇలాంటి వైవిధ్యపూరితమైన జీవితంలోని విభిన్న అంగాలను రంగరించుకొని మన సొంత వ్యాపకాలు, అలవాట్లు భౌతిక వాస్తవికతతో విభేదించకూడదన్న స్ఫూర్తితో యుద్ధ రంగంలోని అవసరాలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చిన నిషాపరుడు, నిజంగా, వ్యక్తి ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యం ఇవ్వడం కాకుండా, లక్ష్యసాధనలో ముందుకు వచ్చిన ఏ కర్తవ్యాన్నైనా ఎలాంటి శషభిషలు లేకుండా చిత్తశుద్ధితో స్వీకరించాలన్న సంస్థ నియమావళికి, క్రమశిక్షణకు కట్టుబడిన నిజమైన గొప్ప ప్రజాస్వామ్యవాది. అందుకే ప్రజల్లో జీవించగలిగాడు. ప్రజాయుద్దానికి ప్రాణాలర్పించగలిగాడు.

మాస్టారు గడ్చిరోలిలో ఉంటాడని పార్టీ అప్పగించిన్నాడు నిజంగా సంతోషించిన వాడిలో నేనొకడని కానీ, అంతకన్నా ఆందోళన చెందిన వారిలో మొదటి వాడినేమో చీకటి రాత్రుల్లో మసక వెలుతుర్లే ఆధారం. ఎర్రటి ఎండలో అడవి మార్గాన నడవాలి, నీచు వాసన లేని అన్నం కోరుకోకూడదు (ఆదివాసులు మాంసప్రియులు కదా). పులిసిన అంబలి పాయసంలాగానే సేవించాలి. ఇవన్నీ “వైట్ మ్యాన్” (ఈ పేరు అతని రంగుని బట్టి తగిలించారు) చేయగలడా అని అనుకోలేదు. కానీ దిన దినం శత్రువు వేట తీవ్రతరమవుతున్న పరిస్థితుల్లో ఒకవేళ మాస్టారున్న సందర్భాల్లోనే కాల్పులే జరిగితే, శత్రువే వెంటాడితే పరుగెత్తగలడా! లాంటి సందేహాలు తలెత్తేవి కానీ మాస్టారున్న సందర్భంలో అలాంటి ఘటనలేవి ఎదురు కాలేదు. మా ఆందోళన పసిగట్టిన మా మాస్టారు “నన్నెప్పుడూ మళ్ళీ డెన్ జీవితానికే నెట్టాలని చూస్తున్నారా” అంటూ హృద్యంగా మాట్లాడేవాడు. మాస్టారు ఆ వయసులో అడవిలో మాతోపాటు ‘సునాయాసంగా’ సంచరిస్తుంటే, ఊళ్ళల్లో చాలామంది ముఖ్యంగా అతని సమవయస్కులు ముక్కున వేలేసుకునేవారు. “ముయితోర్. హుషార్ మాంతోర్” (ముసలాడు హుషారుగున్నాడు) అని నవ్వుకునేవారు. మాస్టారుకు గోండి రాకున్నా ప్రేమించే హృదయముంది. కాబట్టే గోండి ప్రజలను ప్రేమించాడు. పలకరించాడు. గౌరవించే విజ్ఞత ఉంది. కాబట్టే ప్రజలను పూజించాడు అందుకే ప్రజాయుద్ధ పంథాలో అజేయుడైనాడు.

మాస్టారు దండకారణ్యంలోని గెరిల్లాల గుండెల్లో చిరస్మరణీయుడు. ఎంత చిన్నవాళ్ళనయినా ఆప్యాయంగా ‘దాదా’, ‘దీదీ’ అంటూ సంబోధించేవాడు. చదువురాని గెరిల్లాలకు చదువెల్లా నేర్చుకోవాలో ఓపికగా బోధించేవాడు. అడవిలో తనకు తెలియని ఎన్నెన్నో విషయాలు శ్రద్ధతో తెలుసుకునేవాడు. అతడొక విద్యార్థి – అతడొక మేధావి? అతడొక సైనికుడు – అతడొక నాయకుడు, ఆడంబరాలు ఎరుగనివాడు, అహంభావం తెలియనివాడు.

