కప్పు

-ఉమాదేవి సమ్మెట

 

          భవిష్యా లాడ్జ్ నుండి హడావుడిగా ఇంటికెళ్తున్న నాత్యానాయక్ ని చూసి…

          “ఏంది నాత్యా.. ఉరుకుతున్నవ్ వజ్రమ్మ రమన్నదా?” ఏసోబ్ వెక్కిరింపుగా అన్నాడు. 

          “ఏ ఆమె వజ్రమ్మ గాదూ. ఆమె ఆయనకు బాస్”నర్సయ్య అన్నాడు.

          “మంచామనే పట్టిండుపో ”భీమ్లా అంటున్నాడు. తన వెనుక నుండి వినబడుతున్న వెటకారపు మాటలకు..పోయి నాలుగు తందామన్నంత కోపాన్ని దిగమింగుకుని ఇంటికి చేరుకున్నాడు నాత్యా.

          “ఏందిగట్లున్నావ్? మల్లా ఏదన్నా ఒర్లుతున్నరా వాళ్ళు” వజ్రమ్మా అడిగింది.

          “ఎప్పుడుండే లొల్లేగానీ.. ఏంది వజ్రమ్మా! తొందరగా రమ్మన్నవ్?

          “ఏం లేదు. ఇస్త్రీ బట్టలు ఇచ్చిరాను బోయినప్పుడు గా రాధమ్మ మక్కగారెలు ఇచ్చింది. నీకిష్టమని వేడిగున్నప్పుడే తింటవని పిలిసిన”

          ‘నిజంగా వజ్రమ్మ ఎంత మంచిదో!’ ఎప్పటిలాగానే మళ్ళీ అనుకుని ఇష్టంగా గారెలు తిన్నాడు. ఆఖరి ముక్క పూర్తయ్యేలోగా “ఇగో ఛాయ్ తాగు..” అని ముందు పెట్టింది.

          ‘ఆమెకి ఇచ్చినవి ఆడనే కూసోనీ తినొచ్చు. లాడ్జ్లున్న నన్ను పిలిసి మరీ తిన బెట్టింది. ఏం బెట్టింది, ఎంత బెట్టిందని గాదు. నాకిష్టమని యాదికుంచుకుని అమ్మతీరు బెట్టింది. అసొంటామెను బట్టుకొని ఎనకజేరి ఎన్ని మాటలంటున్నరు. అసలెవరామే అంటే ఏమని జెప్పాలా? ఆమెకు నేనెమయిత? నాకు ఆమె ఏమయితది?’చాయ్ తాగు తున్న నాత్యాకి తన వాళ్ళు గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లుతుంటే అవి వజ్రమ్మ కంట పడకుండా తలదించుకుని గుటకలేస్తూ టీ తాగేసాడు. తనని తాను నియంత్రించు కుంటూ..

          “అబ్బా! పొద్దుగాళ్ళ లాడ్జ్ పని. పగటేల బట్టలు ఇస్త్రీ జేస్తవ్. జరంతసేపు పండుకో రాదు. ఏం జూస్తావ్ వజ్రమ్మా. గంత ఘనంగా సీరియళ్ళు”ఎప్పటిలా మాట కలిపాడు.

          “అయ్యో ఏం జెప్పాలే నాత్యా..కూతురి బతుకు అన్యాయమై పోయిందని వారం దినాల సంది ఈ తల్లీ.. ఆ ముగ్గురు ఆడిపిల్లలూ.. డైలాగులు జెప్పుకుంటా ఏం ఏడ్చినా ఏడుస్తున్నరు. అబ్బా వీళ్ళ యాక్షన్లు పాడువడ. ఏడుసుడు ఏడవాలే.. మల్ల మేకప్పులు బోవద్దు. వాళ్ళకు ఎన్ని పైసలిచ్చినా తక్కువనే..”

          “ఏందీ మంచిగా ఏడిసినందుకా పైసలా?” కిసుక్కున నవ్వాడు నాత్యా..

