జ్ఞాపకాల ఇల్లు

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

– అద్దేపల్లి జ్యోతి

నాన్న ,అమ్మ వెళ్ళిపోయాక ఇల్లు కారుతోందని 
తమ్ముడు ఇల్లు పడగొడుతున్నాడు అంటే 
నా కన్నీరాగలేదు 
ఆ నాడు ఫ్లోరింగ్ కూడా అవ్వకుండా వచ్చేసిన సందర్భం 
రాళ్ళు గుచ్చుకుంటుంటే 
జోళ్ళు వేసుకుని నడిచిన వైనం 
ఫ్లోరింగ్ అమరాక హాయిగా అనిపించిన ఆనందం నాలుగు దశాబ్దాలు దాటినా
నా మదిలో ఇంకా నిన్న మొన్నే అన్నట్టున్న తాజాదనం
తొలిసారి పెళ్ళిచూపుల హడావిడి 
నాన్న కొన్న కొత్త కుర్చీల సోయగం 
పెళ్ళికి ఇంటి ముందు చెట్టు మామిడి కాయలతో స్వాగతం పలికిన పులుపుదనం 
అతిధులు పిల్లలయి కాయలు కోసిన సంబరం మొదటిసారి తల్లినైన అమ్మతనం 
అమ్మ గొప్పతనం తెలిసిన సమయం 
పిల్ల అల్లరికి అమ్మ వత్తాసు 
అసలుకన్నా వడ్డీ 
ముద్దంటూ ముద్దుచేసిన గారాబం 
నేను అమ్మమ్మ అయ్యాక అర్థమైన అనుభవం 
నాన్న అనారోగ్యం అమ్మ బేలతనం నాన్న వెనకే అమ్మ పయనం పండుటాకులు రాలడం సహజమని తెలిసినా 
తట్టుకోలేని నిస్సహాయత్వం
ఇంటికి వెళితే ఆ జ్ఞాపకాలు చుట్టుకునేవి అమ్మానాన్న దగ్గరికి తీసుకున్నట్టే 
కానీ, ఇప్పుడు ఆ ఇల్లు నా జ్ఞాపకాలలోనే అమ్మా నాన్నతో పాటు……………..

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.