“మా మాస్టారు ఆకలితో గడిపిన ఒక రాత్రి కూడా నాకు ఇంకా గుర్తుంది”. దళం వడివడిగా నడుస్తుంది ఒకరు మరొకరిని పలకరించడం లేదు. అది ప్రయాణ నియమం. మా దళం కన్నా వేగంగా మబ్బులు కమ్ముకొస్తున్నాయి. కుండపోత వర్షం రానుందని హెచ్చరికలు వినబడుతున్నాయి. కోయందూడ్ చేరాలంటే వాగు దాటాలి. భారీ వర్షం వస్తే దాటలేమన్న అనుభవంతో పరుగులాగే సాగుతుంది నడక. అయినా, వర్షం దారిలోనే అందుకుంది. ఇంకేం! కిట్టులో నుండి పాలీన్ తీసి కప్పుకున్నాం నడక వేగం పడిపోయింది. “పడిపోయేరు భూమన్న జారుతుంది” అంటూనే జోగన్న (కమాండర్) అంత పనీ చేశాడు. “చెప్పితే సరిపోతుందిగా – చూయించడమెందుకు” అన్న మాస్టార్ హాస్యంతో వారు చేరుకున్నాం. “ఆ పూట అక్కడే బస. ఎటూ దారిలేదు వెన్నెల రాత్రులు. వర్షం తగ్గింది. ఏ పాటు తప్పినా సాపాటు తప్పుతుందా” అంటూనే మెక్కేవాళ్ళ హాస్యాలతో మా “గానకచేరి” మొదలైంది 10 గంటల వరకు పాటలు ఆకలిని మరిపిస్తే, ఆ తర్వాత నిద్ర రంగ ప్రవేశం చేసింది. చిటపట చినుకులకు తడవకుండా పైనో పాలిన్ కప్పేసుకొని మేను వాల్చిన వారి పక్కలు సర్దడంలోసహాయపడుతూ భూమన్న ప్రతివారికి బెల్లం – పల్లీలు కొంత కొంత పంచాడు. తన కోసం దళం కేటాయించిన మెడికల్ ఫుడ్ ను ఆ రాత్రి ఆకలిగొన్న తన గెరిల్లా సహచరులందరికీ పంచి తాను వాళ్ళ ఆకలిని పంచుకొని పాలిన్ కప్పుకున్నాడు. విప్లవకారులకు ఉండవలసిన సహృదయత, వినమ్రత, ప్రేమగుణం, జవాబుదారీతనం అన్ని మాస్టారులో బలంగా ఉన్నందునే విప్లవ కమ్యూనిస్టు పార్టీలో దృఢమైన క్రమశిక్షణ పాటిస్తూ నాయకుడు కాగలిగాడు. అదే మాస్టార్ గొప్పతనం. ఇవి కొరవడినవారు విప్లవ పార్టీకి ఆమడ దూరంలో ఉండడమో, లేదా విప్లవోద్యమం నుండి జారుకోవడమో చేస్తూ చరిత్ర పుటల్లో నిల్చిపోతున్నారు.

దండకారణ్యంలో మాస్టార్ పేరు భూమన్న. భూమి పుత్రులతో కలసి భూపోరాటంలో నిలిచినవాడు. భూమి భుక్తి విముక్తి కోసం పోరాడినవాడు. “దున్నేవానికే భూమి” అంటూ నినదించినవాడు. మాతో గడిపిన 15 మాసాల జీవితంలో అతని నుండి ఎన్నెన్నో నేర్చుకున్నాం. శ్రీశ్రీ, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, చలసాని ప్రసాద్, కుటుంబరావుగార్ల చరితలన్ని చెప్పేవాడు. సాధారణ మేధావులందరి బలహీనతలను చెవిలో వేసేవాడు. వారితో మర్యాదగా వ్యవహరించాలనీ, వారంతా మన విప్లవ క్యాంపులో ఉండాల్సిన వారేనని, మనవాళ్ళ గూర్చి మరీ మరీ చెప్పేవాడు. కమ్యూనిస్టు పార్టీ అన్నా నగ్జల్బరీ వారసత్వమన్నా, సంస్థ క్రమశిక్షణ అన్నా విప్లవ హింస అన్నా వారిలో గల పొరపాటు ధోరణులను సెలవిచ్చేవాడు “ప్రజాస్వామ్యం – నియంతృత్వం” పట్ల వారికి గల భ్రమలను, అపోహలను తొలగించాలనేవాడు. మేధావుల లోతుపాతు లెరిగిన అసలైన మేధావి మన ఐ.వి. శ్రీకాకుళ ప్రకాశం.