          “అయ్యో ఏడుసుడంటే మామూలుగా ఏడుసుడా.. నిన్న యాడికి ఆపిండ్రో.. ఇయ్యాల మాల్లా ఆడి నుండీ అట్లనే ఏడుసుకుంట డైలాగులు జెప్పుడంటే మాటలా?సోమారం నుండీ శనారం దాకా ఏడుస్తే.. మల్ల సోమారం జరంత కథ మార్తది” నాత్యా ఆశ్చర్యపోయాడు. ‘వజ్రమ్మంటే వజ్రమ్మనే.. సీరియల్ చూసి సంతోషపడకుండా అక్కడ కూడా వాళ్ళ కష్టమే చూస్తున్నది..” అనుకున్నాడు.

          మందులు కొనుక్కుని లాడ్జ్ కి చేరుకుని 206 గదిలో అతనికి ఇచ్చేసాడు. ఎవరు పిలిచినా వెళ్ళి ఆ పని మౌనంగా చేసుకుంటూ పోతున్నాడు. రాత్రయితే సీసాలు గల గలాడుతాయి. అందుకే రాత్రిపూట వజ్రమ్మతో పాటు మరో అయిదారుగురు ఆడవాళ్ళకు పొద్దున్నఒక్కపూటే లాడ్జ్ లో పని. కాస్త సద్దుమణిగాక అందరూ ఒక దగ్గర చేరి ముచ్చట్లు మొదలుపెట్టారు.

          “ఏంది నాత్యా? చూస్తే హీరో తీరుగున్నవ్. నీకు ఇద్దరు కొడుకులు. అప్పడే మనుమలూ మనమరాళ్ళు గూడనా?” ఏసోబ్ అన్నాడు.

          “అవుమల్ల. వజ్రమ్మకు గూడా ఇద్దరు బిడ్డలు. వాళ్ళకు మల్లా పిల్లలు కూడా”భాస్కర్ అనగానే

          “ఏంది భాస్కర్.. నీకు లేరా ఎట్లా మనుమలు. ఎనకటికి మన పల్లెల్లో సిన్నప్పుడే పెళ్ళిళ్ళు జేసుడాయే. నల్పయి, యాభై ఏళ్ళకే అమ్మమ్మలూ, తాతలూ అయిపోవుడు మామూలే గదా! పాపం వజ్రమ్మకు పెళ్ళయిన పదేండ్లకే మగడు సచ్చిపోయిండు. ఒంటి సేత్తో ఇద్దరాడ పిల్లల పెండ్లిళ్ళు జేసింది. ఏ బిడ్డ నాకాడ ఉండుమన్నా ఉండకుంటా రెక్కల కష్టం జేసుకొని బతుకుతాంది. ఏమోతీయ్. నాత్యానాయక్ కి ఆపదొచ్చినప్పుడు ఆదుకున్నది. ఆడామే ఒక్కతే ఉన్నదని నాత్యా గూడా ఆమెకు అండగ వుండి కాపాడు తున్నడు. ఊకే ఒర్లుడు బందువెట్టుండ్రి” మల్లన్నఅందరినీ కోపడ్డాడు. 

          ‘నేను ఆమెకు అండ కాదు. ఆమెకు ఎవరి అండా అవసరమే లేదు’ అనుకుంటూ మౌనంగా ఇంటికి వచ్చేశాడు నాత్యా. ఆ చిన్న ఇంటిని వున్నంతలో అందంగా తీర్చిదిద్దు తుంది వజ్రమ్మ. ఇంటికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆమె పెట్టిన అన్నం తిని పక్క గదిలోకి వెళ్ళ పక్క పై వాలిపోయాడు.

* * *

          నాత్యా నాయక్ భార్యకు కడుపులో పుండయి చనిపోయి అతని బతుకు కొడుకూ కోడళ్ళ చేతుల్లోకి పోయి అయిదారేళ్ళతున్నది. భార్య గుర్తుకొచ్చి వంటరితనంతో కుంగి పోతూ.. ఏదున్నా దోస్త్ భీమ్లాతో పంచుకునే వాడు.

