విషాద నిషాదము

సప్తమ భాగము – స్వర విలాపము

-జోగారావు

1956 నుండి సంగీత కచేరీలకు దూరమైన అన్నపూర్ణాదేవి , భర్త రవిశంకర్ కు దూరముగా, కొడుకు శుభేంద్ర శంకర్ తో ఆకాశ గంగ ఎపార్ట్ మెంట్ లో సంగీతము పలువురకు నేర్పుతూ ఉంటూండగా, 1970 వ సంవత్సరములో శుభో ను రవిశంకర్ తనతో అమెరికాకు తీసుకుని వెళ్ళిపోయేరు.
ఆవిడను ఒంటరి దానను చేస్తూ, తండ్రి ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ 1972 లో పరమపదించేరు.
1973 లో ఋషి కుమార్ పండ్య శిష్యునిగా చేరి ఆవిడ శూన్య జీవితములో కొంత స్థానాన్ని పొందేరు.
శుభో అమెరికా లో లిండా అనే అమెరికన్ మహిళను వివాహమాడి సోమ్ నాథ్,  కావేరీ అనే బిడ్డలకు తండ్రి అయ్యేరు.
సోమ్ నాథ్, కావేరీ, శుభో అప్పుడప్పుడు ముంబయ్ వచ్చి అన్నపూర్ణాదేవి తో కొన్ని రోజులు గడిపేవారు. వారు వచ్చినప్పుడల్లా, ఆవిడ సామాన్య గృహిణి వలె మనుమడు మనుమరాలితో ఆడుకునేవారు.
మానసికంగా దూరమయిన ముప్పది యేళ్ళ తరువాత, విడిపోయిన పదిహేనేళ్ళ పిదప అక్టోబర్ 1982 లో రవిశంకర్ చట్ట పరముగా అన్నపూర్ణాదేవి కి విడాకులు ఇచ్చేరు.
ఆవిడ ఎంత క్షోభించేరో ఎవరికి తెలుసు?
అయినా, ఆవిడ తన సంగీత సాధనను కొనసాగిస్తూ శిష్యులకు బోధిస్తూనే ఉన్నారు.
సుమారు మూడు నెలల తరువాత ఋషి కుమార్ పండ్య ధైర్యము చేసి అన్నపూర్ణా దేవితో తనూ ఒంటరి వాడనే అని ఆవిడకి ఎప్పటిలా చేదోడు వాదోడుగా ఉంటానని చెబుతూ ఆవిడ ముందు వివాహ ప్రస్తావన తెచ్చేరు.
తన నిర్ణయం నాలుగు రోజులలో చెబుతానని అన్నపూర్ణాదేవి చాలా మధన పడ్డారు.
తన వారు అందరూ ఒక్కరొక్కరుగా దూరమయ్యేరు.
దగ్గరయిన ఋషి గడచిన తొమ్మిదేళ్ళల్లో ఎప్పుడూ హద్దు మీర లేదు.
ఇప్పుడు తన వయసు ఏభయ్ అయిదేళ్ళు. అతనికి నలభయ్యేళ్ళ మూడేళ్ళు.
తన కన్నా పన్నెండు పదమూడేళ్ళు వయసులో చిన్నవాడు.
గడచిన తొమ్మిదేళ్ళల్లో గురు మా అని సంబోధించడమే తప్ప మరొకలా పిలువ లేదు. అతనికి తన పట్ల వ్యామోహము గానీ మరే ఉద్దేశము గాని లేవు.
తన వయసా మీద పడుతోంది. ఇప్పుడు తనకు మానసిక స్థైర్యానికి, తన బాగోగులు చూసుకోవడానికి ఒక వ్యక్తి అవసరం ఎంతయినా ఉంది.
అతనే తన అంతట తను ఈ పెళ్ళి ప్రస్తావన తెచ్చినప్పుడు, అంగీకరించడమే ఉత్తమం. 
తను అంగీకరించకపోతే, ఋషికి ఏ నష్టమూ లేదు.
ఒక వేళ, ఈ వయసులో తనను విడచి ఋషి కూడా వెళ్ళిపోతే.. ?