అమెరికా తదితర సామ్రాజ్యవాదులు ఇరాక్ పై ప్రకటించిన యుద్ధాన్ని (1991) వ్యతిరేకిస్తూ దండకారణ్య గోండులు పల్లెల్లో కాగడాలతో ఊరేగింపులు తీస్తుంటే వారికి నినాదాలు రూపొందించి ఇచ్చినవాడు మన భూమన్న. దండకారణ్య ఆదివాసి కిసాన్ మజ్జూరంగ్ రాష్ట్ర రెండవ మహాసభల్లో ప్రతినిధులందరితో కలిసి రాజకీయాలను చర్చించినవాడు మన భూమన్న. శత్రువును దునుమాడడానికి సిద్ధమైన గెరిల్లాలకు పథకాలు రూపొందించి రిహార్సల్స్ నేర్పినవాడు. 1991లో పార్టీ నిర్వహించిన రాజకీయ తరగతులకు అతనొక ఎన్ సైక్లోపీడియా. భార్య-బిడ్డలు గుర్తొచ్చిననాడు దాచుకోకుండా, వారితో గల తన అనుభవాలన్నీ మాతో పంచుకునే వాడు. ఇలా అన్ని విధాలుగా, అన్ని విషయాల్లోనూ మాతో అతని అనుభూతులను పంచుకొన్న మా ప్రియమైన భూమన్న మా త. ఆ ప్రజాయుద్ధ నాయకుడికి – వారసుడికి మరొక్కసారి వినమ్రంగా విప్లవ జోహార్లర్పిద్దాం.

సృజన పత్రిక ఆగిపోవడంతో, సాహితీమిత్రుల కేంద్రం తెలియకుండా పోయినందున ‘అరుణతార’ ద్వారా నా నిర్ణయాన్ని తెలియజేస్తున్నాను. ఇకపై ‘రాగో’ను ముద్రించేవారెవరైనా (ఏ భాషలోనైనా)

“దండకారణ్య రాగోలను ప్రపంచానికి పరిచయం చేయడానికి

క్షణం క్షణం ఆరాటపడి

వారి జీవితాల్లో జీవితమై,

వారి కష్టసుఖాల్లో భాగమై

వారి ప్రేమకు పాత్రుడై

వారికి నిజమైన నాయకుడైన

మా ప్రియమైన ‘భూమన్న’కే అంకితం”

అన్న మాటలు సహృదయంతో చేర్చగలరని మనవి.

– సాధన

(అరుణతార మాసపత్రిక నవంబర్ 1997 నుండి)

***

 

ఆకాశంలో సగం కోసం (ముందుమాట)

భారతదేశంలో సుమారు పదకొండు కోట్ల మంది ఆదివాసులు జీవిస్తున్నారు. భారతదేశంలో వర్గ సమాజం రూపొందుతున్న క్రమం నుండి ఆదివాసులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఆధిపత్య శక్తులకు లొంగిపోయిన ఆదివాసులు వాళ్ళ ఆర్థిక హోదాను బట్టి కులహోదాను సంతరించుకున్నాయంటారు కోశాంబి. ఈ పోరాటాల చరిత్ర అట్లా ఉంచితే – ఈ ఘర్షణ లొంగుబాట్లలో ఆదివాసి జీవితంలో మనిషిని అణచిపెట్టే ఖాయిదాలు (సంప్రాదాయాలు) అనేకం వచ్చాయి. ఫలితంగా ఈ ఆదివాసులు సమస్త పీడనలను, దోపిడీని ఎదురించాలంటే తమతో తాము – సమస్త పీడలను కాపాడే రాజ్యంతో పాటు యుద్ధం చేయవల్సిందే. అలాంటి యుద్ధంలో ఆదివాసులను సమీకరించడం కోసం దండకారణ్యంలో 1980 నుండి విప్లవకారులు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదురైన అనుభవాలను తమకు సాధ్యమైన రీతిలో సాహిత్యీకరించడానికి అలాంటి పనిలో ఉన్నవాళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారు. అలాంటి సాహిత్యకారుల్లో అనేక వ్యాసాలు, సరిహద్దు, రాగో (గోండి భాషలో రామచిలుక) రాసిన సాధన కృషి చెప్పుకోదగినది.

