కొత్త అడుగులు – 48

నిర్మలాకాశం –పద్మ కవిత్వం

– శిలాలోలిత

          ‘వికసించిన ఆకాశం’- ఉప్సల పద్మ రచించిన కవిత్వం. పద్మకు కవిత్వం అంటే ప్రాణం. టీచర్ గా ప్రస్తుతం మిర్యాలగుడాలో పనిచేస్తూ, బోధన పట్ల వున్న ఆసక్తి వల్ల 3 సార్లు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎన్నికైంది. పిల్లలతో కవిత్వాన్ని రచింపజేస్తూ, ప్రోత్సాహపర్చడమే కాక, సంకలనాన్ని కూడా తీసుకొని వచ్చింది. కథలను రాయించింది. తానే ఒక ఉత్సాహతరంగమై, తన శక్తికి మించి సాహిత్య ప్రయాణం చేస్తున్నది.

          ఇంటర్లోనే పెళ్ళయిపోయినా, చదువుపట్ల ఇష్టం ఎక్కువగా వుండటం వల్ల కొనసాగించింది. అమ్మ, భర్త చిలుకూరి మను గార్ల సహాయ సహకారాలతో మూడు పి.జీ కోర్సులు పూర్తి చేసింది. ప్రస్తుతం పిహెచ్.డిని ముదిగంట్ల సుజాతారెడ్డి గారి పై చేస్తున్నది.

          ‘మిర్యాలగూడా మిణుగురులు’ – పేరిట పిల్లల కవితలను సంపాదకత్వం వహించి అచ్చులోకి తీసుకొని వచ్చింది. గతంలో ‘మౌళి’ లాంటి ఉపాధ్యాయులు పిల్లల కవితలను పుస్తకాలుగా తెచ్చారు.

          ‘ఉమాశశి’ ముందు మాట రాస్తూ, ఇందులో స్త్రీ వాద కవిత్వం, ప్రకృతి కవిత్వం, ప్రాంతీయ కవిత్వం, భావకవిత్వం, దేశభక్తి కవిత్వం, అనుభూతి కవిత్వం ఇలా అనేక  కోణాలలో కనిపించింది అన్నారు.

          ‘మనసుకు రెప్పలు కావాలి’ – ఎంతో అందమైన, అరుదైన ఊహ అన్నారు.

‘మనసుకు రెప్పలు కావాలి

కళ్ళ మూసుకున్నట్లు

మనసు మూసుకోవడానికి …..

గతంలో ‘పాటిబండ్ల రజని’ పాలింకి  పోవడానికి మాత్రలు ఉన్నట్లే,

మన మనసింకి  పోవడానికి మాత్రలుంటే బావుండునన్న కవిత్వ పాదాలు గుర్తొచ్చాయి.

          స్త్రీవాద, బహుజన తెలంగాణ ఉద్యమాలు అందించిన ఉమ్మడి స్ఫూర్తితో లో నుండి తన హృదయాను భూతులను, సామాజిక అనుభవాలను ఎంతో సముచితంగ వ్యక్తీకరించిందని కోయి కోటేశ్వర్రావు గారు అభిప్రాయపడ్డారు. ఛిద్రమవుతున్న కుల వృత్తుల ఆర్త నాదాలను కవిత్వీకరించిందన్నారు.

          ‘స్వచ్ఛ భారత్ పుత్రులకు’ మనసుకు పట్టిన వివక్ష దుమ్మును విదిలించుకుంటేనే  సిసలైన మనిషితత్వానికి నిజమైన చిరునామా అని పద్మ హితవు చెబుతుందన్నారు.

          `తానెవరంటే’ – కవితలో ఒక సగటు మహిళ అవస్థల్ని గొప్పగా కవిత్వీకరించింది.’ వెకిలి చూపుల కత్తుల వంతెనల్ని అలవోకగా దాటుకుంటూ వెళ్ళగలిగే ధీరత్వం తనది’ అంటూ ఎన్నెన్నో అవమానములను, అనుమాలనూ  దాటుకుంటూ, చెరగని చిరునవ్వు ను చిందించాల్సిన స్థితి, వేదన గురించి పెరుమాళ్ళ ఆనంద్ గారు స్పష్టంచేసారు.

          ఈ కవితను చదువుతుంటే ‘జయప్రభ’ కవిత గుర్తొచ్చింది. ఒళ్ళంతా స్త్రీలకు ముళ్ళుండే రోజులు రావాలన్న ఆ డిమాండ్  గుర్తొచ్చింది.

          టి. సాట్ నిపుణ ఛానల్ లో వివిధ పోటీ పరీక్షలకు, తెలుగు సాహిత్య పాఠాలు చెప్పి వీరి గౌరవాభిమానాలను పొందగలిగింది పద్మ. మిర్యాల గుడా పట్టణంలో ‘సాహిత్య  కౌముది’ సాహిత్య సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా సాహిత్య సేవ చేస్తోంది. ప్రస్తుత నివాసం మిర్యాల గుడా.

          ఇంకా ముద్రించబడాల్సినవి ‘ఆకురాయి’ అనే వ్యాస సంపుటి. నల్లగొండ జిల్లా బాలల కథాసంకలనం.

          ఇక, మంచి కవితలు కొన్నింటిని పరిచయం చేస్తుంటే ఆమె  నిబద్ధత కనిపిస్తోంది . ‘మగ బతుకు’ – సగటుమహిళ, జీవితం, ‘చెట్టమ్మ. నీ నవ్వు,  ఏదమ్మా? కన్నీరంటే గౌరవం, మౌనం, మాట, ఓటు, టక్కులమారి, చివరికి మిగిలేది? కసాయి మనసులు, మనసుకదా అదంతే…’ ఇలాంటి  కవితలు 66 వున్నాయి .

          కవిత్వమంటే పద్మకున్న ప్రేమకు అడుగడుగునా కనబడూతూనే వుంది. ఇదో మరింతగా కవిత్వపు లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరమూ వుంది. రాయడంలో వేగం వుంది. వ్యక్తీకరణలో కొత్తదనముంది. కానీ ప్రాచీన సాహిత్య  ప్రభావం ఎక్కువగా వుంది. కొత్త కొత్త విషయాలను, వస్తువులను సేకరించడమే  కాక, కొత్తగా చెప్పాలన్నతపన వుంది. ముందుమాటలు రాసిన వాళ్ళందరూ, ఆమె  కవిత్వాన్ని ఆ సాంతం చదవడమేకాక, మంచి సూచనలను, సలహాలను ఇచ్చారు.

          పద్మ చేస్తున్న అనేక సాహిత్య ప్రయాణాల్లో విభిన్నత ఎక్కువ. వచనం  పల్చబడుతున్నా, అక్కడక్కడా వస్తువు బలంగా వుంటోంది. స్త్రీల జీవితాలను, వ్యవస్థలోని లోపాల ను, సంఘర్షిస్తున్న స్త్రీల సముహాలను, మారని స్థితిగతులనూ, హింసా రాజ్యం చెలరేగుతూ స్త్రీల పై జరుపుతున్న దాడులను ఎన్నో విషయాలు ఆమె కవిత్వంలో కనిపిస్తు న్నాయి.

          ఆమె మరింతగా కవితలు రాస్తూ  తన రచనా వ్యాసంగంలో మరింతగా ఎదగాలనీ ఆశిస్తున్నాను.

జయహో కవిత్వం’

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.