          “కప్పు చాయ్ తాగలనిపించినా కొడుకు వచ్చేవరకు ఆగి, వానికి పెట్టిచ్చిన్నప్పుడే తాగుడు.. మా మామ ఎప్పుడు మరిది ఇంటికి బోతడో’ అన్నట్టు పెద్దకోడలు జూస్తే.. ‘మామ ను మా బావ ఎప్పుడొచ్చి తీసకపోతాడో’ అన్నట్టు చిన్నకోడలు జూస్తది. పిల్లలు ‘తాతా’ అని ప్రేమగా చుట్టూ తిరుగుతుంటే కూడా కోడళ్ళు ఓరుస్తల్లేరు భీమ్లా.. ఆకలేసినప్పుడు ఆకలని చెప్పుకోనికి లేదు. చాతగానప్పుడు పండుకోనికి లేదు. అసలు కొడుకులు మనోల్లా అంటే ఏం చెప్తం. పెండ్లయినంక వాళ్ళ బతుకులు పరాధీనమే కదా. పెండ్లాంకి చెప్ప లేరు. అమ్మనాయినలకు చెప్పలేరు. ఇంకో సంగతి చెప్పుదునా భీమ్లా.. అసలు మగడు సచ్చిపోయిన ఆడదాని కన్నా..పెండ్లాం సచ్చిపోయి వంటరోడైన మగోని బతుకు బతుకే కాదు. కొడుకుల మీదనే గాదూ.. మనుమలు, మన్మరాళ్ళ మీద ప్రేమలున్నా కూడా సంపు కోవాల.

          కొడుకులు పెండ్లాంకెళ్ళి మాట్లాడితే మనకు బాధ. మనకెళ్ళి మాట్లాడితే కోడళ్ళకు బాధ. ఎప్పుడయితే ఈ ప్రేమలను, పాషాలను పక్కకు వెడ్తమో గప్పుడు బిందాస్గా గడ పొచ్చు. సప్పడు జేయ్యక ఓపికున్నప్పుడే సిటీకి బోయి పనులు జేసుకునుడు నయ్యం” అనేవాడు నాత్యా .

          అనుకున్నటుగానే ఓ రోజు మిత్రుడు భీమ్లాకీ, కొడుకులకూ చెప్పి ఊరు వదిలి పెట్టి సిటీకి చేరుకున్నాడు. ఒక వారం పదిరోజులు దొరికిన పనల్లా చేసుకుంటూ అక్కడా ఇక్కడా గడిపాడు. నాత్యా అదృష్టం బాగుండి భీమ్లా  ద్వారా భవిష్య లాడ్జ్లో పని దొరికింది. ఒక చిన్న అద్దె ఇల్లు తీసుకున్నాడు. ‘ఇప్పుడు తిన్నవా అని అడిగేటోడు లేడు. తిన లేదని రంధివడి పడేటోడు లేడు. ప్రేమలు లేకుంటే లేకపోయే. రంధిలేని బతుకు దొరికింది’ అనుకున్నాడు. ఒక ఏడాది బాగానే గడిచిపోయింది. ఆ తరువాత రోజులు ఊహించని విధంగా మారిపోయి నాత్యా వజ్రమ్మ ఇంటికి వచ్చి చేరాడు

* * *

          “విన్నారుల్ల.. ఈ లాడ్జ్ ని మూడ్నెళ్ళు బందుబెట్టి.. దీన్నింకా పెద్దలాడ్జ్ జేస్తా రంట..” అని ఏసోబ్ చెప్పగానే.. ‘ఈ లాడ్జ్ డెవలప్మెంట్ మన సావుకొచ్చి పడ్డది. మూడు నెళ్ళు మనందరి కొలువులు పోతున్నయ్. ఏందింటం? ఎట్లా బతుకుతం? ఈ ఆదివారం నెల జీతమిచ్చి ఇగ బందు బెట్టుమంటరంట. ఆందోళనగా తలోమాటా అనుకుంటూ.. ముఖాలు చిన్నబుచ్చుకుని, దుఃఖపడుతూనే పనులు చేసుకుపోతున్నారు. 