సమస్త కళలు, సాహిత్యం అస్థిత్వంలో ఉన్న అధికార రాజ్యపు భావజాలంతోనే నిండి ఉంటాయి. ప్రజాపోరాటాల నేపథ్యంలోనే ప్రజా సాహిత్యం వస్తుంది. ప్రజా పోరాటాల స్థాయియే ప్రజా సాహిత్యపు తీరుతెన్నులను నిర్ణయిస్తుంది. ప్రజా పోరాటాలను గుర్తించి నడిపించే శక్తులే ఇలాంటి సాహిత్యాన్ని ఆదరిస్తారు. ఈ స్థాయి, సందర్భము అర్థం కాకుంటే సాహిత్యం గురించి విడిగా ఆలోచించి చాలా మంది గాభరపడుతారు.

సాధన రచయితగానే కాకుండా అతను సాహిత్యం ద్వారా అన్వేషించిన ప్రశ్నలు, చెప్పిన అనుభవాలు బహుశా సాహిత్యం చదివే చాలా మందికి కొత్త.

ఆదివాసుల గురించి వచ్చిన సాహిత్యం మిగతా సాహిత్యంతో పోల్చుకుంటే చాలా తక్కువ. అందుక్కారణం వాళ్ళు అనేక సంవత్సరాలుగా సభ్య సమాజానికి దూరంగా ఉండడమే. బీహార్ ముండా ఆదివాసుల గురించి మహాశ్వేతాదేవి ఒరిస్సాలోని జాతావుల గురించి గోపీనాథ్ మహంతి లాంటి వాళ్ళు నవలలు రాశారు. ఈ సాహిత్యం వ్యక్తులుగా ఆదివాసి జీవితాన్ని దర్శించిన తీరు తెలుపుతుంది.

కాని 1980 తరువాత అడవి ప్రాంతాల్లోకి విస్తరించిన ప్రపోరాటాలు ఆదివాసి జీవితంలోని సమస్య వైరుధ్యాలను అధ్యయనం చేయవల్సి వచ్చింది. ఈ అధ్యయనపు నేపథ్యంలోనే – సాహు – అల్లం రాజయ్య గోండుల జీవితం మీద కొమురం భీం నవల వచ్చింది. ఈ నవల ఆదివాసి ప్రాంతంలోని రాజ్యాన్ని, దోపిడిని చర్చించింది. ఈ దోపిడి రాజ్యంతో ఆదివాసులు సాగించిన పోరాటంలోని వైఫల్యాలను విశ్లేషించింది. అంతకన్నా భిన్నంగా నడుపాల్సిన పోరాట ఆవశ్యకతను గుర్తించింది. ఆదిలాబాదు జిల్లాలో ఆదివాసులను దోపిడి చేయడానికి బయటి శక్తులెట్లా చొరబారి నిలదొక్కుకున్నాయో వసంతరావుదేశ్ పాండే నవల అడివి చర్చించింది. సాహు రాసిన అనేక కథలు, పాటలు, వ్యాసాలు జరుగుతున్న ఆదివాసి పోరాటాలను ఎప్పటికప్పుడు చిత్రించాయి. అడవిలో వెన్నెల కథా సంకలనం ఇలాంటి కథలతో వచ్చింది.

పులి ఆనంద్ మోహన్ నవల వసంతగీతం ఆదివాసి జీవితానికి – మైదాన ప్రాంతంలోని ఆదివాసియేతర జీవితానికి ఉండే సంబంధాన్ని, రాజ్యం తన సమస్త అంగాలతో ఈ రెండు ప్రాంతాలల్లోన్ని జనాన్ని ఏ విధంగా అణచి వేస్తున్నదో? అక్కడ కాలూనుతున్న పోరాటాలు ఎంత చిన్నవైనా దోపిడి యంత్రాంగం ఏ విధంగా కదిలిపోగలదో ఇరుపక్షాల చరిత్రను చిత్రీకరించింది.

సాధన నవల సరిహద్దు 1985 తర్వాత కాలానికి సంబంధించినది. 1985 తరువాత విప్లవ ఆచరణలో వచ్చిన అధ్యయనం ఈ నవలలో కనిపిస్తుంది. ఈ నవలలో సాధన ఆదివాసియేతర – ఆదివాసి అనుభవాల సారాంశం ఈ నవల నిండా కన్నిస్తుంది. విప్లవ సాంప్రదాయిక సాహిత్యంలో ఉండే కాల్పనికత – బోధనల నుండి జఠిలమైన యాతన, పీడనల సమాజంలోని అనేక అంశాలను ఇంకా లోతుగా అధ్యయనం చేయాలని ఈ నవల ప్రతిపాదిస్తుంది. రూపం, భాష తదితర విషయాలల్లో సరిహద్దు నవల సాధన మొదటి నవల.