నాలుగు రోజుల తరువాత ఋషితో వివాహానికి తన సమ్మతిని అన్నపూర్ణాదేవి తెలియచేసేరు.
చట్ట పరముగా కోర్ట్ లో వివాహము జరిగిన తరువాత, ఆర్య సమాజ పధ్ధతిలో 1982 వ సంవత్సరము డిసెంబర్ 09 వ తారీఖున అన్నపూర్ణాదేవి, ఋషి కుమార్ పండ్య ల వివాహము జరిగింది.
చట్ట పరముగా దంపతులయినా, వారి మధ్య గురు శిష్య సంబంధమే కొన సాగింది.
రోజులు గడుస్తున్నాయి.
1992 వ సంవత్సరం.
అమెరికా లో కేలిఫోర్నియా సేన్ డియాగో ఆరెంజ్ కౌంటీ లో బాన్సురీ, సితార్ లు  బోధిస్తున్న శుభేంద్ర ఆరోగ్యం క్షీణించ సాగింది.
న్యూమోనియా కారణంగా శుభేంద్ర శంకర్ 15 సెప్టెంబర్ 1992 న ఎభయ్యేళ్ళ వయసులో మరణించేరు.
సోదరుడు ఆలీ అక్బర్ ఖాన్ 18 జూన్ 2009 లో అమెరికాలో మరణించేరు.
రవిశంకర్ 11 డిసెంబర్ 2012 లో అమెరికా లోనే మరణించేరు.
నాలుగు నెలల తరువాత ఆత్మీయుడు ఋషి 13 ఏప్రిల్ 2013 న గుండె పోటుతో మరణించేరు.
వరుసగా తన వారందరూ ఒక్కరొక్కరుగా వెళ్ళిపోతుంటే, అన్నపూర్ణాదేవి బాధ వర్ణనాతీతం.
ఆవిడ ఋషి కుమార్ పండ్య అంత్యక్రియలకు వెళ్ళలేకపోయేరు.
ఎనభయ్యారేళ్ళ వయసు.
వృద్ధాప్యం మీద పడింది. శరీరం సహకరించడం లేదు.
అయినా అన్నపూర్ణాదేవి తన సంగీత సాధనను వదలలేదు.
అయిదేళ్ళు ఎలా గడిచేయో ?
చివరకు ఆ రోజు రానే వచ్చింది.
2018 వ సంవత్సరము అక్టోబర్ 12 రాత్రి అన్నపూర్ణాదేవి ఆరోగ్యము విషమించడంతో ఆవిడను ఆకాశ గంగా ఎపార్ట్ మెంట్ లోని వారు ముంబయ్ లోని బ్రీచ్ కేండీ హాస్పిటల్ లో చేర్పించేరు.
ప్రతి రోజూ ఆవిడ తన సుర్ బహార్ సాధన చేసే సమయం. 
శారదా దేవి ఆవిడ సంగీతాన్ని వినడానికి వచ్చే సమయం. 
తెల్ల వారితే 13 అక్టోబర్ 2018 శని వారం. 
బ్రహ్మ ముహూర్త సమయం. 
ఉదయము 3 గంటల 58 నిముషములకు అన్నపూర్ణాదేవి శాశ్వతముగా ఆకాశ గంగ ను వీడి సంగీతలోకాలకు పయనమయ్యేరు. సత్య లోకములో బ్రహ్మ కు ప్రక్కనే శారదాంబ వీణ కు సమ ఉజ్జీగా సుర్ బహార్ జుగల్ బందీ కి శాశ్వత స్థానము సంపాదించుకున్నందు వలన స్వయముగా శారదాంబ అన్నపూర్ణాదేవిని సత్యలోకమునకు తీసుకుని వెళ్ళేరని అనిపిస్తుంది.
అన్నపూర్ణా దేవి అంత్య క్రియలను ఆవిడ శిష్యులు ముంబాయ్ మెరీన్ లైన్స్ స్టేషన్ సమీపము లో ఉన్న చందనవాడీ స్మశాన గృహములో 13 అక్టోబర్ 2018 శనివారము మధ్యాహ్నము 3 గంటల 30 నిముషములకు జరిపించేరు .
 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.