          “నాత్యా ఎల్లెంరా! పైన కమ్రల్ల  చెద్దర్లు మార్చాల. సందు దొరకనంత వరకూ అందరూ దొరలే. అస్సల్కే మస్తు తాగి ఉంటరు. జప్పన దా!”అని నాత్యాని పిలుచుకుని వెళ్ళారు వజ్రమ్మ వాళ్ళు.

          వీలైనంత వరకూ లాడ్జ్ లో దిగినవాళ్ళు గదులు ఖాళీచేసి వెళ్ళినప్పుడో, వాళ్ళు బయటకెళ్ళినప్పుడో.. ఆడవాళ్ళు వెళ్ళి గదులు శుభ్రంచేసి వస్తారు. రోజూ దుప్పట్లు, కర్టెన్లు మార్చి, టవళ్ళు, సబ్బులూ, ఏర్పాటుచేసి, గదిలు చక్కగా సర్దివస్తారు. రూముల్లో ఒకొక్కరూ రెండు మూడు రోజులున్నప్పుడు వజ్రమ్మ, ఆదెమ్మా, పార్వతీ.. ఇట్లా నాత్యాని గానీ, ఏసోబుని గానీ తోడు తీసుకెళ్తారు. వాళ్ళొక పని, వీళ్ళొకపని చేసుకుంటూనే, ఆడ వాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటారు. 

          ఆ మర్నాడే నెలజీతం మొత్తం ఇచ్చి ఇక పనులకు రావద్దని చెప్తారని తెలిసింది. అక్కడే మెట్ల దగ్గర ముడుచుకుని పడుకున్న నాత్యాను చూసి కంగారుపడి నుదుటి మీద చెయ్యేసి చూసింది. ఒళ్ళు కాలిపోతున్నది. 

          “ఓ రెడ్డన్నా సూసినవా.. నాత్యాకు జరమొచ్చింది. పేయి కాలిపోతున్నది. జర దవఖానకు దీస్క  పోతావా?”అని అడిగింది

          రెడ్డి నాత్యాని చూసీ.. కంగారుపడి అదే సందులో వున్న ప్రజా వైద్యశాలకు తీసు కెళ్ళాడు. ఆ వెనకాలే వజ్రమ్మా, ఆదెమ్మా వెళ్ళారు. డాక్టర్ పరీక్షచేసి రెండు ఇంజెక్షన్లు ఇచ్చి.. చాలా నీరసంగా వున్నాడని సెలేన్ పెట్టారు. కొద్దిసేపటికి మిగితావాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్ళిపోయారు. “నువ్వు కూడా ఇంటికిపో వజ్రమ్మా! తెల్లారి వద్దాంలే” అని చెప్పి ఆదేమ్మా, రెడ్డీ కూడా వెళ్ళిపోయారు. బాగా పొద్దుపోయే వరకు అక్కడే వుండి నాత్యా నిద్రపోయాక ఇంటికి వచ్చేసింది వజ్రమ్మ.

          పొద్దున్నే తన దగ్గర వున్న డబ్బులన్నీలెక్క చూసుకుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ బిల్ కట్టింది. కావాల్సిన మందులూ, పండ్లూ కొనుక్కుని “అస్సల్కే మస్తు నీరసంగున్నవ్. ఇప్పుడు అంత దూరం మీ ఇంటిదాక యాడబోతవు?” అని లాడ్జ్ కి దగ్గరలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్ళింది. ముఖం కడుక్కు రమ్మని చెప్పి డబల్ రొట్టె పెట్టి, టీ ఇచ్చింది.“మందులేసుకొని ఆ మంచం మీద పడుకో. ఇవ్వాళ పెద్దసారొచ్చి మనందరి పైసలు ఇస్తడు. నీ పైసలు గూడా ఇస్తే తెస్తా” అని లాడ్జ్ కెళ్ళింది. రెండు గంటల తరువాత వచ్చింది.