సాధన రెండో నవల రాగో. ఒక రకంగా సరిహద్దు నవల కొనసాగింపులాగా కనిపిస్తుంది ఈ నవల. పాత్రలు కూడా చాలా వరకు రెండు నవలల్లో ఒకే పాత్రలు. కాని ఈ నవల వస్తువులో రూపంలో పూర్తిగా భిన్నమైనది.

రాగో యుక్త వయస్కురాలైన మాడియా గోండు యువతి. గోండుల్లో ఉన్న ఆచారం ప్రకారంగా రాగో చిన్నపిల్లగా ఉన్నప్పుడే రాగో తండ్రి పిల్ల నిస్తానని ఒక బీద యువకున్ని లామడే (ఇల్లరికం) తెచ్చుకున్నాడు. రాగో శారీరకం గానే కాక, మానసికంగా కూడా ఆ యువకున్ని ఇష్టపడలేదు. అదే గ్రామంలోని మరొక పెళ్ళయిన యువకునితో రాగోకు సంబంధం కలిసింది (బహు భార్యాత్వం ఉంది). పెళ్ళి కాదంటే రాగో తండ్రి లామడే యువకునికి అన్ని సంవత్సరాలకు జీతం కట్టాలి – బలవంతపు పెళ్ళి నుండి తప్పించుకొని కోరుకున్న వాని ఇల్లుసొచ్చింది అతను ఉంచుకుంటే ఆ యువకుడికి జీతం ఇచ్చుకోవాలి. కోరుకున్నవాడు భయపడ్డాడు. రాగోను పశువును బాదినట్లు బాదుతూ మళ్ళీ తీసుకవచ్చారు. రాగో ఈ దుర్మార్గమైన ఖాయిదాను ఖాతరు చెయ్యదలచుకోలేదు. తప్పించుకున్నది. అడవిలో చెట్లు పుట్టలు పట్టి తిరిగింది. చివరకు స్నేహితురాలు ఇల్లు చేరుకున్నది. మళ్ళీ తండ్రికి దొరికింది. మళ్ళీ తన్నులు గుద్దులు. మళ్ళీ రాగో తప్పించుకున్నది. ఈసారి మాడియా మనుషులేకాదు మనుషులంతా దుర్మార్గులేనని వ్యక్తులుగా మంచివాళ్ళుగానే ఉన్నా? తనలాగే పెనుగులాడినా చివరకు ఖాయిదా వాతబడి మనుషులపట్ల ముఖ్యంగా స్త్రీలపట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తారని ఆలోచించింది. అడివిలో తిరుగుతూ తనకు పరిచయమున్న సమస్త మానవ సంబంధాల గురించి ఆలోచించింది. ఆ విధంగా దారితెన్ను కానకుండా తిరుగుతున్న దశలో దళంతో కలిసి – అక్కడి నుండి రాగో దళ జీవితంలో ఊపిరి సలుపకుండా తిరుగుతుంది. తనొక్కతే అనుభవించిన క్షోభ – స్వేచ్ఛ కోసం పడిన ఆరాటం మాడియా స్త్రీలందరిలోనూ చూస్తుంది. ఈ బాధలు ఖాయిదాల స్వరూప స్వభావాలు – అవి మొత్తం ఆదివాసి జీవితంలో పెనవేసుకపోయిన తీరు అర్థం చేసుకుంటుంది. పార్టీ సభ్యత్వము, తండ్రి రాగోను ఆమోదించడంతో నవల ముగుస్తుంది.

ఈ నవల రాగో లేవనెత్తిన ప్రశ్నల రూపంలో ఆదివాసి ఖాయిదాలకు సంబంధించినట్టు కన్పించినా ఇవి ప్రపంచ ప్రజలవి. ముఖ్యంగా ప్రపంచ జనాభాలో సగ భాగంగా ఉన్న స్త్రీలకు సంబంధించినవి.