          “ఇగ్గో..నీ పైసలు కూడా ఇచ్చిండు. సాయంత్రం బోయి సంతకం బెట్టిరా”అంటూ అతని పైసలు అతనికి ఇచ్చేసి, వేడివేడిగా అన్నం వండి పెట్టింది. తల వంచుకుని తింటున్న నాత్యాతో..

          “సూడూ! ఎట్లా బతకాలే ఏంజెయ్యాలే? అనిగట్ల ఊకే ఎందుకు రంధివడుతున్నవు. నేను బట్టలు ఇస్త్రీ చేసుకునే బండున్నది గదా! దాని మీద పుచ్చకాయలు, అంగూర్లు అమ్ముకుందాం. వానజల్లు పడేటాళ్ళకు లాడ్జ్ మల్ల దెరుస్తరు. తెరువకుంటే.. కూరగాయలు అమ్ముకుందాం. ఊకే సిన్నబోకు”అన్నది. నాత్యాకి ఎక్కడలేని ఓపిక వచ్చింది. ఆ సాయంత్రం మెల్లగా తన గదికి చేరుకున్నాడు.

 * * *

          ఆ మరుసటి రోజు ఉదయమే ఇద్దరి జీతం పెట్టుబడిగా పెట్టి.. పొద్దున్నే హోల్ సెల్ మార్కెట్ కి వెళ్ళి పుచ్చకాయలు కొనుకొచ్చుకుని, సెంటర్లో బండిపెట్టి అమ్ముకో సాగారు. ఇక ఆ రోజు నుండీ నాత్యాకి ఆలోచించాల్సిన అవసరమే రాలేదు. ప్రతి రెండు రోజులకూ, వజ్రమ్మతో పాటే వెళ్ళి పుచ్చకాయలు కొనితెచ్చేవాడు. పగలంతా ఇద్దరూ కలిసి అమ్మేవారు. రాత్రి వజ్రమ్మ ఎంతిస్తే అంత పుచ్చుకుని ఇల్లు గడుపుకునేవాడు. మధ్య మధ్య వజ్రమ్మ ఇంట్లోనే తినేవాడు.ఎవరికి ఆపదొచ్చినా ముందుండే వజ్రమ్మ లాడ్జ్ లో పనులు పోయి కుంగిపోతున్న నలుగురైదుగురికి చేతనైనంతలో రకరకాల సహాయాలు చేసింది. ఆమె పేరు వజ్రమ్మ కానీ మనసు నవనీతం. ఇప్పుడు ఆ గుణమే నాత్యాకి ఒక వింత పరిస్థితిని తెచ్చిపెట్టింది.                                             

          “మన రాజేష్ పురుగుల మందు తాగేసిండంట. ధవాఖానలో ఉన్నాడు” అని రెడ్డి వచ్చి చెప్పగానే..అందరూ ఆసుపత్రికి వెళ్ళారు. ‘రెండు నెలల నుండీ కిరాయి కట్టలేదు, ఇల్లు ఖాళీ చేయమని సామాన్లు బయట వేసి ఇంటాయన చాలా అవమానించాడట, లాడ్జ్ లో ఉద్యోగం పోయి సరైన సంపాదన లేక బతుకు కష్టంగా ఉన్నది. ఇగ మేము కూడా చచ్చిపోతామంటూ’ రాజేష్ భార్య గోడుగోడున ఏడ్చింది. ముందు వాళ్ళను ఇంటికి తీసుకెళ్ళి కడుపు నిండా అన్నం పెట్టింది.

          “అందరం ఒక్కసారే కష్టాలల వడ్డం. కొంచెం ధైర్నం దెచ్చుకోండ్రి” అంటూ ఓదార్చింది. మర్నాడే ఆమె గాజులు తాకట్టు పెట్టి రాజేష్ ఇంటి బాకీ తీర్చింది. నాత్యాని పిలిచింది..

          “నాత్యా నువ్వుండే ఇంట్ల .. అండ్ల రెండు కమ్రలు ఉన్నాయి కదా? రాజేష్ వాళ్ళను మీ ఇంటికి తీస్కపో. వాళ్ళు ఆడ వుంటరు”అన్నది. ఇప్పటికిప్పుడు వాళ్ళకు ఇల్లేడ దొరుకుతది? మీ ఇంటాయానతో మాట్లాడి రాజేష్ వాళ్ళను మీ ఇంట్లబెడ్దం. నీ సామాన్లన్నీ ఈడకు దెచ్చెయి” అన్నది. తెల్లబోయి చూశాడు.

        “ఇప్పటికిదే మంచిగనిపిస్తున్నది నాత్యా. నువ్వేమనుకోకు. ఒక నాలుగు దినాలల్ల వేరే ఇల్లు ఎతుకుందువులే. పరేషాన్ గాకు”అన్నది.

          అంతా వజ్రమ్మ చెప్పినట్టే జరిగింది. తెలిసినవాళ్ళతో అప్పు ఇప్పించి రాజేష్ భార్యతో కూరగాయల వ్యాపారం పెట్టించింది. ఆమె కృతజ్ఞతతో వజ్రమ్మ కాళ్ళు పట్టు కున్నంత పనిచేసింది. మధ్యలో పనులు పోయిన వాళ్ళలో దాదాపు సగం మంది ఇలా వజ్రమ్మ సాయంతో కాస్త గట్టున పడ్డవాళ్ళే. అందుకేనేమో వజ్రమ్మంటే అందరూ భయ భక్తులతోనే ఉంటారు. 

* * *

          నాత్యా రోజూ పుచ్చకాయలు అమ్ముతూ..వుండుండీ “ఇగ నేనుబోత.. నేనుబోత..” అనేవాడు. “ఏడికి బోతవ్?”అని వజ్రమ్మ అడగగానే..“నా ఇల్లు వాళ్ళకిప్పిచ్చినవ్ గదా! ఇగ నేను ఇల్లు ఎతుక్కోవద్దా”ఉక్రోషంగా అనేవాడు. ఒక రోజంతా ఇంటి కోసం తిరిగి వచ్చేవాడు. రాగానే.. “ఇల్లు దొరికిందా?” అంటే.. కోపంగా ముఖం అటు తిప్పుకునేవాడు. వజ్రమ్మ పట్టించుకునేది కాదు

          ఒకసారి ‘నేను పోయి ఇల్లు ఎతుకుంటా’ అని ఆరాటించి పట్టుబట్టి అదేపనిగ నాలుగురోజులు తిరిగాడు.

          “ఏమైంది నీ ఇంటి ముచ్చట?” అని వజ్రమ్మ ఆగడగానే ఏడుపు ముఖం పెట్టు కుని.. “ఏంజెయ్యాలా మస్తు అడ్మాన్స్ అడుగుతున్నారు. ఒక్కడే ఉండే మొగోళ్ళకు అసల్కే ఇల్లియ్యనంటున్నరు”అంతా నువ్వు జేయబట్టే అన్నట్టు ముఖం ఎర్రగా చేసుకుని అన్నాడు.  

          “నాత్యా! నిజంజెప్పు. నీకు కుద్దుగ ఎల్లిపోవాల్నాని ఉంటే నేనేబోయి ఇల్లు జూస్త..”అన్నది

          “అప్పుడు నువ్వే అన్నావ్ గదా! మొదలు రాజేష్ వాళ్ళు ఆ ఇంట్లకు పోనీ. అటెంక నువ్వు ఇల్లు జూసుకుందువుగానీ అనీ.. మల్ల ఇల్లు చూసుకోకుండా ఈడనే ఉంటనా? అదిగాక నేనీడనే ఉంటే అందరూ ఏదేదో అనుకుంటున్నరు”

          “అవుమల్ల. అనుకునేటోళ్ళంతా మనలను పెట్టి పోషిస్తున్నారు గాదూ! నువ్వు పైకి చెప్తున్నావ్. నేను చెప్తలేదు. నా ఎన్కగూడ మస్తు అంటున్నరు. అనుకోనీ.. ఎవ్వల నాపుతం” నాత్యా మౌనంగా నిల్చున్నాడు.