సకల మానవ సృష్టిని, వ్యక్తీకరణను నియంత్రించే క్రమంలోనే రాజ్యం తనను తాను నిలబెట్టుకున్నది. రాజ్యం తన మనుగడ కోసం వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, వ్యక్తీకరణను నియంత్రించే నిర్మాణ రూపాలను రూపొందించుకున్నది. అలాంటి నిర్మాణ రూపంలో చాలా పురాతనమైనది, సంక్లిష్టమైనది, జటిలమైనది ఇంతవరకు జరిగిన వర్గపోరాటాల్లో కూడా మిగిలి ఉన్నది కుటుంబం. అయితే రాజ్యంతో మానవులు జరిపిన పోరాటాల చరిత్ర తెలిసినంతగా మానవులు కుటుంబంతో జరిపిన పోరాటాల చరిత్ర (ఒక్క టాల్ స్టాయ్ అన్నా కెరీనా తప్ప) ముఖ్యంగా భారతీయులకు కొత్త. ఉత్పత్తి, పునరుత్పత్తి, లింగ భేదాలతో పాటు అనేక పీటముళ్ళతో ఈ చరిత్ర నిండి ఉన్నది. అయినా అనివార్యంగా ఈ కుటుంబంతో, కుటుంబంలో మానవులు ఎడతెగని ఒంటరి పోరాటాలు చేస్తున్నారు. మనం ఇప్పటి దాకా చూసిన అన్ని రకాల సమాజాలల్లో ఈ పోరాటం కొనసాగుతూనే ఉన్నది. కుటుంబం పురుషుల కన్నా స్త్రీలను దాదాపు సంపూర్ణంగా అణచివేసింది. కుటుంబంలో జరిగిన భయంకర యుద్ధంలో స్త్రీలదే ప్రధాన పాత్ర.

రాగో ప్రశ్నలన్నీ ఇట్లాగా నిర్మితమై కొనసాగుతున్న కుటుంబానికి సంబంధించినవి. రాగో రామచిలుకలాగా స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురాలనుకున్నది. మనిషిని మనిషి చేరుకోవడానికి ఉన్న సమస్త అడ్డంకులను ప్రశ్నించింది.

అయితే ఇలాంటి స్వేచ్చకు వ్యక్తీకరణకు సంబంధించిన రాగో దళంలో చేరడంతో అన్ని ప్రశ్నలకు జవాబు దొరికిందా? మహా అయితే ప్రశ్నలు మరింత జటిలమయ్యాయి. దళంలో తిరిగి విప్లవ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మనుషుల సమస్త బంధనాలు త్రేంచేయగలమని రాగో తనకు తాను జవాబు చెప్పుకున్నదా? దళంలో ఉండే ఇతర సభ్యులందరికి ఇలాంటి ప్రశ్నలున్నాయి. తీరిక లేని దళ కార్యక్రమంలో తిర్గడానికి – ప్రజాపోరాటాలు నిర్ణయించడానికి మధ్య చర్చించని అగాధం – చాలా ముఖ్యమైనవి.

ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త ఉద్రిక్తతలతో యాతనలతో విసిగి వేసారి జనం తమ సంపూర్ణ వ్యక్తీకరణ కోసం, స్వేచ్ఛ కోసం పోరాడడానికి సిద్ధపడతారు. ఇలాంటి స్వేచ్ఛను ఆర్తితో పట్టించుకొని నూతన ప్రజాస్వామిక విప్లవాచరణలో ఓపికగా నడిపించగల్గినప్పుడే సమస్త పీడనలు పోవడానికి మార్గం సుగమమౌతుంది.

అడవిలో ఒంటరిగా తిరుగుతూ రాగో వేసిన ప్రశ్నలు నిజానికి దళం ముందు చెప్పనేలేదు. బహుశా ఆ వొత్తిడిని తట్టుకోలేక దారీతెన్నూ కానక దొరికిన దారిలో నడిచిందేగాని అదే అసలైన దారి అని పూర్తిగా నమ్మలేదు. అట్లని అంతకన్నా రాగోను మనిషిగా ఇదివరకు పరిగణించిన వారూలేరు.

రాగోలాగే మనుషులంతా ఎగురాలనే తీవ్రమైన అన్వేషణలో ఉన్నారు. వెతుకులాటలో ఉన్నారు….

తన్ను తాను తెలుసుకోవడమే కాదు. తనలాంటి వాళ్ళను తనతో పాటు రాగో తీసుకపోగలదా?

ప్రపంచం అతలాకుతలంగా ఉన్న ఈ సంక్షుభిత సమయంలో భవిష్యత్తు రాగో మీద ఆధారపడి ఉన్నది.

– యస్. పి. వసంత

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.