          “సూడు నాత్యా! మూడునెళ్ళన్న లాడ్జ్ పని ఆరునెల్లయినా పూర్తిగాలేదు ఎప్పటి కయితదో తెల్వదు. అందరం ఒక్కతీరే కష్టాలల వున్నం. ఒకరికి ఒకరు తొడనుకున్న. ఇంత గడ్డు కాలంల నీకో కిరాయి, నాకో కిరాయి.. నీకొక  గ్యాస్ బండ, నాకొక గ్యాస్ బండ..నీకొక కరెంట్ బిల్లు, నాకొక కరెంట్ బిల్లు.. అవుసరమా? నాదెట్లన్న సొంతిల్లే.. నువ్వొక కమ్రాల ఉంటున్నవ్. నేనొక కమ్రాల ఉంటున్న. ఇద్దరం పని జేసుకుంటున్నాం. నీకు ఓపిక ఉన్నప్పుడు నువ్వు వండు. నాకు ఓపిక ఉన్నప్పుడు నేను వండుత. ఇండ్ల ఏమున్నది?” అన్నది. నాత్యా  విస్మయంగా చూశాడు.

          “ఈడ ఉండబట్టి శానొద్దులయి తున్నది నా కొడుకులకైతే నేనేమైపోయినా పట్టదు. మరి నీ బిడ్డలూ అల్లుళ్ళూ ఏమంటరో?”

          “ఏమన్నా అననీ. వాళ్ళకు చేసేది వాళ్ళకు చేసి పంపిన. రెక్కల కష్టంజేసి ఈ ఇల్లు గట్టుకున్నా. ఎవ్వళ్ళన్న ఏమన్న అంటే నేను చెప్పుకుంట తీయ్” అన్నది.

          “మరి.. మేమేమో లంబడోళ్ళం మీరేమో..” అంటూ ఏదో అనబోయాడు..

          “అబ్బో మీరేమో బంగారం తింటారు. మేమేమో వజ్రాలు దింటంగాదు. నీ కులాలు పాడుగాను. కడుపున బుట్టిన బిడ్డలై నా సరే. ఆళ్ళింట్ల వీళ్ళింట్ల ఉండకుంటా.. అప్పుల పాలు గాకుండా బతుకుడెట్ల అన్నది సూడు. మన తీరు రెక్కలను నమ్ముకుని వంటరి బతుకేటోళ్ళకు కులాలూ కావల్నా కులాలూ? ప్రపంచమంత పైసలతోనే నడుస్తున్నది. కరువు కాలంల కర్సులు పంచుకుందామన్నదే నా ఆలోచన. ఇగ నీ ఇష్టం నాత్యా. ఉంటే ఉండు. పోతే పో!” విసురుగా లోనికి వెళ్ళిపోయింది?” నాత్యా మౌనంగా వెళ్ళి వజ్రమ్మకు ఇష్టమైన అల్లం చాయ్ పెట్టాడు.

          అంతే ఆ రోజు నుండీ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. చుట్టాలు ఆమె వెనుక ఎన్ని మాటలన్నా పట్టించుకోలేదు. నాత్యా తన ఊరికెళ్ళి కొడుకులను చూసి రెండు రోజులుండి వస్తుంటాడు. పురిటికి వచ్చిన కూతురూ, అల్లుడూ గొడవ పెట్టుకున్నా లెక్క చేయలేదు వజ్రమ్మ. “వాళ్ళొచ్చిండ్రు గదా! నేనుబోత..” అని నాత్యా మొహమాట పడ్డా వెళ్ళనివ్వలేదు. కూతురికి మంచి హాస్పిటల్ లో పురుడుపోసి అన్నీ అమర్చి పంపింది.

          మూడు నెలలన్నది.. దాదాపు పదినెలలకు గానీ లాడ్జ్ తెరవలేదు. మళ్ళీ పాత వాళ్ళందర్నీ ఉద్యోగాలలో తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అందరూ భవిష్య లాడ్జ్ ఉద్యోగస్తులయ్యారు. పాత మిత్రులు మళ్ళీ నాత్యాను ఆట పట్టించడం మొదలుపెట్టారు.

* * *

          “ఓ నాత్యా! మొన్నటిదాక గట్టిగా ఊదితే పడిపోతవన్నట్టు ఉండేటోడివి. ఇప్పుడు నున్నగా దేలినవుగాదూ. వజ్రమ్మా మస్తుగ తినబెడ్తున్నట్టున్నది కదా!” ఏసోబు అన్నాడు.

          “ఆ మంచిగా తినబెడ్తది. అవసరమొస్తే మంచిగ తిడ్తది గూడా” భీమ్లా వెటకారంగా అన్నాడు. 

          “ఏం దిట్టదు. వజ్రమ్మ శానా మంచిది.” ఉక్రోషంగా అన్నాడు నాత్యా.

          “అయ్యో మేమేన్నం? శానా మంచిది కాబట్టే గదా! నువ్వు ఆమెను బట్టినవ్”

          “ఏంది నకరాలుగున్నదా! ఆమెను నేను పట్టుడేంది?” మీద మీదకు వెళ్ళబోయాడు.

          “పోనీ ఆమెనే నిన్ను బట్టింది. అట్ల కాదంటే.. ఆమెనే నిన్ను వుంచుకున్నదితీయ్?” నిర్లజ్జగా జనార్ధన్ అన్నాడు. వజ్రమ్మ రావడం చూసి అందరూ నోళ్ళు మూసుకున్నారు.

* * *

          ముందు లేచినవాళ్ళు పాలు కాసి టీ పెట్టాలని వజ్రమ్మ పెట్టిన రూల్. పొద్దున్నే లేచిన నాత్యా టీ పెట్టాడు. వజ్రమ్మ లేచి ముఖం కడుక్కుని టీ కప్పు అందుకుని..

          “నాత్యా.. నిన్న పొద్దుగాళ్ళ సంది జూస్తున్న. ఎందుకు అట్లున్నవ్?” టీ తాగుతూ అడిగింది.

          “ఏముంది ఎప్పటి తీరే. అందరూ నీకు నేనెమయిత? నాకు నువ్వేమవుతావ్ గిదే లొల్లి”

          “నిన్నే గాదు నాత్యా! నన్నయితే ఏందేందో అంటున్నరు. అననీ మల్ల” వజ్రమ్మ బయటపడింది.

          “అసలు గిదంత ఎందుకు? ఏదన్న ఒక్కటి చెప్తే సరిపోదా? కానీ ఏమని చెప్పాలే అన్నదే సమజయితల్లే?

          “ఏమని జెప్పాలే? ఏమని జెప్పాలే అంటవ్ గానీ.. అసలెందుకు జెప్పాలె అనుకోవా? ఎవళ్ళన్నా కలిసి ఉండాల్నంటే.. ఒకరికి ఒకళ్ళు ఏమన్నా అవ్వాల్నా? సిటీకి సదువు కోను పోయినోళ్ళు ఒక ఇల్లు కిరాయికి దీసుకోని కలిసి ఉంటల్లేదా? మనం సుత ఏడికన్న బోయినప్పుడు మస్తు ఖర్చయితదని షేరింగ్ ఆటోలో బోతల్లేమా? అట్లనే కలిసి ప్రయాణం జేస్తున్నం అనుకోరాదు” నాత్యా పూర్తిగా సమాధానపడలేదు.

          “ఇట్లా కలిసి ఒక కప్పు చాయ్ తాగుతున్నాం. కలిసి ఒక కప్పు కింద బతుకుతున్నాం. మనం మంచి దోస్తులం నాత్యా.. గంతే!”వజ్రమ్మ మాటలకు తలలోని బరువంతా దిగిపోయి నాత్యా ముఖం విచ్చుకున్న కమలమయ్యింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.